సర్వేల ముక్తకంఠం

1 May, 2021 00:04 IST|Sakshi

ఆఖరి దశ పోలింగ్‌ పూర్తయ్యాక యధావిధిగా వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు గురువారం వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిదో దశ పోలింగ్‌తో అక్కడి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ముగియ డంతో చానెళ్లన్నీ సర్వే ఫలితాలను హోరెత్తించాయి. కరోనా మహమ్మారి దేశమంతా స్వైరవిహారం చేస్తూ, పౌరుల ప్రాణాలు తోడేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మునుపటిలా వీటిపై జనంలో ఉత్కంఠ వుంటుందా అన్నది ప్రశ్నార్థకమే. అయినా మీడియా తన పని తాను చేసుకుపోయింది. ఎప్పటిలాగే సర్వేలు చేయడంలో నైపుణ్యం వున్న సంస్థలను రంగంలోకి దించి జనం నాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొదటినుంచీ అందరూ అనుకుంటున్నదే దాదాపుగా ఈ సర్వేలు కూడా చెప్పాయి. పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరుంటుందని, తమిళనాట డీఎంకే, అస్సాంలో బీజేపీ, కేరళలో వరసగా రెండోసారి వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్‌డీఎఫ్‌) విజయం సాధించవచ్చని జోస్యం చెప్పాయి. పుదుచ్చేరిలో తొలిసారి ఎన్‌డీఏకు అధికారం దక్కబోతున్నదని అంచనా వేశాయి. అంకెల్లోనే కాస్త వ్యత్యాసాలున్నాయి. బెంగాల్‌ విషయంలో ఒక్క రిపబ్లిక్‌ టీవీ–సీఎన్‌ఎక్స్‌ సర్వే మాత్రమే బీజేపీకి అధిక స్థానాలిచ్చింది. ఎన్నికల ప్రచారం ప్రారంభదశలో బెంగాల్‌ను అందరూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖాతాలోనే వేసినా, ఆ తర్వాత సంశయంలో పడ్డారు. అది బీజేపీ సృష్టించిన ప్రచారహోరు పర్యవసానమా లేక తృణమూల్‌ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో వచ్చినట్టు కనబడుతున్న మార్పా అన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే చివరి రెండు దశల పోలింగ్‌నాటికి దేశం నలుమూలలా కరోనా పర్యవసానంగా నెలకొన్న విషాదకర పరిస్థితులు బెంగాల్‌ను ఏమేరకు ప్రభావితం చేసివుంటాయన్నది వేచిచూడాలి. 


నెలన్నరపాటు దఫదఫాలుగా జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలపై జనంలో గతంతో పోలిస్తే ఆసక్తి తగ్గింది. బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ను గద్దె దించాలన్న కృతనిశ్చయంతో వున్న బీజేపీ అందుకు తగినట్టు భారీ స్థాయిలో ప్రచార యుద్ధం సాగించింది. ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వంటి హేమాహేమీలు సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అన్నిచోట్లా భారీయెత్తున జనం హాజరయ్యారు. కరోనా వైరస్‌ విజృంభణను పట్టించుకోకుండా, దాన్ని నియంత్రించడానికి అవసరమైన వ్యూహాలు రూపొందించకుండా బెంగాల్‌పైనే మోదీ దృష్టి సారించారన్న విమర్శలు కూడా వచ్చాయి. మమత సైతం బీజేపీకి దీటుగా ముందుకురికారు. ఇంత సుదీర్ఘమైన పోలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అనేకులు తప్పుబట్టారు. చివరి మూడు దశలనూ ఒకే దశగా మార్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ వచ్చినా సంఘం పెద్దగా స్పందించలేదు. తమిళనాడులో నేతలు పాల్గొన్న సభల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడంవంటివి లేకున్నా అది పట్టించుకోలేదని, ఫలితంగా కరోనా కేసులు పెరిగాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మాత్రం సంఘం నొచ్చుకుంది. ఈసీ అధికారులపై హత్య కేసు ఎందుకు పెట్టరాదంటూ న్యాయమూర్తులు కటువుగా వ్యాఖ్యానించారు. ఇందుకు ఎన్నికల సంఘం బాధపడటంలో అనౌచిత్యమేమీ లేదు. కానీ  పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వగైరాల్లో నాయ కులు తన లక్ష్మణ రేఖను దాటుతున్నప్పుడు కూడా అదిలాగే స్పందిస్తే... పార్టీలతో నిమిత్తం లేకుండా, నేతలు అధిరోహించిన పదవులతో సంబంధం లేకుండా తగిన చర్యలకు ఉపక్రమిస్తే మరింత బాగుండేది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక బహిరంగసభను కరోనా విజృంభణ కారణంగా రద్దు చేసుకున్నప్పుడే ఈసీ కూడా ఆ దిశగా ఆలో చించి ప్రచారపర్వాన్ని ఇక కట్టిపెట్టాలని పార్టీలకు ఆదేశాలివ్వాల్సింది.


ఎగ్జిట్‌ పోల్స్‌ శాస్త్రీయతపై ఆదినుంచీ సంశయాలున్నాయి. మన దేశంలో మాత్రమే కాదు... విదేశాల్లోనూ అదే పరిస్థితి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ నెగ్గుతారని ఏ సర్వే కూడా చెప్పలేకపోయింది. దాదాపు అందరూ హిల్లరీ క్లింటన్‌వైపే మొగ్గారు. తీరా బ్యాలెట్‌ బాక్సులు తెరిచేసరికి ట్రంప్‌ ప్రత్యక్షమయ్యారు. మన దేశంలో 2004లో యూపీఏ నెగ్గుతుందనిగానీ, 2009లో అది వరసగా రెండోసారి కూడా విజయం సాధిస్తుందనిగానీ మెజారిటీ సర్వేలు చెప్పలేకపోయాయి. జనం నాడి తెలుసుకోవడం అంత సులభం కాదు. ప్రజలెప్పుడూ కూడబలుక్కున్నట్టు ఒకే మాదిరి ఓటేస్తారు. కానీ వ్యక్తులుగా ఎవరికి వారు విజేతల గురించి అయోమయంలో వుంటారు. ఫలితాలు వెలువడినప్పుడు ఆశ్చర్యపోతారు. పోలింగ్‌ రోజున సర్వే చేసేవారిని ముప్పుతిప్పలు పెడతారు. ఓటేసింది ఒకరికైతే మరొకరి పేరు చెబుతారు. వారిని మాటల్లోపెట్టి ఎటువైపు మొగ్గుందో తెలుసు కోవడం అంత సులభమేమీ కాదు. ఎన్నో అనుభవాలు నేర్పిన గుణపాఠాలతో తగిన ప్రమాణాలు రూపొందించుకుని, జనం నాడి పట్టేందుకు నిజాయితీగా ప్రయత్నించే సంస్థలు కూడా లేకపోలేదు. వాస్తవ ఫలితాలు వెలువడినప్పుడు తమకు విశ్వసనీయత ఏర్పడాలని ఆశించే ఇలాంటి సంస్థలు న్నట్టే... చవకబారు రాజకీయ ప్రయోజనాలు ఆశించో, బెట్టింగులద్వారా కోట్లు గడించాలన్న వెంప ర్లాటతోనో దొంగ జోస్యాలు చెప్పేవారూ తయారయ్యారు. తినబోతూ రుచెందుకన్నట్టు ఆదివారం ఎటూ వాస్తవ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రతిష్టను పెంచుతాయా, తగ్గిస్తాయా అన్నది తేలాల్సివుంది. 

మరిన్ని వార్తలు