లెక్క పెద్దది... ఉద్దీపన చిన్నది

30 Jun, 2021 00:00 IST|Sakshi

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం – ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ఇది ప్రాథమికం. ఒకప్పటి ప్రభువులైనా, ఇప్పటి ప్రభుత్వాలైనా తప్పక చేయాల్సిన పని ఇదే. కరోనా కష్టకాలం ఆ సంగతి పదే పదే గుర్తుచేస్తోంది. అందుకే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఏకంగా రూ. 6.28 లక్షల కోట్ల అంకెతో ముందుకు రావడం కాస్తంత సంతోషమే. ఇప్పటికే కరోనా మొదటి ఉద్ధృతిలో, తరువాత ఒకటికి, మూడుసార్లు రకరకాల ఉద్దీపన ప్యాకేజీలు, ఉపశమన చర్యలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి ఇలా ముందుకు వచ్చింది. దెబ్బతిన్న అనేక రంగాలకు అండగా నిలవడం కోసం తాజా కరోనా రెండో ఉద్ధృతి అనంతరం తొలిసారిగా చర్యలు ప్రకటించింది. ఆర్థికరంగం అప్పుడప్పుడే కోలుకుంటోందని భావిస్తున్న వేళ కరోనా సెకండ్‌ వేవ్‌ నిజానికి పెద్ద దెబ్బే కొట్టింది. అంతకు మించి అనిశ్చితి నెలకొనేలా చేసింది. అందుకే, ఆర్థికమద్దతు అందించాలంటూ ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యవిధాన సంఘం’తో సహా పలువురు ప్రభుత్వాన్ని కోరారు. ఆ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఎనిమిది కీలక చర్యలతో తాజా ఉద్దీపన ప్యాకేజీ వచ్చింది. అయితే, ఇందులో నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేదేమీ లేదు. కోవిడ్‌ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణసంస్థలకు ప్రభుత్వహామీగానే ప్యాకేజీలో ఎక్కువ ఉండనుంది. 

నిజానికి, కరోనాతో గత ఏడాది మార్చిలో తొలిసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన రెండు రోజులకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అసంఘటిత రంగ కార్మికులనూ, పట్టణ, గ్రామీణ నిరుపేద ప్రజానీకాన్నీ దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్రకటన అది. ఆ తరువాత నుంచి ‘ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ’ లాంటి రక రకాల పేర్లతో కేంద్రం నుంచి వివిధ సందర్భాల్లో ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలు వస్తూ వచ్చాయి. వాటి పేర్లు, ఉద్దేశాలు ఏమైనప్పటికీ – కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికంటూ లక్షల కోట్లు లెక్కల్లో కనిపించాయి. తాజా ఉపశమన చర్యలూ దానికి కొనసాగింపే! కరోనాతో దెబ్బ తిన్న రంగాలకు కొత్తగా రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం ప్రకటించారు. ఇందులో భాగంగా కరోనా మూడో వేవ్‌ ముప్పు నేపథ్యంలో– ఆరోగ్య రంగం మీద, అందులోనూ ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి పెట్టడం విశేషం. ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు ‘నేషనల్‌ క్రెడిట్‌ గ్యారెంటీ ట్రస్ట్‌’ హామీ ఇవ్వనుంది. కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ పట్ల, జనం ఇబ్బందుల పట్ల ఈ మాత్రం అక్కర కచ్చితంగా హర్షణీయం. కానీ, ఆలోచనలో ఉన్నది ఆచరణలో ఎంత ప్రతిఫలిస్తుందన్నది పలువురి సందేహం. అందుకు తగ్గట్టే... విత్తమంత్రి తాజా అంకెల విన్యాసంలో కూడా నిజంగా అందేదెంత, జనం లబ్ధి పొందేదెంత అన్నది కాస్తంత లోతుగా పరి శీలిస్తే కానీ తేలవు. మొత్తం రూ. 6.28 లక్షల కోట్లలో అనేకం– బ్యాంకులు అప్పులివ్వాల్సిన రుణ హామీ పథకాలు, లేదంటే ఇప్పటికే బడ్జెట్‌లో చూపిన వ్యయాలు. అలాగే, ఇందులో చాలా మటుకు ఈ సంవత్సరానికి సంబంధించినవి కావు. అయిదేళ్ళ పాటు సాగే అనేక సంస్కరణల్లో అవి భాగం అనేది గమనార్హం. ఇక, ఈ ప్రకటించిన మొత్తంలో కేవలం పదో వంతే (దాదాపు రూ. 55 వేల నుంచి 60 వేల కోట్లు) ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే అదనపు వ్యయం అని ఆర్థిక నిపుణుల అంచనా. ఇక, మరికొన్నేమో ప్రస్తుతం ఉన్న పథకాలు, గతంలో ప్రకటించిన చర్యల్లోనే చేసిన మార్పులు చేర్పులు. ప్రభుత్వ అండతో వచ్చిన గ్యారెంటీలను చూసి, బ్యాంకులు మరింత రుణాలివ్వడానికి ముందుకు వస్తాయనే ఊహ మీదే ఈ ప్యాకేజీ రూపకల్పన సాగింది. అది ఏ మేరకు ఆచరణ సాధ్యమో ఇప్పటికిప్పుడు చెప్పలేం. 

అయితే, అంతా నిరాశే అనడానికీ వీలు లేదు. మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా వ్యాపార వేత్తలను ఆర్థికంగా ఉత్సాహపరిచే ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ను వచ్చే ఏడాది మార్చి దాకా పొడిగించాలన్న నిర్ణయం ప్రశంసనీయం. అలాగే, సూక్ష్మ రుణ సంస్థల ద్వారా చిన్న కుటుం బాలకు రుణాలు అందేలా కేంద్రం బ్యాంకులకు హామీ ఇచ్చే పథకం లాంటివీ మెచ్చదగినవే. అయితే, టూరిస్టులకు ఉచిత వీసాల ప్రకటన వినడానికి బాగున్నా, వాళ్ళు రావాలంటే దేశంలో వ్యాక్సినేషన్‌ ఇంకా వేగంగా సాగాలి. కరోనా భయాలు లేకుండా సామాజిక ప్రశాంతత నెలకొనాలి. వ్యాపారాలు లేక కుదేలైన పర్యాటక, ఆతిథ్య రంగాల మొదలు చిన్న, మధ్య తరహా పరిశ్రమల దాకా అన్నిటికీ మరిన్ని రుణాల బదులు నాన్‌–డెట్‌ క్యాపిటల్‌ సమకూర్చాలి. అలాగే, పట్టణ ప్రాంత నిరుపేదలకు నగదు బదిలీ ద్వారా తక్షణ ఆర్థిక సహకారం అందించాలి. నిజానికి, అమెరికా సహా అనేక దేశాలు ఈ కరోనా కాలంలో చేసింది అదే! ఒకపక్క మౌలిక వసతి కల్పన ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే, మరోపక్క ఆర్థికంగా అండగా నిలవడం వల్ల జనం కొనుగోళ్ళు చేస్తారు. పరిశ్రమల ఉత్పత్తులకు తగ్గట్టు అమ్మకాలు సాగి, వ్యాపారాలు పుంజుకుంటాయి. వెరసి ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. మొత్తం మీద, మూడో వేవ్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ... కరోనా కష్టాల కడలి నుంచి ఆర్థిక వ్యవస్థను ఒడ్డునపడేయడానికి చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. ఇవ్వాల్సింది ఎంతో ఉంది. అందాక... ఆక్సిజన్‌ అందక కష్టపడుతున్న వివిధ రంగాలకు ఈ తాజా ప్యాకేజీ లెక్కల్లో చూపినంత ఉద్దీపన కాకపోయినా, కాసింత ఊపిరి! కొద్దోగొప్పో ఊరట!! అయితే, ఈ ప్యాకేజీలతోనే అంతా సర్దుకుంటుందని చంకలు గుద్దుకుంటేనే కష్టం!! 

మరిన్ని వార్తలు