అమ్మ మరిచిన పాట

7 Nov, 2022 01:14 IST|Sakshi

పక్క ఫ్లాట్‌లో పాపాయి పుట్టింది. బుజ్జిగా ఉండుంటుంది. కళ్లు తెగ తెరిచి తల్లిని చూస్తూ ఉండుంటుంది. పాలు సరిపోతుండొచ్చు. గుండెలకు హత్తుకుని ఇచ్చే వెచ్చదనం సరిపోతుండొచ్చు. అయినా సరే కయ్‌మని ఏడుస్తుంది. నేను ఏడుస్తున్నానహో అని చెప్పడానికి ఏడుస్తున్నట్టుంది. నాకేదో కావాలహో అని చెబుతున్నట్టు ఏడుస్తుంటుంది. అమ్మకు పాతికేళ్లుంటాయి. ఎత్తుకుని సముదాయిస్తుంది. అటూ ఇటూ తిప్పుతూ ఊరుకోబెడుతుంది. పాపాయి ఏడుపు ఆపదే! బహుశా అమ్మ పాడాలేమో! యుగాలుగా తల్లులందరూ పసికందుల కోసం మనోహరమైన గాయనులై ఎత్తే గొంతును ఆ తల్లి కూడా ఎత్తాలేమో! 

‘ఆయి ఆయి ఆయి ఆపదలు కాయీ’.  
ఆహా. ఒకప్పుడు ఏ అమ్మయినా ఈ పాట అందుకుంటే పసినోరు ఠక్కున మూతపడేది. గొంతులో లయ ఊయల ఊపుతున్నట్టుండేది. ఏదమ్మా... మళ్లొకసారి పాడు అన్నట్టుగా పాపాయి మెడ కదిలించేది. ‘ఆయి ఆయి ఆయీ... ఆపదలు కాయీ’. చిట్టి బంగారు తల్లికి ఏ ఆపదలూ రాకూడదు. ఈ బంగరు బుజ్జాయి బొజ్జ నిండా పాలు తాగి, కంటి నిండా కనుకు తీయాలి. వివశుల్ని చేసే చిర్నవ్వు నిదురలో నవ్వాలి. గుప్పిళ్లు బిగించాలి. ఉత్తుత్తికే ఉలికి పడాలి. అందుకు తల్లి ఏం చేయాలి? పాడాలి.

‘ఏడవకు కుశలవుడ రామకుమార... ఏడిస్తె నిన్నెవ్వరెత్తుకుంటారు?’ సీతాదేవి పాడకుండా ఉందా? అడవిలో తావు కాని తావులో, లోకుల మధ్య ఇద్దరు కుమారులను కని, వారికి సర్వం తానై, వారు ఒడిలో ఉంటే అదే పెన్నిధిగా భావించి, ఆ కారడవిలో, రాత్రివేళ, ఏనాడైనా దడుపు వల్లో కలత చేతో ఏడిస్తే సీత పాడకుండా ఉందా? ‘ఉంగరమ్ములు కొనుచు ఉయ్యాల గొనుచు ఊర్మిళా పినతల్లి వచ్చె ఏడవకు. పట్టు అంగీ గొనుచు పులిగోరు గొనుచు భూదేవి అమ్మమ్మ వచ్చె ఏడవకు’. సీతాదేవి పాడుతున్నదా? పిల్లలకు తన సొద చెప్పుకుంటున్నదా? ఆశను వారిలో సజీవంగా ఉంచు తున్నదా? ఏమో! పాడటం మాత్రం మానలేదు. వాళ్ల నాన్న విన్న పాటను తిరిగి వల్లెవేయక ఉండ లేదు. ‘రామా లాలీ మేఘ శ్యామా లాలి... తామరస నయన దశరథ తనయా లాలీ’...

తల్లి గొంతు ఎలా ఉంటే ఏమి? బిడ్డ కోసం పాడితే అందులోకి అమృతం వచ్చేస్తుంది. వాత్సల్యపు తేనె తొర్లి పడుతుంది. నా పంచప్రాణాలు నీవే కన్నా అనే భావం మాటలు రాని చిట్టిగుండెకు గట్టిగా చేరుతుంది. పాపాయికి అది కావాలి. పసివాడికి ఆ మాట చెవిన పడాలి. అందుకై చెవి రిక్కిస్తుంది ఒడిలో ఉండే కలువమొగ్గ. ‘జో అచ్యుతానంద జోజో ముకుంద.. రార పరమానంద రార గోవింద’... వింటుంటే నిద్రాదేవి బింకం చెదిరేలా లేదూ! అయ్యో తల్లి... నీ బిడ్డను చేరి హాయిగా నిద్ర పుచ్చుతాలే అని బెట్టు తీసి గట్టున పెట్టేట్టు లేదూ!!

శ్రీమంతుల ఇంట్లో వారసుడు పుట్టాడట. సంగీతం వినిపించే ఖరీదైన ఆట వస్తువులు కొంటారు. యూట్యూబ్‌లో జింగిల్స్‌ వినిపిస్తారు. మధ్యతరగతి ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందట. కొత్త గౌన్లు కొంటారు. బంగరు దండ వేస్తారు. ఏడ్చిన ప్రతిసారీ పాలకే అని భ్రమసి ఎదను నోటికంది స్తారు. పేదవాడి గుడిసెలో ముత్యాలమూట ఒడిలోకొచ్చి పడిందట. ముద్దులు పుణుకుతారు. కంటి మీద రెప్పేయక కాచుకుంటారు. ఏడుస్తూ ఉంటే అగ్గిపెట్టె మీద దరువేసి వినిపిస్తారు. తెలుగు ఉంది మనకు. భాష ఉంది మనకు. రాగం ఉంది, పసికందుల నిదురకై భావం ఉంది మనకు. పాడమని చెప్పారు పెద్దలు పిల్లల కోసం. పాటలు అందించి వెళ్లారు పిల్లల కోసం. తల్లిపాలు పోయి పోత పాలు వచ్చె. లాలిపాట పోయి హోరుపాట వచ్చె. పిల్లలకు తెలుసు ఇది బాగలేదని. అందుకే ఏడుస్తారు. తల్లికి అమ్మమ్మ పాట ఇవ్వలేదు. తల్లి తనకు పుట్టిన బిడ్డకు పాట ఇవ్వబోదు. లాలిపాట అదృశ్యమయ్యే నేలా మనది?

‘నిద్ర నీ కన్నుల్లు మబ్బు మొగముల్లు నిద్రకూ నూరేళ్లు నీకు వెయ్యేళ్లు... నిన్ను గన్నయ్యకూ నిండు నూరేళ్లు... జో జో’.... తల్లి బిడ్డతో చేసే తొలి సంభాషణ లాలిపాట. బిడ్డ జీవితంలో సంగీ తాన్ని తొలిగా ప్రవేశపెట్టేదే లాలిపాట. శ్రుతి తప్పని జీవితాన్ని కాంక్షించేదే లాలిపాట. ఒంటరితనం మిగిలినప్పుడు పాటను తోడు చేసుకొమ్మని ఉపదేశం చేసేదే లాలిపాట. సర్వం సంగీతమయమైన ఈ జగత్తులో బిడ్డకు స్వాగతం పలికేదే లాలిపాట. కాని తల్లి గొంతు ఫోన్‌లో బిజీ. తల్లి గొంతు ఏదో పని పురమాయింపులో బిజీ. తల్లి గొంతు ఇరుగు పొరుగు పలకరింపుల్లో బిజీ. 

బిడ్డ పుడితే చేయవలసిన సాంగేలు అనేకం పోయాయి. బిడ్డ పుడితే హాజరు కావాల్సిన బంధుమిత్రులు ముఖం చూపించలేనంత బిజీగా ఉన్నారు. చీటికి మాటికి వచ్చి ఆ చిట్కా, ఈ విరుగుడు చెప్పే ముసలమ్మలు సొంతింట, పరాయింట కాన రావడం లేదు. దిష్టి చుక్కలు, సాంబ్రాణి ధూపాలు లేవు. గోరువెచ్చని నీళ్లతో కాళ్లన బోర్లించి స్నానం చేయించి ఇచ్చే అమ్మలక్కలు లేరు. సంస్కృతి అంటే ఏమిటి? అది ఏదో మహా విగ్రహాల్లో, అపూర్వ ఉత్సవాల్లో ఉండదు. కుటుంబంలో నిబిడీకృతం అయ్యే చిన్నచిన్న ఆనందాల్లో, ముచ్చట్లలో ఉంటుంది. ముగ్గు, మామిడి తోరణం లేనిది కూడా ఇల్లే. కాని అవి రెండూ ఉన్న ఇల్లు  తెలుగుదనపు ఇల్లు.

ఏడుపు ఆపి, పిల్లలు బుల్లి పెదాలు విప్పి, భలే నవ్వాలి. ఇంటింటా బిడ్డ కోసం పాడి తల్లి ఆవులించాలి. ‘ఏడవకు ఏడవకు వెర్రి నాగన్న... ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు... నీలాలు కారితే నే చూడలేను... పాలైన కారవే బంగారు కళ్లు...’. 

మరిన్ని వార్తలు