పరిష్కార ప్రయత్నం

31 Aug, 2022 01:05 IST|Sakshi

రెండున్నర నెలలు... అంతా కలిపితే 74 రోజులు. ఈ పరిమిత కాలంలో ఏ వ్యవస్థలోనైనా పెనుమార్పులు తీసుకురావడం సాధ్యమేనా? ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా, భారత సర్వోన్నత న్యాయాధిపతి (సీజేఐ)గా కొత్తగా నియుక్తులైన జస్టిస్‌ యు.యు. లలిత్‌ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. న్యాయవ్యవస్థలో సమూల సంస్కరణలకు సిద్ధమవుతున్నారు. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం నుంచి పని ప్రారంభించిన లలిత్‌ కొన్నేళ్ళుగా సుప్రీమ్‌ కోర్ట్‌లో అశ్రద్ధకు గురైన వ్యవహారాలపై దృష్టి సారించారు. కోర్ట్‌ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పాలనాపరమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని వార్తాకథనాల మాట. ఏడాది పొడుగూతా రాజ్యాంగ కేసుల్ని వినేందుకు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలను పునరుద్ధరించాలనీ, అలాగే కోర్ట్‌ సమయాన్ని వృథా చేసే ‘పనికిమాలిన’ దావాలపై చర్యలు చేపట్టాలనీ లలిత్‌ భావన. ఆ ఆలోచన మంచిదంటూనే, ఆచరణలో కష్టనష్టాలపై చర్చలు మొదలయ్యాయి.

ప్రస్తుతానికైతే, ఆగస్ట్‌ 29 నుంచి ప్రతిరోజూ వాదోపవాదాలు వినేందుకు గాను పాతిక రాజ్యాంగ ధర్మాసన అంశాలను లిస్ట్‌ చేస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు. ఈ ప్రకటన కీలకమైనది. కేవలం తన దాకా వచ్చిన అప్పీలుపై తీర్పు చెప్పడమే కాదు, రాజ్యాంగ అంశాలను కూలంకషంగా పరిశీలించి, వాటికి వ్యాఖ్యానం చెప్పడం సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన బాధ్యత. అనేక ఇతర పెండింగ్‌ అంశాల పనిలో పడిపోయి, కొంతకాలంగా అది విస్మరణకు గురైంది. 1960లలో సగటున ఏటా 134 రాజ్యాంగ ధర్మాసన తీర్పులు వెలువడితే, ఆ సంఖ్య నిరుడు 2కు పడిపోయింది. దీన్ని గుర్తించిన నూతన ప్రధాన న్యాయమూర్తి ఈ బాధ్యతను భుజానికెత్తుకోవడం హర్షణీయం. 

అపరిష్కృత కేసుల సమస్య దేశాన్ని చాలాకాలంగా పీడిస్తోంది. కరోనా దెబ్బతో ఈ సమస్య ద్విగుణం, బహుళం అయింది. 2017 నాటికి సుప్రీమ్‌లో 55 వేల పైచిలుకు కేసులు పెండింగ్‌. ఇప్పుడు వాటి సంఖ్య 71 వేలు దాటేసింది. ఇవన్నీ రాజ్యాంగేతర అంశాలకు సంబంధించినవే. న్యాయ సంస్కరణల్లో భాగంగా ఈ సమస్యను ఓ కొలిక్కి తేవడం ప్రధానం. తగినంత మంది న్యాయమూర్తులు లేరనడానికి వీల్లేదు. 2019 ఆగస్ట్‌ నాటికే సుప్రీమ్‌ జడ్జీల సంఖ్య 34కు పెరిగింది. ఎప్పటికప్పుడు జడ్జీల సంఖ్య పెరుగుతున్నా, 1950 నుంచి పెండింగ్‌ కేసులూ పెరుగుతూ పోతుండడం విడ్డూరం. దీనికి పరిష్కారంగా జోన్ల వారీగా కోర్ట్‌ను విభజించి, పదిహేనేసి మంది జడ్జీలతో 4 ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేసి, సుప్రీమ్‌ కోర్ట్‌కూ – హైకోర్ట్‌లకూ మధ్య అప్పిలేట్‌ కోర్ట్‌గా సదరు బెంచ్‌లు పనిచేయాలని ఒక ప్రతిపాదన. దీనివల్ల రాజ్యాంగ అంశాలపై దృష్టి పెట్టడానికి న్యాయమూర్తులకు మరింత సమయం దొరుకుతుందని వాదన. కానీ, ఈ జోనల్‌ కోర్ట్‌ల ఏర్పాటు రాజ్యాంగకర్తల ఆలోచనకు విరుద్ధమంటూ 1974లోనే 58వ న్యాయ సంఘం కొట్టిపారేసింది.

ప్రస్తుతం సుప్రీమ్‌ ఎదుట 492 రాజ్యాంగ ధర్మాసన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో దాదాపు 53 కేసులు ప్రభావశీల రాజ్యాంగ అంశాలకు సంబంధించినవి. పౌరసత్వ సవరణ చట్టం, ముస్లిమ్‌ వివాహ చట్టాల రాజ్యాంగబద్ధత, ఆర్టికల్‌ 370 రద్దు లాంటి అంశాలకు విస్తృత ధర్మాస నాలు అవసరమైనవి. ఇవన్నీ కోర్ట్‌ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నాయి. ఇలాంటి 53 కేసుల్లో ప్రస్తుతం 25 కేసులను వినే ప్రక్రియకు కొత్త సీజేఐ శ్రీకారం చుట్టారు. 1960లలో ఏటా సగటున వందకు పైగా రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటయ్యేవి. 2000 నాటికి వచ్చేసరికి వాటి సంఖ్య దాదాపు 10కి పడిపోయింది. సాధారణంగా అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలను చూస్తుంటాం. కొన్నిసార్లు ఏడుగురు, తొమ్మిదిమంది జడ్జీలతోనూ ధర్మాసనాలు ఏర్పాటవుతుంటాయి. 

సుప్రీమ్‌ కోర్ట్‌ పని ఒత్తిడిని పరిమాణాత్మకంగా విశ్లేషించి చూస్తే, కోర్టు సమయంలో 85 శాతం దేశం నలుమూలల నుంచి వస్తున్న అప్పీళ్ళను వినడానికే సరిపోతోంది. ప్రస్తుతం 31 మందే ఉన్న నేపథ్యంలో ఈ కార్యభారం మధ్య విస్తృత రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటు కొంత కష్టమని ఓ వాదన. అవసరానికి తగ్గట్టు జడ్జీల నియామకాలు పెంచుకోవడం దీనికి పరిష్కారం. ఇక శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు వల్ల కీలక అంశాలపై సత్వర నిర్ణయం సాధ్యం. కానీ, అదొక్కటే అన్ని సమస్యల్నీ పరిష్కరించలేదని గుర్తించాలి. ‘శాశ్వత’మనే ఆలోచన కొత్తదేమీ కాదు. 2019 సెప్టెంబర్‌లోనే అప్పటి ఛీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రకటన చేసినా, ఆచరణలోకి రాలేదు. అయితే, కార్యనిర్వాహక వ్యవస్థతో పారదర్శక చర్చలతోనే శాశ్వత ధర్మాసనం సాధ్యం. 

ఇప్పుడు సమగ్ర న్యాయ సంస్కరణలు అవసరం. అవి ఎంత సమగ్రంగా ఉంటే, అంత సమర్థ పరిష్కారం లభిస్తుంది. ఆధునిక సాంకేతికతనూ, కృత్రిమ మేధ లాంటివీ వాడుకుంటే న్యాయ వ్యవస్థ పనితీరు మరింత మెరుగవుతుంది. పెండింగ్‌ కేసుల పరిష్కారం సుకరమవుతుంది. అనేక దేశాలు చాలాకాలంగా వర్చ్యువల్‌ సాంకేతికతతో సత్వర న్యాయం అందిస్తున్నాయి. కరోనా వేళ వర్చ్యువల్‌ దోవ పట్టిన మన కోర్టులు ఇకపైనా దాన్ని విస్తృతంగా అనుసరించాలి. కోర్టుల ఆధునికీ కరణ, డిజిటలీకరణకు ప్రాధాన్యమివ్వాలి. అదే సమయంలో ధర్మాసనాలు నిర్ణీత కేసుల్లో కీలక రాజ్యాంగ అంశాలపై స్పష్టతనిస్తే, దిగువ కోర్టులకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. అప్పీళ్ళ ప్రవాహా నికి అడ్డుకట్ట పడుతుంది. ఇక, కేసుల లిస్టింగ్‌లోనూ మరింత పారదర్శకత తెస్తానంటున్న లలిత్‌ మాటలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు