నివేదిక చాటుతున్న నిజం

28 Jul, 2020 01:22 IST|Sakshi

మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ స్వీయ భాషాభిమానం ఎక్కువే. బోధనా మాధ్యమంగా కూడా అదే వుండాలని కోరేవారికి కూడా కొదవలేదు. కానీ జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌ఓ) జరిపిన సర్వేలో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని కోరుకునేవారు గణనీయంగా వున్నారని తేలింది. దేశంలో దాదాపు అన్నిచోట్లా, అన్ని వర్గాలకు చెందినవారూ తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మాధ్యమమే అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ సర్వే 2017–18కి సంబంధించిందే అయినా నివేదికను ఈమధ్యే వెలువరించారు. ఆ సంస్థ నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే నర్సరీ మొదలుకొని సెకండరీ విద్య వరకూ తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మాధ్యమమే కావాలనుకునేవారు అధికమయ్యారు. తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీలతోసహా 13 ప్రాంతీయ భాషలు మాట్లాడే కుటుంబాల్లోని పిల్లల్లో అత్యధికులు... అంటే 50 శాతం కన్నా ఎక్కువ ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకుంటున్నారని ఎన్‌ఎస్‌ఓ నివేదిక అంటోంది. ఈ నివేదిక వెల్లడించే అంశాలు మరికొన్ని ఉన్నాయి. హిందీ భాషా ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో మాత్రం ఇంగ్లిష్‌ మీడియం వైపు మొగ్గుచూపే విద్యార్థుల శాతం గతంతో పోలిస్తే తగ్గింది. ఈ రాష్ట్రాలు పేదరికంతో కొట్టుమిట్టాడే ప్రాంతాలు కావడమే అందుకు కారణం. అక్కడ విద్యపై పెట్టే తలసరి వ్యయం జాతీయ సగటుకంటే తక్కువ.

ఇంగ్లిష్‌ మాధ్యమం కావాలని కోరుకున్నవారంతా మాతృ భాష విషయంలో ఎలాంటి భావో ద్వేగాలూ లేనివారన్న అభిప్రాయానికి రానవసరం లేదు. చుట్టూ వున్న సమాజంలో కలిగిన కుటుం బాలవారు తమ పిల్లల్ని ఇంగ్లిష్‌ మాధ్యమ పాఠశాలలకు పంపించడం, అలా చదువుతున్నవారే అనంతరకాలంలో ఉపాధి అవకాశాలు తన్నుకుపోతుండటం చూసిన వారు తమ పిల్లలు కూడా అదేవిధంగా ఎదగాలని, వారు కూడా మెరుగైన జీవనం గడపాలని ఆశించడంలో తప్పులేదు. పైగా మన సమాజంలో కులపరంగా కావొచ్చు...ఆర్థికపరంగా కావొచ్చు వందల ఏళ్లుగా వున్న అసమా నతలు విద్యలో బాహాటంగా కనిపిస్తున్నాయి. నిరుపేద వర్గాలవారు ఎలాంటి మౌలిక సదుపా యాలూ లేని బడుల్లో చదుకోవాల్సివస్తోంది. ఏ మాధ్యమం అన్న సంగతలా వుంచి అసలు చదువే వారికి సరిగా అందని పరిస్థితులున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తగినంతమంది టీచర్లు లేకపో వడం, బోధనోపకరణాలు వుండకపోవడం వగైరాలవల్ల అక్కడ చదువుకునే అల్పాదాయ వర్గాలవారి పిల్లలు అనంతరకాలంలో చదువుల్లో తీవ్రంగా వెనకబడిపోతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇంగ్లిష్‌ మాధ్యమం అందుబాటులో లేకపోవడం వారి ఉన్నత విద్యనూ, ఉపాధి అవకాశాలనూ దారుణంగా దెబ్బతీస్తోంది. నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఈ వ్యత్యాసాలు పెద్దగా కనబడేవి కాదు. 

కానీ విద్యా రంగంలో ప్రైవేటుకు చోటివ్వడం మొదలుపెట్టాక అంతా తలకిందులయింది. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో చంద్రబాబు అధికారంలోకొచ్చాక ఇది మరింత వెర్రితలలు వేసింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి విద్యార్థులు ఇంగ్లిష్‌ మాధ్యమం వుండే ప్రైవేటు విద్యా సంస్థలకు పోయేలా చేశారు. అలా చదివించే స్తోమత లేని కుటుంబాలు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కొనసాగించారు. వృత్తి విద్యా కోర్సుల్లో చేరినప్పుడు, అనంతరకాలంలో ఉద్యోగావకాశాల కోసం పోటీపడినప్పుడు నిరుపేద వర్గాల పిల్లలు ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదివినవారితో వెనకబడుతున్నారు. ఇంగ్లిష్‌ మాధ్యమం అర్థంకాక అండర్‌ గ్రాడ్యు యేషన్‌ స్థాయిలో చదువు మానేవారి సంఖ్య కూడా గణనీయంగా వుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి టీడీపీ ఎన్నో ఎత్తుగడలు వేసింది. తీరా న్యాయస్థానం ఉత్తర్వులతో  తల్లిదండ్రులు 2020–21 విద్యా సంవత్సరంలో తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రభుత్వం సర్వే నిర్వహించినప్పుడు 96.17 శాతంమంది ఇంగ్లిష్‌ మాధ్య మమే కావాలని చెప్పడం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.  పిల్లలకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకా శాలు అందాలంటే ఇంగ్లిష్‌ మాధ్యమం తప్పనిసరని దాదాపు ముక్తకంఠంతో వారంతా చెప్పారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వున్నదని ఇప్పుడు తాజాగా వెల్లడైన ఎన్‌ఎస్‌ఓ నివేదిక సైతం చెబుతోంది. మన దేశంలో సైన్సు, ఇంజనీరింగ్, సామాజిక శాస్త్రాలు వగైరాలన్నీ ఇంగ్లిష్‌లోనే వుంటాయి. వాటిని దేశీయ భాషల్లో అందించాలన్న స్పృహే మన పాలకులకు మొదటినుంచీ లేకుండా పోయింది. కనుకనే ఉన్నత చదువుల స్థాయికెళ్లేసరికి ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువుకోవడం అందరికీ తప్పనిసరైంది. 

పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్‌ విద్య తెలుగులో చదువుకుని, మంచి మార్కులతో ఉత్తీర్ణులైనవారు సైతం ఆ ఇంగ్లిష్‌ మాధ్యమం కొరుకుడు పడక బోల్తాపడుతున్నారు. తగినన్ని తెలివితేటలున్నా ప్రాథమిక స్థాయినుంచి ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదివినవారితో పోటీ పడలేక పోతున్నారు. ఇంగ్లిష్‌ మాధ్యమంపై అభ్యంతరాలు వ్యక్తం చేసేవారంతా ఎన్‌ఎస్‌ఓ నివేదిక చాటిచెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకోక తప్పదు. ఆ సంస్థ వెలువరించే సర్వేలకు విశ్వ సనీయత వుంది. మన దేశంలో గణాంకాలకు ఆద్యుడని చెప్పే పీసీ మహలనోబిస్‌ వంటివారు అందుకు కారణం. సర్వేకు తీసుకున్న ప్రాతిపదికలు, సర్వేలో పాల్గొన్నవారి వివరాలు ఈ సంస్థ తెలియజేస్తుంది. సమాజంలో అందరికీ సమాన విద్య, సమానావకాశాలు ఉన్నప్పుడు మాధ్యమం గురించి పట్టింపు రాదు. కానీ అందుకు భిన్నమైన స్థితిగతులున్నప్పుడు, ఇంగ్లిష్‌ మాధ్యమంవైపు వెళ్లడానికి కేవలం పేదరికమే ఆటంకంగా మారినప్పుడు ప్రభుత్వాలు అవసరమైతే తమ విధానాలు మార్చుకుని అందరికీ సమానావకాశాలు దక్కేలా చూడవలసి ఉంటుంది. ఎన్‌ఎస్‌ఓ నివేదిక అందరి కళ్లూ తెరిపించాలి.

మరిన్ని వార్తలు