ఈ వేగం సరిపోదు

1 Apr, 2021 00:23 IST|Sakshi

నిరుడు సెప్టెంబర్‌లో తగ్గుముఖం పట్టడం మొదలెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి ఫిబ్రవరిలో మళ్లీ అక్కడక్కడ తలెత్తుతూ చాలా తక్కువ వ్యవధిలోనే ఉగ్రరూపం దాల్చింది. గత 24 గంటల్లో కొత్తగా 53,480 కేసులు బయటపడగా 354 మంది మరణించారు. మొత్తం 84 శాతం కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో... అంటే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్య ప్రదేశ్‌లలో వున్నాయని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా, యూరప్‌ దేశాల్లో కరోనా రెండో దశ మొదలైనప్పుడు మన దేశంలోనూ ఆ పరిస్థితి తలెత్తవచ్చునని అంటు వ్యాధుల నిపుణులు పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలూ సకాలంలో మేల్కొనలేదు.

పౌరులను అవసరమైనంతగా అప్రమత్తం చేయలేదు. మళ్లీ ఉత్సవాలు, వేడుకలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు మొదలుకావటం... అన్నీ మరిచి వాటిల్లో భారీయెత్తున ప్రజానీకం పాల్గొనటం ఎక్కువైంది. అదృష్టవశాత్తూ నిరుటితో పోలిస్తే మనం నిరాయుధంగా లేం. వైరస్‌ బారిన పడినవారికి ఏఏ పరీక్షలు జరపాలో, ఎలాంటి చికిత్స చేయాలో గతంతో పోలిస్తే మరింత స్పష్టత వచ్చింది. అంతకుమించి ఆ మహమ్మారి బారిన పడకుండా వుండేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులోకొచ్చాయి. అయితే అనేక కారణాల వల్ల వ్యాక్సిన్‌లిచ్చే ప్రక్రియ మందకొడిగానే వుంది. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అత్యధికంగా పౌరులకు టీకాలు వేస్తున్న దేశం మనదే. కానీ తలసరి సగటు చూస్తే చాలా తక్కువే. ఇప్పుడిప్పుడు  వైరస్‌ విజృంభణ గమనించాక 45 ఏళ్ల వయసు పైబడినవారికి కూడా టీకాలివ్వటం మొదలుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 

కరోనా కేసుల డేటాను పరిశీలిస్తే ఆ మహమ్మారి వ్యాప్తి ఎంత వేగంగా వుందో అర్థమవుతుంది. నాలుగైదు నెలల క్రితం అమెరికా, యూరప్‌లలో రెండో దశ మొదలైనప్పుడు సైతం దాని వ్యాప్తి ఇదే వేగంతో వుంది. సాధారణంగా ఏ దేశంలోనైనా వైరస్‌ వ్యాపిస్తున్న తీరు వెల్లడికాగానే ఆ వైరస్‌ తాలూకు జన్యు అనుక్రమణికను ఆరా తీసే పని చురుగ్గా మొదలవుతుంది. అయితే ఆ విషయంలో మనం బాగా వెనకబడివున్నాం. వెల్లడైన మొత్తం కేసుల్లో కనీసం అయిదు శాతం మేర ఈ ప్రక్రియ పూర్తి చేయగలిగితే ఆ వైరస్‌ ఆనుపానులన్నీ స్పష్టంగా వెల్లడవుతాయి. కానీ మన దేశంలో అది కేవలం 0.01 శాతం మాత్రమే. 2019 డిసెంబర్‌లో తొలిసారి చైనాలోని వుహాన్‌లో బయటపడిన కరోనా వైరస్‌ ప్రపంచం నలుమూలలా విస్తరించే క్రమంలో ఎన్నో మార్పులకు లోనైంది.

ఒక రోగి నుంచి మరొక రోగికి వ్యాపించే సమయంలో ఆ వైరస్‌ ఎన్ని రకాల ఉత్పరివర్తనాలకు లోనయిందో, ఆ క్రమంలో అది ఏవిధమైన మార్పులకు గురవుతున్నదో తెలుసుకోవాలంటే రోగుల నుంచి నమూనాలు సేకరించి, వైరస్‌ అనుక్రమణికను తెలుసుకోవటం ఒక్కటే మార్గం. ఒక వైరస్‌లోని జన్యువులను సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే దాని నిర్మాణ స్వరూపంపై అవగాహన కలుగు తుంది. అది క్షీణ దశకు చేరుకుందా, ప్రమాదకరంగా పరిణమించిందా అన్నది తేలుతుంది. అది తెలిస్తే ప్రజారోగ్య రంగంలో అనుసరించాల్సిన వ్యూహాలకు రూపకల్పన చేయటం, అందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయటం, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సులభమవుతుంది.

అలాగే వైరస్‌ ఏ ప్రాంతంలో అధికంగా వుందో, అది ఎక్కువగా ఎవరి ద్వారా వ్యాపిస్తున్నదో గుర్తించ గలుగుతారు. దాంతోపాటు వైరస్‌పై పరిశోధనలు చేస్తున్నవారికి సరైన వ్యాక్సిన్‌లను రూపొం దించటంలో, ఇతరత్రా చికిత్సలను సూచించటంలో తోడ్పడుతుంది. కరోనా వైరస్‌ మహమ్మారి సృష్టించిన విలయంతో తప్పనిసరిగా అమలు చేయల్సివచ్చిన లాక్‌డౌన్‌లు, వాటి పర్యవసానంగా అన్ని రంగాలూ స్తంభించిపోవటం కారణంగా సాధారణ ప్రజానీకం ఎన్నో అగచాట్లు పడింది. మరోసారి ఆ పరిస్థితి తలెత్తకూడదనుకుంటే టీకాలిచ్చే కార్యక్రమం మాత్రమే కాదు...ఇలా వైరస్‌ జన్యు అనుక్రమణికను తెలుసుకోవటం కూడా ముఖ్యం. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన వైరస్‌ రకం 18 రాష్ట్రాల్లో 736మందికి సోకిందని గుర్తించారు. మరో 34మందికి దక్షిణాఫ్రికా రకం వైరస్‌ సోకిందని తేల్చారు. ఒకరికి బ్రెజిల్‌ రకం వైరస్‌ ఉందట. ఇవన్నీ వారంక్రితంనాటి లెక్కలు. ఇప్పుడు ఈ సంఖ్య మరిన్ని రెట్లు పెరిగివుంటుంది. ఇలా వివిధ రకాల కరోనా వైరస్‌ల వల్ల రోగ లక్షణాలను నిర్ధారించటంలో, దాన్ని నివారించటానికి ఇవ్వాల్సిన ఔషధాలను, వ్యాక్సిన్లను నిర్ణయించటంలో ఇబ్బందులెదురవుతాయి. 

మన దేశంలో ప్రజారోగ్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలేమిటో, అందులోని లోటు పాట్లేమిటో కరోనా మహమ్మారి ప్రభావవంతంగా ఎత్తిచూపింది. అయితే దాన్నుంచి అవస రమైనమేర గుణపాఠాలు తీసుకోవటంలో విఫలమయ్యామని మనకెదురవుతున్న అనుభవాలు రుజువు చేస్తున్నాయి. వ్యాధి నిరోధకత మన దేశంలో ఎక్కువని సంబరపడే పరిస్థితులు లేవని కరోనా రెండో దశ తాజాగా రుజువు చేస్తోంది.  పాశ్చాత్య దేశాల్లో మాదిరే ఇక్కడా వేగంగా వైరస్‌ వ్యాపిస్తున్న తీరు మనం తక్షణం మేల్కొనాలని తెలియజెబుతోంది. నిరుడు కరోనా తీవ్రతను సకాలంలో గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో విఫలమైన బ్రిటన్, అమెరికాలు టీకాలివ్వటంలో మాత్రం అందరికన్నా ముందున్నాయి. ఆ చురుకుదనాన్ని మనం సైతం అందు కోగలగాలి.  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు