‘డిజిటల్‌ హెల్త్‌’ మంచిదేగానీ...

18 Aug, 2020 03:31 IST|Sakshi

రెండేళ్లక్రితం నీతిఆయోగ్‌ ప్రతిపాదించిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం) సాకారమైంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులపైనుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రకటించారు. తొలి దశలో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు ప్రారంభమవుతుంది. ప్రధాని చెబుతున్న ప్రకారం ఈ ప్రాజెక్టులో దేశ పౌరులందరి ఆరోగ్య రికార్డులు నిక్షిప్తమైవుంటాయి. ఆధార్‌ సంఖ్య మాదిరే ప్రతి వ్యక్తి పేరిట ఒక నంబర్‌ ఇవ్వడంతో పాటు అందులో వారికున్న అనారోగ్యం వివరాలు, అందుకు ఉపయోగిస్తున్న ఔషధాలు, వారికి భిన్న సందర్భాల్లో చికిత్స చేసిన వైద్యులు, ఆసుపత్రుల పేర్లు, వైద్య పరీక్షల రికార్డులు, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న సందర్భాలు వగైరాలన్నీ పొందుపరుస్తారు. అంటే ప్రతి వైద్యుడు, ఆసుపత్రి, రోగ నిర్ధారణ కేంద్రాలు వగైరాలన్నీ ఎప్పటికప్పుడు రోగి సంబంధించిన వివరాలు అప్‌లోడ్‌ చేయాలి. అందులో తమ ఫీజుల వివరాలు కూడా వుండాలి.

ఇది అనేకవిధాల అవసరమైన ప్రాజెక్టు అనడంలో సందేహం లేదు. పౌరులు ఒకచోటనుంచి మరో చోటకు వెళ్లినప్పుడు అనుకోకుండా అస్వస్థులైన పక్షంలో వారికి ఎటువంటి చికిత్స అందించాలన్న అంశంలో అక్కడి వైద్యులకు సంపూర్ణ అవగాహన ఉండదు. తన సమస్యేమిటో, ఇంతక్రితం ఎలాంటి చికిత్స తీసుకున్నారో, తనను పర్యవేక్షిస్తున్న వైద్యులు రాసిన ఔషధాలేమిటో చెప్పే పరిస్థితి రోగికి ఉండకపోవచ్చు. పర్యవసానంగా రోగిలో తాము గమనించిన లక్షణాలనుబట్టి అక్కడి వైద్యులు చికిత్స అందిస్తారు. అది కొన్నిసార్లు వికటించే ప్రమాదం కూడా వుంటుంది. కొన్నేళ్లక్రితం ప్రముఖ టాలీవుడ్‌ నటుడు శ్రీహరి ముంబైకి ఒక షూటింగ్‌ నిమిత్తం వెళ్లి అస్వస్థులైనప్పుడు ఇదే సమస్య ఎదురైంది. ఆయన అనారోగ్య సమస్యపట్ల సరైన అవగాహనలేకుండా వైద్యులు చేసిన చికిత్స ఆయన ప్రాణాలను బలిగొంది. పౌరుల దగ్గర ఆరోగ్య గుర్తింపుకార్డు వుంటే, అందులో వారి వివరాలు వైద్యులు క్షణాల్లో తెలుసుకుని మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతుంది. పౌరులకు కలిగే లాభాలిలావుంటే ప్రభుత్వాలకు ఉపయోగ పడే అంశాలు మరిన్ని వున్నాయి. 

స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లవుతున్నా మన దేశంలో ఆరోగ్య సదుపాయాలు అత్యంత నాసిరకంగా వున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడ్డాక ఈ సంగతి అందరికీ మరింతగా తేటతెల్లమైంది. అనుకోకుండా జబ్బులుబారిన పడిన పౌరులు ప్రైవేటు ఆసుపత్రుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దారుణమైన పరిస్థితులు ఇక్కడున్నాయి. ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు మన జీడీపీలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఖర్చుచేస్తున్నాయి. 2017లో విడుదల చేసిన ఆరోగ్య విధానం ప్రకారం జీడీపీలో 2.5 శాతాన్ని ఆరోగ్యరంగంపై వెచ్చించాలి. కానీ అది అమలుకావడం లేదు. అలా జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో 8 శాతాన్ని ఆరోగ్య రంగంపై వ్యయం చేయాలి. ఆ రకంగా మొత్తం వ్యయంలో రాష్ట్రాల వాటా 60 శాతం అవుతుంది. మిగిలిన 40శాతం కేంద్రం భరించాల్సివస్తుంది. దేశంలో చాలాచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్నచోట వైద్యులు, ఇతర సిబ్బంది చాలినంతగా లేరు.

ప్రతి పదివేల జనాభాకు కనీసం పదిమంది వైద్యులుండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తుండగా మన దేశంలో ఆ సంఖ్య 7.7.  కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ హెల్త్‌ ఇంటెలిజెన్స్‌ నిరుడు విడుదల చేసిన నివేదిక ప్రకారం మన పౌరులపై ప్రభుత్వాల తలసరి వ్యయం రూ. 1,657 మాత్రమే. దీన్ని కనీసం రెట్టిం పైనా చేస్తే తప్ప మన పౌరులకు  ఓమాత్రంగానైనా ఆరోగ్య సదుపాయాలు అసాధ్యం. భూతాపం పెరుగుతుండటంతో ప్రకృతి వైపరీత్యాలు వున్నకొద్దీ పెరుగుతాయని, అందువల్ల ప్రభుత్వాలు పౌరులపై తలసరి రూ. 4,000 వ్యయం చేయడానికి సిద్ధపడితే తప్ప ముప్పును ఎదుర్కొనడం కష్టమవుతుందని ఆరోగ్య నిపుణుల అంచనా. ఎన్‌డీహెచ్‌ఎం వల్ల పౌరుల్లో అత్యధికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, దేనికెంతో వ్యయం చేయాలో ప్రభుత్వాలకు తెలుస్తుంది. ఏ ప్రాంతంలో ఏ సమస్యలున్నాయో, అక్కడ తీసుకోవాల్సిన చర్యలేమిటో ప్రభుత్వాలకు అవగాహన కలుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడానికి ప్రంశంసనీయమైన పథకాలు రూపొందిస్తున్నది. అందుకోసం రూ. 16,200 కోట్లు వ్యయం చేయడానికి సిద్ధపడుతోంది. ఇప్పుడున్న 11 వైద్య కళాశాలలకుతోడు మరో 15 వైద్య కళా శాలలు, నర్సింగ్‌ కళాశాలలు... ప్రస్తుతమున్న 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అదనంగా మరో 149 ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 989 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దబోతోంది. అలాగే ఏరియా ఆసుపత్రులకూ, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు రూ. 1,236 కోట్లు ఖర్చు చేయనుంది. 

కేంద్రం తాజాగా ప్రారంభించిన ఎన్‌డీహెచ్‌ఎం ఫోన్‌లో ఇమిడే యాప్‌లో వుంటుందని, ఇందులో చేరడం తప్పనిసరి కాదంటున్నారు. అయితే చేరేవారికి సమకూరే సదుపాయాల వల్ల మున్ముందు ఎవరికి వారు స్వచ్ఛందంగా చేరతారన్నది ప్రభుత్వ ఉద్దేశం. అన్ని డిజిటల్‌ లావా దేవీలకూ వుండే ప్రమాదం ఎన్‌డీహెచ్‌ఎంకు కూడా వుంటుంది. లక్షల కోట్ల రూపాయల ఫార్మా రంగం అధిక శాతం పౌరులు ఎటువంటి జబ్బులబారిన పడుతున్నారో తెలుసుకోవడానికి ఈ డేటాను తస్కరించే ముప్పు ఎప్పుడూ పొంచివుంటుంది. డేటా రక్షణకూ, పౌరుల వ్యక్తిగత గోప్యత పరిరక్షణకూ పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. గతంలో ఆధార్‌ డేటా చౌర్యం జరిగిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నివిధాలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. డిజిటల్‌ వేదిక రూపకల్పన సరే... అందుకు అనువుగా ప్రజారోగ్య వ్యవస్థను కూడా సమూల ప్రక్షాళన చేయాలి. అప్పుడు మాత్రమే పౌరులు నిండు ఆరోగ్యంతో వుంటారు. 

మరిన్ని వార్తలు