Kerala High Court: ఆమె పేరు చాలదా!

27 Jul, 2022 00:18 IST|Sakshi

ఇది చరిత్రాత్మక ఆదేశం. కంటికీ, మనసుకూ ఉన్న పొరలు తొలగించుకొని, అందరినీ సమానంగా చూడమని కోర్టు మరోసారి చెబుతున్న ఉపదేశం. కుంతీపుత్రులంటూ చిన్నచూపు చూస్తూ, బురద జల్లడం అమానవీయమన్న సామాజిక సందేశం. అవును. కేరళ హైకోర్ట్‌ గత వారమిచ్చిన ఉత్తర్వులు ఇలా అనేక విధాల ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయమైనవి. పెళ్ళి కాని తల్లుల, లైంగిక అత్యాచార బాధితుల సంతానానికి సైతం ఈ దేశంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సగౌరవంగా, వ్యక్తిగత గోప్యతకు భంగం లేకుండా జీవించే ప్రాథమిక హక్కులు ఉన్నాయని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. జనన ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు, తదితర పత్రాలన్నిటిలో తల్లి పేరు రాస్తే చాలనీ, తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదనీ ఒకరికి అనుమతినిస్తూ, ఇలాంటి వారిని ‘నవ యుగ కర్ణులు’గా పేర్కొంది. పౌరుల హక్కులను మరోసారి గుర్తు చేస్తూ హైకోర్ట్‌ ఇచ్చిన ఈ ఆదేశం కొత్తది కాకున్నా కీలకమైనది. సమాజపు ఆలోచనలో రావాల్సిన మార్పు పట్ల ఆలోచన రేపుతోంది.

గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చేసిన తప్పుతో నిగూఢ పరిస్థితుల్లో మైనర్‌గా ఉన్నప్పుడే తాను గర్భవతినయ్యాననీ, పెళ్ళి కాని తల్లిగా, తనకు పుట్టిన బిడ్డగా తాను, తన కుమారుడు ఇవాళ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామంటూ ఒక అమ్మ వెలిబుచ్చిన ఆవేదనకు ఫలితమిది. తండ్రి ఎవరో తెలియని అనిశ్చితితో కుమారుడి గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు మూడు చోట్ల మూడు రకాలుగా ఉందనీ, దాని బదులు తనను సింగిల్‌ పేరెంట్‌గా గుర్తించాలనీ, తమకు ఈ మానసిక క్షోభ నుంచి రక్షణ కల్పించాలనీ ఆమె కోర్టు మెట్లెక్కారు. ఈ కుంతీ విలాపం కోర్టు విన్నది. బర్త్‌ రిజిస్టర్‌లో తండ్రి పేరు తొలగించి, ఒంటరి తల్లిగా అమ్మ పేరుతోనే తనకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలన్న ఆ కొడుకు వాదన న్యాయమేనంది. ఆ కేసులో జూలై 19న కేరళ హైకోర్ట్‌ ఆదేశం ఇవాళ దేశవ్యాప్త వార్త అయింది. కుంతీపుత్రులైనంత మాత్రాన పిల్లల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించ లేరనీ, వారి వ్యక్తిగత జీవితంలోకి జొరబడరాదనీ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ కుండ బద్దలు కొట్టారు. అందుకు 2015 నాటి సుప్రీమ్‌ కోర్ట్‌ చరిత్రాత్మక తీర్పునూ ఆసరాగా చేసుకున్నారు. 

నిజానికి, పిల్లల కన్నతండ్రి ఎవరో బహిర్గతం చేయాలంటూ ఒంటరి తల్లులను నిర్బంధించరాదు. 2015లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం ఆ మేరకు అపూర్వమైన తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా ఒంటరి తల్లులకూ, పెళ్ళి కాని తల్లులకూ పుట్టిన సంతానానికి బర్త్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నప్పుడు వారి తండ్రి ఎవరో చెప్పమంటూ బలవంతం చేయరాదని కేంద్ర హోమ్‌ శాఖ చాలాకాలం క్రితమే జనన, మరణ ధ్రువీకరణ జారీ చేసే రిజిస్ట్రార్లు అందరికీ లేఖ కూడా రాసింది. ఒంటరి తల్లుల అఫిడవిట్‌ చాలు... నిరభ్యంతరంగా బర్త్‌ సర్టిఫికెట్‌ జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. కేరళ హైకోర్ట్‌ ఇప్పుడు మళ్ళీ ఆ సుప్రీమ్‌ కోర్టు తీర్పునూ, హోమ్‌ శాఖ లేఖనూ ప్రస్తావిస్తూ తాజా ఆదేశాలివ్వడం గమనార్హం. అలాగే, తండ్రి పేరు, వివరాలు చెప్పాల్సిన ఆవశ్యకత లేకుండా, అలాంటి గడులేమీ లేని పత్రాన్ని విడిగా తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి గతంలోనే కోర్ట్‌ ఉత్తర్వులిచ్చింది. వీటన్నిటినీ గుర్తు చేస్తూ, పిల్లల, తల్లుల తీవ్ర మానసిక వేదనను అర్థం చేసుకుంటూ కేరళ హైకోర్ట్‌ ధర్మాసనం తాజా కేసులో ఆదేశాలివ్వడం విశేషం. ఒంటరి తల్లులకూ, వారి పిల్లలకూ ఇది మరోసారి ఊరట! 

పౌరులందరినీ సంరక్షించడం, వారందరినీ గౌరవంగా, సమభావంతో చూసేలా చూడడం దేశం భుజస్కంధాలపై ఉంది. కానీ, చాలా సందర్భాల్లో అటు ప్రభుత్వం, ఇటు సమాజంలో చక్రం తిప్పేవారందరూ ఆ వాగ్దానాన్నీ, బాధ్యతనూ విస్మరించడమే విషాదం. అలనాటి మహాభారత ఇతిహాసంలోని కర్ణుడి కథ నుంచి నేటి నవయుగ కుంతీకుమారుల వరకు అందరిదీ ఇదే అనుభవం. పెళ్ళి కాని తల్లులకూ, లైంగిక అత్యాచార బాధితులకూ పుట్టిన పిల్లలంటే దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ సమాజానికే కాదు... ప్రభుత్వానికీ లోకువే. ఆ తల్లులపై, పిల్లలపై కళంకితులనే ముద్ర వేయడం అందరికీ అలవాటే. ఈ సమస్యను గుర్తించింది గనకే, తండ్రి పేరు చెప్పాలంటూ ప్రభుత్వ సంస్థలు బలవంతం చేయరాదని 2015లోనే సుప్రీమ్‌ కోర్ట్‌ తీర్పు చెప్పింది. అయినా, ఇవాళ్టికీ అది పకడ్బందీగా ఆచరణలోకి రాకపోవడం విషాదం. 

అమ్మను మించిన దైవం లేదనే సంస్కృతికి వారసులమంటాం. తీరా అమ్మ పేరు రాస్తే చాలదని, తండ్రి పేరూ చెప్పాల్సిందే అనడం ఎలా సమర్థనీయం? ఏళ్ళు గడిచినా, తరాలు మారినా పితృస్వామ్య భావజాలంలోనే మునిగితేలే మానసిక రుగ్మతకు ఇది ప్రతీక. మహాభారత కుంతీ కుమారి కాలం నాటి భావాలకే దాస్యం చేయడం ఆధునిక సమాజానికి నప్పని అంశం. అభ్యుదయాన్ని కాంక్షించేవారెవరూ ఒప్పుకోని విషయం. అవతలివారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసి, వారిని లోకువగా జమకట్టే హక్కు ఎవరికీ లేదు గాక లేదు. కేరళ హైకోర్ట్‌ ఆదేశం కొత్తదేమీ కాకపోయినా, తల్లుల, పిల్లల హక్కులను ప్రభుత్వానికీ, సమాజానికీ మళ్ళీ గుర్తు చేసింది. జన్మకు కారణమైన తండ్రి కన్నా, నవమాసాలూ మోసి, జన్మనిచ్చిన అమ్మ ఎప్పుడూ ఒక మెట్టు పైనే అని మాటలు చెప్పే మనం ఇకనైనా మారాలి. కనిపెంచిన అమ్మను కనిపించే దేవతగా గుర్తింపు పత్రాల్లోనూ అంగీకరించాలి. దానికి ఇంకెన్ని కోర్టులు ఆదేశాలివ్వాలంటారు!? 

మరిన్ని వార్తలు