ముసురుకుంటున్న చీకట్లు!

12 Oct, 2021 00:32 IST|Sakshi

కరెంట్‌ కోత, లైట్లు లేక కొవ్వత్తులతో కాలక్షేపం... ఒకప్పుడు నిత్యానుభవం. కొన్నేళ్ళుగా దూరమైన ఆ అనుభవం త్వరలోనే మళ్ళీ దేశమంతటా ఎదురుకాక తప్పేలా లేదు. వస్తున్న వార్తలను బట్టి చూస్తే, ఒకప్పటిలా మళ్ళీ విద్యుత్‌ కోతలు దేశమంతటా నిత్యకృత్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి. సొంతంగా విద్యుదుత్పత్తి చేద్దామంటే బొగ్గు కొరత. థర్మల్‌ విద్యుత్కేంద్రాలు మూతపడే పరిస్థితి. పోనీ... ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తే కొందామంటే, అనూహ్యమైన విద్యుత్‌ కొనుగోలు రేట్ల మోత. యూనిట్‌కు పాతిక రూపాయలు పెట్టినా, విద్యుత్‌ లభించని దుఃస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే, గృహావసర విద్యుత్‌ వినియోగం తగ్గించుకొని, విద్యుత్‌ ఆదా చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వాలూ ప్రజలను అభ్యర్థించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలకు విద్యుత్‌ కోతలు తప్పవన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యం ఇది. 

మన దేశంలో 135 థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. అవన్నీ మునుపెన్నడూ లేనంత బొగ్గు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నాయనీ, విద్యుత్‌ కొరత తప్పదనీ సాక్షాత్తూ ‘భారతీయ కేంద్ర విద్యుత్‌ అథారిటీ’ డేటాయే స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా అవసరమైన విద్యుత్తులో 70 శాతాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. కానీ, బొగ్గు నిల్వల తీవ్ర కొరత కారణంగా ఈ 135 థర్మల్‌ ప్లాంట్లలో 106, అంటే దాదాపు 80 శాతం ప్లాంట్లు సంక్షోభ, లేదా అతి తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలుండాలని భారత ప్రభుత్వం మాట. కానీ, ఇప్పుడు రెండు రోజులకు మించి లేవు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలోని బొగ్గు, లిగ్నైట్‌ గనులున్న ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల బొగ్గు రవాణాకు చిక్కులొచ్చాయి. వర్షాకాలానికి ముందే తగినంత బొగ్గు నిల్వలు చేసుకొనే దూరదృష్టి  లేకుండా పోయింది. 

మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు సైతం చతికిలబడ్డాయి. షిప్పింగ్‌ ఆలస్యాల కారణంగా అంతర్జాతీయ గొలుసుకట్టు సరఫరా దెబ్బతింది. అంతర్జాతీయ బొగ్గు రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 40 శాతం మేర బొగ్గు ధరలు పెరిగినట్టు లెక్క. కొన్నిచోట్ల ఒక టన్ను 60 డాలర్లుండేది ఇప్పుడు దాదాపు 120 డాలర్లు అయిందని కథనం. దాంతో, అవసరమైన అంతర్జాతీయ బొగ్గును కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ రేట్లకు కొనలేక, తమ సామర్థ్యంలో సగం కన్నా తక్కువ విద్యుత్తునే ఆ కేంద్రాలు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి. కేరళలో 4, మహారాష్ట్రలో 13 థర్మల్‌ విద్యుత్కేంద్రాలు మూతబడ్డాయి. పంజాబ్‌లో దాదాపు సగం థర్మల్‌ విద్యుత్కేంద్రాలు ఆగిపోయాయి. ఇక, దక్షిణాదినా పలు విద్యుత్కేంద్రాలు మూతబడే పరిస్థితి. ఇప్పటికే రాజస్థాన్‌లో రోజుకో గంట, పంజాబ్‌లో 3 గంటలు, ఢిల్లీలో విడతల వారీగా విద్యుత్‌ కోత నడుస్తోంది. అలాగే, కేరళ, గుజరాత్, తమిళనాడు, అతి తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న జార్ఖండ్, బీహార్‌ రాష్ట్రాలు సైతం పవర్‌ కట్‌ బాటలోకి వస్తున్నాయి.  

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఈ విద్యుత్‌ సంక్షోభంపై ఇప్పటికే కేంద్రానికి వివరంగా లేఖ రాశారు. కోవిడ్‌ తర్వాత విద్యుత్‌ డిమాండ్‌ 15 శాతం పెరిగిందనీ, రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్‌ కొనాలన్నా అందుబాటులో లేదనీ వాస్తవాల్ని వివరించారు. 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయింపు సహా అనేక తక్షణ పరిష్కారాలూ సూచించారు. ఢిల్లీ సహా కొందరు ఇతర ముఖ్యమంత్రులూ తమ కష్టాలు కేంద్రానికి విన్నవించారు. కానీ, సంక్షోభ పరిష్కారానికి కేంద్రం మీనమేషాలు లెక్కించింది. చైనా లాంటి చోట్ల ఇప్పటికే విద్యుత్‌ సంక్షోభం కనిపిస్తున్నా, మన పాలకులు అంతా బాగుందన్నారు. సమాచార లోపం వల్లే అనవసర భయాలన్నారు. ఎట్టకేలకు సోమవారం కేంద్ర హోమ్‌మంత్రి సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. నిజానికి, విద్యుత్‌ లాంటి విషయాల్లో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ పని సమర్థంగా చేస్తున్నట్టు కనిపించదు. 

రాష్ట్రాలు విద్యుత్‌ కోసం అధిక రేట్లకైనా సరే ప్రైవేట్‌ సంస్థల వద్దకు పరిగెత్తాల్సిన పరిస్థితి కల్పించే కుట్ర ఈ కొరతకు కారణమని కొందరి వాదన. 1957 నాటి చట్టంలో తేనున్న సవరణలతో అరణ్యాలు, గిరిజన భూముల్ని కేంద్రం సేకరించి, బొగ్గు గనుల తవ్వకాలకు ప్రైవేట్‌ వారికి కట్ట బెట్టడానికే ఇదంతా అని ఆరోపిస్తున్నవారూ లేకపోలేదు. వాటిలో నిజానిజాలు ఏమైనా, కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న వేళ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలపై అజాగ్రత్త స్వయంకృతమే. పాలకులు ‘ఆత్మ నిర్భర భారత్‌’ నినాదంతో సరిపెట్టకుండా, బొగ్గు, చమురు, సహజవాయువుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు తగిన పరిస్థితులు కల్పించాలి. 

ఇవాళ మంచినీటి లానే విద్యుత్‌ కూడా! విద్యుత్‌ లేకపోతే నాగరక జీవి మనుగడే కష్టం. అందుకే, విద్యుత్‌ రంగంలోనూ ఆచరణవాదంతో సంస్కరణలు తేవడమూ ముఖ్యం. మన దేశ విద్యుత్‌ అవసరాల్లో 90 శాతం శిలాజ ఇంధనాల నుంచి తీర్చుకుంటున్నాం. భవిష్యత్తుకు ఇది సరి కాదు. ఎక్కడైనా బొగ్గు నిల్వలు శాశ్వతంగా ఉండవు కాబట్టి, ఎప్పటికైనా పునర్వినియోగ విద్యుత్‌ వైపు మళ్ళాల్సిందే. దేశవ్యాప్తంగా సౌరశక్తి అనే ఉచిత, సహజ వనరును సమర్థంగా ఉపయోగించుకొని, సోలార్‌ పవర్‌ ఉత్పత్తి పెంచుకుంటే, సమస్యలుండవు. పవన విద్యుదుత్పత్తి పైనా గట్టిగా దృష్టి పెట్టక తప్పదు. ఆ మధ్య ఆక్సిజన్‌ కొరత... ఇప్పుడు బొగ్గు కొరత. కళ్ళ ముందున్నా సరే... సమస్యను గుర్తించడానికి నిరాకరిస్తే, కాలం గడిచేకొద్దీ కష్టమే! 

మరిన్ని వార్తలు