‘ఆధార’పడదగ్గదేనా..?!

2 Jun, 2022 02:16 IST|Sakshi

ఇవ్వడమా? మానడమా? ఇదీ ఇప్పుడు సగటు భారతీయుడి సమస్య. దాదాపు పదేళ్ళ క్రితం జీవితంలోకి కొత్తగా వచ్చిపడ్డ ఆధార్‌ అనే గుర్తింపు కార్డు, దానిలో నమోదయ్యే సమస్త వివరాలు, ఇచ్చే పన్నెండంకెల ప్రత్యేక నంబర్‌ – ఇప్పుడు పెను సమస్యయ్యాయి. బ్యాంకు ఖాతా తెరవడం, సెల్‌ఫోన్‌ సిమ్‌ కొనుగోలు మొదలు చివరకు హోటళ్ళు, సినిమా హాళ్ళలో బుకింగ్‌ దాకా దేనికీ ఆధార్‌ తప్పనిసరి కాకపోయినా, ఇతర గుర్తింపుకార్డులు అనేకమున్నా, అన్నిటికీ ఆధార్‌ కావాలని పట్టుబట్టడమూ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అడిగిన ప్రతి సంస్థకూ ఆధార్‌ జిరాక్స్‌లు ఇవ్వద్దని శుక్రవారం ఒక ప్రకటన, సాధారణ ముందు జాగ్రత్తతో ఇవ్వచ్చని ఆదివారం మరో ప్రకటన – రెండే రోజుల తేడాలో ఇలా ద్వైధీభావంతో రెండు విరుద్ధ ప్రకటనలు కేంద్రం నుంచి రావడం విచిత్రం. పెరుగుతున్న సైబర్‌ మోసాల వేళ ఇది మరింత గందరగోళం రేపింది. వ్యక్తిగత వివరాల గోప్యత, భద్రతపై ఉన్న అనుమానాల్ని పోగొట్టాల్సిన బాధ్యత ఇక పాలకులదే! 

ఒకప్పుడు స్వచ్ఛందమైన ఆధార్‌ ఇప్పుడు దేశంలో అన్నిటికీ తప్పనిసరి కావడం విచిత్రమే. అధికారికంగా అనుమతి లేని సంస్థలు సైతం పౌరుల ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ కాపీలు, ఇ–కాపీలను తీసుకోవడం కచ్చితంగా ఆందోళనకరం. దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉన్నందున అలా ఆధార్‌ వివరాలను ఎవరికి పడితే వాళ్ళకు అందజేయరాదంటూ, ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఎఐ) బెంగళూరు కార్యాలయం గత వారం సరిగ్గానే అప్రమత్తం చేసింది. కొన్ని సంస్థలకే ఆధార్‌ వివరాలు సేకరించే లైసెన్స్‌ ఇచ్చామనీ, లైసెన్స్‌ లేని సంస్థలు ఆధార్‌ అడిగితే (ఆధార్‌ నంబర్‌లో చివరి నాలుగంకెలు మాత్రమే కనిపించే) ‘మాస్క్‌డ్‌ ఆధార్‌’ను ఇవ్వాలనీ చెప్పింది. నాలుగేళ్ళ క్రితమే రూ. 500కి వంద కోట్ల ఆధార్‌ నంబర్లు, వ్యక్తిగత వివరాలు లభ్యమైన దేశంలో ఆధార్‌పై ఉన్న అనుమానాలకు ఈ ప్రకటన బలమిచ్చింది. కేంద్ర ఐటీ శాఖ వెంటనే బరిలోకి దిగి, ‘తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉంద’ంటూ ఆ మార్గదర్శకాల్ని ఉపసంహరించడం విడ్డూరం. 

‘ఆధార్‌ జిరాక్స్‌ కాపీలు ఇవ్వద్దు’ అని ఒకరు, ‘కాదు కాదు ఇవ్వచ్చ’ని మరొకరు – ఒకే వ్యవస్థ నుంచి చెప్పారంటే, ఆధార్‌పై గందరగోళం ప్రజల్లోనే కాదు... ప్రభుత్వంలోనూ ఉందని అర్థమవు తూనే ఉంది. కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగి తూచ్‌ అన్నప్పటికీ, ప్రజలకు చేరాల్సిన సంకేతమైతే చేరిపోయింది. ఆధార్‌ వివరాల దుర్వినియోగంపై ఉన్న అనుమానం నిరాధారమైనదేమీ కాదని తేలిపోయింది. అసలు బయట ఆఫ్‌లైన్‌లో ఆధార్‌ వెరిఫికేషన్‌ చేసే వారెవరైనా సరే వ్యక్తుల ఆధార్‌ నంబర్లను కానీ, బయోమెట్రిక్‌ సమాచారాన్ని కానీ ‘సేకరణ, వినియోగం, నిల్వ’ చేయరాదు. ఆ మాటే 2016 నాటి ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 8ఎ(4) స్పష్టంగా చెబుతోంది. అయినాసరే, అవసరం లేకున్నా ఆధార్‌ జిరాక్స్‌ అడగడం, ఇచ్చేది లేదంటే సేవలు నిరాకరించడం, తప్పక అమాయకంగా ఇచ్చేయడం – సగటు భారతీయులందరి అనుభవం. కోవిడ్‌ టెస్ట్‌లకు సైతం ఇదే చూశాం.

అంతర్జాలంలో పుష్కలంగా సాగుతున్న డేటా లీకేజీల పుణ్యమా అని వ్యక్తిగత గోప్యత ఇప్పుడు హుళక్కి. ప్రైవేట్‌ ఏజెన్సీలు డిమాండ్‌ చేసి మరీ, ఆధార్‌ కాపీలు తీసుకొని ఆన్‌లైన్‌లో ఆథెంటికేషన్‌ చేస్తుండడం ఏ రకంగా చూసినా తప్పే. డిజిటల్‌ ఫోటో ఎడిటింగ్‌ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉండడంతో, ఆధార్‌ కాపీల మీద ఫోటోలు, సమాచారాన్ని యథేచ్ఛగా మార్చే ప్రమాదం ఉంది. ఆధార్‌ ప్రాధికార సంస్థలోని డేటా బ్యాంక్‌లో ఉన్న సమాచారాన్ని తారుమారు చేయలేరు కానీ, తమ దగ్గర చేసిన మార్పులతో మోసాలకు పాల్పడవచ్చు. ఉద్యోగ సంస్థలు, అప్పులిచ్చేవాళ్ళు సైతం వేలి ముద్రలు సేకరించడం చూస్తున్నాం. ప్రభుత్వ యూఐడీఏఐ దగ్గర గోప్యతకే దిక్కు లేదంటే, ఇక ఈ చిన్నాచితక సంస్థల వద్ద ఈ బయోమెట్రిక్‌ వివరాల భద్రత ఎంత సొబగుగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. వేలిముద్రల డేటాతో డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు అనేకం. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అసలు లబ్ధిదారుల బదులు నకిలీలు కడుపు నింపుకొనే వీలూ కలిగింది. అందుకే జాగ్రత్త అవసరం.  

ఆ మాటకొస్తే, ఆధార్‌ నమోదు సైతం దోషరహితమేమీ కాదు. మొన్నటికి మొన్న మే నెలలోనే ఆధార్‌ జారీ సంస్థ పనితీరుపై మొదటిసారిగా ఆడిట్‌ జరిగింది. బయోమెట్రిక్స్‌లో తప్పులు, డూప్లికేషన్ల లాంటి అయిదు ప్రధాన లోపాలు ఆధార్‌లో చోటుచేసుకున్న తీరును కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తెలిపింది. అయితే, అంతకంతకూ పెరుగుతున్న భారత డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు ఆధారచక్రంగా నిలిచింది ఆధార్‌ కార్డులే. వేర్వేరు బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ నగదు బదలీకి తోడ్పడే స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషనైన ‘యూపీఐ’ లాంటివి కూడా ఆధార్‌ వల్లే సాధ్యమయ్యాయి. కాబట్టి, ఆధార్‌ పద్ధతిని తప్పుబట్టే కన్నా దాని భద్రతపై దృష్టి పెట్టడం ముఖ్యం. వాణిజ్య సంస్థలేవీ ఆధార్‌ను అడగరాదని సుప్రీమ్‌ కోర్ట్‌ ఎప్పుడో చెప్పింది. అయినా అది అమలవుతున్న దాఖలా లేదు. పౌరులు సైతం ఆధార్‌లో రెండంచెల ధ్రువీకరణ, బయోమెట్రిక్స్‌ లాక్, పరిమిత కేవైసీకి అనుమతించే వర్చ్యువల్‌ ఐడెంటిటీ విధానాలను ఆశ్రయించాలి. ప్రభుత్వం సైతం బయోమెట్రిక్, ఆధార్‌ డేటాను ప్రైవేట్‌ సంస్థలు సేకరించకుండా అడ్డుకట్ట వేయాలి. మున్ముందుగా ‘మాస్క్‌డ్‌ ఆధార్‌’ను ప్రాచుర్యంలోకి తేవాలి. ఆ పైన ఆధార్‌ నంబర్ల జారీ, వినియోగాన్ని కట్టుదిట్టం చేయాలి. ఆధార్‌ను అంగట్లో సరుకుగా మార్చిన వెబ్‌సైట్ల భరతం పట్టాలి. అందుకే, దేశంలో పటిష్ఠమైన డేటా భద్రతకు త్వరితగతిన ఓ చట్టం చేయాలి. లేదంటే, ఎంతటి ఆధార్‌ అయినా వట్టి నిరాధారమే! 

మరిన్ని వార్తలు