ఎన్‌జీవోలకు ఆంక్షల సంకెళ్లు

3 Oct, 2020 00:34 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడి సమస్త కార్యకలాపాలూ స్తంభించి ఒక అసాధారణమైన స్థితి నెలకొన్న తరుణంలో ప్రపంచ దేశాలన్నిటా పాలకులు భవిష:్యత్తులో తీవ్ర పర్యవసానాలుండ గల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన పార్లమెంటు గత నెల మూడో వారంలో ఆమోదించిన విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ బిల్లు కూడా అటువంటిదే. సాగురంగ, కార్మిక రంగ సంస్కర ణలకు సంబంధించిన బిల్లుల మాదిరే ఈ బిల్లుపై కూడా పెద్దగా చర్చ జరగలేదు. మన దేశంలో వివిధ రంగాలను ఎన్నుకుని లక్షల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్‌జీవోలు) పనిచేస్తున్నాయి. వాటికి మరింత జవాబుదారీతనం అలవర్చడమే ఈ సవరణ బిల్లు ఉద్దేశమని, అవి పారదర్శకంగా వ్యవహరించేందుకు ఇది దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది.

దేశంలో 31 లక్షలకు పైగా ఎన్‌జీ వోలు పనిచేస్తున్నాయని 2015లో సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో సీబీఐ తెలిపింది. మన దగ్గర ప్రతి 709మందికి ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ వుంటే, ఎన్‌జీవోలు మాత్రం ప్రతి 400మందికి ఒకటి ఉన్నాయని కూడా అది వివరించింది. ప్రభుత్వ తాజా నిబంధనల పర్యవసానం వెంటనే తెలి సింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినందువల్ల భారత్‌లో కార్యకలాపాలు నిలిపేస్తున్నామని ఈమధ్యే ప్రకటిం చింది. మున్ముందు మరెన్ని సంస్థలకు ఈ పరిస్థితి ఏర్పడుతుందో చూడాల్సివుంది.  

ఎక్కడో యూరప్‌లోని మారుమూల పుట్టి, మన దేశంలో అట్టడుగు వర్గాలవారికి అసాధారణ మైన సేవలందించి అమ్మగా అందరితో పిలిపించుకున్న స్వర్గీయ మదర్‌ థెరిసా స్వచ్ఛంద సేవ గురించి ఆణిముత్యంలాంటి మాట చెప్పారు. ‘మనలో అందరం గొప్ప పనులు చేయలేం. కానీ గొప్ప ప్రేమతో చాలా చిన్నవైన పనులుకూడా బాగా చేయగలం’ అన్నారామె. అలా భిన్న రంగాల్లో సేవే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థలు ఎక్కువే వున్నాయి. ఎయిడ్స్‌ బాధితుల సంక్షేమం మొదలుకొని వీధి బాలలకు ఆవాసం, విద్య అందించి ఆదుకుంటున్నవి... గ్రామసీమల్లో కౌమార బాలికల, మహి ళల ఆరోగ్యం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నవి... దళితులు, అనాథ బాలబాలికలు, వృద్ధులు తదిత  రులకు ఆశ్రయం కల్పిస్తున్నవి ఎన్నో వున్నాయి.

వారికి ఆశ్రయం కల్పించడమే కాదు... తదనంతర జీవితంలో స్వశక్తితో ఎదిగేందుకు కృషి చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, లీగల్‌ ఎయిడ్, కార్మిక హక్కులు, మానవ హక్కులు వంటి ఎన్నో అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. మారు మూల ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అలసత్వాన్ని ప్రదర్శించినప్పుడు జనం నిలదీయడానికి, ప్రభుత్వ పథకాలు సక్రమంగా వారికి చేరేందుకు దోహదపడుతున్నాయి. ఎవరికీ పట్టని ఎన్నో అంశా లను ఈ స్వచ్ఛంద సంస్థలు పట్టించుకుని వాటి పరిష్కారానికి కారణమవుతున్నాయి. మొన్నటికి మొన్న లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వాలు చాలాచోట్ల చేతులెత్తేసినప్పుడు వలసజీవుల్ని ఎక్కడి కక్కడ ఆదుకున్నది ఈ స్వచ్ఛంద సంస్థలే.

అయితే ఇక్కడ కూడా సేవ ముసుగులో కైంకర్యం చేసే సంస్థలు... అనాథ బాలబాలికల ఆశ్రమాల పేరిట వారిపట్ల క్రౌర్యంగా వ్యవహరించే సంస్థలు వున్నాయి. అలాంటి సంస్థల పని పట్టాల్సిందే. అందుకెవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఆ వంకన ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేసే సంస్థలకు ఆటంకాలు కల్పించడం అవాంఛనీయం, ప్రమాదకరం. ఎన్‌జీవోలను క్రమబద్ధం చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. 1976లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సమయంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తొలిసారి విదేశీ విరాళాలు అందుకునే సంస్థల నియంత్రణకు చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఎదురయ్యే అనుభవాల ఆధారంగా ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ వచ్చాయి.

2010లో అలాంటి చట్టాలన్నిటినీ క్రోడీకరిస్తూ  అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశీ విరాళాల(నియంత్రణ) చట్టం తెచ్చింది. అది తీసుకురావడం వెనకున్న ఉద్దేశమేమిటో స్పష్టమే. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలు ప్రభుత్వాలకు కంట్లో నలుసులయ్యాయి. అవి దేశంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని నాటి యూపీఏ ప్రభుత్వం ఆరోపించింది. థర్మల్‌ విద్యుత్, అణు విద్యుత్, అల్యూమినియం మైనింగ్‌ ప్రాజెక్టులు ముందుకెళ్లకుండా ఉద్యమాల ద్వారా అడ్డుకుంటోందని వచ్చిన నివేదిక ఆధారంగా 2013లో గ్రీన్‌పీస్‌ సంస్థకు మన్మోహన్‌ సర్కారు విదేశీ విరాళాలు రాకుండా నిలిపివేసింది. రష్యా సహకారంతో నిర్మాణమవుతున్న కూదంకుళం అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగే ఆందో ళనల వెనక అమెరికా నుంచి నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల పాత్ర ఉన్నదని మన్మోహన్‌సింగ్‌ అప్పట్లో ఆరోపించారు. ఇలా అభివృద్ధి ప్రాజెక్టుల్ని ఎన్‌జీవోలు అడ్డుకోవడం వల్ల వృద్ధి రేటు 2 నుంచి 3 శాతం పడిపోతుందని నిఘా సంస్థ అంచనా వేసింది.

స్వచ్ఛంద సంస్థలు అటు వామపక్ష ఉద్యమ సంఘాలనుంచీ, ఇటు ప్రభుత్వాలనుంచీ అభ్యం తరాలెదుర్కొన్నాయి. జనంలో వుండే ఆగ్రహావేశాలను చల్లార్చి, వ్యవస్థపట్ల వారిలో భ్రమలు రేకెత్తించి పరోక్షంగా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలకు తోడ్పడుతున్నాయని ఉద్యమ సంఘాలు ఆరోపించేవి. ఆదివాసీల్లో పనిచేసే అనేక సంస్థలు గతంలో నక్సలైట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆ ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. మహాత్మా గాంధీ, వినోబా భావేల స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ పిల్ల లకు చదువు నేర్పడానికి వనవాసి చేతనా ఆశ్రమ్‌ పేరిట స్వచ్ఛంద సంస్థ నడిపిన హిమాన్షుకుమార్‌ భద్రతా బలగాల బెదిరింపులతో కార్యకలాపాలు నిలిపేయాల్సివచ్చింది. విరాళాల సేకరణలోగానీ, ఇతరత్రా కార్యకలాపాల నిర్వహణలోగానీ స్వచ్ఛంద సంస్థలు పారదర్శకంగా పనిచేయాలనడాన్ని ఎవరూ కాదనరు. కానీ ఆ వంకన సహేతుకమైన, చట్టబద్ధమైన కార్యకలాపాలను నడిపే సంస్థలను సైతం అడ్డుకోవడం... వేధించడం సరైంది కాదు. అది అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది.

>
మరిన్ని వార్తలు