మెరుగైన సైబర్‌ ప్రపంచ దిశగా!

30 Apr, 2022 00:40 IST|Sakshi

మూడు దశాబ్దాలక్రితం సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకొచ్చి, ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతలతో అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్‌ వర్తమాన ప్రపంచంలో శక్తిమంతమైన సాధనం. పౌరహక్కులతో, భావప్రకటనా స్వేచ్ఛతో ముడిపడి ఉన్న ఆ సాధనం భౌగోళిక సరిహద్దులను చెరిపి, సమస్త ప్రపంచాన్నీ ఒక్కటి చేసింది. ఏ రకమైన అంతరాలకూ తావీయని విశ్వ వేదికగా రూపుదిద్దుకుంది. అయితే ఆ వేదికను ఆంక్షల చట్రంలో బంధించాలని చూసే ప్రభుత్వాలూ, ఫక్తు వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే సంస్థలూ అదును కోసం నిరంతరం కాచుక్కూ  ర్చుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్‌ ఖండ దేశాలతోపాటు ఆస్ట్రేలియా, న్యూజి లాండ్, జపాన్‌ తదితర దేశాలు గురువారం ఇంటర్నెట్‌పై ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దాదాపు 60 దేశాలున్న ఆ బృందంలో మన భాగస్వామ్యం లేకపోవడం కొంత బాధాకరమే. ఇంటర్నెట్‌ను ఆపిన ఘటనలు అంతక్రితంతో పోలిస్తే మన దేశంలో నిరుడు తక్కువే అయినా వరసగా నాలుగేళ్ల డేటా గమనిస్తే ప్రపంచంలో ఇప్పటికీ ఇతరులకన్నా ఎక్కువసార్లు దాన్ని నిలుపుదల చేసిన ఘనత మనదే. పెత్తందారీ వ్యవస్థలున్న చైనా, రష్యా, కొన్ని అరబ్‌ దేశాల గురించి చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్‌లో వచ్చిపడే సమాచారాన్ని జల్లెడపట్టి, తమకు చేటు తెస్తాయన్న వాటిని ఏరిపారేయడం అక్కడ నిత్యకృత్యం. ఇక ‘అత్యంత ప్రజాస్వామిక దేశం’గా ముద్ర ఉన్న అమెరికా తన చీకటిమాటు వ్యవహారాలను బట్టబయలు చేసిన వికీలీక్స్‌ అధినేత జూలియన్‌ అసాంజ్‌ను ఈనాటికీ ఎట్లా వెంటాడుతున్నదో తెలుస్తూనే ఉంది. అందుకే ఇప్పుడు వెలువడిన డిక్లరేషన్‌పై పెదవి విరిచేవారున్నారు. కానీ ఏదీ ఒకేసారి మారదు. నిలదీయడం, ఒత్తిళ్లు తీసుకు రావడం ఆలస్యంగానైనా మంచి ఫలితాలకు దారితీస్తాయి.  

ఇంటర్నెట్‌ మాధ్యమం పులుగడిగిన ముత్యమనీ, అక్కడంతా సవ్యంగా ఉన్నదనీ చెప్పలేం. ఆ వేదికగా ఊరేగుతున్న సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలుంటాయి. జుగుప్సాకరమైన అశ్లీలత, విరుచుకుపడే విద్వేషం, బాధ్యతారహిత పోకడలు అక్కడ రివాజు. కొత్తగా సైబర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఉత్సాహపడేవారికి మారీచులనుంచీ, దుశ్శాసనులనుంచీ, కీచకులనుంచీ సమస్యలు పొంచివుంటాయి. కనుక ప్రజల భద్రతకూ, సామాజిక ప్రశాంతతకూ అవసరమైన నిబంధనలు విధించడం, నయవంచకుల పనిబట్టడం ఎంతో ముఖ్యం. సామాజిక మాధ్యమాలకు జవాబుదారీతనం ఉండేలా, తప్పుడు రాతలపైనా, దృశ్యాలపైనా, మాయగాళ్లపైనా ఎప్పటికప్పుడు నిఘా వేసి ఏరిపారేసేందుకు అవసరమైన యంత్రాంగాలను అవి ఏర్పాటు చేసుకొనేలా ఒత్తిళ్లు తీసుకురావాలి. ఫిర్యాదులొచ్చిన మరుక్షణమే రంగంలోకి దిగి నేరగాళ్లను పట్టుకునేలా రక్షకభట వ్యవస్థను తీర్చిదిద్దాలి. చిత్రమేమంటే చాలా దేశాల్లోని ప్రభుత్వాలకు ఇలాంటి విపరీత పోకడల గురించి పెద్దగా చింత ఉన్నట్టు కనబడదు. తమ అప్రజాస్వామిక ధోర ణులను ప్రశ్నించే, తమ పాలనలోని నిర్వాకాలను బట్టబయలు చేస్తున్నవారిపైనే వాటి దృష్టి పడుతుంది. మన దేశం వరకూ తీసుకుంటే ఇప్పటికీ సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కుకుని బిట్‌ కాయిన్ల పేరుతో, అనేక రకాల స్కీముల పేరుతో అనేకమంది నిత్యం కోట్లాది రూపాయలు కోల్పోతున్నారు. యువతులూ, చిన్న పిల్లలూ ప్రమాదకర పరిస్థితుల్లో పడుతున్నారు.

సైబర్‌ ప్రపంచంలో భావప్రకటనా స్వేచ్ఛకూ, వ్యక్తి స్వాతంత్య్రానికీ అనువైన వాతావరణాన్ని సృష్టించి, ప్రజాస్వామిక వ్యవస్థల పటిష్టతకు తోడ్పడే విధంగా దాన్ని తీర్చిదిద్దితే... పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగనీయని విధంగా దానికి మెరుగులు పెడితే అన్ని వర్గాలవారూ ఎదగడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా మెలగక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచ దేశాలు ఇంటర్నెట్‌ను గుప్పెట్లో పెట్టుకోవాలని ఎలా ప్రయత్నిస్తున్నాయో, నిరసననూ, అసమ్మతినీ ఎలా అణచివేస్తున్నాయో సైబర్‌ ప్రపంచంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు బయటపెడుతున్నాయి. ఇప్పుడు వెలువడిన డిక్లరేషన్‌ స్వాగతించదగిన పరిణామమే అయినా అలాంటి సంస్థల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుని ఉంటే మరింత బాగుండేది. దాదాపు 80 ఏళ్లక్రితం రెండో ప్రపంచ యుద్ధ సందర్భంలో  నిఘా సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి ఏర్పాటైన ‘ఫైవ్‌ అయిస్‌’(అయిదు నిఘా నేత్రాలు) కూటమి ఇప్పటికీ సజావుగా తన కార్యకలాపాలు సాగిస్తోంది. 2001లో అమెరికా ‘ఉగ్రవాదంపై యుద్ధం’ ప్రకటించాక డిజిటల్‌ నిఘాలో అది కొత్త కొత్త పోకడలు పోతోంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాలు భాగస్వాములుగా ఉన్న ఆ కూటమిలోనివారే ఈ డిక్లరేషన్‌లో భాగస్వాములైన తీరు ప్రశ్నలు రేకెత్తించడంలో వింతేమీ లేదు. అన్నిటిపైనా చర్చలు జరగాల్సిందే. పౌరుల డేటాను దొంగిలించడం, తమ కంట్లో నలుసుగా తయారైనవారిపై పెగాసస్‌ వంటి ఉపకరణాలద్వారా కుట్రలకు దిగి ఖైదు చేయడంవంటి ధోరణులకు అడ్డుకట్ట పడాల్సిందే. ఇంటర్నెట్‌ స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం ఇప్పుడు ప్రారంభమైన ప్రయత్నం మున్ముందు అన్నిచోట్లా ప్రజాస్వామిక భావాల పటిష్టతకు దోహదపడితే... ప్రభుత్వాలు తమ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి తోడ్పడితే... ఒకింత మెరుగైన, సురక్షితమైన ప్రపంచానికి అది బాటలు పరిస్తే అంతకన్నా ఆహ్వానించదగ్గది ఏముంటుంది? 

మరిన్ని వార్తలు