వడ్డిస్తారా? వదిలేస్తారా?

25 Aug, 2022 00:47 IST|Sakshi

చూస్తూ చూస్తుండగానే వామనుడు త్రివిక్రమావతారం దాల్చడమంటే ఇదే! ఆరేళ్ళ క్రితం 2016 జూలైలో నెలకు కేవలం కోటి రూపాయల లోపలున్న ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’ (యూపీఐ) లావాదేవీల విలువ ఈ జూలైలో ఏకంగా రూ. 10.6 లక్షల కోట్ల స్థాయికి చేరింది. సామాన్యులు, పేదలకు సైతం బ్యాంకింగ్‌ను అందుబాటులోకి తెచ్చి, చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో రోజువారీ లావాదేవీలను జరిపే సాంకేతికతను అందించడం అపూర్వ విజయమే!

ప్రపంచంలోని దేశదేశాలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి, ఇండియా వైపు తిరిగి చూసేలా చేసిన డిజిటల్‌ చెల్లింపుల విప్లవమిది. ఈ యూపీఐ చెల్లింపులపై సర్వీస్‌ ఛార్జ్‌ వేయాలా, వద్దా అన్నది తాజా ప్రశ్న. భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) చర్చాపత్రం గత వారం ఈ అంశాన్ని లేవనెత్తింది. రాజకీయ విమర్శలకు వెరచి, ఆర్థికశాఖ తక్షణమే బరిలోకి దిగింది. భారం మోపే ఆలోచనను కొట్టిపారేసింది. ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి దేశంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ప్రీపెయిడ్‌ వ్యాలెట్లు – ఇలా అనేక వ్యవస్థలున్నాయి. ఆర్బీఐ పక్షాన డిజిటల్‌ కరెన్సీ సైతం రానుంది. భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్పీసీఐ) వారి ‘యూపీఐ’ పల్లెపల్లెకూ పాకి, మొత్తం రిటైల్‌ నగదు బదలీల్లో 82 శాతం వాటా దక్కించుకోవడానికి పలు కారణాలు. మొబైల్‌ ఇంటర్నెట్‌ విప్లవం, బాదరబందీలు లేని బ్యాంకు ఖాతాల ‘జన్‌ధన్‌ యోజన’, నగదు రహిత చెల్లింపులపై సర్కారు మొగ్గు... ఇలా అనేకం ఈ విజయగాథ వెనక ఉన్నాయి.

యూపీఐలో అప్పటికే నిర్ధారించిన ఫోన్‌ నంబర్ల ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదలీ అవుతుంది. డబ్బు అందుకున్నవారు సదరు లావాదేవీ విలువలో 0.3 శాతాన్ని (తక్కువలో తక్కువ రూ. 100) రుసుముగా గతంలో చెల్లించాల్సి వచ్చేది. నగదు రహిత లావాదేవీల్ని పెంచడానికి 2020 జనవరిలో ప్రభుత్వం ఆ ఫీజును తొలగించింది. అప్పటి నుంచి యూపీఐ తారాపథాన్ని తాకింది. ప్రజలపై భారం ఎత్తేసినా, అసలంటూ యూపీఐ కార్యకలాపాల నిర్వహణకైతే 0.25 శాతం మేర ఖర్చవుతున్నట్టు ఆర్బీఐ అంచనా. ఆర్థిక మధ్యవర్తులకు పడే ఆ లోటును కేంద్ర నిధులతో సర్కారు భర్తీ చేస్తూవస్తోంది. ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ లానే యూపీఐ నిర్వహణ భారాన్నీ జనంపై వేయాలని ప్రతిపాదన. 

సుమారు రూ. 800 విలువైన లావాదేవీకి ఇచ్చే బ్యాంకు, తీసుకొనే బ్యాంకు, ఎన్పీసీఐ, యూపీఐ యాప్‌లు అన్నింటికీ కలిపి రూ. 2 ఖర్చవుతుందట. ప్రతి సేవకూ కొంత ఖర్చయ్యే మాట నిజమే. అలాగని అన్నిటికీ రుసుము వసూలు చేస్తామనడం సరికాదు. కొన్ని సేవలకు పబ్లిక్‌ సబ్సిడీ అవసరం. ఇవాళ యూపీఐ సేవలు లాంటివే. ఏ వ్యవస్థ అయినా నిలదొక్కుకోవాలంటే, అది వాడే వారికి భారం కాకూడదనేది సాధారణ సూత్రం. ఛార్జీల్లేని యూపీఐ మరింత కాలం కొనసాగాలం టున్నది అందుకే. వినియోగదారులకు సౌకర్యం, మన ఆర్థిక వ్యవస్థకు ఒనగూరే లబ్ధి రీత్యా చూస్తే యూపీఐ ‘డిజిటల్‌ జనహిత’ వ్యవస్థ. ఆర్థిక శాఖే ఆగస్టు 21న ఆ మాట అన్నది. నిర్ణీత అవసరాన్ని తీరుస్తూ, ఎవరైనా వాడుకొనేలా ఉచితంగా అందుబాటులో ఉంటేనే ప్రజాశ్రేయో వ్యవస్థ. లేదంటే అది కొందరి స్వలాభానికే పరిమితమై, చివరకు సంక్షేమం క్షీణిస్తుందని ఆర్థిక శాస్త్రవేత్తల హెచ్చరిక. 

నల్లధనం చెల్లింపులకు చోటివ్వకుండా, పారదర్శకమైన డిజిటల్‌ మార్గంలో పురోగమించడం దేశానికి మంచిదని భావిస్తున్న కేంద్రం దీని నిర్వహణ వ్యయాన్నీ భరించాలి. పోనుపోనూ అది బరువయ్యే మాట నిజమే. వచ్చే 2023–24 నాటికి డిజిటల్‌ చెల్లింపులు ఏటా రూ. 120 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. ప్రభుత్వ సబ్సిడీ బిల్లు రూ. 30 వేల కోట్ల పైకి ఎగబాకవచ్చు. కానీ, సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వాలు ఆ భారానికి సిద్ధపడాలి. యూపీఐ లావాదేవీల్లో 1.4 శాతానికి పైగా విఫలమవుతున్నాయనీ, ఇటీవల ఆ రేటు పెరుగుతోందనీ, ఈ చెల్లింపు వ్యవస్థను దీర్ఘకాలం సమర్థంగా నడపాలంటే వినియోగ ఛార్జ్‌ తప్పదనే వారున్నారు. ఒకవేళ రేపు తప్పనిసరై ఛార్జ్‌ చేయాల్సి వచ్చినా ఇటు కస్టమర్ల, అటు ఆపరేటర్ల ప్రయోజనాల సమతూకంతో దాన్ని నిర్ణయించాలి. నిర్ణీత మొత్తం లోపల ఛార్జ్‌ మినహాయించడం ఒక మార్గం. లేదంటే నెలకు నిర్ణీత యూపీఐ లావాదేవీలు ఉచితమంటూ, అది దాటితేనే ఛార్జ్‌ అన్నది మరో మార్గం.  

ప్రతి యూపీఐ లావాదేవీకీ ఒక పైసా వంతున స్వల్పఛార్జ్‌ వసూలు చేసినా, ఈ జూలైకి ముగిసిన ఏడాదికి రూ. 5,842 కోట్ల ఆదాయం వచ్చేదని కొందరు లెక్కలు కడుతున్నారు. వెయ్యిసార్లు యూపీఐ వాడితే... కస్టమర్‌ పది రూపాయలే చెల్లించాల్సి వస్తుందనీ, ఈ నామ మాత్రపు రుసుముతో కొత్త ఆవిష్కరణలకూ, మెరుగుదలకూ వీలుంటుందనీ చెబుతున్నారు. పైకి ఇవన్నీ బాగానే ఉన్నా, కొన్నదానికీ, తిన్నదానికీ జీఎస్టీ సహా రకరకాల పన్నులు కడుతున్న ప్రజలు తమ నగదు చెల్లింపులకూ సర్కార్‌ వారి బాదుడు ఆలోచనను స్వాగతిస్తారా అన్నది ప్రశ్న. ఫలితంగా వారు మళ్ళీ డిజిటల్‌ కన్నా నగదు చెల్లింపుల వైపే మొగ్గే ప్రమాదం ఉంది. పెద్ద మొత్తాల బదిలీకి వాడే ఇతర ఆన్‌లైన్‌ చెల్లింపు విధానాలకు పాలకులు సబ్సిడీ ఇవ్వకున్నా ఫరవాలేదేమో కానీ, కోట్లాది సామాన్యుల్ని డిజిటల్‌ వైపు నడిపించిన యూపీఐని అపురూపంగా చూసుకోవడం ప్రస్తుతం అవసరం. అతి ఛార్జీలతో ఆన్‌లైన్‌ చెల్లింపుల్ని నిరుత్సాహపరిస్తే డిజిటల్‌ లక్ష్యమే దెబ్బ తింటుంది. కథ మళ్ళీ మొదటికి వస్తుంది!

మరిన్ని వార్తలు