వలసలపై డేటా భేష్‌!

15 Dec, 2020 04:19 IST|Sakshi

దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికెళ్లే  వలస కార్మికులు, ఇతరుల డేటా రూపొందించడానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సంకల్పించడం మంచి పరిణామం. ఈ డేటా రూప కల్పన కోసం ఇతర మంత్రిత్వ శాఖల సహాయసహకారాలు తీసుకోవాలని కార్మిక శాఖ నిర్ణయిం చింది. వచ్చే జూన్‌కు డేటా సిద్ధమవుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభుత్వా లకూ, పౌరులకూ చాలా గుణపాఠాలు నేర్పింది. వలస వచ్చేవారి విషయంలో ఖచ్చితమైన డేటా వుండాలని అంతక్రితం ఏ ప్రభుత్వమూ అనుకోలేదు. కానీ లాక్‌డౌన్‌ అమలు ప్రారంభించాక ఆ వివరాలు లేకపోవడం ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో అనుభవపూర్వకంగా అర్థమైంది. వలస కార్మికుల్లో అత్యధికులు అసంఘటిత రంగంలో వుంటారు. లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించి, రవాణా సౌకర్యాలు నిలిపేయడంతో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులను, కూలీలను పనిలో పెట్టుకున్నవారే లాక్‌డౌన్‌ ఎత్తేసేవరకూ వారి బాగోగులు పట్టించుకోవాలని కేంద్రం సూచిం చినా కొద్దిమంది మినహా అత్యధికులు పట్టించుకోలేదు. పైగా వారికి ఇవ్వాల్సిన బకాయిలు ఎగ్గొట్టిన ఘనులు కూడా వున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన సాయమైనా, ఇటు స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయమైనా అందనివారెందరో వున్నారు. ఉన్నచోటే వుంటే ఆకలిదప్పులతో చనిపోవడం ఖాయమన్న నిర్ణయానికొచ్చినవారు కుటుంబాలతో సహా స్వస్థలాలకు నడక మొదలుపెట్టారు.  అలా వెళ్లినవారి సంఖ్య కోటి పైమాటేనని కార్మిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

ఉపాధి హామీ, ఒకే దేశం–ఒకే రేషన్‌వంటి పథకాల కోసం... ఈపీఎఫ్, ఈఎస్‌ఐ తదితర ప్రయోజనాలు వర్తింపజేయడానికి డేటా సేకరిస్తారు. అలాగే ఆధార్‌ డేటా సరేసరి. ఇలా భిన్న రంగాలకు చెందిన ప్రభుత్వ విభాగాలు సేకరించే డేటాను సమన్వయపరిస్తే అది కొంతవరకూ ఉపయోగపడొచ్చు. అలాగే ఒక రాష్ట్రం నుంచి వేరేచోట్లకు వెళ్లేవారు రిజిస్టర్‌ చేసుకోవడానికి అనువైన విధానాన్ని రూపకల్పన చేయాలి. మన దేశంలో వలస కార్మికులు ఎంతమంది వుంటారన్న విషయంలో స్పష్టమైన గణాంకాలు లేవు. వలస కార్మికుల సంఖ్య 45 కోట్ల వరకూ వుండొచ్చని 2011 జనాభా లెక్కలు తేల్చాయి. మన దేశంలో ఏటా సగటున 4.5 శాతం మేర అంతర్గత వలసలు పెరుగుతుంటాయని ప్రపంచ ఆర్థిక ఫోరం నివేదిక అంచనా వేసింది. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచే వేరే రాష్ట్రాలకు వలసలుంటాయి. వీరంతా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్తుంటారని 2017నాటి ఆర్థిక సర్వే తెలిపింది. తాము వున్నచోట ఉపాధి లేకపోవడం, తక్కువ వేతనాలు లభించడం, కరువుకాటకాలు తలెత్తటం, మెరు గైన వైద్య సౌకర్యాలు కొరవడటం, శాంతిభద్రతలు లేకపోవటం వగైరా సమస్యల వల్ల చాలామంది వలసపోవడానికి సిద్ధపడతారు. తమ ప్రాంతం, భాష కానిచోట మనుగడ సాగించడం కష్టమని తెలిసినా వారికి అంతకన్నా గత్యంతరం వుండదు. కుటుంబాల్లోని పిల్లలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు లభించాలంటే... కనీసం బ్యాంకు ఖాతా ప్రారంభించాలంటే ఏదో రకమైన గుర్తింపు కార్డు వుండాలి.

చాలా సందర్భాల్లో అది అసాధ్యమవుతుంది. దేశంలోని వలస కార్మికుల్లో 22 శాతంమందికి ఎలాంటి గుర్తింపు కార్డు వుండదని 2011లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భాష రాకపోవటం వల్ల, స్థానికులు కాకపోవటం వల్ల వారికి పనులు చూపించే దళారులు వలస కార్మికులను నిలువుదోపిడీ చేస్తుంటారు. మెరుగైన వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలు రాబట్టు కోవటం వలస కార్మికులకు సులభం కాదు. పనిచేసేచోట సమస్యలేర్పడితే వారిని ఆదుకునే వారుండరు. వలస కార్మికులు సృష్టించే సంపద తక్కువేమీ కాదు. మహా నగరాల్లో ఆకాశాన్నంటే భవంతుల నిర్మాణం మొదలుకొని చిన్న చిన్న పారిశుద్ధ్య పనుల వరకూ అన్నింటా వారి ప్రమేయం వుంటుంది. అయినా ఇన్ని దశాబ్దాలుగా వారికి సంబంధించిన సమగ్రమైన డేటా ప్రభుత్వాల దగ్గర లేదు. ఇది వలస కార్మికులకు, కూలీలకు మాత్రమే కాదు... ప్రభుత్వాలకు సైతం సమస్యే. ఏ ప్రాంతంలో జనాభా సాంద్రత ఎంతవుందో నిర్దిష్టమైన అంచనా కొరవడటంతో మంచినీరు, డ్రయి నేజ్‌ వంటి సౌకర్యాల అమలు తలకిందులవుతుంది. వారికి సరైన వేతనాలు లభిస్తున్నాయో లేదో, వారి సంక్షేమానికి ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ధారించుకోవడం అసాధ్యమవుతుంది.

వలస కార్మికులకు కూడా కార్మిక చట్టాలు వర్తిస్తాయి. వాటికింద నిర్దిష్టమైన పనిగంటలు, వేతనం, ఇతర భత్యాలు అందాలి. అలాగే వారికి తగిన ఆవాసం, వైద్య సౌకర్యాలు కల్పించాలి. అనుకోని ప్రమాదం సంభవించినా, ఉన్నట్టుండి పని నుంచి తొలగించినా, మరెలాంటి సమస్య తలెత్తినా ఫిర్యాదు చేసే హక్కు వారికుంటుంది. వలస కార్మికుల ఉపాధి, పని పరిస్థితుల క్రమబద్ధీకరణ కోసమంటూ 1979లో చట్టం తీసుకొచ్చారు. దానికి మరింత పదును పెడుతూ 2011లో సవరణలు చేశారు. ఆ చట్టంకింద అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది ఇతర రాష్ట్రాలవారిని పనిలో పెట్టుకునే కాంట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన రిజిస్టర్‌ నిర్వహిస్తూండాలి. కానీ ఈ చట్ట నిబంధనలు ఎలా అమలవుతున్నాయో చూసేవారు కరువయ్యారు. అందుకే లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితులపై ప్రభుత్వాలకు అంచనా లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా సేకరణకు నడుం కట్టింది గనుక అలాంటి సమస్యలు తీరుతాయని ఆశించాలి.  వలస కార్మికుల సామాజిక భద్రతకు, సంక్షేమానికి తగిన చర్యలు తీసుకొనేందుకు ఈ డేటా తోడ్పడాలి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన నిర్వ చనం అన్ని చట్టాల్లోనూ ఒకేలా లేదు. ఆ లోపాన్ని కూడా సరిచేయాలి. డేటా ఆధారంగా గుర్తింపు కార్డులు జారీచేసి, వలస కార్మికులకు సకల ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు