కాటేస్తున్న ‘రహస్యాలు’!

14 Jan, 2023 00:48 IST|Sakshi

అమెరికాలో మొన్న నవంబర్‌ మధ్యంతర ఎన్నికలు డెమోక్రాటిక్‌ పార్టీకి అంచనాలకు మించిన విజయాలనందించాయి. ఇప్పుడిప్పుడే ద్రవ్యోల్బణం సద్దుమణిగిన జాడలు కనిపిస్తున్నాయి. ఆర్థిక రంగం అంతో ఇంతో పుంజుకుంటున్నదని కూడా అంటున్నారు. ఈ విజయోత్సాహంతోనే కావొచ్చు... రెండోసారి సైతం తానే డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థినని అధ్యక్షుడు జో బైడెన్‌ ఢంకా బజాయిస్తున్నారు. ఇంతటి శుభ తరుణంలో ఉరుము లేని పిడుగులా ‘రహస్యపత్రాలు’ బయటికొస్తూ బైడెన్‌ను ఇరుకున పడేస్తున్నాయి.

ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువై రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలై నిష్క్రమించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పోతూ పోతూ అత్యంత రహస్యమైన ఫైళ్లను సంగ్రహించారన్న ఆరోపణలు ఏడాదిన్నర క్రితం గుప్పుమన్నాయి. ఆ వ్యవహారంపై విచారణ సాగుతోంది. ట్రంప్‌ ఎస్టేట్‌లో, ఆయన కార్యాలయాల్లో అటువంటి రహస్యపత్రాలు దొరి కాయి కూడా. ఆ మరకను ఎలా వదుల్చుకోవాలో తెలియక రిపబ్లికన్‌లు కకావికలవుతున్న తరుణంలో బైడెన్‌ సైతం ఆ తానులోని ముక్కేనని వెల్లడికావటం డెమొక్రాట్లకు సహజంగానే దుర్వార్త. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించక స్వప్రయోజనాలు నెరవేర్చుకునే సాధనంగా పరిగ ణించేవారే చట్టాలను బేఖాతరు చేస్తారు.

నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ట్రంప్, బైడెన్‌లిద్దరూ ఆ పనే చేశారా అన్నది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. వాషింగ్టన్‌లోని బైడెన్‌ కార్యాలయంలో నిరుడు నవంబర్‌ 2న కొన్ని రహస్యపత్రాలు దొరికాయని గత వారం ఆయన న్యాయవాదులు ప్రకటించారు. 2017లో ఒబామా హయాంలో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి పత్రాలివి. దానిపై రిపబ్లికన్‌లు రచ్చ చేస్తుండగానే విల్మింగ్టన్‌లోని బైడెన్‌ సొంతింట్లో గురువారం ఆ కాలానికి సంబంధించినవే మరికొన్ని రహస్యపత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

ట్రంప్‌ పుణ్యమా అని అమెరికా సమాజం నిట్టనిలువునా చీలింది. ట్రంప్‌ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదార్లు ఫలితాలు వెల్లడైనరోజు విధ్వంసానికి తెగించారు. దౌర్జన్యాలకు దిగారు. ఆ ఉదంతంపై విచారణ సాగుతున్న కాలంలోనే ట్రంప్‌ చేతివాటం బయటికొచ్చింది. అధ్యక్షుడిగా తన పరిశీలనకు వచ్చిన అత్యంత రహస్యమైన పత్రాలను ఆయన కట్టలకొద్దీ పోగేసుకున్నారని వెల్లడైంది. ఈ విషయంలో ట్రంప్‌పై అనర్హత వేటు పడే ప్రమాదమున్నదని కూడా అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇప్పుడు బైడెన్‌కూ అలాంటి ప్రారబ్ధమే చుట్టుకుంటుందా? ఎన్ని లోటుపాట్లున్నా ఇప్పటికీ ప్రపంచంలో అగ్రరాజ్యంగానే కొనసాగుతున్న అమెరికాను గత దశాబ్దకాలంగా ‘రహస్యపత్రాలు’ అడపా దడపా కాటేస్తూనే ఉన్నాయి. అమెరికా రక్షణ విభాగంలో పనిచేస్తున్న చెల్సియా ఎలిజెబెత్‌ మానింగ్‌ తొలిసారి 2010లో వికీలీక్స్‌కు అత్యంత కీలకమైన రహస్య ఫైళ్లు అందజేశారు. అందులో ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలో అమెరికా సైన్యం సాగించిన దురాగతాలకు సంబంధించిన వీడియోలు, అధికారిక పత్రాలు, ఉన్నతస్థాయిలో సాగిన సంభాషణలు వగైరాలున్నాయి. ప్రస్తుతం రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ సైతం అప్పట్లో వివిధ దేశాధినేతలపై అమెరికా రాయబారులు తమ అధ్యక్షుడికి పంపిన కేబుల్స్‌ లీక్‌ చేసి ఆ దేశం పరువును పాతాళానికి నెట్టారు.

వారి మాదిరిగా ట్రంప్, బైడెన్‌లు రహస్య ఫైళ్లలోని అంశాలు బయటపెట్టి ఉండకపోవచ్చు. కానీ అధికారం వెలగబెట్టినవారు చెల్సియా, స్నోడెన్‌ మాదిరే సొంతానికి ఫైళ్లు పట్టుకెళ్లారని వెల్లడికావటం అమెరికాను ప్రపంచంలో నవ్వులపాలు చేయదా? ఇప్పుడు డెమొక్రాట్లకు వచ్చిపడిన సమస్యేమంటే... ట్రంప్‌ చౌర్యం బయటికొచ్చిన ప్పుడు వారు కాలరెగరేశారు. ఘనమైన రాజకీయ అనుభవం, పాలనకు కావలసిన సమర్థత, జాతీయ భద్రత అంశంలో రాజీపడని తత్వం తమ సొంతమని దండోరా వేశారు. కానీ బైడెన్‌ ‘రహస్యపత్రాల’ వ్యవహారం కాస్తా వారి గాలి తీసేసింది. 

ట్రంప్‌ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ విభాగం రహస్యపత్రాలు పట్టుకున్నప్పుడు ‘ఒక దేశాధ్యక్షుడు ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటార’ని బైడెన్‌ బోలెడు ఆశ్చర్యపోయారు. ఇప్పుడాయనే ఇరకాటంలో పడ్డారు. రెండుచోట్లా రహస్యపత్రాలే దొరికినా ఇద్దరినీ ఒకేగాటన కట్టొచ్చా? దొరకడంలో సారూ ప్యత ఉన్నా దొరికిన పత్రాల తీవ్రతలో తేడాలుండొచ్చు. ఆ సంగతి పత్రాల పరిశీలన పూర్తయితే గానీ తేలదు. అలాగే అవి ఎవరెవరి కంటపడ్డాయో కూడా తెలియవలసి ఉంది. ట్రంప్‌ దగ్గర 33 బాక్సుల్లోపట్టేన్ని పత్రాలు దొరికితే అందులో అనేకపత్రాలు ‘టాప్‌ సీక్రెట్‌’కు సంబంధించినవి.

బైడెన్‌ దగ్గర సంఖ్యరీత్యా ఇంతవరకూ దొరికినవి తక్కువ. పైగా ‘మీ హయాంలోని రహస్యపత్రాలు తీసుకుపోయారట. వాటిని తక్షణం మాకు అప్పగించండ’ని జాతీయ పత్రాల భాండాగారం ఏడా దిగా కోరుతున్నా ట్రంప్‌ బేఖాతరు చేశారు. న్యాయశాఖను కూడా ఆయన లెక్క చేయలేదు. అందుకే ఎఫ్‌బీఐను ఉరికించాల్సివచ్చింది. ఇక బైడెన్‌ న్యాయవాదులు స్వచ్ఛందంగానే పత్రాలు అప్పగించినా వారి వ్యవహారశైలిలో దోషముంది.

రెండునెలలపాటు వాటి సంగతి దాచి ఉంచారు. గత నెల 20న న్యాయశాఖకు చెప్పినా ఆ శాఖ సైతం మూగనోము పాటించింది. చివరకు గత సోమవారం బయటపెట్టింది. ట్రంప్‌ను ఎలాగైనా శిక్షింపజేయాలని చూస్తున్న అటార్నీ జనరల్‌ మెరిక్‌ గార్లాండ్‌కు తాజా పరిణామం మింగుడుపడనిదే. ఇప్పుడు రాబర్ట్‌ కె. హర్‌ నేతృత్వంలో సాగబోయే విచారణ బైడెన్‌ భవితనూ, డెమొక్రాట్ల రాతనూ నిర్ణయిస్తుంది. చేసుకున్నవారికి చేసుకున్నంత! 

మరిన్ని వార్తలు