సరికొత్త ఆశలతో...

31 Dec, 2022 00:30 IST|Sakshi

కాలం ఎవరికోసమూ ఆగదు. అది ప్రవాహ సదృశం. మరికొన్ని గంటల్లో ముగియబోతున్న 2022 తీపి, చేదు జ్ఞాపకాల కలయిక. నూతన సంవత్సరంలోకి అడుగిడేముందు వాటిని మననం చేసుకుని, అవసరమైన గుణపాఠాలు తీసుకుంటేనే మెరుగైన రేపటిని పొందగలం. బ్రిటిష్‌ నటుడు ఐరన్స్‌ చెప్పినట్టు గడిచే సంవత్సరాలు కాలనాళికల్లాంటివి. వాటిలో కొన్ని మనల్ని వెనక్కి తీసు కెళ్తాయి. అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తాయి కూడా. కొన్ని మనల్ని ముందుకు నడిపిస్తాయి.

మనలోని నిరాశానిస్పృహలను పటాపంచలు చేస్తాయి. భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తాయి. అవి స్వప్నాలు. గడిచిపోయిన కాలంలో వేటిని స్వీకరించి సొంతం చేసుకోవాలో, వేటిని తిరస్కరించి ముందుకు నడవాలో మనమే నిర్ణయించుకోవాలి. ‘కలతలే తరగలై లేస్తుంటే/కక్షలే గాలులై వీస్తుంటే... ధరియించి పెదవిపై దరహాసం/భరియించి యెడదలో పరితాపం/విరచింతు నీనాటి నవగీతం...’ అంటూ మహాకవి శ్రీశ్రీ అయిదు దశాబ్దాలనాడు ఓ ఉగాదికి స్వాగతం పలుకుతూ అన్నాడు. నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ సందర్భంలో ఆ కవితాపంక్తులు శిరోధార్యాలు. 

కరోనా మహమ్మారి కాటేసిన అనంతరం అంతర్జాతీయ స్థితిగతులు ఒక అస్పష్ట చిత్రాన్ని ఆవిష్కరించాయి. సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు వణికాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా అయోమయంలో కూరుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఎడతెగని దూకుడుతో ఆర్థికంగా అమెరికాను అధిగమించగలదనుకున్న చైనా కరోనా వైరస్‌ నోటచిక్కి విలవిల్లాడుతోంది.

తనకు తోచిందే అమలు చేస్తూ జనావళి బాధలు పట్టించుకోని ఆ ఏకస్వామ్య వ్యవస్థలో సైతం ముసలం పుట్టడం ఈ ఏడాది చోటుచేసుకున్న విచిత్రం. ‘జీరో కోవిడ్‌’ విధానంతో జనాన్ని ఆంక్షల చట్రంలో బిగించటానికి ప్రయత్నించిన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చివరకు చైనా పౌరుల ఒత్తిళ్లకు దిగిరాక తప్పలేదు. లాక్‌డౌన్‌లకు స్వస్తి పలకవలసి వచ్చింది. 

అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ తలెత్తగల ప్రాంతాలుగా అందరూ అంచనావేసిన వాటికి భిన్నంగా ఉక్రెయిన్‌లో మంట రాజుకుంది. రష్యా దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా తలెత్తిన ఆ ఘర్షణ నుంచి గౌరవప్రదంగా ఎలా బయటపడాలో తెలియక రష్యా అధినేత పుతిన్‌ తలపట్టుకున్నారు. ఆయనగారు ఇప్పుడిప్పుడు శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు. లొంగుబాటుకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్‌ వెనక అమెరికా సమకూర్చిపెడుతున్న ఆయుధ సామగ్రి, యుద్ధ విమానాలు ఉన్నాయన్నది వాస్తవం. సోవియెట్‌ పతనానంతరం అమెరికా సృష్టించుకున్న ఏకధ్రువ ప్రపంచ భావనపై ఆఖరి సమ్మెట పోటు వేయాలన్నది పుతిన్‌ ఎత్తుగడైతే... మరొక్కసారి రష్యాను పాదా క్రాంతం చేసుకుంటే తన సర్వంసహాధికారానికి తిరుగుండదని అమెరికా ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఏ యుద్ధంలోనైనా ఆయుధాలు నిర్ణాయక శక్తులు కాదు. అంతిమంగా మానవ సంకల్ప బలమే విజేత. దురాక్రమణపై మొక్కవోక పోరాడుతున్న ఉక్రెయిన్‌ ప్రజానీకం దాన్ని మరోసారి నిరూ పించాల్సి వుంది. శాశ్వత పరాజితులు, శాశ్వత విజేతలు ఉండబోరని మొన్నీమధ్య ఖతార్‌లో ముగిసిన ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ పోటీలు చాటాయి. ఈ పోటీల్లో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీ నాను అంతక్రితం సౌదీ వంటి దేశం ఓడించిందంటే నమ్మబుద్ధి కాదు. మొరాకో క్వార్టర్‌ ఫైనల్‌కి రావటం, చివరాఖరి వరకూ విజేతగానే కనబడిన ఫ్రాన్స్‌ చతికిలబడటం ఆశ్చర్యకరమైనవే. 

అందరూ సమస్యలెదుర్కొంటున్న ఈ కరోనా అనంతర ప్రపంచంలో ఎంతోకొంత మెరుగ్గా ఉన్నది మన దేశమే. సహజంగానే ఈ పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీని తిరుగులేని నేతగా నిలబెట్టింది. అయితే పేదరికం బారినపడి అవస్థలు ఎదుర్కొంటున్న కుటుంబాలు కోకొల్లలు. ఈ దుఃస్థితి పిల్లలను చదువులకు దూరం చేసింది. సెకండరీ విద్యలో నిరుడు డ్రాపౌట్లు దాదాపు 15 శాతమని ఒక నివేదిక చెబుతోంది. కొత్త సంవత్సరంలో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు, ఈశాన్యంలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతు న్నాయి.

జమ్మూ, కశ్మీర్‌లోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రెండు పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో జనామోదం లభించకున్నా ఫిరాయింపులను ప్రోత్సహించటంద్వారా బీజేపీ అధికార పీఠాలను ఆక్రమించగలిగింది. మేఘాలయలో అధిక స్థానాలు గెలుచుకున్నా బీజేపీ ఎన్నికల అనంతర పొత్తుతో కాంగ్రెస్‌ చిత్తయింది. త్రిపురలో 2018లో అధిక సీట్లు బీజేపీయే గెల్చుకున్నా వామపక్షాలకూ, ఆ పార్టీకీ మధ్య వ్యత్యాసం 1.37 శాతం మాత్రమే. ఈ రాష్ట్రాల్లో ఎన్ని ఈసారి బీజేపీ ఖాతాలో పడతాయో చూడాలి. 

మౌలికంగా యువజనం అధికంగా ఉన్న దేశం మనది. జనాభాలో సగంకన్నా ఎక్కువగా, అంటే 52 శాతంమంది వయసు ముప్ఫైలోపే. అదీగాక ఈ కొత్త సంవత్సరంలో జనాభారీత్యా మనం చైనాను అధిగమించబోతున్నాం. కనుక ఉడుకునెత్తురులో అసంతృప్తి రాజుకోకుండా చూడటం, మెరుగైన విధానాలతో నిరుద్యోగ సమస్యను అధిగమించటం పాలకులకు సవాల్‌.

ఉచిత పథకాలు అరిష్టమన్న కేంద్ర పాలకులు వచ్చే ఏడాదంతా ప్రజాపంపిణీ ద్వారా ఆహారధాన్యాలను ఉచితంగా అందిస్తామని ఈమధ్యే ప్రకటించారు. ఆకలి సూచీల దండోరా తప్పని చెప్పినవారే ఈ ప్రకటన చేయటం మంచి పరిణామం. గతం నేర్పిన గుణపాఠాలను గ్రహిస్తేనే భవిష్యత్తు సవాళ్లను సునాయాసంగా ఎదుర్కొనగలం. కొత్త సంవత్సరంలో నిరంతర అప్రమత్తతతో మెలగగలం. 

మరిన్ని వార్తలు