అమెరికా ఎటువైపు?

16 Oct, 2020 00:38 IST|Sakshi

అమెరికాలో అందరి అభిప్రాయంగా ప్రచారంలో వున్న అంశాన్నే తాజా సర్వే కూడా మరోసారి ధ్రువీకరించింది. ఈసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నెగ్గే ఛాన్స్‌ లేదన్నది ఆ సర్వే సారాంశం. అమెరికాలో అత్యధికులు ట్రంప్‌ ప్రత్యర్థి, డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌నే కోరుకుంటు న్నారని ఆ సర్వే చెబుతోంది. అంతకన్నా ముఖ్యమైనదేమంటే... ఓటు హక్కున్న ప్రవాస భారతీ  యుల్లో మూడింట రెండొంతులమంది ఈసారి బైడెన్‌కే ఓటేస్తామని తెలిపారు. ఎన్నారై ఓటర్లలో 72 శాతంమంది బైడెన్‌కు అనుకూలంగా వుంటే ట్రంప్‌కు 22 శాతంమంది అనుకూలం. సాధారణంగా భారతీయులెప్పుడూ డెమొక్రాటిక్‌ పార్టీకే అనుకూలంగా వుంటారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ నెగ్గాలని కోరుకున్నవారిలో భారతీయులు గణనీయంగానే వున్నారన్న అభిప్రాయం కలగడానికి అప్పుడు కొంతమంది చేసిన హడావుడి, ఆయన శిబిరంలో ఎన్నికల బాధ్యతలు చూసేవారిలో గణనీయ సంఖ్యలో ఎన్నారైలు వుండటం కొంత కారణం.

దాంతోపాటు అప్పట్లో ట్రంప్‌ కోసం కొందరు యజ్ఞం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్నారై ఓట్లలో 16 శాతం ట్రంప్‌కు వెళ్లాయని లెక్కలు చెబుతున్నాయి. ఆయనపై పోటీచేసిన డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ 77 శాతం ఎన్నారైలు ఓటేశారు. దీన్నిబట్టి చూస్తే ట్రంప్‌ ఓట్లు అప్పటికీ ఇప్పటికీ 6 శాతం మేర పెరిగాయి. మరో 6 శాతం మంది ఎటూ తేల్చుకోలేనివారున్నారని తాజా సర్వే వెల్లడించింది. వీరిలో ఎంత శాతాన్ని ట్రంప్‌ తనవైపు తిప్పుకుంటారన్నది చూడాల్సివుంది. పెన్సిల్వేనియా, మిచిగాన్, ఫ్లారిడా, నార్త్‌ కరోలినా రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు ఎక్కువగా వుంటారు. కనుక అక్కడ వీరి మద్దతు కీలకమవుతుంది. ఎన్నారై ఓటర్లలో ట్రంప్‌వైపు మొగ్గిన వారి సంఖ్య గతంకన్నా పెరగడానికి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకున్న ఆదరణ కారణం. వాస్తవానికి ఇదింకా ఎక్కువగానే వుండేది. కానీ ట్రంప్‌ తెంపరితనం దాన్ని తగ్గించింది. ఒకపక్క ఎన్నికలు ముంగిట్లోకొచ్చిన తరుణంలో ఈ నెల మొదటివారంలో హెచ్‌ 1బీ వీసాలపై కొత్త ఆంక్షలు విధించారు. అమెరికా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే వీటిని తీసుకొచ్చానని ట్రంప్‌ ప్రకటించారు. ఎలాంటి కారణం చూపి అయినా ప్రభుత్వం వీసా నిరా కరించడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తున్నాయని, ఇందువల్ల తమకెంతో నష్టం జరుగుతుందని భారతీయులు వాపోతున్నారు. అయితే శ్వేత జాతి అమెరికన్లలో కూడా తన పరపతి తగ్గుతోందని తెలిశాకే ట్రంప్‌ ఈ కొత్త ఆంక్షల్ని అమల్లోకి తెచ్చారన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.

2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ తన ప్రత్యర్థికన్నా దాదాపు 8 నుంచి 10 శాతం అధికంగా ఓట్లు తెచ్చుకున్న అయోవా, ఒహాయో, టెక్సాస్‌ రాష్ట్రాల్లో ఈసారి కేవలం అయోవా రాష్ట్రంలో మాత్రమే ఆయన లబ్ధి పొందుతారని ఒక సర్వే గతంలో చెప్పింది. అయితే ఒహాయో, ఫ్లారిడాల్లో బైడెన్‌  వెనకబడ్డారని తాజా సమాచారం. ఈ రెండూ రెండో ప్రపంచ యుద్ధం మొదలుకొని ఇప్పటివరకూ అధ్యక్షుడిగా ఎంపికైనవారి వెనకే వున్నాయి. గత నెల 29న ట్రంప్, బైడెన్‌ల సంవాదం తర్వాత బైడెన్‌ ఆధిక్యత కనబరిచారని దాదాపు అన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. ఎన్‌బీసీ అయితే అంతక్రితం రెండు వారాలకన్నా బైడెన్‌ ఆధిక్యత ఆరు శాతం పెరిగిందని... ఆయనకు 53 శాతంమంది మద్దతు పలికితే, ట్రంప్‌కు 39 శాతంమంది అనుకూలంగా వున్నారని తేల్చింది. గత ఎన్నికల్లో తన ప్రత్యర్థికన్నా ఒక శాతం ఓట్ల ఆధిక్యత సాధించిన మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో బైడెన్‌ ఆధిక్యత చాలా ఎక్కువగా వుందన్నది సర్వే చెబుతున్న మాట. ఈ మూడూ పారిశ్రామికంగా ప్రాముఖ్యం వున్నవని, ఇక్కడ కార్మికుల సంఖ్య ఎక్కువగా వుంటుందని గమనిస్తే ట్రంప్‌ పరిస్థితి ఎలావుందో అంచనా వేసుకోవచ్చు. 

ఇవన్నీ గ్రహించబట్టే ట్రంప్‌ ఉత్సాహంగా వున్నట్టు కనబడేందుకు ప్రయత్నిస్తున్నారు. బైడెన్‌తో సంవాదం జరిగిన రెండ్రోజుల తర్వాత తనకు కరోనా వైరస్‌ సోకిందని ఆయన ప్రకటించారు. ట్రంప్‌ తానే కరోనా వైరస్‌ బారిన పడటంతో ఆ వ్యాధిని అరికట్టడంలో విఫలమయ్యారన్న ప్రచారాన్ని ధ్రువీకరించినట్టయింది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేవారు మంచి ఆరోగ్యంతో ఉండాలని, శక్తివంతంగా కనబడాలని అమెరికన్లు కోరుకుంటారు. అలాంటివారే సమస్యలనుంచి తమను కాపాడగలడన్న నమ్మకం వారికుంటుందంటారు. బైడెన్‌తో జరిగిన సంవాదంలో ఓటమిపాలై వున్న ట్రంప్‌కు కరోనా వైరస్‌ కూడా సోకిందంటే ఇక చెప్పేదేముంది? కనుకనే వ్యాధినుంచి కోలుకున్నవారు పాటించాల్సిన నియమాలను కూడా పక్కనబెట్టి రెండు వారాలు కాకుండానే ఆయన ఎన్నికల రంగంలోకి ఉరికారు.  

ఇప్పటికే చాలామంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి సంఖ్య కోటీ పది లక్షల వరకూ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ముందుగా ఓటే యడం ఇదే ప్రథమం అంటున్నారు. మిగిలినవారు ఓటేయడానికి ఇక మూడు వారాల సమయం మాత్రమే వుంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్‌ ఓటు పెద్దగా పరిగణనలోకి రాదు. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లే కీలకమైనవి. గత దఫాలో పాపులర్‌ ఓటు హిల్లరీ పక్షానే వున్నా ఆమె ఓటమి పాలయ్యారని గుర్తుంచుకుంటే... సర్వేలు చూసి ట్రంప్‌ను పరాజితుడిగా లెక్కేయడం సరికాదని అర్థ మవుతుంది. ఇంతవరకూ చేసిన సర్వేలన్నిటా ట్రంప్‌ కన్నా దాదాపు 10 శాతం ఆధిక్యత కనబరు స్తున్నా ఓటర్ల పూర్తి విశ్వాసాన్ని చూరగొనడంలో బైడెన్‌ విఫలమయ్యారని గ్యాలప్‌ సంస్థ తేల్చింది. ట్రంప్‌ మళ్లీ విజేత అవుతారని 56 శాతంమంది ఓటర్లు భావిస్తుంటే... 40 శాతంమంది మాత్రమే బైడెన్‌ నెగ్గుతారని అనుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది. నిరుద్యోగం, వర్ణ వివక్ష, కరోనా వైరస్‌ వంటి అనేక అంశాలు అమెరికా ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కనుకనే ట్రంప్‌ గెలుపు అనుమానమేనని సర్వేలు అంటున్నాయి. అందులో ఎంతమేర వాస్తవం వుందో వచ్చే నెలలో తేలిపోతుంది. 

మరిన్ని వార్తలు