శరణార్థుల గోడు పట్టదా?

24 Aug, 2022 01:00 IST|Sakshi

రోహింగ్యా శరణార్థుల అంశం మళ్ళీ పతాక శీర్షికలకెక్కింది. అధికారంలో ఉన్నవారికి ఈ కాందిశీ కుల పట్ల అనుసరించాల్సిన వైఖరిలో స్పష్టత లేదని మరోసారి రుజువైంది. మురికివాడల్లోని 1100 మంది రోహింగ్యాలను ఢిల్లీ శివార్లలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు ఉద్దేశించిన నివాసాల్లోకి తరలించి, ప్రాథమిక వసతులు కల్పించి, పోలీసు భద్రత కల్పిస్తామంటూ కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ఆగస్ట్‌ 17న ట్వీట్‌ చేశారు. కానీ, అమిత్‌ షా సారథ్యం లోని హోమ్‌ శాఖ తక్షణమే రంగంలోకి దిగి, ‘‘చట్టవిరుద్ధమైన రోహింగ్యా విదేశీయులకు’’ ఆ నివాసాలివ్వాలంటూ ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని వివరణనిచ్చింది. కొద్ది గంటల తేడాలో ఒకే అంశంపై రెండు మంత్రిత్వశాఖలు రెండు రకాలుగా స్పందించడం విడ్డూరం. కాందిశీకుల అంశంపై దేశంలో జాతీయ స్థాయిలో ఓ చట్టం అవసరమని తాజా వివాదం మరోసారి గుర్తుచేస్తోంది. 

గతంలో యూపీ నీటిపారుదల శాఖ స్థలంలో ఉంటున్న నివాసాలు ప్రభుత్వం నోటీసిచ్చిన మరునాడే అనూహ్యంగా అగ్నికి ఆహుతయ్యాక, ఢిల్లీ శివారులోని ఓ ఇస్లామిక్‌ ఛారిటీకి చెందిన స్థలంలో తాత్కాలిక నివాసాల్లో, దగ్గరలో మరుగుదొడ్లు కూడా లేని దుర్భరస్థితిలో రోహింగ్యాలు బతుకులు వెళ్ళదీస్తున్నారు. వారికి కనీస వసతులు కల్పిస్తామని సర్కార్‌ 2021లోనే అంది. ఆ పరిణామ క్రమంలోనే దౌత్యవేత్త, సీనియర్‌ మంత్రి పూరీ తాజా ట్వీట్‌ వచ్చింది. తీరా విశ్వహిందూ పరిషత్‌ సహా అధిక సంఖ్యాక హిందూ సమర్థకుల విమర్శలకు వెరచి, ప్రభుత్వం ప్లేటు ఫిరాయిం చడం శోచనీయం. రోహింగ్యా అనేది పశ్చిమ మయన్మార్‌ (బర్మా)లోని రఖైన్‌ ప్రావిన్స్‌కు చెందిన సమూహం. ముస్లిమ్‌లైన వీరు బెంగాలీలోని ఓ మాండలికంలో మాట్లాడతారు. మయన్మార్‌ వీరిని ‘నివాసిత విదేశీయులు’ అనీ, ‘సహచర పౌరుల’నీ పేర్కొంటోంది. 2012 నుంచి వరుస హింసా కాండలతో వీరు మయన్మార్‌ను వదిలిపోవాల్సి వచ్చింది. 5 లక్షల మంది సౌదీ అరేబియాకు పారి పోయారు. 2017లో మళ్ళీ మయన్మార్‌ సైన్యం దాడులతో, లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లో తలదాచుకున్నారు. 2012లో 1200 మంది తొలి బృందం శరణార్థులుగా ఢిల్లీకి వచ్చింది.  

అయితే, 2018 అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు భారత్‌ మొత్తం 12 మంది శరణార్థుల్ని మయన్మార్‌కు తిప్పి పంపింది. ఇది రోహింగ్యాల అంశంపై గళం విప్పుతున్న ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ బృందం లెక్క. వారందరూ స్వచ్ఛందంగా తిరిగి వెళ్ళారని సర్కారు వారి మాట. కానీ, ఐరాస శరణార్థి సంస్థ స్వతంత్రంగా ఆ సంగతి నిర్ధారించుకొనేందుకు పదే పదే అభ్యర్థించినా, అనుమతి నిరాకరించడం గమనార్హం. మన దేశంలో మొత్తంగా 40 వేల మంది రోహింగ్యా కాందిశీకులు ఉన్నారు. వారిలో 5700 మంది జమ్మూలో, మిగిలినవారు తెలంగాణ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్‌లలో తలదాచుకున్నారు. అయితే వీరిలో 16 వేల మందే ఐరాస శరణార్థి సంస్థ వద్ద నమోదు చేసుకున్నారు. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పు అని చిత్రీకరిస్తూ మెజారిటీ వర్గీయులు పోనుపోనూ స్వరం పెంచుతున్నారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఎంత గట్టిగా మాట్లాడితే, అంత ఎక్కువగా జాతీయతావాదులనే కీర్తి దక్కుతుందని భావిస్తున్నారు. 

నిజానికి, 1951 నాటి ఐరాస అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందంపై కానీ, కాందిశీకుల హోదాకు సంబంధించిన 1967 నాటి ప్రోటోకాల్‌పై కానీ భారత్‌ సంతకం చేయలేదు. కాబట్టి, అవతలి దేశంలో పీడనకు గురవుతారని తెలిసీ రోహింగ్యాలను మయన్మార్‌కు బలవంతాన పంపేయడం చట్టప్రకారం సరైనదేనని వాదించవచ్చు. అందుకు మునుపటి సుప్రీమ్‌ కోర్ట్‌ తీర్పుల్నీ ఉదాహరణగా చూపవచ్చు. కానీ, తెలిసి తెలిసీ అలా పంపరాదన్నదే సంతకాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చట్టంలో అందరూ అనుసరించే సంప్రదాయం, ధర్మం. న్యాయస్థానం సైతం ఈ నిస్సహాయులకు అండగా నిలవకపోవడం విషాదం. హోమ్‌శాఖ 2011లో జారీ చేసిన ‘ప్రత్యేక వ్యవహార సూత్రాలు’ మినహా ఇప్పటికీ మన దేశంలో అంతర్జాతీయ ఆదర్శాలకు తగ్గట్టు శరణార్థులకు ఓ జాతీయ చట్టమంటూ లేకపోవడమే దీనికి కారణం. శశిధరూర్‌ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టినా రాజకీయ ఏకాభిప్రాయం లేక, లాభం లేకపోయింది. 

ఇప్పటికీ పాకిస్తానీ హిందువులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లు దేశంలోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఏ ప్రాంతానికీ చెందని ఇలాంటివారు దేశంలో 2.89 లక్షల మంది ఉన్నారు మరి, ఐరాస గుర్తింపుకార్డులిచ్చిన రోహింగ్యాల పట్ల పాలకులు అదే తరహా వైఖరి చూపడానికి ఇబ్బందేమిటి? పదేళ్ళుగా ఈ గడ్డపైనే ఉంటున్న సాటి మనుషులుగా రోహింగ్యాలు మెరుగైన జీవితం గడిపేలా చూడడం మానవత్వం. ఆ మేరకు గతంలో చేసిన బాసలకు భారత్‌ కట్టుబడాలి. 

వేదికలపై ‘వసుధైక కుటుంబం’ లాంటి కబుర్లు చెప్పే పాలకులు తీరా చేతల్లో తద్భిన్నంగా వ్యవహరిస్తే ఎలా? శరణార్థులపై విదేశాంగ విధానాల్లో ఒక మాట, దేశంలో రాజకీయ లబ్ధి కోసం వారినే ‘చెదలు’ అని ఈసడిస్తూ మరోమాట మాట్లాడడం ఏ రకంగా సమర్థనీయం? రోహింగ్యాలంటే తీవ్రవాదులే అన్న భావన ఎవరు, ఎందుకు కల్పిస్తున్నారు? ‘అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందా’న్ని భారతదేశం గౌరవిస్తుంది. జాతి, మతం, ధార్మిక విశ్వాసాల సంబంధం లేకుండా అందరికీ ఆశ్రయమిస్తుంది’ అనే మంత్రి గారి మాట ఉత్తుత్తిదేనా? శరణు కోరినవారిని కాపాడమనే శ్రీరాముడే ఆదర్శం అనే పాలకులు ఆలోచించాలి. 

మరిన్ని వార్తలు