సయోధ్యకు అంకురార్పణ

5 Aug, 2020 00:46 IST|Sakshi

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాలంటూ అలుపెరగని రీతిలో దశాబ్దాలుగా పోరాడు తున్నవారి స్వప్నం ఈడేరబోతోంది. బుధవారం ఆ నగరంలో మూడు గంటలపాటు జరిగే భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీసహా 174మంది ఆహ్వానితులు పాల్గొంటున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి పంజా విసిరిన పర్యవసానంగా ఇలా తక్కువమందితో నిరాడంబరంగా ఆ కార్యక్ర మాన్ని ముగిస్తున్నారు. లేనట్టయితే ఇవాళ్టి రోజున అయోధ్య లక్షలాదిమంది జనసందోహంతో హోరె త్తిపోయేది. బాబ్రీ మసీదు వున్న ప్రాంతం రామ జన్మభూమి అని, దాని స్థానంలో రామమందిరం నిర్మించాలని జన్‌సంఘ్‌గా వున్నప్పటి నుంచి బీజేపీ రాజకీయంగా పోరాడుతూ వుంది. అంతకు చాన్నాళ్లముందే... అంటే 1885 డిసెంబర్‌లో వలసపాలకుల హయాంలోనే తొలిసారి సివిల్‌ కేసు దాఖలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949 చివరిలో అయోధ్య అదనపు నగర మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ వివాదంపై విచారణ జరిగింది. ఈ వ్యాజ్య పరంపర ఇలా కొనసాగుతుండగానే న్యాయ స్థానాల వెలుపల ఇరువర్గాలమధ్యా సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నించినవారు కూడా లేకపోలేదు.

1990లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్, 1992లో అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు, 2003లో నాటి ప్రధాని వాజపేయి ఈ మార్గంలో ప్రయత్నించారు. ఇతర ప్రయత్నాల సంగతలా వుంచి పీవీ హయాంలో ఆయన సలహాదారుగా పనిచేసిన పీవీఆర్‌కే ప్రసాద్, తాంత్రికుడు చంద్రస్వామి పీఠాధిపతులతో, హిందూ మత పెద్దలతో, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. ఆ సంభా షణలు కొంతవరకూ ఫలించిన దాఖలాలు కూడా కనబడ్డాయని, కానీ చివరకు అది కాస్తా మూలన పడిపోయిందని చెబుతారు. నిరుడు మార్చిలో సుప్రీంకోర్టు సైతం ఇలాంటి మధ్యవర్తిత్వ ప్రయత్నం చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఫకీర్‌ మహ మ్మద్‌ ఇబ్రహీం కలీఫుల్లా, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచులతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అన్ని పక్షాలతో చర్చించి ఒక ఒప్పందాన్ని రూపొందించింది. అయితే కొన్ని పక్షాలు మాత్రమే దానికి అంగీకరించాయి. ఆ పక్షాలు కూడా షరతులు విధించాయి. అయితే మధ్యవర్తిత్వాలు సర్వ సాధారణంగా ఆస్తుల పంపకాలు, స్థల యజమానుల మధ్య వుండే సరిహద్దు తగాదాలు వగైరాల్లో చెల్లుబాటవుతుంది. పరస్పరం తలపడేవారు ఏదో ఒక దశలో కోర్టు వివాదాలతో విసిగిపోయి కొంద రిని పెద్దమనుషులుగా అంగీకరించి, వారి తీర్పునకు తలొగ్గుతారు. కానీ రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం మౌలికంగా మతపరమైన మనోభావాలతో, విశ్వాసాలతో ముడిపడి వున్న సమస్య. అక్కడ అంతక్రితం వున్న రామమందిరాన్ని బాబర్‌ ధ్వంసం చేయించి, దానిపై మసీదు కట్టాడన్నది రామ మందిరం నిర్మించాలని పోరాడినవారి వాదన. ఈ వివాదం రాజకీయంగా మాత్రమే కాదు... సామాజికంగా కూడా కల్లోలం సృష్టించింది.

తన మధ్యవర్తిత్వ ప్రయత్నం ఫలించలేదని గ్రహించాక సుప్రీంకోర్టు నిరుడు నవంబర్‌ 9న తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించా లని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఒక ట్రస్టు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం పనులు జరగాలని నిర్దేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించా లని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో విద్వేషపూరిత పరిణామాలకు దారితీసిన ఒక సంక్లిష్ట సమస్య సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పరిసమాప్తమైంది. అన్ని వర్గాలూ ఈ తీర్పును స్వాగతిం చాయి. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చొరవ, పట్టుదల వల్లే ఈ చిక్కుముడి వీడింది. చివరి దశలో కూడా ఇది యధాప్రకారం వాయిదా పడేలా చూడాలని కొన్ని పక్షాలు ప్రయత్నించాయి. 40 రోజులపాటు నిర్నిరోధంగా సాగిన వాదప్రతివాదాల క్రమంలో ఉద్వే గాలు చోటుచేసుకున్నాయి. కోపతాపాలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పువల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న భయాందోళనలు అందరిలోనూ ఉన్నాయి. బాబ్రీ మసీదు విధ్వంçసం అనంతరం ఎన్నో విషాదకర పరిణామాలు చూసి ఉండటం వల్ల అవి సహజమే. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ అందరిలోనూ పరిణతి వచ్చింది. పరస్పర ఘర్షణల వల్ల ఒరిగేదేమీలేదన్న అవగాహన ఏర్పడింది. అందుకే ఎక్కడా ఆగ్రహావేశాలు కట్టుదాటలేదు. అంతా ప్రశాంతంగా గడిచిపోయింది.

కాలం మారేకొద్దీ ఎలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలంటే రామ జన్మభూమి ఉద్యమాన్ని చూడాలి. తన రథయాత్రతో ఆ ఉద్యమానికి ఆయువు పోసి, అది దేశవ్యాప్తమయ్యేందుకు బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ కారకులు. ఆ రథయాత్రవల్లే బీజేపీ దేశం నలుమూలలా బలపడింది. కానీ ఇప్పుడు జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన తన ఇంట్లో టెలివిజన్‌ సెట్‌లో వీక్షించవలసి వస్తోంది. కరోనా కారణంగా 90 ఏళ్లు పైబడి వయస్సున్నవారిని అనుమతించరాదని నిర్ణయించినందువల్లే ఆయనను ఆహ్వానించలేదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పట్లో ప్రధాన పాత్రధారులైన నేతలు మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌సింగ్, ఉమాభారతిలకు ఆహ్వానం అందినా వారు నిరాకరించడం ఆసక్తికరమైన విషయం. ఉమాభారతి అయోధ్య వెళ్తున్నా, కార్యక్రమానికి హాజరుకాబోనని ఇప్పటికే చెప్పారు. అడ్వాణీ రథయాత్ర గుజరాత్‌ వచ్చినప్పుడు ఆ కార్యక్ర మానికి నిర్వాహకుడిగా ఉండి పెద్దగా వార్తలకెక్కని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రధాని హోదాలో భూమి పూజలో కీలక భూమిక పోషించబోతున్నారు. మన దేశంలో రామకోవెల లేని ఊరు, వాడా వుండదు. రాముడు కోట్లాదిమంది హిందువులకు ఆరాధ్యుడు కావొచ్చుగానీ, రామాయణం చాటి చెప్పిన విలువలు కాలావధుల్ని దాటి పరివ్యాప్తమయ్యాయి. కులాలు, మతాలు, జాతులకు అతీ తంగా  అందరికీ ఆదర్శనీయమైనవిగా నిలిచాయి. అయోధ్యలో నిర్మాణం కాబోయే రామ మందిరం సైతం ఆ విలువల స్ఫూర్తికి అద్దం పట్టేలా రూపుదిద్దుకుంటుందని ఆశించాలి.

మరిన్ని వార్తలు