ఆ పాలన నేర్పిన పాఠాలెన్నో!

7 Feb, 2023 01:32 IST|Sakshi

అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అని నానుడి. పాకిస్తాన్‌ సైనిక నాయకుడిగా, ఆ పైన పాలకుడిగా చక్రం తిప్పిన జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌కు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అధికారం పోయాక పరాయి దేశానికి పలాయనమై, ఆఖరికి అరుదైన వ్యాధితో ఆదివారం నిస్సహాయంగా కన్నుమూయాల్సి వచ్చింది. సైనిక దిగ్గజాలు అయూబ్, జియాల బాటలో నడిచి, పాకిస్తాన్‌ను నేరుగా పాలించే స్థాయికి ఎదిగిన ఈ జనరల్‌ మూటగట్టుకున్న అప్రతిష్ఠ అపారం. ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ హఠాత్తుగా స్తంభించింది ఆయన వల్లే.

1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో అంత శక్తిమంతమైన అధినేత కూడా గద్దె దిగారు. అనేక వివాదాలు ముసిరిన ముషారఫ్‌ పాలన చిత్రమైన పరస్పర వైరుద్ధ్యాల గాథ. అవిభజిత భారతావనిలో ఢిల్లీలో పుట్టిన ఈ జనరల్‌ సైనికకుట్రకు పాల్పడినప్పుడు ప్రజా ప్రభుత్వాల అవి నీతితో విసిగిన పాక్‌ పౌరసమాజం సంతోషించింది. ఆ సంతోషం తొందరలోనే ఆవిరైంది. పాక్‌ భద్రతా పరిస్థితిని చిక్కుల్లో పడేసిన పాపం ముషారఫ్‌దే. తీవ్రవాదంపై పోరులో ఆయన ద్వంద్వ నీతి ఆ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తే, ఆ రాజకీయ దుశ్చర్యలో తానే దగ్ధమైన దుఃస్థితి. దాయాది దేశంలో మరణశిక్ష పడ్డ ఏకైక సైనిక పాలకుడనే దుష్కీర్తీ ఆయనదే. 2007లో రెండోసారి ఎమర్జెన్సీ విధించి, రాజద్రోహానికి పాల్పడ్డారన్న కారణంపై మరణశిక్ష పడింది. వైద్యచికిత్సకంటూ 2016లో దేశం విడిచి దుబాయ్‌ చేరి, అక్కడే స్వీయప్రవాసంలో తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. 

ముషారఫ్‌ వ్యవహారమంతా ఓ నిగూఢ ప్రహేళిక. నిరంకుశ పాలన సాగిస్తూనే, ఉదారవాద సంస్కరణలూ తెచ్చారు. మీడియా వర్ధిల్లడానికి వీలు కల్పించిందీ ఆయనే. ఆనక అవి తనకు అడ్డం తిరిగాక వాటి నోరు మూయించేందుకు ప్రయత్నించి, భంగపడ్డదీ ఆయనే. 1999 మేలో సైనిక ప్రధానాధికారిగా దుందుడుకుగా కార్గిల్‌ యుద్ధానికి కారణమై, పాక్‌ పరువు తీసిందీ ఆయనే. అదే అక్టోబర్‌లో కరాచీలో తన విమానం దిగనివ్వని ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను సాగనంపి, ఎమర్జెన్సీ విధించి పగ్గాలు చేపట్టి, ఆనక 2001లో ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నుంచి దేశాధ్యక్షుడై, భారత్‌తో శాంతి ప్రయత్నాలు చేసిందీ ఆయనే. ఆ మాటకొస్తే ఆయన హయాంలోనే అయిదేళ్ళు భారత్, పాక్‌ల మధ్య శాంతి నెలకొంది. చిత్రంగా ఈ సైనిక నియంత ఏలుబడిలోనే 2003–04ల్లో సియాచిన్, కశ్మీర్‌ వివాదం దాదాపు పరిష్కారమయ్యే దాకా వెళ్ళింది. ఆఖరున ఆ అవకాశం చేజారింది.

1999 నుంచి తొమ్మిదేళ్ళు పాక్‌ను పాలించిన శక్తిమంతమైన దేశాధినేత ముషారఫ్‌. అధ్యక్షుడైన కొద్దినెలలకే ‘తీవ్రవాదంపై పోరు’ అంటూ దోస్తీ చేసిన అమెరికాని సైతం బురిడీ కొట్టించిన తంత్రం ఆయనది. అల్‌ఖాయిదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ ఆచూకీ కోసం అగ్రరాజ్యం జల్లెడ పడుతుంటే, అతణ్ణి పెరట్లోనే పెట్టుకొని కాలక్షేపం చేయగలిగారు. అలా ఇటు తీవ్రవాద విషనాగుతో, అటు 9/11 ఘటనతో తీవ్రవాదంపై శివాలెత్తుతున్న అమెరికాతో ఏకకాలంలో నెయ్యం నెరిపారు. ఈ కత్తి మీద సాము వికటించి, పాలు పోసిన పామే కాటేసింది. దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నాడంటూ తీవ్రవాద బృందాలు రెండుసార్లు ఆయన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాయి. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను పట్టాలు తప్పేలా చేయడం సహా ఆయన ఘోర తప్పిదాలు అనేకం. రాజకీయ మనుగడ కోసం వివిధ మతతత్త్వ పార్టీలతోనూ జట్టు కట్టారు. ఆఖరికి 2006లో బలూచ్‌ నేత అక్బర్‌ ఖాన్‌ బుగ్తీని హతమార్చడంతో బలూచిస్తాన్‌లో దిగజారిన పరిస్థితి ఇప్పటికీ సాధారణ స్థితికి రానే లేదు. బుగ్తీ హత్యతో ఆరంభమైన ముషారఫ్‌ పతనం దేశ ప్రధాన న్యాయమూర్తిని పక్కకు తప్పించాలన్న విఫలయత్నంతో వేగవంతమైంది. 2008లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్‌ అభిశంసనకు సిద్ధమవడంతో అవమానకరమైన రీతిలో ముందుగానే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో మూడు నెలలకు 26/11 ముంబయ్‌ దాడులతో భారత్‌ కూడా పాఠం నేర్చుకుంది. సైనిక నియంతతోనో, సైనాధ్యక్షుడితోనో మాట్లాడినంత మాత్రాన దాయాదితో సంబంధాలు మెరుగవడానికి అన్ని వర్గాలూ కలిసొస్తాయనుకుంటే అంతకన్నా అవివేకం లేదన్న చేదు నిజం తెలిసొచ్చింది. 

ఇక, 2010లో ముషారఫ్‌ పెట్టిన ‘ఆల్‌ పాకిస్తాన్‌ ముస్లిమ్‌ లీగ్‌’ సైతం అనేక ఇతర ఏకవ్యక్తి రాజకీయ పార్టీల లానే అచిరకాలంలోనే తెర మరుగైంది. దేశ సమస్యల్ని పరిష్కరించగల సత్తా సైన్యానికే ఉందని గుడ్డిగా నమ్మిన పాక్‌ సైనిక నేతల్లో కడగొట్టువాడైన ముషారఫ్‌ కష్టాలు కొనితెచ్చారు. ఇస్లామాబాద్‌లో అధికార కేంద్రంగా ఆనాటి నుంచి సైన్యం సాగిస్తున్న ఆటకు ఇప్పటికీ తెరపడనే లేదు. ఆయన హయాంలో జరిగిన అనేక నిర్ణయాలే ఇవాళ్టికీ పాక్‌ రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాల ముఖచిత్రం ఇలా మిగలడానికి కారణం. నేడు రాజకీయ అనిశ్చితి, తీవ్రవాదుల ఎదురుదాడి మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తానీ పాలక శిష్టవర్గం, పౌరులు, సైన్యం ముషారఫ్‌ శకం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం. ఆయన తప్పొప్పులు పాకిస్తానే కాదు.. పొరుగుదేశమైన మనతో సహా ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయాల్లో సైనిక జోక్యం దుష్పరిణామాలు అంత తొందరగా ఆగవు. 

మరిన్ని వార్తలు