దీపస్తంభాల వెలుగులో...

17 Apr, 2022 00:55 IST|Sakshi

చీకటి తెరలు కరిగిపోయే వేళ, వెలుగు రేకలు ప్రసారమయ్యే క్రమంలో దృగ్గోచరాలపై ఒక స్పష్టత వస్తుంది. లోకం మీద, దాని నడవడి మీద అవగాహన కుదురుకుంటుంది. భారత రిపబ్లిక్‌ ‘అనే నేను’ పేరుతో ప్రజాపాలన ప్రారంభమై డెబ్బయ్‌ రెండేళ్లు గడిచింది. ఈ కాలంలో అధికారం చెలాయించిన నాయకుల చిత్తశుద్ధిలో తరతమ భేదాలున్నాయి. అయినప్పటికీ భారత రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం ప్రభావం ఫలితంగా కొందరు పాలకులు నిండు మనసుతో, మరికొందరు అర్ధమనస్కంగా సామాజిక పరివర్తన క్రమానికి లంగరెత్తక తప్పలేదు.

ఫలితంగా ‘నిమ్న’ జాతి పొరల్ని చీల్చుకుంటూ సామాజిక నిచ్చెనమెట్లను ఒక్కొక్కటే ఎక్కుకుంటూ కొందరు అధోజగత్‌ సహోదరులు ‘సోషల్‌ డెమోక్రసీ’ అనే అంతస్థుకు చేరుకోగలిగారు. చదువు అనే చేదోడు లభించిన కారణంగా వారికీ అధిరోహణ సాధ్యమైంది. ఇరుగుపొరుగు పరిసరాలు వారికిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిచ్చెన కింది మెట్టు మీద నిలబడి ఉన్నప్పుడు విన్న కాకమ్మ కథల డొల్లతనం ఇప్పుడు వెల్లడవుతున్నది. అద్భుతాలుగా వినిపించిన స్వాములోర్ల ప్రతిమల కంటే, సర్దార్ల విగ్రహాల కంటే సమున్నతమైన శిఖర సమానమైన మూర్తిని మనోనేత్రంతో వాళ్లు చూడగలుగుతున్నారు. ఆ మూర్తి చూపుడువేలు ప్రబోధం వారికిప్పుడు సరైన రీతిలో అర్థమవుతున్నది.

ఇన్నాళ్లూ మన నాయకులూ, బోధకులూ చెబుతున్నట్టుగా అంబేడ్కర్‌ కేవలం దళిత నాయకుడు కాదు. జాతీయ నాయకుడు. నేటి దేశావసరాలకు గాంధీ, నెహ్రూల కంటే అంబేడ్కర్‌ ఎక్కువగా సరితూగగలడని నిరూపణవుతున్నది. ఆయనను కేవలం రాజ్యాంగ రచయితగానే మన పాఠ్య పుస్తకాలు మనకు పరిచయం చేశాయి. కానీ, ఈనాటి సామాజిక, రాజకీయ సమస్యలను కూడా ఏడెనిమిది దశాబ్దాలకు పూర్వమే దర్శించి భాష్యం చెప్పిన మహోపాధ్యాయుడు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. ఆయన పుట్టిన తేదీ ఏప్రిల్‌ 14. రోజురోజుకూ ఈ తేదీకి ప్రాధాన్యం పెరుగుతున్నది. భారతీయ సమాజం విద్యాప్రపూర్ణమవుతున్న కొలదీ, వివేకపూరితమవుతున్న కొలదీ ఈ తేదీ మరింత కాంతులీనబోతున్నది.

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏప్రిల్‌ 14వ తేదీతో ముడిపడిన మరో ఉత్తేజభరితమైన వృత్తాంతం కూడా ఉన్నది. ఉస్మానియా విద్యార్థి నాయకుడైన జార్జిరెడ్డిని పెత్తందారీ శక్తులు కుట్రపూరితంగా మట్టుపెట్టిన రోజది. అది జరిగి ఇప్పటికి యాభయ్యేళ్లయింది. జార్జిరెడ్డిని గురించి ఆనాటి పరిశీలకుల్లో రెండు రకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. జార్జిరెడ్డి ఇంకొంతకాలం జీవించి ఉంటే, రాజకీయాల జోలికి – గొడవల జోలికీ వెళ్లకుండా ఉండి ఉంటే ఈ దేశానికి ఐన్‌స్టీన్‌ వంటి ఒక గొప్ప శాస్త్రవేత్త లభించి ఉండేవాడని కొందరు అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్సీ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో జార్జి గోల్డ్‌మెడలిస్ట్‌. పరిశోధక విద్యార్థి. జార్జి పరీక్ష పేపర్లు దిద్దడానికి ఉస్మానియా ప్రొఫెసర్లు తటపటాయిస్తే, వాటిని బొంబాయి యూనివర్సిటీకి పంపించారట. జార్జి సమాధానాలు చదివిన అక్కడి ప్రొఫెసర్‌ ఒక్కసారి ఈ యువ మేధావిని వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న కోరికతో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారట.

జార్జిరెడ్డి బతికి వుంటే ఇండియాకు ఇంకో చేగువేరా లభించి ఉండేవాడని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. గ్రామీణ పేద రైతు కుటుంబాల నుంచీ, బీసీ, ఎస్సీ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ స్థాయికి అప్పుడప్పుడే చేరుకుంటున్న రోజులవి. పెత్తందారీ, సంపన్న వర్గాల పిల్లల్లో కొందరు గూండా తండాలను వెంటేసుకుని యూనివర్సిటీలో అరాచకం సృష్టిస్తున్న రోజులు. గ్రామీణ విద్యార్థుల్ని ర్యాగింగ్‌ చేయడం, అవమానించడం, వారిపై దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ దశలో యూనివర్సిటీలో ప్రవేశించిన జార్జి గ్రామీణ విద్యార్థులను సంఘటితం చేసి, వారికి అండగా నిలబడ్డాడు. వారికి తిరగబడడం నేర్పించాడు. జార్జి స్వయంగా బాక్సర్‌. ధైర్యశాలి. అతని ధాటికి గూండా గ్యాంగ్‌లు హడలిపోయేవి. ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందం’ పేరుతో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జార్జి విజయబావుటా ఎగరేశాడు. ఈ దశలోనే జార్జిరెడ్డి హత్య జరిగింది. విద్యార్థిలోకంపై ఈ హత్య తీవ్రమైన ప్రభావం చూపింది. అనంతర కాలంలో జార్జిరెడ్డి స్ఫూర్తితో వందలాదిమంది విద్యార్థులు విప్లవకారులుగా తయారయ్యారు.

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవిత కథ అందరికీ తెలిసిందే. అణచివేతను, అవమానాలను స్వయంగా అనుభవించి కృషితో, సాహసంతో ఎవరెస్ట్‌ ఎత్తుకు ఎదిగిన ధీశాలి. భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించే వ్యక్తిగా ఆయన పేరును విస్మరించడానికి వీల్లేని దశకు ఆయన ఎదిగారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని దేశంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సామాజిక పరివర్తనకు దోహదపడే బాటలు వేశారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగున పడి దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతికి ఆయన రాజ్యాంగంలో చోటు కల్పించారు. భిన్న భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలతో కూడిన ఈ దేశాన్ని ఒక సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలదొక్కుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది రాజకీయ భావన మాత్రమే కాదు. సామాజిక భావన కూడా! ఆర్థిక భావన కూడా! అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల వెనుకబడిపోయిన విశాల ప్రజానీకం మిగిలిన వారితో పోటీపడగలిగే స్థాయికి చేరుకోవడానికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ముఖ్యంగా రాజ్యాంగ పీఠిక ఈ దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అద్దంపడతాయి. పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వేచ్ఛ, అవకాశాల్లోఅందరికీ సమానత్వం, వ్యక్తిగత గౌరవాన్ని జాతి సమగ్రతను సంరక్షిస్తూ అందరి నడుమ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం రాజ్యాంగ లక్ష్యాలుగా పీఠికలో సంకల్పం చెప్పుకున్నారు.

ఈ రాజ్యాంగ లక్ష్యాలను ఇప్పటికే సంపూర్ణంగా సాధించి ఉన్నట్లయితే సమాజంలో ఇంత విపరీతమైన వ్యత్యాసాలు ఉండేవి కావు. రాజ్యాంగం నిర్దేశించినట్లు అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించి ఉన్నట్లయితే జార్జిరెడ్డి వంటి యువకులు విప్లవ మార్గం వైపు మొగ్గు చూపేవారు కాదు. అంతరాలు లేని రాజ్యాన్ని సృష్టించాలని ఆ మార్గంలో వెళ్లిన వేలాదిమంది యువకులు ఆత్మబలిదానాలు చేశారే తప్ప గమ్యం మాత్రం ఇంతవరకూ కనుచూపు మేరలోకి రానేలేదు. అదే లక్ష్యసాధన కోసం అంబేడ్కర్‌ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకోసం దారిచూపే పవిత్ర గ్రంథంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. పాలకుల సహాయ నిరాకరణ వలన రాజ్యాంగ లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరకపోయినా కొంతమేరకైనా సత్ఫలితాలనిస్తున్నాయి. నెమ్మదిగానైనా సామాజిక పరివర్తన జరుగుతున్నది. నాణ్యమైన విద్యను దళిత, గిరిజన వెనుకబడిన వర్గాలకు ఉచితంగా అందజేసి ఉన్నట్లయితే పరివర్తన మరింత వేగంగా జరిగేది.

దోపిడీ – పీడనా లేని సమాజాన్ని కాంక్షించేవారెవరైనా సరే, మనిషి మనిషిగా ఆత్మగౌరవంతో బతకగలిగే వ్యవస్థను కోరుకునేవారు ఎవరైనా గానీ, పేదరికం లేని కరువు కాటకాలు లేని రోజులు రావాలని కోరుకునేవారందరూ కూడా, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య కావాలని నినదించేవారందరూ కూడా ఆ దిశలో పడుతున్న ప్రతి అడుగునూ స్వాగతించాలి. ప్రేమించాలి. అభినందించాలి. ఆ అడుగు విప్లవకారులదైనా, ప్రజాస్వామికవాదులదైనా సరే! కేంద్ర ప్రభుత్వాలదైనా, రాష్ట్ర ప్రభుత్వానిదైనా సరే! ఒక్కో ముందడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుందని మరిచిపోరాదు. అంబేడ్కర్‌ జయంతికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. 70 శాతం మంత్రిపదవులను బలహీనవర్గాలకు కేటాయించారు. ఇన్ని పదవులు ఈ సెక్షన్లకు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇది అభినందించదగిన సందర్భం కాదా? ఐదు ఉపముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకు కేటాయించారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే చర్య కాదా? దేశవ్యాప్తంగా దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్న వారిలో దళితులు, మహిళలే అత్యధికంగా ఉన్నారంటూ దశాబ్దాలుగా జాతీయ క్రైమ్‌ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి.

ఆ సవాల్‌కు జవాబుగా ఒక దళిత మహిళకే హోంశాఖను అప్పగించడాన్ని మనం స్వాగతించలేమా? ఇలా అప్పగించడం వరుసగా ఇది రెండవసారి కూడా! హోం, రెవెన్యూ, వైద్యం–ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్, పురపాలన, పరిశ్రమలు, రవాణా – ఇలా కీలకమైన శాఖలన్నింటినీ ఈ వర్గాలకే కేటాయించడాన్ని ఇదివరకెప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలోగానీ, వేరే రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ చవిచూసి ఉన్నామా? గతంలో యాదవ – కురుబ కులాలకు కలిపి జాయింట్‌గా ఒకటి, గౌడ – శెట్టిబలిజలకు కలిపి జాయింట్‌గా ఒకటి, పొలినాటి వెలమ – కొప్పుల వెలమలకు కలిపి ఒకటి చొప్పున కేటాయించే సంప్రదాయాన్ని వదిలిపెట్టి విడివిడిగా మంత్రి పదవులిచ్చారు. రాయలసీమలో జనాధిక్యం కలిగిన బోయలకూ, ఉత్తరాంధ్రలో అధికంగా వుండే తూర్పు కాపులకూ, సముద్ర తీరం వెంబడి నివసించే మత్స్యకారులకూ మంత్రి పదవులు దక్కాయి. ఎక్కువ మంత్రి పదవులను ఇవ్వడమే కాకుండా కీలక శాఖలను కట్టబెట్టడం సాధికారత సాధనలో ఒక గొప్ప ముందడుగు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంతకు ముందు స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు యాభై శాతం కుర్చీలను కట్టబెట్టింది. మొత్తం స్థానిక సంస్థల పదవుల్లో యాభై శాతాన్ని మహిళలకు రిజర్వు చేసింది. నామినేటెడ్‌ పదవుల్లో యాభై శాతం, నామినేటెడ్‌ పనుల్లో యాభై శాతం ఈ వర్గాలకు కేటాయింపును చట్టబద్ధం చేసింది. ఈ మొత్తంలో కూడా సగం మహిళలకు! ఈ చర్యలు రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణమైనవే కదా! గమ్యాన్ని మరింత దగ్గర చేసేవే కదా! విద్య – వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విప్లవాత్మకమైనవిగా ఇప్పటికే నీతి ఆయోగ్, కేంద్రం, ఇతర రాష్ట్రాలు ప్రశంసించాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షాలు గానీ, మీడియా గానీ వీటి గురించి ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. వ్యవసాయ రంగంలో చిన్న కమతాలు లాభదాయకం కాదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తల నుంచి సోషలిస్టు ఆర్థికవేత్తల వరకూ అందరూ అభిప్రాయ పడతారు. దీనికి పరిష్కారంగా కార్పొరేట్‌ వ్యవసాయాన్ని కొందరు సూచిస్తున్నారు. సమష్టి వ్యవసాయాన్ని మరికొందరు సూచిస్తున్నారు. ఇవేవీ కూడా భారతీయ వ్యవసాయ సంస్కృతికి సరిపడేవి కావు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్‌బీకే సెంటర్లు చిన్న కమతాలకు శ్రీరామరక్షగా నిలబడగలుగు తాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని కూడా స్వాగతించలేమా? రాజ్యాంగం నిర్దేశించిన గమ్యాన్ని ముద్దాడే దిశగా పడే ప్రతి అడుగునూ స్వాగతించడం, అభినందించడమే అభ్యుదయమవుతుంది. వ్యతిరేకించడం అభివృద్ధి నిరోధకమవుతుంది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు