Arvind Kejriwal: కలిసొచ్చిన అదృష్టం?

1 Oct, 2021 00:11 IST|Sakshi

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకు అంటే ఇదేనేమో! దేశరాజధాని నుంచి తమ సామ్రాజ్యాన్ని పంజాబ్‌ సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు ఇంతకు మించిన మంచి అవకాశం రాదు. సరిగ్గా నెల రోజుల్లో ప్రత్యర్థుల తప్పులతో పంజాబ్‌లో తమ పార్టీ ఇంతగా పుంజు కుంటుందని చివరకు ‘ఆప్‌’ సైతం ఊహించలేదు. కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు, ఆ పార్టీ సీఎం అమరీందర్‌ రాజీనామా, పీసీసీ పీఠమెక్కినంత వేగంగానే సిద్ధూ కిందకు దిగిపోతానని అలకపాన్పు ఎక్కడం– అన్నీ ఇప్పుడు ‘ఆప్‌’కు కలిసొస్తున్నాయి. సర్వశక్తులూ కేంద్రీకరిస్తే, మరో అయిదు నెలల్లో పంజాబ్‌లో జెండా ఎగరేయడం కష్టమేమీ కాదని ఆ పార్టీకి అర్థమైంది. ‘ఆప్‌’ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండురోజుల పంజాబ్‌ పర్యటన, కురిపించిన హామీలే అందుకు నిదర్శనం.

జూలై ఆఖరున జరిపిన తమ ఆఖరి సర్వేలో పంజాబ్‌లో 20 శాతం మేర కాంగ్రెస్‌ ప్రజాదరణ తగ్గిందనీ, ‘ఆప్‌’ ఆదరణ పెరిగిందనీ సాక్షాత్తూ అమరీందరే చెబుతున్నారు. మరోపక్క సీ–ఓటర్‌ లాంటి జాతీయ సంస్థల సర్వే సైతం ఈసారి ‘ఆప్‌’ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని అంచనా వేస్తోంది. ఆ పార్టీ, దాని అధినేత దూకుడు పెంచింది అందుకే. అధికారంలోకొస్తే గృహ వినియోగానికి 300 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇస్తామన్నారు.

తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, సర్జరీలు, ఢిల్లీ తరహాలోనే పంజాబ్‌లో 16 వేల గ్రామక్లినిక్‌లు అంటూ రెండో భారీ వాగ్దానం చేశారు. నిజానికి ‘ఆప్‌’ దళిత కార్డూ వాడదలిచింది. కొత్త సీఎంగా చన్నీ రూపంలో కాంగ్రెస్‌ ముందే ఆ కార్డు వాడడంతో ‘ఆప్‌’కు ఓ అస్త్రం పోయింది. అయితేనేం, కాంగ్రెస్‌ దళిత ప్రేమ కేవలం ఎన్నికలయ్యే దాకా మూడు నెలల ముచ్చటేనని ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్‌లా హిందూ ముద్రకు దూరం జరగలేదు. మధ్యేమార్గ జాతీయవాదపార్టీగా హిందూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తోంది. ఈసారి సిక్కులకే సీఎం పీఠమని తేల్చేసింది. అలా అన్ని వర్గాలనూ తనవైపు తిప్పుకొనే పనిలో ‘ఆప్‌’ ఉంది.

కాంగ్రెస్‌కు సొంత ఇంటిని సర్దుకోవడంతోనే సరిపోతోంది. కొత్త సీఎం చన్నీతో గురువారం 3 గంటల పైగా చర్చ తర్వాత, పీసీసీ పీఠానికి రాజీనామా విషయంలో సిద్ధూ రాజీకి వచ్చినట్టు వార్త. కానీ, వరుస అనాలోచిత, దుందుడుకు చర్యలతో ఆయనకూ, కాంగ్రెస్‌ పార్టీకీ జరగకూడని నష్టం జరిగిపోయింది. ఈ మొత్తంలో చివరకు గెలుపు ఎవరిదన్నది పక్కన పెడితే, నష్టపోయింది నిస్సందే హంగా కాంగ్రెస్సే. బుధవారం అమిత్‌షానూ, గురువారం అజిత్‌ దోవల్‌నూ కలిసిన అమరీందర్‌ బీజేపీలో చేరట్లేదని అన్నారు. కానీ, ఏదో సామెత చెప్పినట్టు పెళ్ళిలో నాగవల్లి నాటి మాట సదస్యా నికి ఉంటుందా అన్నది ప్రశ్న. రానున్న అయిదు నెలల్లో ఏం జరుగుతుందో చెప్పలేం.

సీనియర్లను ఘోరంగా అవమానిస్తున్న కాంగ్రెస్‌ను మాత్రం వదిలేస్తున్నట్టు అయిదు దశాబ్దాల పైచిలుకు రాజకీయ అనుభవజ్ఞుడు అమరీందర్‌  సింగ్‌ కరాఖండిగా చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధూను గెలవనిచ్చేది లేదనీ మరోసారి తొడగొట్టారు. ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌ పుట్టి ముంచేలా ఉన్నాయి. పంజాబ్‌లో కెప్టెన్‌ అమరీందర్‌ సత్తా తెలిసిన విశ్లేషకులు చెబుతున్న జోస్యం ఒకటే – సిద్ధూను ఆయన మట్టి కరిపించడం ఖాయం. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తప్పు తెలిసొచ్చేలా చేయడమూ ఖాయం. అదే నిజమైతే, కాంగ్రెస్‌ మరో రాష్ట్రాన్ని చేజేతులా వదులుకున్నట్టు అవుతుంది. పంజాబ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు ఎలాగూ ఇప్పుడు పెద్ద బలం లేదు గనక, ‘ఆప్‌’కు ఇప్పుడు అన్నీ మంచి శకునములే.

అలాగని ‘ఆప్‌’కు సమస్యలే లేవని కాదు. గత రెండేళ్ళుగా ఆ పార్టీ పంజాబ్‌ విభాగం అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. గెలుపు వాసనలు పసిగట్టిన అసంతృప్త నేతలు ఇప్పుడిప్పుడే దారికొస్తున్నారు. అకాలీదళ్, ఇప్పుడు కాంగ్రెస్‌ పాలనల్లోని లోటుపాట్లను ప్రచారోపన్యాసాల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ‘ఆప్‌’కు ‘ఒక్క ఛాన్సివ్వండి’ అంటున్నారు. 2017 పంజాబ్‌ ఎన్నికల్లో ‘ఆప్‌’ 20 సీట్లు గెలిచి, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అప్పట్లో స్థానికులెవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించక, లోకల్‌ సెంటిమెంట్‌లో దెబ్బతింది. ఈసారి ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. ఇంకా సస్పెన్స్‌ ముడి విప్పకపోయినా, ఈసారి సిక్కు వర్గీయులే తమ అభ్యర్థి అని జూన్‌లోనే ప్రకటించేసింది. ఢిల్లీ తరహా పాలన, ఉచిత పథకాల హామీలే ఆసరాగా పైకి ఎగబాకాలని చూస్తోంది.

అయితే, ఢిల్లీలో ‘ఆప్‌’ పాలనంతా అద్భుతమనీ నమ్మలేం. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రచారానికి తెగ ఖర్చు చేస్తోంది. బీ కేటగిరీ రాష్ట్రమైన ఢిల్లీలో తలసరి ప్రభుత్వ ప్రకటనల ఖర్చు దేశమంతటిలోకీ అత్యధికమట. రాజధాని పేపర్లలో రోజూ ఏదో ఒక మూల ‘ఆప్‌’ ప్రకటన ఉండాల్సిందేనంటున్నారు పరిశీలకులు. కరోనా కాలంలో రాజధాని వదిలి గ్రామాలకు వెళ్ళిన వలస జీవుల ఇంటి అద్దెలు తామే కడతామన్న తలకు మించిన హామీలూ ‘ఆప్‌’ అధినేత ఇచ్చారు.

ఇప్పుడు ఎన్నికల వేళ పంజాబ్‌లోనూ వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. రేపు నిజంగా అధికారం లోకి వస్తే అవన్నీ ఆచరణ  సాధ్యమా అన్నది ప్రశ్న. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నదే వర్తమాన కాంగ్రెస్‌ సర్కారుపై సొంత నేత సిద్ధూ సహా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. వచ్చిన సానుకూలతను ‘ఆప్‌’ వాడుకోవడం వరకు ఓకే కానీ, ఓట్ల కోసం చందమామను చేతిలో పెడతామంటేనే చిక్కు. ఎందుకంటే, ఓటర్లకిచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఢిల్లీలో ఆ పార్టీకి ఇప్పటికే తెలిసొచ్చింది. తస్మాత్‌ జాగ్రత్త! 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు