అసంతృప్తి జాడలు

29 Jan, 2022 00:37 IST|Sakshi

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పకడ్బందీ విధాన రూపకల్పన కొరవడితే పర్యవసానాలెలా ఉంటాయో నాలుగు రోజులుగా ఆగ్రహంతో రగులుతున్న ఉత్తరప్రదేశ్, బిహార్‌ యువత నిరూపిస్తున్నారు. త్వరలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలి. యువ జనాభా అధికంగా ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లోనూ చోటుచేసుకుంటున్న ఘటనలను విపక్షాల కుట్రగా కొట్టిపారేయడం లేదా యాదృచ్ఛికంగా తలెత్తిన సమస్యగా భావించడం సులభం.

కానీ నిరుద్యోగ భారతంలో అంతర్లీనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని ఆ ఉదంతాలు వెల్లడిస్తున్నాయని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆగ్రహోదగ్రులైన యువత బిహార్‌లోని గయలో ఒక ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టగా... ఆ రాష్ట్రంలోని సమస్తీ పూర్, బక్సార్, భోజ్‌పూర్, ముజఫర్‌పూర్, పట్నా తదితర నగరాల్లో వేలాదిమంది యువకులు ధర్నా చేశారు. రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ తదితరచోట్ల రైలు పట్టాలపై ధర్నాలు జరిగాయి. రిపబ్లిక్‌ డే రోజున అక్కడి ప్రయాగ్‌రాజ్‌లో యువకులున్న హాస్టళ్లపై పోలీసులు దాడికి దిగారు. 

ఉద్యమ మూలాలు గమనిస్తే యువత ఆగ్రహానికి కారణం అర్థమవుతుంది.  రైల్వే శాఖలో సాంకేతికేతర విభాగాల సిబ్బంది నియామకాల కోసం ఎప్పుడో 2019 మార్చిలో 35,281 పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ప్రవేశ పరీక్షకు కోటి 25 లక్షలమంది దరఖాస్తు చేసు కున్నారు. కరోనా విజృంభణతో చాలా ఆలస్యంగా సంబంధిత పరీక్షను ఆన్‌లైన్‌లో నిరుడు నిర్వ హించారు. ఈ నెల 14న విడుదల చేసిన ఫలితాల్లో ఏడు లక్షలమంది అర్హులుగా తేలారు. అంటే ఒక్కో పోస్టుకు  20 మంది పోటీ పడాలి. కానీ తొలుత నోటిఫికేషన్‌లో చెప్పినదానికి భిన్నంగా వచ్చే నెల 14, 18 తేదీల్లో మరో అర్హత పరీక్ష నిర్వహించబోతున్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఆ పరీక్షలో ఒక్కో పోస్టుకు 8 మందిని ఎంపిక చేసి వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు.

ఇదే అభ్యర్థులకు ఆగ్రహం కలిగించింది. నోటిఫికేషన్‌లో కేవలం ఒక్క అర్హత పరీక్ష ఉంటుందని ప్రక టించి, ఇప్పుడు దాన్నెలా మారుస్తారని యువత నిలదీసింది. దానికితోడు పరీక్షల్లో గోల్‌మాల్‌ జరిగిందన్న వదంతులు వ్యాపించాయి. వారి అభ్యంతరాలు మీడియాలో ప్రముఖంగా రాకపోయి ఉండొచ్చుగానీ... పక్షం రోజులుగా ట్విటర్, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాల్లో అవి హోరెత్తు తున్నాయి.

అర్హులుగా తేలినవారికి తక్షణం ఇంటర్వ్యూలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పోస్టులకు టెన్త్, ఇంటర్‌ అర్హతలుగా ప్రకటించి, పట్టభద్రులకు ఎందుకు చోటిచ్చారని ప్రశ్నిం చారు. రెండేళ్లపాటు నిద్రాహారాలు మాని చదువుకున్నామని, కోచింగ్‌ కేంద్రాల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టామని మొరపెట్టుకున్నారు. కానీ నిలువెల్లా కళ్లున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. కనీసం రైల్వే మంత్రిత్వ శాఖలోని బాధ్యులైనా ఈ సమస్యపై దృష్టి పెట్టలేక పోయారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు రెండో పరీక్షను ఇప్పుడు తాత్కాలికంగా నిలిపే శారు. అభ్యంతరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటైంది.  

దేశంలో వాస్తవ పరిస్థితులేమిటో ప్రభుత్వ పత్రాల్లో కనబడకపోవచ్చు... అంతా సవ్యంగానే ఉన్నదని అధికారపక్షం పదే పదే చెబుతూ ఉండొచ్చు. కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలు వేరుగా ఉన్నాయని భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగిత రేటు డిసెంబర్‌ 2016లో 43 శాతం ఉంటే 2021 డిసెంబర్‌ నాటికి అది 37 శాతానికి పడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో అది 32.8 శాతం మించి లేదు. పైగా అనేకులు క్రమబద్ధంగా జీతా లొచ్చే ఉద్యోగాలు కోల్పోయి, రోజు కూలీలుగా మారారు. ప్రభుత్వ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి.

రిటైరవుతున్నవారి సంఖ్యకు అనుగుణంగా నియామకాలు ఉండటం లేదు. ఇప్పటికీ ఉద్యో గాలివ్వడంలో అగ్రభాగంలో ఉన్న రైల్వే శాఖలో పదేళ్లక్రితంతో పోలిస్తే సుమారు అయిదు లక్షల ఉద్యోగాలు మాయమయ్యాయి. దానికితోడు పబ్లిక్‌ రంగ సంస్థలు క్రమేపీ ప్రైవేటు పరమవుతున్నాయి. అక్కడా ఉద్యోగావకాశాలు పెద్దగా ఉండటం లేదు. ఉన్నా ప్రభుత్వో ద్యోగంతో పోలిస్తే అక్కడ ఉద్యోగ భద్రత తక్కువ. ఇది చాలదన్నట్టు లేబర్‌ కోడ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిరుడు తీసుకొచ్చిన 3 చట్టాలు అమల్లోకొస్తే ఆ భద్రత మరింత దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో ప్రభుత్వోద్యోగం సంపాదించాలన్న ఆత్రుత పెరగడంలో ఆశ్చర్యం లేదు. అది వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నదన్న అభిప్రాయం కలిగితే ఇక చెప్పేదేముంది?

కోర్కెల సాధన కోసం హింసామార్గం అవలంబించడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు. కానీ ఇందుకు దారితీసిన కారణాలేమిటో పాలకులు సానుభూతితో అర్థం చేసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రభుత్వ గణాంకాలు ఏం ఊదరగొడుతున్నా, తయారీ రంగ పరిశ్రమలు ఊపందు కోనిదే ఉద్యోగావకాశాలు పెరగవు. రోజు కూలీలుగా బతుకీడుస్తున్న యువతకు భద్రత కలిగిన, గౌరవప్రదమైన ఉపాధి దొరకనిదే వారిలోని అసంతృప్తీ, ఆగ్రహమూ చల్లారవు. కనుక ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను పదునెక్కించాలి. వచ్చే బడ్జెట్‌లో నికరమైన పథకాలకు చోటీయాలి. ప్రసంగాలతో పొద్దుపుచ్చి, ఎన్నికల్లో ఇతరేతర భావోద్వేగాలను రెచ్చగొడితే నాలుగు ఓట్లు రాలవచ్చేమోగానీ... సమస్యలు మాయం కావని గ్రహించాలి.

మరిన్ని వార్తలు