తెలంగాణ విమోచన దినోత్సవం: స్ఫూర్తిదాయక పోరాటం

17 Sep, 2021 13:11 IST|Sakshi

సందర్భం

ఈ నేల మీద సాగిన వీరోచిత త్యాగాల చరిత్ర, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. నాలుగు వేల మంది రక్త తర్పణంతో తెలంగాణ పునీత మైంది. ‘బాంచన్‌ దొర, నీ కాళ్లు మొక్కుతా’ అన్న చేతులే బందూకులెత్తి పోరాటం సాగించాయి. ఈ పోరాటం పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది. 3 వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు నెలకొల్పింది. 

ఈ క్రమం సాగుతుండగానే 1948 సెప్టెంబర్‌ 13న భారత సైన్యం ఆపరేషన్‌ పోలో పేరుతో హైదరాబాద్‌ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. భారీ మర ఫిరంగులతో 50 వేల సైన్యం కవాతు తొక్కింది. కేవలం ఐదు రోజుల్లోనే యుద్ధం ముగి సింది. సెప్టెంబర్‌ 17న ఏడవ నిజాం భారత సైన్యాలకు లొంగిపోయాడు. కానీ నిజాంను లొంగ దీసుకోవడానికి వచ్చిన నెహ్రూ సైన్యాలు రైతాంగ ఉద్యమాన్ని అణచడానికి మూడేళ్ల పాటు శత విధాలా ప్రయత్నించాయి. అనేకులైన రైతు యోధులు, కమ్యూనిస్టులు నెహ్రూ సైన్యాల చేతిలో హత్యకు గురయ్యారు. పదివేల మంది కార్యకర్తలను కాన్సంట్రేషన్‌  క్యాంపులలో నిర్బం ధానికి గురిచేశారు. బ్రిగ్స్‌ ప్లాన్‌ పేరుతో గ్రామాలను దహనం చేశారు. అయినా సాయుధ పోరాట విరమణ జరగలేదు. 1946లో ప్రారంభమైన పోరాటాన్ని 1951 అక్టోబర్‌ 21న భారత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విరమిస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

ఇది చరిత్ర కాగా, భారతీయ జనతా పార్టీ నిజాం లొంగుబాటును విమోచన దినంగా ప్రకటి స్తున్నది. హైదరాబాద్‌ సంస్థానంలో ముస్లిం రాజుకు, హిందూ ప్రజలకు మధ్య జరిగిన యుద్ధ మని గోబెల్స్‌ పలుకులు పలుకుతోంది. సాయుధ పోరాటంతో గానీ, నిజాం వ్యతిరేక ఉద్యమాలతో గానీ ఆనాటి జనసంఘ్‌కూ, ఈనాటి బీజేపీకీ ఏ సంబంధమూ లేదు. ఇది కులానికి, మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. నిరంకు శమైన నిజాం పాలనకు, భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆనాడు హిందూ ముస్లిం తేడా లేకుండా సాగించిన వర్గపోరాటం ఇది. 

1943లో పరమ దుర్మార్గుడైన పాలకుర్తి, విసునూరు దొరలపై చట్ట బద్ధంగా తిరగబడి సవాల్‌ చేసిన పేద ముస్లిం రైతు బందగీ. తన భూమిని దక్కించుకునే ప్రయ త్నంలో భూస్వాముల గుండాల దాడిలో బలైన తొలి అమరుడు. ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్‌ నిజాంకు వ్యతిరేకంగా రాస్తు న్నాడని దొంగచాటుగా రజాకార్లు ఆయన కాళ్ళు చేతులు నరికి వేశారు. ఎందరో ముస్లిం మేధా వులు, కమ్యూనిస్ట్‌ నాయకుడు, కవి మఖ్దూమ్‌ లాంటి వారి నుంచి మొదలుకొని సామాన్య ప్రజల వరకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరా డారు. గత రెండు వందల సంవత్సరాలలో తెలం గాణ ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గానీ, పోరాటం గానీ దేశ చరిత్రలో కానరాదు.

బ్రిటిష్‌ పరిపాలన అంతం కావడం, దేశానికి స్వాతంత్రం రావడం, దాదాపు 565 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడం జరిగింది. కానీ, స్వాతంత్య్రానంతరం ఐదు సంస్థానాలు స్వతం త్రంగా వ్యవహరించడానికి నిర్ణయించుకున్నాయి. అందులో హైదరాబాద్‌ స్టేట్‌ ఒకటి. నిజాం రాజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు గాంచాడు. ఆనాడే 236 బిలియన్ల సంపద కలిగి ఉన్నాడు. ఐదు టన్నుల బంగారం కలిగి ఉన్నాడు.

హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు 1947 జూన్‌ 11న నిజాం పర్మాన ప్రకటించాడు. నిజాం దేవుడి ప్రతి రూపం అంటూ ఎంఐఎం ప్రచారం ప్రారంభించింది. ప్రజ లను భయభ్రాంతులకు గురిచేయడం, దోచు కోవడం, హత్యలు లూటీలు చేయడం, దొరలకు జాగీర్దార్లకు అండగా నిలవడం రజాకార్ల నిత్య కృత్యంగా మారింది. ప్రజలలో నిజాం పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అది కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ పోరాటంగా రూపు దిద్దుకుంది. 

పోలీస్‌ యాక్షన్, నిజాం పాలన అంతంతో ప్రజల కష్టాలు తీరుతాయని అందరూ భావిం చారు. తెలంగాణలో నైజాం పాలన స్థానంలో నెహ్రూ పాలన వచ్చింది. ఆనాటి దొరలే తిరిగి కాంగ్రెస్‌ నాయకులు అయ్యారు. పాలనలో మార్పు లేదు, ప్రజల బతుకుల్లో మార్పులేదు. అందుకే నిజాం లొంగిపోయిన 1948 సెప్టెంబర్‌ 17 తర్వాత కూడా తెలంగాణ పోరాటం కొనసాగింది. ప్రజలపై దాడులను ప్రతిఘటించాలని పార్టీ నిర్ణయించింది. చివరకు పార్టీ నాయ కత్వంతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపి పోరాట విరమణకు కొన్ని హామీలను ఇచ్చింది. నాయకత్వం పోరాట విరమణ ప్రకటించింది. ఆ తర్వాత ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. అయితే వీరుల త్యాగాలు వృధా కాలేదు. వర్తమాన సమాజంలో ఆ స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉన్నది. 

- వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ

మరిన్ని వార్తలు