ఎన్నదగిన తీర్పు

22 Sep, 2020 01:35 IST|Sakshi

ప్రముఖ నటుడు సూర్యపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలన్న సూచనను తోసి పుచ్చుతూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎన్నదగ్గది. నీట్‌ పరీక్షలు నిర్వహణ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను తప్పుబడుతూ సూర్య సామాజిక మాధ్యమం ద్వారా వ్యాఖ్యలు చేశారు. ఇవి న్యాయవ్యవస్థను కించపరిచేలా వున్నాయంటూ మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్ర హ్మణ్యం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటూనే న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తుల పనితీరుపై వాఖ్యానాలు చేసేటపుడు జాగ్ర త్తగా మాట్లాడాలని ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం హితవు పలికింది. కోర్టు ధిక్కార నేరం అస్త్రాన్ని ప్రయోగించే విషయంలో మన దేశంలోనే కాదు... అనేక దేశాల్లో మొదటి నుంచీ భిన్నాభిప్రాయాలున్నాయి. బ్రిటన్‌లో వందేళ్లక్రితమే ఒక తీర్పు సందర్భంగా లార్డ్‌ మోరిస్‌ కోర్టు ధిక్కార నేరానికి కాలదోషం పట్టిందని వ్యాఖ్యానించారు. కోర్టుల పట్ల ప్రజాభిప్రాయం దాడి రూపంలోవున్నా, అపఖ్యాతిపాలు చేసేవిధంగా వున్నా, అవమానకరంగా వున్నా దాన్ని వారికే వది లేయడం మంచిదన్నారు. అనంతరకాలంలో బ్రిటన్‌లో కోర్టు ధిక్కారాన్ని నేరంగా పరిగణించే చట్టాన్ని రద్దు చేశారు. 2009నుంచి అయిదేళ్లపాటు లా కమిషన్‌ చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ ఈ అంశాన్ని పరిశీలించారు. అయితే మన దేశంలో కోర్టు ధిక్కార నేరాలు పెరుగు తున్నందువల్ల ఈ చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం వున్నదని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఇందులోనే తగిన రక్షణలున్నాయన్నారు. 

సుప్రీంకోర్టుకు 1964లో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ గజేంద్ర గడ్కర్‌ కోర్టు ధిక్కార నేరాల విషయంలో అధికారాన్ని వినియోగించేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని న్యాయ మూర్తులకు హితవు పలికారు. కోర్టు ధిక్కార నేరానికి సంబంధించి వున్న చట్టం న్యాయమూర్తుల వ్యక్తిగత పరిరక్షణ కోసం కాదు. సరైన న్యాయం అందజేయడానికి న్యాయస్థానానికి గల అధికారానికి విఘాతం కలగకుండా వుండటం కోసం. వాస్తవానికి ఇది సాధారణ పౌరుడు న్యాయస్థానం నుంచి ఫలవంతమైన, ప్రభావశీలమైన న్యాయం పొందడానికుండే హక్కును రక్షించడం కోసం. కనుక ఏది కోర్టు ధిక్కారం అవుతుంది... ఏది కాదు అనే అంశంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరిం చాల్సివుంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలోని 19వ అధికరణ పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పూచీ పడుతోంది. అదే సమయంలో ఆ హక్కుకు సహేతుకమైన కొన్ని పరిమితులు కూడా విధిం చింది. అందువల్లే నిర్దిష్టమైన అభిప్రాయం లేదా ప్రసంగం కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయా రావా అన్న అంశాన్ని నిర్ధారించడానికి నిశిత పరిశీలన అవసరమవుతుంది. ఈ నెల మొదట్లో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కోర్టు ధిక్కరణ అంశం బాగా చర్చలోకొచ్చింది. తనకు సుప్రీంకోర్టుపైనా, మొత్తం న్యాయవ్యవస్థపైనా ఎంతో గౌరవం వున్నదని, ఆ రెండింటినీ అప్రదిష్టపాలు చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ప్రశాంత్‌ భూషణ్‌ వాదిం చారు. అయితే ఆయన నేరానికి పాల్పడ్డారని ధర్మాసనం అభిప్రాయపడి రూపాయి జరిమానా విధిస్తూ, అది చెల్లించకపోతే మూడు నెలల జైలు, మూడేళ్లపాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్‌ వుంటాయని హెచ్చరించింది. ప్రశాంత్‌భూషణ్‌ జరిమానా చెల్లించి, తీర్పును పునఃసమీక్షించాలని అప్పీల్‌ చేశారు. ఆ వివాదం ముగియకముందే సూర్య వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

సూర్య కేసు పూర్వాపరాలు గమనిస్తే ఆయన నీట్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా లేదా న్యాయమూర్తులపైనా నిందలు వేయలేదు. ఉద్దేశాలు ఆపాదించలేదు. కానీ వ్యంగ్య ధోరణితో మాట్లాడారు. ‘కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న న్యాయ స్థానం విద్యార్థులు మాత్రం నిర్భయంగా పరీక్ష రాయాలని చెబుతోంద’న్నారు. సూర్య ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అందరికీ తెలుసు. తమిళనాడులో నీట్‌ పరీక్షలు రాయాల్సిన నలుగురు విద్యార్థులు ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో తాము పరీక్షలు రాసే పరిస్థితుల్లో లేమని వీరు లేఖలు రాసి చనిపోయారు. దీనిపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగినప్పుడు సూర్య ఈ వ్యాఖ్య చేశారు. న్యాయస్థానాలపై వ్యాఖ్యానాలు చేసేటపుడు వ్యక్తమయ్యే భాష, పదాలు సముచితమైన, న్యాయమైన విమర్శ పరిధుల్ని దాటి పోకుండా చూసుకోవాల్సిన అవసరం వున్నదని సూర్య వ్యాఖ్యపై తీర్పునిచ్చిన సందర్భంగా ధర్మాసనం తేల్చింది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలో అన్ని వ్యవస్థలూ స్తంభించిన మాట వాస్తవమే. అది అంతరించేవరకూ బాధితులకు న్యాయం కోసం వేచిచూసే పరిస్థితులు ఉండకూడదన్న ఉద్దేశంతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కేసుల్ని విచారించడం, వాదనలు వినడం అన్ని దేశాల్లోనూ మొదలుపెట్టారు. నేరుగా కేసుల్ని విచారించేటప్పుడు అందులో వున్న తీవ్రత తెలిసినంతగా, ఆన్‌లైన్‌ విచారణల్లో తెలిసే అవకాశం లేదని కొందరు న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేయకపోలేదు. ఈ ప్రక్రియలో వుండే సాంకేతికమైన అవరోధాల సంగ తలావుంచి, బహిరంగ విచారణ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని వారు అభి ప్రాయపడ్డారు. కేవలం కక్షిదారులకూ, వారి న్యాయవాదులకూ మాత్రమే పరిమితమయ్యే ప్రక్రియ సరికాదన్నారు. సూర్య విమర్శించిన కోణం వేరు. అయితే విమర్శించడానికి సూర్యకు గల హక్కును  మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించలేదు. ఆ విమర్శ ఆరోపించేవిధంగా కాక హుందాగా వుండాలని సూచించింది. ఏ అంశంపైన అయినా అన్నీ తెలుసుకున్నాకే అభిప్రాయాలు వ్యక్తం చేయాలని హితవు పలికింది. మొత్తానికి మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం ఎంతో సంయమనంతో ఇచ్చిన ఈ తీర్పు ఎన్నదగినది. 

మరిన్ని వార్తలు