శరత్కాల వెన్నెల

11 Oct, 2021 00:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘విత్‌ ఫ్రీడమ్, బుక్స్‌ అండ్‌ ది మూన్‌ హూ కుడ్‌ నాట్‌ బి హ్యాపీ’ అన్నాడు ఆస్కార్‌ వైల్డ్‌. కోరుకున్న స్వేచ్ఛ, చదువుకోదగ్గ పుస్తకాలు, వెన్నెల కురిపించే జాబిల్లి... ఆనందానికి మరేం కావాలి. అందుకే ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ అని మన కవి సినారె రసాస్వాదన చేశాడు. మానవజాతి సూర్యుణ్ణి చూసి నమస్కారం పెట్టుకుంది. గౌరవించింది. పూజించింది. అష్షో బుష్షో అనీ అంది. చంద్రుడు? వారికి నేస్తం. బెడ్‌లైటు. మామ. ఊసులు చెప్పుకునే చెలికాడు. తక్కిన రుతువులు ఎవరివైనా కావచ్చు. శరత్కాలం చంద్రుడిది. ఈ కాలంలో చంద్రుడు చల్లటి నీటితో ఫేస్‌వాష్‌ చేసుకున్నట్టు ఉంటాడు. ఇది శరత్కాలం.

‘పిండారబోసినట్టుంది వెన్నెల’ అని పుస్తకాల్లో కనిపిస్తుంది. ‘కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి వెన్నెల కురుస్తోంది’ అని రచయితలు రాస్తే వయసులో ఉన్న యువతీ యువకుల రొమాంటిక్‌ భావాలతో మైమరుస్తారు. ఏ అడ్డంకీ లేని నిర్మల ఆకాశంలో, పలుచటి గాలులు వీచే రాత్రి సమయాన, దాపున చుక్కల సింగారంతో, శరత్కాలంలో పూర్ణచంద్రుడు ఉదయిస్తే, దానిని చూడలేకపోతే మన దగ్గర మణులుంటే ఏంటి... మాణిక్యాలుంటే ఏంటి... ఫోన్‌పేలో ఎంత ఉంటే ఏంటి...

సాహిత్యంలో వసంత రుతువుది ఏకఛత్రాధిపత్యమే. కాని శరదృతువు తక్కువ తిన్లేదు. ఆ మాటకొస్తే వేదకాలం గుర్తించింది మూడు రుతువులనే. గ్రీష్మం, వసంతం, శరత్తు. ‘సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి’ అనే అర్థం వచ్చే శ్లోకం ఋగ్వేదంలో ఉంది. ప్రకృతి వర్ణనలో పరాక్రమశాలి అయిన కాళిదాసు శరత్కాలపు వెన్నెలను ఏల వదులుతాడు. ‘ఈ వెన్నెల ఎలా ఉందంటే గడ్డ కట్టిన చిక్కటి తెల్లటి పెరుగులా ఉంది’ అని వెన్నెల రుచి చూపించాడు. వెన్నెలలో రెల్లుగడ్డికి గ్లామర్‌ తీసుకు వచ్చింది కూడా ఆ మహాకవే. శరత్కాలంలో రెల్లుగడ్డి వెన్నెలను తాగి మత్తుగా ఊగుతున్నట్టు ఉందని రాశాడాయన. ‘వెన్నెల కాస్తుంటే కొందరు కిటికీలు మూసుకుంటారు’ అని గుడిపాటి వెంకటాచలం విసుక్కున్నాడు కాని తిలక్‌ వెన్నెల కాసిందంటే చాలు కవిత్వం రాశాడు. ‘దవుదవ్వుల పడుచు పిల్లలు పకపక నవ్వినట్టుంది వెన్నెల... దాపరికం లేని నాతి వలపులాగుంది వెన్నెల’ అని రాశాడు. అంతేనా? ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. తన పుస్తకాన్ని ‘అమృతం కురిసిన రాత్రి’ అన్నాడు. ఇక్కడ అమృతం వెన్నెలామృతమే. అయినా సరే ‘ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది’ అని రాసిన నండూరి సుబ్బారావూ మొనగాడే. ఎంకిని ఆచ్ఛాదన లేని చంద్రుని కింద నాయుడు బావ చూశాడో లేదో కాని తెలుగు పాఠకులు కన్నులు ఇంతింత చేసుకుని చూశారు.

శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ పున్నమి వాల్మీకి మహర్షి జన్మదినం. రామాయణం ఈ భరతభూమి మీద అనాదిగా ఆధ్యాత్మిక వెన్నెలను కురిపిస్తూ ఉంది. రాముడు రామచంద్రుడు. చంద్రుణ్ణి నేలకు దించమని కోరి గోరుముద్దలు తిన్నవాడు. సీతమ్మ మోము చంద్రబింబం కంటే ఏం తక్కువ. మహా భారతాన్ని తెలుగు అనువాదం చేస్తున్న నన్నయ్య ‘అరణ్య పర్వం’లో శరత్కాలాన్ని వర్ణిస్తూ ఒక పద్యం రాసి అక్కడితో రచన చాలించాడు. 200 ఏళ్ల తర్వాత ఎఱాప్రగడ కొనసాగింపుగా శరత్కాల వర్ణన చేసే మరో పద్యం రాసి ఆ అనువాదాన్ని కొనసాగించాడు. తెలుగు మహాభారతం ఆ విధంగా ఒక శరత్కాలానికి మరో శరత్కాలానికి మధ్య సుదీర్ఘ విరామం తీసుకుంది. 

రుతువులు ఏం చేస్తాయి? ఏవో సంకేతాలు ఇస్తాయి. ఆ ప్రకారం నడుచుకోమని మనుషులకు చెబుతాయి. శరత్కాలం స్త్రీ, పురుషుల సన్నిహిత కాలం అని శృంగార శాస్త్రాలు చెబుతాయి. భర్తృహరి ‘శృంగార శతకం’ ఆ సమయంలో ఆలుమగలు ఎలా వ్యవహరించాలో చెబుతుంది. ‘శరత్కాలంలో ఆలుమగలు ఏకాంతంగా మేడ మీదకు చేరాలి. అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేయాలి. చంద్రుడు నడిమింటికి వస్తాడు... వెన్నెల ధార కురుస్తూ ఉంటుంది... ఆ సమయంలో ఒకరి స్పర్శను ఒకరు ఆస్వాదించాలి’ అని చెప్పింది. చలం కూడా ‘ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు వెన్నెల రాత్రుళ్లలో సముద్రపు ఒడ్డున భూమే శయ్యగా కలిసేది ఎప్పుడో’ అని రాశాడు.

రుతువు అంటే స్పందన. వెన్నెల అంటే స్పందన. స్పందనాగుణం కోల్పోవడమే ఇప్పుడు మనిషిని బాధిస్తున్న సంగతి. విషాదం ఏమంటే తాను స్పందనాలేమితో బాధ పడుతున్న సంగతి కూడా మనిషికి తెలియదు. పూవు పూస్తే, హరివిల్లు విరిస్తే, చినుకు చూరు నుంచి చిటుకూ పుటుకూ మంటే, గాలికి ఒక తీవ ఝల్లుమని కదిలితే ఆగి చూసి ఆస్వాదించి స్పందించే సమయం మనిషికి ఎక్కడిది? అది ఉంది. కాని లేదు అని పరుగు పెట్టడమే మనిషి నేడు చేస్తున్నది. ఈ స్పందన కరువైన కొద్దీ జీవితంలో ఆస్వాదన కరువవుతుంది. స్త్రీ, పురుషుల మధ్య శుష్కమైన కోరిక మిగిలి రససిద్ధి అడుగంటుతుంది. నేడు భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య నిజమైన రసస్పందన  కరువవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫేక్‌– కపట మోహ ప్రదర్శనే మిగులుతున్నది.

సంవత్సరానికి ఒకసారి శరత్‌ రుతువు వస్తుంది. సోముడు తేజోవంతమై అందాక పేరుకు పోయిన భావాల నిరాసక్తతను వదలగొడతాడు. వెన్నెల గుమ్మరిస్తాడు. గుండెలకు లాలిత్యం ఇస్తాడు. హాయి పడాల్సిన కాలం ఇది. పున్నములను చూడాల్సిన కాలం. దాంపత్య అనుబంధాన్ని వెలిగించుకోవాల్సిన కాలం. వెలగడం మీ వంతు.  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు