ఎర్రకోట వీరుడు

17 Aug, 2022 00:14 IST|Sakshi

మాటలతో కోటలు కడుతూ, మనసు గెలవడం సులభమేమీ కాదు. కానీ, చారిత్రక ఎర్ర కోట బురుజుపై నుంచి ప్రసంగించినప్పుడల్లా ప్రధాని మోదీ తన మాటల మోళీతో సామాన్యుల్ని మెప్పిస్తూనే ఉన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవ వేళ తాజాగా ప్రసంగిస్తూ శతవసంత భారతా వనికి గంభీర లక్ష్యం నిర్దేశించారు. 2047 కల్లా భారత్‌ను ‘అభివృద్ధి చెందిన దేశం’ చేయాలన్నారు. ‘దేశాభివృద్ధి, బానిసత్వ మూలాల్ని వదిలించుకోవడం, వారసత్వ వైభవ స్ఫురణ, సమైక్యత, బాధ్య తల నిర్వహణ’ అంటూ 5 ప్రతిజ్ఞల మహాసంకల్పమూ చెప్పారు. లక్ష్య సాధనకు స్పష్టమైన సర్కారీ ప్రణాళిక ఏమిటో చెప్పడం మాత్రం అలవాటుగానో, పొరపాటుగానో విస్మరించారు. పొరుగున పొంచి ఉన్న ముప్పు, అంతర్జాతీయ సమస్యల ప్రస్తావన చేయలేదు. రెండేళ్ళలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు చేయడం మర్చిపోలేదు. అవినీతి, బంధుప్రీతి, వంశపాలనపై పోరాడేందుకు ఆశీస్సులు కావాలని షరా మామూలుగా అభ్యర్థించడమూ ఆపలేదు. 

2017లో కేదార్‌నాథ్‌ పర్యటనప్పుడే 2022 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేస్తా మని ప్రధాని సంకల్పం చెప్పారు. ఇప్పుడదే లక్ష్యాన్ని కొత్త కాలావధితో ప్రవచించారు. ఏది, ఎన్నిసార్లు చెప్పినా స్వభావసిద్ధ నాటకీయ హావభావ విన్యాసాలతో సామాన్యుల్ని ఆకట్టుకొనేలా చెప్పడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. వరుసగా తొమ్మిదో ఏట చారిత్రక ఎర్రకోటపై జెండా ఎగరేసి, సందేశమిచ్చిన ఆయన ఈసారి సంప్రదాయంగా చేసే ప్రత్యేక పథకాల ప్రకటనల జోలికి పోలేదు. స్వచ్ఛతా అభియాన్, జాతీయ విద్యావిధానం, కరోనా టీకాల లాంటి అంశాల్లో ప్రభుత్వ పురోగతినే పునశ్చరణ చేశారు. ఇటీవలి తన అలవాటుకు భిన్నంగా టెలీప్రాంప్టర్‌ లేకుండా 82 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘జై జవాన్, జై కిసాన్‌’కు గతంలో వాజ్‌పేయి ‘జై విజ్ఞాన్‌’ను జోడిస్తే, తాజాగా మోదీ ‘జై అనుసంధాన్‌’(నూత్న పరిశోధన)ను చేర్చారు. 

కొన్నేళ్ళుగా మాటలు ఎర్రకోట దాటాయే కానీ, చేతలు సభా వేదికలైనా దాటట్లేదన్నది నిష్ఠుర సత్యం. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2017లోనే మాట ఇచ్చారు. విదేశాల్లోని నల్లధనం వెలికి తెచ్చి, ఇంటింటికీ రూ. 15 లక్షలు పంచడమే తరువాయని ఊరించారు. అమృతో త్సవం నాటికి అందరికీ ఇళ్ళు వచ్చేస్తాయని ఊహల్లో ఊరేగించారు. తీరా అన్నీ నీటి మీద రాతల య్యాయి. ఉచితాలన్నీ అనుచితాలంటూ, ప్రజాసంక్షేమ పథకాలపై ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న వారు కొత్తగా ఏవో ఒరగబెడతారనుకోలేం. కానీ ‘అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు... అలము కున్న ఈ దేశం ఎటు దిగజారు’ అంటూ దశాబ్దాల క్రితం కవి వ్యక్తం చేసిన ఆవేదననే నేటికీ వల్లె వేస్తుంటే, ఎవరిపైనో నెపం మోపుతుంటే ఏమనాలి? దేశంలో ఏ మంచి జరిగినా గత 8 ఏళ్ళ లోనే జరిగినట్టూ, ప్రతి చెడుకూ ఆ మునుపటి 67 ఏళ్ళే కారణమన్నట్టు ఎన్నాళ్ళు నమ్మబలుకుతారు? 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశేష ప్రగతికి దోహదపడిందంటూ ఎర్రకోటపై అనేక అంశాల్ని ప్రస్తావించారు. వాటిలో కొన్ని సత్యశోధనకు నిలవట్లేదు. ‘పర్యావరణంపై భారత కృషి ఫలితాలి స్తోంది. అడవుల విస్తీర్ణం, పులులు, ఆసియా సింహాల సంఖ్య పెరగడం ఆనందాన్నిస్తోంది’ అంటూ చెప్పుకున్న గొప్పల్లో నిజం కొంతే! దేశ భూభాగంలో మూడోవంతులో అడవులను విస్తరింపజేస్తా మన్న పాలకులు సాధించింది స్వల్పమే. అటవీ విస్తీర్ణం 24.6 శాతానికి పెరిగిందని ప్రభుత్వ లెక్క. 2002 – 2021 మధ్య భారత్‌లో చెట్ల విస్తీర్ణం 19 శాతం మేర తగ్గిందని నాసా, గూగుల్‌ వగైరాల సమాచారమంతా క్రోడీకరించే ‘గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌’ మాట. పర్యావరణ  విధానానికి వస్తే – బొగ్గు మీదే అతిగా ఆధారపడే మన దేశం అమెరికా, చైనాల తర్వాత అధిక కర్బన ఉద్గార దేశాల్లో ఒకటి. 

అలాగే, రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత సంస్థలను ప్రోత్సహిస్తున్నామ న్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల ప్రోత్సాహం బీజేపీ హయాంలో జరిగింది. కానీ, విదేశాల నుంచి భారీగా ఆయుధాల కొనుగోలులో ఇప్పటికీ మనం ముందున్నాం. 2017 – 2021 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం వాటా మనదే. దేశంలో పులులు, సింహాల సంఖ్య పెరిగిన మాట నిజమైనా, జాతీయ చిహ్నంలో సరికొత్త ఉగ్రనరసింహం దేనికి ప్రతీకంటే జవాబివ్వడం కష్టం. స్వాతంత్య్ర కాలపు ‘స్వదేశీ’, నేటికి ‘స్వావలంబన’ (ఆత్మనిర్భరత)గా రూపాంతరమైనా నేతన్న ఖద్దరును కాదని జెండాలు సైతం దిగుమతి చేసుకొనే దుఃస్థితి ఏమిటి? విదేశీ బొమ్మలు వద్దంటు న్నారని సంబరంగా చెబుతున్నవారు విదేశీ తయారీ జాతీయజెండాల వైపు మొగ్గడమేమిటి? 

అవినీతి, ఆశ్రితపక్షపాతం, ఆత్మనిర్భర భారత్‌ మోదీ ప్రసంగాల్లో నిత్యం దొర్లే మాటలు. నారీ శక్తి ప్రస్తావనా నిత్యం చేస్తున్నదే! ఆచరణలో చేసిందేమిటంటే ప్రశ్నార్థకమే! అవినీతిపై యుద్ధం మాటకొస్తే – 2015 మొదలు 2017, 2018, 2019... ఇలా ఏటా ఆ మాట మోదీ తన ప్రసంగంలో చెబుతూనే ఉన్నారు. ప్రసంగ పాఠాలే అందుకు సాక్ష్యం. ప్రతిపక్షపాలిత బెంగాల్‌లో బయటపడ్డ గుట్టలకొద్దీ నోట్లకట్టల్ని ఎవరూ సమర్థించరు కానీ, కాషాయ జెండా కప్పుకోగానే పచ్చి అవినీతి పరులు సైతం పరిశుద్ధులైపోతున్న ఉదాహరణలే అవినీతిపై పోరాటస్ఫూర్తిని ప్రశ్నిస్తున్నాయి. సమై క్యతను ప్రవచిస్తున్న పార్టీలు భిన్నభాషలు, సంస్కృతులు, కులాలు, మతాలున్న దేశంలో రకరకాల ప్రాతిపదికన మనుషుల్ని విడదీస్తూ, మనసుల్ని ఎలా దగ్గరచేయగలవు? వాగాడంబరం కట్టిపెట్టి, ఆచరణలోకి దిగాలి. స్వతంత్ర భారత శతమాన లక్ష్యం చేరాలంటే అన్నిటికన్నా ఆ ప్రతిజ్ఞ ముఖ్యం! 

మరిన్ని వార్తలు