రిపబ్లికన్‌ల పైయెత్తు

27 Aug, 2020 00:46 IST|Sakshi

అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద ప్రాచీనమైన పార్టీ(జీఓపీ)గా అందరూ పిల్చుకునే రిపబ్లికన్‌ పార్టీ ఆన్‌లైన్‌ సదస్సు మొదలైంది. మూడురోజులపాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ మూలాలున్న నిక్కీ హేలీని ఎంపిక చేసి డెమొక్రాటిక్‌ పార్టీకి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సవాలు విసిరారు. అమెరికాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న భారతీయ ఓటర్లను ఆకర్షించడానికి ఇప్పటికే డెమొక్రాటిక్‌ పార్టీ కాలిఫోర్నియా సెనెటర్‌ కమలాహారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంచుకుంది. ఆమె తల్లి తమిళనాడువాసి కాగా, తండ్రి జమైకాకు చెందినవారు. నిక్కీ హేలీ తల్లి దండ్రులిద్దరూ భారతీయులే. వారు పంజాబీలు. ట్రంప్‌ ఈసారి నెగ్గకపోవచ్చని దాదాపు సర్వేలన్నీ చెబుతున్న నేపథ్యంలో రిపబ్లికన్‌ సీనియర్లలో ఆయనపై వ్యతిరేకత వుంది. కానీ ట్రంప్‌ ఆ వ్యతి రేకతను అధిగమిస్తారని తొలినాటి సదస్సులోనే తేలిపోయింది. రిపబ్లికన్లకు మొదటినుంచీ ఒక ముద్ర వుంది. మిన్ను విరిగి మీద పడుతుందన్నా సంప్రదాయ విధానాలనుంచి జరగరని, జనాకర్షక విధానాలవైపు మొగ్గు చూపరని ఒక అభిప్రాయం వుంది. అబార్షన్లు, వలసలు, విదేశాంగ విధానం, వాణిజ్యం తదితర అంశాల్లో రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్షులుగా ఎవరు గెలిచినా ఒకే వైఖరి ఉంటుంది. కానీ ట్రంప్‌ రంగ ప్రవేశంతో అదంతా మారింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ధోరణిని పార్టీ అలవర్చుకుంది. ఇప్పుడు ట్రంప్‌ ఓడినా, గెలిచినా ఇకపై రిపబ్లికన్‌ పార్టీ ఆయన వేసిన బాట లోనే పయనిస్తుందని ప్రస్తుత పరిణామాలు చూస్తే ఎవరికైనా అనిపించకమానదు. 

తన నాలుగేళ్ల ఏలుబడిలో వలసలపై ట్రంప్‌ విరుచుకుపడని రోజంటూ లేదు. ఆయన తీసు కొచ్చిన కఠిన నిబంధనలు వలసదారులను వెతలపాలు చేశాయి. కానీ ఇప్పుడు రిపబ్లికన్‌ సదస్సు సందడిలోనే ట్రంప్‌ తీరిక చేసుకుని  వైట్‌హౌస్‌లో బొలివియా, లెబనాన్, భారత్, సూడాన్, ఘనా లకు చెందిన అయిదుగురు పౌరులకు అమెరికా పౌరసత్వం అందజేశారు. ఇన్నేళ్లుగా అమెరికా ఎదు ర్కొంటున్న సమస్త ఇబ్బందులకూ వలసలే కారణమని చెబుతూ, ఆఖరికి కరోనా వైరస్‌ వ్యాప్తి వారి పుణ్యమేనని ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్‌ హఠాత్తుగా ఇలా కొందరికి పౌరసత్వం ఇవ్వడం యాదృ చ్ఛికమేమీ కాదు. వలసల విషయంలో తాము సరళంగానే వ్యవహరిస్తామన్న అభిప్రాయం కలిగిం చడం ఆయన ధ్యేయం. నేరుగా అలా చెబితే శ్వేతజాతి అమెరికన్‌ ఓటర్లు దూరమవుతారు కనుక ఆ మాట మాత్రం చెప్పరు. అలాగే రిపబ్లికన్‌ పార్టీ ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా)కు మొదటినుంచీ అనుకూలం. చైనాతో వాణిజ్యం, వివిధ దేశాలతో కొత్త ఒప్పందాలు వగైరాలన్నీ రిపబ్లికన్లకు ప్రీతిపాత్రమైనవి. వాణిజ్య సంబంధాల విస్తరణతో సంపద మరింత పెరుగుతుందని రిపబ్లికన్‌ పార్టీ విశ్వాసం. జార్జి బుష్‌ ప్రవచించిన కొత్త ప్రపంచ విధానం ప్రకారం అమెరికా నిర్దేశకత్వంలోనే ఏ దేశమైనా మెలగాలి. ఎవరికి భద్రత కావలసివచ్చినా తమపైనే ఆధార పడాలి. కానీ ట్రంప్‌ దాన్ని తలకిందులు చేశారు. ‘అమెరికాకే అగ్ర ప్రాధాన్యం’ అన్న నినాదంతో అధి కారంలోకొచ్చి ‘ప్రపంచంపై పెత్తనం వద్దు, మా ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అన్న విధానం అమలు చేయడం మొదలుపెట్టారు. వేరే దేశాల్లో వున్న అమెరికా సేనలకయ్యే వ్యయం ఆ  దేశాలే భరించాలని, లేదంటే సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తామని షరతు పెట్టారు. చైనాతో కయ్యానికి దిగారు. అసలు అమెరికా విధానమేమిటో అర్థంకాని రీతిలో రోజుకో రీతిగా మాట్లాడి అయోమయం సృష్టించారు. కరోనా వైరస్‌పై నిర్దిష్టమైన వ్యూహం లేకపోవడంతో దేశం అసాధారణ సంక్షోభంలో చిక్కుకుంది.

ట్రంప్‌ పాలనతో జనం విసిగిపోయారని, ఈసారి తమకే పట్టం కడతారని డెమొక్రాట్లు అను కుంటున్నా అదంత సులభమేమీ కాదు. వలస విధానాలు, కరోనా అరికట్టడంలో వైఫల్యాలు, జాతి విద్వేషాలు, తుపాకి సంస్కృతి, పర్యావరణ మార్పులు వగైరా అంశాల్లో ట్రంప్‌ వైఖరి జనంలో ఏవ గింపు కలిగించినా... ఆయన హయాంలోనే తక్కువ నైపుణ్యం వున్న కార్మికులకు రెండు దశాబ్దాల తర్వాత మెరుగైన వేతనాలు లభించడం మొదలైంది. పన్ను సంస్కరణలు, నియంత్రణల సడలింపు, దేశీయ ఇంధనరంగంలో ఉత్పత్తి పెంచడం వగైరాలతోనే ఇదంతా సాధ్యమైంది. నల్లజాతీయుల ఓట్లలో అత్యధికం తమకే వస్తాయని డెమొక్రాట్లు విశ్వసిస్తున్నా ట్రంప్‌ హయాంలో ఆ వర్గంలో నిరు ద్యోగిత 5.4 శాతం మాత్రమే వున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఒబామా రెండు దఫాల ఏలుబడిలో కూడా అది 7.5 శాతంకన్నా తగ్గలేదని గుర్తుంచుకుంటే ఆ వర్గాల్లో ట్రంప్‌పై అనుకూలత ఏవిధంగా వుంటుందో అంచనా వేసుకోవచ్చు. ఇతర అంశాల్లో ట్రంప్‌ను దుయ్యబడుతున్న డెమొ క్రాట్లు, ఆర్థికాభివృద్ధి కోసం ఆయనకన్నా మెరుగ్గా ఏం చేయదల్చుకున్నదీ ఇంతవరకూ చెప్పలేదు. ఆ విషయంలో ఓటర్లకు భరోసా ఇవ్వగలిగితేనే డెమొక్రాట్లకు మెరుగైన అవకాశాలుంటాయి. 

ఈ ఎన్నికల్లో ఏటికి ఎదురీదుతున్నానన్న భావన ట్రంప్‌లో లేకపోలేదు. అందుకే ప్రతి చిన్న అంశంలోనూ ఆయన జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. డెమొక్రాట్లు కమలాహారిస్‌ను ఎంపిక చేసిన వెంటనే రిపబ్లికన్‌ పార్టీ గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్‌ పాల్గొన్న భారీ సభ వీడి యోలను ప్రచారంలో పెట్టింది. ఇప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతి మహిళ నిక్కీ హేలీని ఎంపిక చేసింది. ఎంపికయ్యాక హేలీ చేసిన ప్రసంగం రిపబ్లికన్‌ పార్టీ ప్రచారం ఎలా వుండబోతున్నదో చెబుతోంది. అమెరికాలో జాతి విద్వేషాలున్నాయన్న ఆరోపణను హేలీ ఖండిం చారు. అందుకు తన రాజకీయ ఎదుగుదలనే ఉదాహరణగా చూపారు. ఇంతవరకూ వరసగా రెండో సారి అధ్యక్షుడిగా పోటీచేసి నెగ్గిన ఏకైక రిపబ్లికన్‌ నాయకుడు జార్జి డబ్ల్యూ. బుష్‌ మాత్రమే. ట్రంప్‌ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో, డెమొక్రాట్లు ఏమేరకు సత్తా చాటగలరో నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తేలుతుంది. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా