5G Network: 5జీ పై భయాందోళనలు 

3 Jun, 2021 01:09 IST|Sakshi

ప్రపంచ ప్రజానీకాన్ని అనుసంధానించటంలో... భారీ పరిమాణంలో వుండే డేటాను సైతం రెప్పపాటున బదిలీ చేయటంలో వినూత్న పోకడలు పోతుందంటున్న అయిదో తరం వైర్‌లెస్‌ సాంకేతికత(5జీ టెక్నాలజీ) అతి త్వరలో దేశంలో అడుగుపెట్టబోతోంది. దాని పనితీరును నిపు ణులు ఇప్పటికే ప్రాథమికంగా పరీక్షించారు. నెట్‌వర్క్‌ సంస్థలు, మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలు సంసిద్ధంగా వున్నాయి. మన దేశంలో ఈ ఏడాది ఆఖరుకల్లా అది విస్తరించటం మొదలవుతుంది. వచ్చే ఏడాదంతా 5జీ కోలాహలమే వినిపించబోతోంది.  ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ అందరిలోనూ చర్చనీయాంశమవుతోంది. పౌరుల ఆరోగ్యంపై ఆ సాంకేతికత తీవ్ర ప్రభావం చూపే అవకాశము న్నదని, పర్యావరణానికి సైతం అది హానికరం కాగలదని ఆమె వాదన. అలాగని అత్యాధునిక సాంకేతికత అమలును తాను వ్యతిరేకించటం లేదంటున్నారు. పర్యవసానాలపై అధ్యయనం చేయ కుండా ప్రవేశపెట్టడంపైనే తనకు అభ్యంతరమని వివరిస్తున్నారు. 5జీ కోసం సెల్‌ టవర్లలో, ఫోన్లలో వాడే సాంకేతికత, వాటినుంచి వెలువడే రేడియేషన్‌ మనుషులకూ, పశుపక్ష్యాదులకూ తీవ్ర హాని కలిగించగలదని నమ్మడానికి తగిన కారణాలున్నాయని ఆమె చెబుతున్నారు. 

కొత్త సాంకేతికతతో పాటే సంశయాలూ వ్యాపిస్తాయి. విద్యుత్‌ దీపాలు వచ్చినప్పుడు ప్రాణాలకు ముప్పు కలుగుతుందన్న భయంతో అనేక గ్రామాలు చాన్నాళ్లు వాటికి దూరంగా వుండి పోయాయని చరిత్ర చెబుతోంది. మన దేశంలో మాత్రమే కాదు...ప్రపంచమంతటా ఈ ధోరణి కన బడుతుంది. బ్రిటన్, అమెరికా, స్విట్జర్లాండ్‌ వంటిచోట్ల ఏడెనిమిదేళ్లుగా అనేకులు 5జీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మనుషులకు మాత్రమే కాక, మొత్తంగా జీవరాశులకు ముప్పు తెస్తుందని వాదిస్తున్నారు. ఇలా అంటున్నవారిలో శాస్త్రవేత్తలు సైతం వుండటం సాధారణ పౌరుల్లోని భయాం దోళనలను మరింత పెంచుతున్నాయి. జుహీ చావ్లా లేవనెత్తిన అభ్యంతరాలు రాగలకాలంలో మన దేశంలో మరింత గట్టిగా వినబడతాయి. వీటిని ఒక్క మాటతో కొట్టి పారేయడం తేలిక.

విశ్వసనీయత కలిగిన శాస్త్రవేత్తలు సవివరమైన పరిశోధనలు నిర్వహించి 5జీపై వుండే సంశయాలకు జవాబి వ్వగలగాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా వుండే అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధనా సంస్థ(ఐఏఆర్‌సీ) కొంతకాలంక్రితం 5జీలో వినియోగించే రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్‌ఎఫ్‌) మనుషుల్లో కేన్సర్‌ కారకం కాగలదని...ముఖ్యంగా కొన్ని రకాల మెదడు కేన్సర్లను ఇది మరింత ప్రేరేపించే అవకాశం వున్నదని సందేహం వ్యక్తం చేసింది. అలా అంటూనే దీనిపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం వున్నదని అభిప్రాయపడింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ తర్వాత విడుదల చేసిన నివేదికలో ‘ప్రతి ఆరోగ్యపరమైన సమస్యనూ వైర్‌లెస్‌ సాంకేతికతతో ముడిపెట్టడం సరికాద’ని భావించింది. ప్రస్తుతం ఆ సంస్థలోని శాస్త్రవేత్తలు 5జీ సాంకేతికతను జల్లెడ పడుతు న్నారు. ఆ నివేదిక వచ్చే ఏడాదికి గానీ విడుదలయ్యే అవకాశం లేదు. 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొబైల్‌ ఫోన్‌ల సమస్యలపై కూడా ఆరా తీసింది. చివరకు వాటివల్ల మెదడు కేన్సర్‌లు వస్తాయనడానికి ఆధారాల్లేవని తేల్చింది. ప్రస్తుతం టచ్‌ స్క్రీన్‌ సౌకర్యం వుండే స్మార్ట్‌ ఫోన్‌లతో పోలిస్తే అప్పుడు వినియోగించిన ఫోన్‌లు సురక్షితమైనవి. పైగా పాత ఫోన్‌లు కేవలం మాట్లాడు కోవటానికి, ఎస్సెమ్మెస్‌ సందేశాలు పంపుకోవడానికి మినహా మరెందుకూ ఉపయోగపడేవి కాదు. స్మార్ట్‌ ఫోన్‌లు అలా కాదు...భూగోళాన్ని మన చేతుల్లో పెడుతున్నాయి.

విషాదమేమంటే వీటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకూ పరిశోధించిన దాఖలా లేదు. అందుకే నాలుగేళ్లక్రితం 39 దేశా ల్లోని 190మంది శాస్త్రవేత్తలు స్మార్ట్‌ ఫోన్‌లతో వచ్చే ప్రమాదాలను ఏకరువుపెడుతూ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. అయితే అశాస్త్రీయమైన నమ్మకాల ఆధారంగా కొందరు అనవసర భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారని 2019లో మరికొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. ఆసుపత్రుల్లో ఇప్పుడు విస్తృతంగా ఉపయోగిస్తున్న సీటీ–స్కాన్, ఎక్స్‌రే యంత్రాలతోనూ సమస్యలున్నాయి. అవి భారీగా రేడియేషన్‌ను కలగజేస్తాయన్న ఉద్దేశంతోనే బాధ్యతాయుతమైన వైద్యులు ఎంతో అత్యవసరమనుకుంటే తప్ప రోగులకు సీటీ–స్కానింగ్‌ సూచించరు. 

రేడియో ఫ్రీక్వెన్సీని వినియోగించడం మొదలై శతాబ్దం కావస్తోంది. అయితే 5జీలోని రేడియో ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఎక్కువ. సుదూర ప్రాంతాలకు సైతం అది సరిగా అందాలంటే సెల్‌ టవర్లు ముమ్మరంగా వినియోగించాలి. కనుక జనాభాలో అత్యధికులు దీని ప్రభావానికి లోనుగాక తప్పదు. ఇప్పుడున్న సాంకేతికతల ఆధారంగా 5జీని కొలవడం సరికాదన్నదే నిపుణుల భావన. అందుకే దీని సంగతి త్వరగా తేల్చాలని ఈమధ్యే 44 దేశాలనుంచి 253మంది శాస్త్రవేత్తలు ఐఏఆర్‌సీకి లేఖ రాశారు. మనుషుల్లోని నాడీమండల వ్యవస్థ, రక్తంలో కొన్ని రకాల రసాలను స్రవించే వినాళగ్రంధి వ్యవస్థ దెబ్బతింటాయన్నది వీరి ఆందోళన. బ్రిటన్‌ శాస్త్రవేత్తలైతే ప్రస్తుతానికి 5జీ అమలు వాయిదా వేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. కనుక జుహీ చావ్లా భయాందోళనలను తేలిగ్గా తీసుకోలేం. దేశంలో వున్న సమస్యలు చాలలేదన్నట్టు ఇంకా పరిపూర్ణమైన సమాచారం లేని ఈ సాంకేతికతను పులుముకోవటం విజ్ఞత కాదేమో ఆలోచించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వచ్చే వరకూ వేచిచూడటమే అన్నివిధాలా శ్రేయస్కరం. 

మరిన్ని వార్తలు