శివసేన సర్కారు దూకుడు

10 Sep, 2020 00:30 IST|Sakshi

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న అనుమానాస్పద స్థితిలో మరణించి నప్పటినుంచి రాజుకుంటున్న వివాదం అనేకానేక మలుపులు తిరిగి చివరకు మంగళవారం అతని స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి అరెస్టుకు దారితీసింది. అది జరిగిన మరునాడే నటి కంగనా రనౌత్‌ నివాసం ఆవరణలో అనుమతుల్లేని నిర్మాణాలున్నాయంటూ బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) కూల్చివేతలు మొదలుపెట్టడం, ముంబై హైకోర్టు ఆదేశాలతో మధ్యలో అవి నిలిచి పోవడం, ఆ విషయంలో శివసేనపై కంగనా విరుచుకుపడటం వంటి పరిణామాలన్నీ చకచకా జరిగాయి. రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్‌ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోగానే ఇప్పుడు కంగనా ఇంటి కూల్చివేత వివాదం ఎజెండాలో కొచ్చింది. ఈ రెండు ఉదంతాలూ పరస్పర సంబంధమైనవి కాకపోయివుంటే ఈ కూల్చివేత ఇంత ఆదరా బాదరాగా జరిగేది కాదు. అలాగే ఇంత ప్రముఖంగా చర్చకొచ్చేది కూడా కాదు. ఎందుకంటే ఇంతక్రితం షారుఖ్‌ ఖాన్, సోనూసూద్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖుల నివాసాల్లో సైతం బీఎంసీ అక్రమ నిర్మాణాల పేరిట కొన్నింటిని కూల్చివేసింది.

ఇటీవలకాలంలో శివసేనపై, ముంబై మహా నగరంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆ పార్టీకి ఆగ్రహం కలిగిస్తున్నాయి. సుశాంత్‌సింగ్‌ కేసులో ముంబై పోలీసుల వ్యవహారశైలిని ఆక్షేపిస్తూ ఆ నగరాన్ని కంగనా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారు. ఇక్కడ జీవనం సాగించాలంటే భయంగా వుందని వ్యాఖ్యానించారు. అందుకు జవాబుగా శివసేన సైతం ఆమెపై నోరు పారేసుకుంది. దాంతో తన ప్రాణాలకు ముప్పువుందంటూ ఆమె కేంద్రానికి విన్నవించుకుని వై ప్లస్‌ సెక్యూరిటీ కూడా సాధించుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసిన ప్పుడు శివసేన ప్రతీకారం ఏ స్థాయిలో వుంటుందో అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నందువల్లా,  ఆ అధికారాన్ని ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో పంచుకుంటూన్నందువల్లా ఆ పార్టీ ఈసారి భౌతిక దాడులకు బదులు వాగ్యుద్ధానికి మాత్రమే పరిమితమైంది. కానీ అధికారాన్ని విని యోగించి తన చేతనైంది చేయడానికి సిద్ధపడింది. దాని పర్యవసానమే బుధవారంనాటి కూల్చివేత. 

కంగనా బంగ్లాలో కొన్ని అక్రమ నిర్మాణాలున్నాయని బీఎంసీ మొన్న సోమవారం ఆమెకు నోటీసులు జారీ చేసింది. అది అవాస్తవమని ట్విటర్‌లో కంగనా జవాబిచ్చారు. ఆమె సిబ్బంది కూడా బీఎంసీకి లిఖితపూర్వక సమాధానం పంపారు. అది అందుకున్న వెంటనే బుధవారం ఉదయం బీఎంసీ కూల్చివేత మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి స్టే రావడంతో అది తాత్కాలికంగా నిలిచింది. ముంబై మహానగరంలో అధికారుల కుమ్మక్కు కారణంగా అనేకానేక అక్రమ నిర్మాణాలు బయల్దేరు తున్నాయని, పర్యవసానంగా వర్షాకాలంలో నగరం వరదల్లో చిక్కుకుంటున్నదని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న నిర్మాణాలు నగరంలో నిరుపేదలు, సాధారణ పౌరుల బతుకుల్ని నరకప్రాయం చేస్తున్నాయని వారంటున్నారు. కనుక అక్రమ నిర్మాణాలు కూల్చేయాల్సిందే. కానీ అందుకు తగిన విధివిధానాలు అనుసరించాలి తప్ప ఇష్టానుసారం చేయడం ఎవరూ హర్షించరు. ఇది హఠాత్తుగా చేసింది కాదని...ఆమెకు 2018లోనే నోటీసులిచ్చామని బీఎంసీ చెబుతోంది. అది నిజమే కావొచ్చు... కానీ దానిపై ఆమె కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఇచ్చిన నోటీసుకు సైతం కంగనా సిబ్బంది జవాబిచ్చారు. ఆ వెంటనే కూల్చివేత ప్రారంభించాల్సిన అగత్యం ఏమొచ్చిందో బీఎంసీ సంతృప్తికరమైన జవాబివ్వలేక పోతోంది. ఒకపక్క ఆమెకూ, శివసేనకూ మధ్య వివాదం రాజుకుని తారస్థాయికి వెళ్లిన సమయంలో ఇది చోటుచేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది వేధింపుగానే అందరూ భావిస్తారు. 

ఈ వివాదం మొత్తానికి మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు. సుశాంత్‌ మరణానికి మానసిక ఒత్తిళ్లే కారణమని, ఇలాంటి ఒత్తిళ్లను అయినవాళ్లు సకాలంలో గుర్తించకపోతే బాధితులు ఆత్మహత్య చేసుకునేవరకూ వెళ్తారని చానెళ్ల నిండా నిపుణులు చర్చిస్తున్న సమయంలో కంగనా రనౌత్‌ రంగ ప్రవేశం చేసి పూర్తి భిన్నమైన కథనం వినిపించారు. బాలీవుడ్‌లో బంధుప్రీతిని ప్రోత్సహించే మూవీ మాఫియా అతన్ని మృత్యు ఒడిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా వున్నదని ఆమె చెప్పారు. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. అది చూస్తుండగానే కంగనాకూ, శివసేనకూ... కంగనాకూ, ఇతర బాలీవుడ్‌ నటీ మణులకూ మధ్య వివాదంగా మారింది.

బిహార్‌ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముంబై పోలీసులపై బురద జల్లుతున్నదని, వారి తరఫున కంగనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని శివసేన ఆరోపిస్తోంది. అందులో వాస్తవం కూడా ఉండొచ్చు. కానీ ఒక నటి చేసిన వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకుని, ఆమెపై కక్ష సాధిస్తున్నట్టు కనబడేలా వ్యవహరించడం శివసేన అపరిపక్వతను పట్టిచూపుతుంది. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. స్థానికుల ఉపాధి కాజేస్తున్నారన్న వంకతో స్థానికేతరులపై ఆ పార్టీ దాడులు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెస్తుంది. లాక్‌డౌన్‌ పర్యవసానంగా మన దేశంలో సామాన్యుల జీవనం ఎంత దుర్భరంగా మారిందో కళ్లకు కట్టే కథనాలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. కరోనా మహమ్మారి జోరు ఇంకా తగ్గలేదు. కానీ మన మీడియా మాత్రం రెండున్నర నెలలుగా బాలీవుడ్‌ పరిధి దాటి బయటకు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడి జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందరూ దృష్టి కేంద్రీకరిస్తే మంచిది.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు