దయనీయంగా దాయాది

12 Jan, 2023 00:14 IST|Sakshi

చపాతీ ఇరవై, తందూరీ రోటీ పాతిక రూపాయలు. కిలో గోదుమ పిండి నూట పాతిక. బేకరీలో బ్రెడ్‌ సైతం సైజును బట్టి రూ. 70 నుంచి 200. పాడి సమృద్ధిగా ఉండే శీతకాలమైనా సరే రెండున్నర నెలల క్రితమే లీటర్‌ పాలు రూ. 118 నుంచి రూ. 200 అయింది. గోదుమలు ప్రధాన ఆహారమైన దేశంలో పది కిలోల బస్తా 1500 పలుకుతోంది. మార్కెట్‌లో గోదుమ పిండి ఖాళీ అయ్యేసరికి, బారులు తీరిన జనం... తిండి కోసం అల్లాడుతూ ఆహార గింజలకై కొట్టుకుంటున్న పరిస్థితులు... ఆర్మీ గార్డుల రక్షణలో గోదుమ ట్రక్కులు పంపాల్సిన అవస్థలు... బలూచిస్తాన్, సింద్‌ ప్రావిన్స్‌లలో తొక్కిసలాటలు.

ఇవీ అక్కడి దృశ్యాలు. రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు మూసేయాలి. రాత్రి పదికి కల్యాణ మండపాలు కట్టేయాలి. ఆఫీసులో కరెంట్‌ వినియోగం కనీసం 30 శాతం తగ్గించాలి. తేయాకు దిగమతి చేసుకొనేందుకు విదేశీ మారకం తగినంత లేనందున రోజూ తాగే టీ పైనా రెండు కప్పుల రేషన్‌. ఇదీ పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఆదేశాలు. పాలకుల విధాన వైఫల్యం, ప్రకృతి ప్రకోపం కలసి కొద్దినెలలుగా కనివిని ఎరుగని ఆర్థిక, ఆహార సంక్షోభంలోకి దాయాదిదేశాన్ని నెట్టేశాయి. 

పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితికి ఇవన్నీ మచ్చుతునకలు. గత జూన్‌ నుంచి సగటున 31 శాతం ఆహార ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న దేశంలో ఆర్థికవ్యవస్థ సైతం సంక్షోభంలో ఉంది. ఎనిమి దేళ్ళలో ఎన్నడూ లేనట్టు విదేశీమారక ద్రవ్య నిల్వలు 450 కోట్ల అమెరికన్‌ డాలర్లకు పడిపోయాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఏకంగా 800 కోట్ల డాలర్లకు పైగా అప్పులు తీర్చాలి. అంటే, రాను రానూ నిల్వలు మరింత క్షీణిస్తాయి.

సరిగ్గా అయిదేళ్ళ క్రితం డాలర్‌ విలువ 110 రూపాయలున్న పాక్‌లో ఇప్పుడది రెట్టింపై, 228 చిల్లరకు చేరింది. తగ్గుతున్న ద్రవ్య నిల్వలు, బలహీనపడుతున్న రూపాయి, దెబ్బతింటున్న స్థూల ఆర్థిక అంశాలు... ఇలా అనేకం మన పొరుగు దేశాన్ని అడకత్తెరలో పెట్టాయి. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే సామాజిక, ఆరోగ్య రంగాల్లో సంక్షోభాలు అనివార్యం. 

నిజానికి, గత ఏడాది 2.7 కోట్ల టన్నుల గోదుమలు పండించాలని పాక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, నీటి కొరత వచ్చింది. పులి మీద పుట్రలా ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. జూన్‌లో వరదలతో వ్యవసాయ భూమి దెబ్బతిని, ఉత్పత్తి పడిపోయింది. రష్యా నుంచి లక్షల టన్నులు దిగుమతికి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ప్రకృతి శాపమనుకుంటే... ఎన్నడూ లేనంత ద్రవ్యో ల్బణం, పెట్రోలియమ్‌ ధరల పెంపు, రూపాయి విలువలో క్షీణత, దేశమే దివాళా తీసే పరిస్థితి – పాలకుల విధాన వైఫల్యానికి నిలువుటద్దాలు. గద్దె మీది పెద్దల తప్పులకు పౌరులు కష్టాల పాలయ్యారు. చిక్కు సమస్యల నుంచి దేశాన్ని బయటకు తెచ్చే కృషి చేయాల్సిన అధికార పక్షాలు ఆర్థికంగానే కాదు... ఆలోచనల పరంగానూ దివాళా తీయడం విషాదం. తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించక, ఎంతసేపటికీ గత ప్రభుత్వాలపై నిందారోపణలకే పరిమితం కావడం విడ్డూరం. 

గత ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన తొలి పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ రికార్డు కెక్కితే, ఆయన స్థానంలో ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌కు చెందిన షహబాజ్‌ షరీఫ్‌ గద్దెనెక్కారు. ప్రభుత్వం మారిందే కానీ, పార్లమెంట్‌ నిస్తేజంగా మారింది. వివిధ ప్రావిన్స్‌ల అసెంబ్లీలు ఏ క్షణం లోనైనా రద్దయ్యే పరిస్థితిలో పడ్డాయి. తీవ్రవాదం మరోసారి పడగ విప్పింది. ఏ రోజుకారోజు రాజకీయ సంక్షోభం ముదిరి, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి.

దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నా, రాజకీయ పెద్దలెవరూ నియమానుసారం నడుచుకొనే ప్రయత్నం చేయకపోవడం మరీ విడ్డూరం. ఇన్నేళ్ళుగా పాలనను పక్కనపెట్టి, భారత, అఫ్గాన్‌ గడ్డలపై తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే వ్యూహాత్మక అస్త్రంగా భావించిన పాకిస్తాన్‌కు ఇప్పుడు అదే తీవ్రవాదం గుదిబండై కూర్చుంది. స్వయంకృత అపరాధాలను గుర్తించి, ఇకనైనా బుద్ధి మార్చుకోవాల్సిన సమయం వచ్చింది.

2011 నాటికి పాక్‌ అప్పులు ఆ దేశ జీడీపీలో 52.8 శాతం ఉంటే, గత ఏడాదికి 77.8 శాతానికి ఎగబాకాయి. అప్పులు తీర్చలేక, ఆహార సంక్షోభం నుంచి బయటపడలేక సతమతమవుతూ ఆ దేశం ఆపన్నహస్తం కోసం చూస్తోంది. దేశ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సాయం కోరుతూ పాక్‌ ప్రధాని జెనీవాకు వెళ్ళారు. ఆహారం, వైద్యసాయం, వ్యవసాయం, ప్రాథమిక వసతుల నిమిత్తం 10 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ఇస్తానంటూ అమెరికా మంగళవారం ప్రకటించింది.

సౌదీ అరేబియా సైతం పాక్‌లో తమ పెట్టుబడిని వెయ్యికోట్ల డాలర్లకు పెంచాలని యోచిస్తోంది. వరద బాధిత పాక్‌ కోలుకోవడానికి సోమవారం నాటి జెనీవా దాతల సదస్సులో వెయ్యి కోట్ల మేర వాగ్దానాలు రావడం నైతికంగా ఉత్సాహజనకమే. కానీ, వివిధ సంస్థలతో రానున్న మూడేళ్ళలో అందే సాయం పాక్‌ తక్షణ డాలర్‌ ద్రవ్యసంక్షోభాన్ని పరిష్కరించలేదు. తక్షణ ద్రవ్యసాయంతో ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదాలి. 

ఐఎంఎఫ్‌తో సమస్యాత్మక సంబంధాలున్న పాక్‌ ఇప్పటికైతే కఠిన షరతులు ఆపాలని కోరింది. ఊహించినదాని కన్నా మెరుగైన సాయం అందినందుకు ప్రధానమంత్రి, బృందం సంతోషిస్తున్నా, ఇది తాత్కాలిక ఊరటే. స్థూల ఆర్థిక సంస్కరణలు చేపడితేనే దేశానికి దీర్ఘకాలిక పునరుద్ధరణ సాధ్యం. స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రే చెప్పినట్టు పర్వతం లాంటి సమస్యలను అధిగమించడా నికి కాలంతో పోటీపడుతూ పాక్‌ పరుగులు తీయాలి. అయితే, మాటలు చెబితే చాలదు... చేతల్లో చూపెట్టాలి. ఆ బృహత్తర బాధ్యత దాయాది దేశపు విధాన నిర్ణేతలదే! 

మరిన్ని వార్తలు