Queen Elizabeth II: అరుదైన వ్యక్తిత్వం

10 Sep, 2022 00:39 IST|Sakshi

‘రవి అస్తమించని సామ్రాజ్యం’ తన ప్రాభవం క్రమేపీ కోల్పోతూ, కొడిగడుతున్న తరుణంలో బ్రిటిష్‌ పట్టపు రాణిగా వచ్చిన రాణి ఎలిజబెత్‌–2 గురువారం రాత్రి కన్నుమూశారు. బ్రిటన్‌తో పాటు మరో 14 దేశాలకు లాంఛనప్రాయపు రాజ్యాంగాధినేత హోదాలో అయితేనేమి, పూర్వపు బ్రిటిష్‌ వలస దేశాలతో కూడిన కామన్వెల్త్‌ అధినేత హోదాలో అయితేనేమి... ఈ ఏడు దశాబ్దాలూ ఆమె తనదైన ముద్రవేశారు. ఎలిజబెత్‌–2 సింహాసనం అధిష్ఠించేనాటికి అదే యూరప్‌ ఖండంలోని అనేక దేశాలు హింసాత్మకంగానో, సామరస్యపూర్వక మార్గంలోనో రాచరిక వ్యవస్థల్ని పూర్తిగా వదుల్చుకుని ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లుగా అవతరిస్తున్నాయి. బ్రిటన్‌ గురించే చెప్పాలంటే అంతకు రెండున్నర శతాబ్దాల పూర్వమే అది ప్రజాస్వామ్య ఫలాలను రుచిచూడటం ప్రారంభించింది. అయినా బ్రిటన్‌ ప్రజాజీవన రంగం ఈనాటికీ రాచరిక వ్యవస్థతోనే పెనవేసుకుని ఉండటం, బకింగ్‌హామ్‌ రాజప్రాసాద పరిణామాలు ఈనాటికీ అక్కడి పౌరుల్లో ఆసక్తిదాయకం కావడం ఆ సమాజ తీరుతెన్నుల్ని పట్టిచూపుతుంది. ఇందుకు రాణిగా ఎలిజబెత్‌–2 నిర్వహించిన పాత్ర కూడా తక్కువేమీ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడటం, తమ పరిధులు, పరిమితులు గుర్తెరిగి మసులుకోవడం వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా శోభనిస్తుంది. రాణి ఎలిజబెత్‌ ఆ పని చేశారు కాబట్టే పెద్దగా వివాదాలు ముసురుకోలేదు. తనదైన ఆ శైలే 70 ఏళ్లపాటు ఆమెను అవిచ్ఛిన్నంగా నిలబెట్టింది. దేశానికి రాచరికం ఎందుకన్న ప్రశ్న తలెత్తకుండా చేసింది.

రాజ్యాధినేతగా ఆమె ప్రతి వారం ప్రధానితో, విదేశాంగ మంత్రి తదితరులతో సంభాషించటం ఆనవాయితీ. ఇంటా బయటా జరిగే పరిణామాలను తెలుసుకోవటం, సలహాలివ్వటం రివాజు. ఆమె రాణి అయ్యేనాటికి విన్‌స్టన్‌ చర్చిల్‌ దేశ ప్రధాని. అప్పటికే రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ అన్నివిధాలా దెబ్బతిని, తన వలస రాజ్యాల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహం పర్యవసానంగా ఒక్కో దేశంనుంచే నిష్క్రమించకతప్పని దుస్థితిలో పడింది. ఆమె వచ్చాక సైతం అది కొనసాగింది. తన తాతలకాలం లోనే రాజ కుటుంబీకులకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండే దశ అంతరించి సమానత్వ భావన వచ్చింది. ఇక 1956 నాటి సూయెజ్‌ కాల్వ సంక్షోభం బ్రిటన్‌ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలో తన వాస్తవ స్థానమేమిటో చూపింది. సామ్రాజ్యంగా వెలుగులీనిన బ్రిటన్‌ యూరోప్‌ యూనియన్‌ (ఈయూ)లో ఒక భాగస్వామిగా మారడం... ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా అదే ఈయూ నుంచి రెండేళ్లక్రితం బయటకు రావడం వంటి పరిణామాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. స్కాట్‌లాండ్‌లో స్వాతంత్య్ర కాంక్ష క్రమేపీ పెరిగి ఒక దశలో ఆ ప్రాంతం విడిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వాలూ, వాటి అస్థిరతా సరేసరి. వీటన్నిటినీ చూస్తూ, దశాబ్దాల తన అనుభవంతో ప్రభుత్వంలో ఉండేవారికి ఎప్పటికప్పుడు సలహాలిస్తూ ఆమె తన ప్రభావాన్ని చూపగలిగారు. అదే సమయంలో అనవసర జోక్యం చేసుకుంటున్నారన్న అపప్రథ రాకుండా చూసుకున్నారు. అందుకే బ్రిటన్‌ రాచరికానికి ఇప్పటికీ ప్రాసంగికత అడుగంటకపోవటం వెనక ఆమె వ్యక్తిగత ముద్రను కాదనలేం.  

‘రాచరిక వ్యవస్థలోకి తొంగి చూడనంత కాలం దానిపై పూజ్యభావన ఉంటుంది. ఒక్కసారి అలా చూశాక మరి దాన్ని కీర్తించడం అసాధ్యం. అందుకే ఆ మార్మికతను అట్లే కొనసాగనీయండి’ అన్నాడు రాజ్యాంగ నిపుణుడు వాల్టర్‌ బాజెట్‌ ఒక సందర్భంలో వ్యంగ్యంగా. అలా చూస్తే బకింగ్‌ హామ్‌ రాజప్రాసాదంలో దిగ్భ్రాంతిపరిచేవి ఎన్నో కనబడతాయి. 1992లో ఒకేసారి ఆమె సంతానం లోని ముగ్గురు విడాకులు తీసుకోవటం బ్రిటన్‌ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయారు. ఆ మాటకొస్తే తాను రాణి అయిన కొద్దికాలానికే తన సోదరి ఒక సాధారణ వ్యక్తితో సాన్నిహిత్యం నెరపడం, మీడియాలో అది చిలవలు పలవలుగా రావడం, చివరికామె అతన్ని పెళ్లాడి, ఆ తర్వాత కొద్దికాలానికే విడాకులు తీసుకోవటం వంటి పరిణామాలు రాజకుటుంబీకుల్ని ఊపిరాడని స్థితిలో పడేశాయి. ఎందుకంటే రాణిగా ఆమె చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు సుప్రీం గవర్నర్‌. సంప్రదాయానికి అత్యంత విలువ నిచ్చే సమాజం దృష్టిలో ఇవన్నీ ‘జరగకూడని ఘోరాలు’. ఇక యువరాణి లేడీ డయానా స్పెన్సర్‌ విషయంలో ఆమె తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నారు. కోడలిగా సంప్రదాయ పాత్రలో ఒదిగి, ప్రచారానికి దూరంగా ఉండాల్సిన డయానా ప్రముఖురాలిగా మారడం రాజప్రాసాదంలో ఎవరికీ నచ్చలేదంటారు. డయానాను ఆమె అత్తగా ఆరళ్లు పెట్టారని ఆరోపణ లొచ్చాయి. దానికి తగ్గట్టే 1995లో ప్రిన్స్‌ చార్లెస్‌తో విడిపోయిన డయానా మరో రెండేళ్లకు పారిస్‌లో దుర్మరణం పాలైనప్పుడు మొదట్లో రాణి నుంచి స్పందన లేదు. చివరకు ప్రజాభిప్రాయానికి ఆమె తలొగ్గక తప్పలేదు. నాలుగురోజులు ఆలస్యమైనా విషాద సూచకంగా రాజప్రాసాదంపై ఉన్న యూనియన్‌ జాక్‌ను అవనతం చేయమని ఆదేశించవలసి వచ్చింది. ఇక భిన్న సందర్భాల్లో రాజ్యాధినేతగా అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల అధినేతలకూ, సీనియర్‌ సైనికాధికారులకూ నైట్‌హుడ్, ఆనరరీ నైట్‌ కమాండర్‌ వంటి భుజకీర్తులు తగిలించడం విమర్శలకు తావిచ్చింది. వీరంతా వియత్నాం, పాలస్తీనా, ఇరాక్‌ తదితరచోట్ల రక్తపుటేర్లు పారించారన్న ఆరోపణలు ఎదు ర్కొన్నవారు. ఏదేమైనా ఎలిజెబెత్‌లా సంయమనంతో మెలగటం, ఆ ఒరవడిని కొనసాగించటం కుమారుడు చార్లెస్‌కు సంక్లిష్టమైనదే. ఆయన ఆ బాధ్యత ఎలా నెరవేరుస్తారో బ్రిటన్‌ గమనిస్తూనే ఉంటుంది.

మరిన్ని వార్తలు