ఇమ్రాన్‌ వింత నిర్ణయం

5 Apr, 2022 00:59 IST|Sakshi

గత కొంతకాలంగా రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఎట్టకేలకు పదవినుంచి నిష్క్రమించారు. పోతూ పోతూ అమెరికాపై పెద్ద బండ పడేశారు. తనను పదవీచ్యుతుణ్ణి చేయడానికి ‘ఒక పెద్ద దేశం’ కుట్ర పన్నుతున్నదంటూ గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న ఇమ్రాన్‌.. సొంత పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌(పీటీఐ) ఎంపీల సమావేశంలో అమెరికా పేరు చెప్పడంతోపాటు ఆ ప్రభుత్వంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయమంత్రిగా ఉంటున్న డోనాల్డ్‌ లూ ఇందులో ప్రధాన పాత్ర పోషించారని తేటతెల్లం చేశారు.

ఈ కుట్ర సిద్ధాంతం మాటెలా ఉన్నా దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా అమెరికా పేరే వినిపించడం పాకిస్తాన్‌ పౌరు లకు అలవాటైపోయింది. గతంలో మాదిరే ఇప్పుడు కూడా నిజానిజాలేమిటో వెల్లడయ్యే అవకాశాలు లేవు. సైన్యానికీ, తనకూ సంబంధాలు చెడిన సంగతి బహిరంగ రహస్యమే అయినా ఇమ్రాన్‌ ఆ మాటెత్తడం లేదు. అటు సైన్యం కూడా ఇలాంటి తెలివే ప్రదర్శిస్తోంది. తమకూ, రాజకీయాలకూ సంబంధం లేదంటున్నది. నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించడానికి ఇమ్రాన్‌ను ముందుపెట్టి 2018లో సైన్యం ఆడిన డ్రామా ఎవరూ మరిచిపోరు.

ఆయన పార్టీ స్థాపనలోనూ, ఆయన సాగించిన ఉద్యమాల్లోనూ సైన్యం ప్రమేయం గురించీ, ఆఖరికి ఎన్నికల్లో రిగ్గింగ్‌ నడిపించి ఆయన ప్రధాని అయ్యేందుకు తోడ్పడిన వైనం గురించీ తెలియవారెవరూ లేరు. అయితే ఇద్దరిమధ్యా సంబంధాలు ఎందుకు బెడిసికొట్టాయో వెల్లడికావడానికి మరికొంతకాలం పడుతుంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఇమ్రాన్‌ పోషించిన పాత్రే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆఖరి బంతి వరకూ పోరాడతానని ఆయన ప్రగల్భాలు పలికారు. అందరినీ నమ్మిస్తూ వచ్చారు. తీరా చివరి నిమిషంలో కాడి పడేశారు.

జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం ఖాన్‌ సూరి సాయంతో కావలసినంత గందరగోళం సృష్టించి, అటు తర్వాత దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీని కలిసి అసెంబ్లీని రద్దు చేయించారు. తాను సూచించిన వ్యక్తే ఆపద్ధర్మ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనాల్సిన నాయకుడి సత్తా ఏపాటిదో తేలకుండా ఆయన చేసిన సిఫార్సును దేశాధ్యక్షుడు ఎలా ఆమోదించారన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

దేశ విభజన పూర్తయి ఒక దేశంగా ఆవిర్భవించినప్పటినుంచీ పాకిస్తాన్‌ను సంక్షోభాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. అక్కడి రాజ్యాంగం దేశాన్ని మత రాజ్యంగా ప్రకటించటంలోనే ఈ సంక్షోభ పరంపరకు బీజాలున్నాయి. మెజారిటీ పౌరుల్లో ఉండే మత విశ్వాసాలను సొమ్ము చేసుకోవడానికి రాజకీయ పక్షాలు ఒకటిని మించి మరొకటి పోటీ పడే క్రమంలో వ్యవస్థలన్నీ అవినీతిలో కూరుకు పోయాయి. నిస్తేజంగా తయారయ్యాయి. దీన్ని సైన్యం తెలివిగా ఉపయోగించుకుంది. దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు దేశ ప్రజలను నమ్మించి రేషన్‌ పంపిణీ మొదలుకొని అన్నిటిలోనూ తన ప్రమేయం ఉండేలా చూసుకుని రాజకీయ వ్యవస్థపై పట్టు బిగించింది.

ఏ ప్రభుత్వాన్నీ పూర్తి కాలం అధికారంలో కొనసాగనీయకుండా చూడటం, సాధ్యపడకపోతే సైనిక కుట్రలో ప్రభుత్వాలను కూల్చడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం దానికి రివాజు. ఇన్ని దశాబ్దాలుగా అలవాటైన ప్రాణం ఇప్పుడు అందుకు భిన్నంగా తటస్థత పాటించిందని ఎవరూ నమ్మరు. కానీ ఆ మాట ఇమ్రాన్‌ ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో అనూహ్యం.

ఒకపక్క విపక్షాల అవిశ్వాసాన్ని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడంపై పార్లమెంటులో గొడవ సాగుతుండగా మాయమైన ఇమ్రాన్‌.. ఆ తర్వాత టీవీల్లో ప్రత్యక్షమై విపక్షాల అవిశ్వాసం ఓడిపోయిందనీ, అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశాననీ, త్వరలో ఎన్నికలుంటాయనీ ప్రకటించడంతో వ్యవస్థలన్నీ నవ్వులపాలయ్యాయి. ఎటూ పదవి పోవడం ఖాయమనుకున్నప్పుడు హుందాగా అవిశ్వాసాన్ని ఎదుర్కొని ఉంటే ఇమ్రాన్‌కు కొద్దో గొప్పో గౌరవం దక్కేది. కానీ ఆయన రాకలోనే అప్రజాస్వామికత దాగి ఉన్నప్పుడు నిష్క్రమణ అందుకు భిన్నంగా ఉంటుందనుకోవడం దురాశ. 

ఇమ్రాన్‌ రాకపోకల మాటెలా ఉన్నా ఉక్రెయిన్‌ విషయంలో ఎవరి ఒత్తిళ్లకూ లొంగక స్వతం త్రంగా నిర్ణయం తీసుకుందని పదవి ఊడే వేళయిందని గ్రహించాక రెండు సందర్భాల్లో ఆయన భారత్‌ను కొనియాడటం గమనించదగ్గది. ఇది తమ సైన్యం అనుసరిస్తున్న వైఖరిపై ఎత్తిపొడుపు. తాను రష్యాను సమర్థించగా, సైన్యం మాత్రం అమెరికా అనుకూల వైఖరి తీసుకోవడాన్ని తట్టుకోలేక అది ఒత్తిళ్లకు తలొగ్గిందని చెప్పడానికి ఆయన భారత్‌ను ప్రశంసించారు. ఇమ్రాన్‌ వచ్చేనాటికే పాకిస్తాన్‌ రూపాయి సంక్షోభంలో చిక్కుకుంది. కరెంట్‌ అకౌంట్‌ లోటు, ద్రవ్యలోటు నానాటికీ పెరు గుతూ పోయాయి.

చైనా ఆపన్న హస్తం అందిస్తుందని ఆశించినా మత ఛాందసవాదం ఉన్నకొద్దీ వెర్రితలలు వేస్తున్న తీరుతో అది వెనకడుగేసింది. పైగా దానికి చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీలే భయపెట్టేంతగా పెరిగాయి. మొదటినుంచీ వెనకుండి ఇమ్రాన్‌ను నడిపించి ఆర్థిక సంక్షోభానికి కారణమైన సైన్యం ఇప్పుడు ఆయన్ను బలిపశువును చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి.

పాకిస్తాన్‌ పరిణామాలపై అక్కడి సుప్రీంకోర్టు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆ తీర్పు ఎలా ఉన్నా వ్యవస్థలను ఆడిస్తున్న సైన్యం తీరు మారనంతవరకూ.. ప్రజలు చైతన్యవంతులు కానంతవరకూ పాకిస్తాన్‌ వ్యథ తీరదు. అది ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి నిత్యం పయనిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ విఫలరాజ్యంగానే మిగులుతుంది.

మరిన్ని వార్తలు