జీవనయానం వలస ప్రయాణం

18 Oct, 2021 00:21 IST|Sakshi

చరిత్ర గురించి చాలా నిర్వచనాలే ఉండొచ్చు. స్థూలంగా మానవుల వలస పరిణామాన్ని నమోదు చేసే కథనమే చరిత్ర. వలసలు లేకుండా మానవాళికి మనుగడ లేదు. చరిత్ర అంతా వలసల మయమే! ప్రకృతి సానుకూలత లేని ప్రదేశాలను విడిచిపెట్టి, సురక్షిత ప్రదేశాలకు వలస వచ్చిన మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు నాగరికతలు ఏర్పడ్డాయి. నాగరికతల పరిణామ క్రమంలో స్థిర నివాసాల సంస్కృతి వ్యాప్తిలోకి వచ్చినంత మాత్రాన మనుషుల వలసలు ఆగిపోలేదు. ప్రకృతి బీభత్సాల నుంచి, యుద్ధాల నుంచి, నియంతృత్వ పీడనల నుంచి, కరవు కాటకాల నుంచి వీలైనంత దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవడానికే మనుషులు ప్రయత్నిస్తారు. పుట్టిపెరిగిన చోట చాలీచాలని బతుకులను బలవంతంగా నెట్టుకొచ్చే కంటే, ఎంత దూరమైనా వెళ్లి బతుకులను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మెరుగైన జీవితాల కోసం మనుషులు తాము పుట్టి పెరిగిన ప్రదేశాలను విడిచిపెట్టి, దేశాలను దాటి వలసలు వెళుతూనే ఉన్నారు. వలసలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. భూమ్మీద మనుషులే కాకుండా, జలచర ఖేచరాదులు కూడా సానుకూల పరిసరాలను వెదుక్కుంటూ సుదూర ప్రదేశాలకు వలస వెళతాయి. ఇప్పుడు మన దేశంలో వలసపక్షుల కాలం మొదలైంది. 

ఖండాంతరాలను దాటి శరదృతువులో ఇక్కడకు చేరుకునే నానాజాతుల పక్షులు వసంత రుతువు వరకు ఉంటాయి. మనుషుల వలసలకు, పక్షుల వలసలకు తేడాలున్నాయి. మనుషులకు తాము పుట్టి పెరిగిన ప్రదేశం కంటే వలస వచ్చిన ప్రదేశమే సురక్షితంగా, తమ అభివృద్ధికి భేషుగ్గా ఉన్నట్లయితే, అక్కడే స్థిరపడిపోయి, తరతరాలుగా పాతుకుపోతారు. పాపం, పక్షులు అలా కాదు. వాటి వలసలన్నీ కేవలం రుతుధర్మాన్ని అనుసరించే సాగుతాయి. వలసల్లో పక్షుల క్రమశిక్షణ తిరుగులేనిది. కచ్చితంగా నిర్ణీత కాలానికి వస్తాయి.æఅంతే కచ్చితంగా నిర్ణీత కాలానికి తమ తమ నెలవులకు తిరిగి వెళ్లిపోతాయి. మనుషుల మాదిరిగా ఆస్తులు కూడబెట్టుకుని, శాశ్వతంగా ఉండిపోవాలనుకోవు. శరదృతువు ఆగమనంతోనే మన దేశంలోని ప్రధానమైన సరస్సుల వద్ద వలసపక్షుల సందడి మొదలవుతుంది. ఒడిశాలోని చిలికా, ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్, కొల్లేరు, గుజరాత్‌లోని నలసరోవర్, కేరళలోని కుమరకోమ్‌ వంటి సరస్సుల వద్దకు, పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్,  అరుణాచల్‌లోని ఈగల్‌నెస్ట్‌ వంటి అభయారణ్యాలకు వందలాది జాతులకు చెందిన లక్షలాది వలస పక్షులు వస్తాయి. ధ్రువప్రాంతంలోని శీతల వాతావరణానికి దూరంగా, కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలకు ఈ పక్షులు వలస వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. పిల్లలకు రెక్కలు రాగానే, వాటితో కలసి వేసవి మొదలవుతుండగా తిరిగి వెళ్లిపోతాయి. 

వలసల్లో మనుషుల పద్ధతి కాస్త భిన్నం. తరతరాల కిందట మన దేశం నుంచి వలసవెళ్లిన మనవారు వివిధ దేశాల్లో పూర్తిగా స్థిరపడిపోయారు. కొన్ని దేశాల్లో అధికార పదవులనూ దక్కించుకున్నారు. అలాగని వలసలన్నీ సుఖప్రదమైన ప్రయాణాలు కావు. పక్షులకైనా, మనుషులకైనా వలసల్లో ఆటుపోట్లు, అడుగడుగునా ప్రమాదాలూ తప్పవు. ప్రకృతి వైపరీత్యాల నుంచి వలసపక్షులకు మార్గమధ్యంలో ఆపదలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ అధిగమించి సానుకూల వాతావరణంలోకి వలస వచ్చి, గూళ్లు ఏర్పాటు చేసుకున్నా, వాటి మనుగడకు పూర్తి భద్రత ఉండదు. వేటగాళ్ల వలలకు, ఉచ్చులకు చిక్కి బలైపోతుంటాయి. ఇన్ని కష్టనష్టాల తర్వాత ప్రాణాలతో మిగిలినవి మాత్రమే తిరిగి తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోగలుగుతాయి. బతుకుతెరువు కోసం వలస వెళ్లే మనుషుల పరిస్థితీ అంతే! ఇక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే కార్మికులు దళారుల చేతిలో మోసపోయి, వెట్టి చాకిరి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. అనుకోని దుర్ఘటనల్లో అయినవారికి దూరంగా ప్రాణాలు పోగొట్టుకునే ఉదంతాలూ ఉన్నాయి.

మంచు గడ్డకట్టే శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు ఏకకణ జీవి అమీబా మొదలుకొని, క్షీరదమైన మంచు ఎలుగుబంటి వంటి జీవులు శీతాకాలమంతా ఉన్న చోటనే కదలకుండా పడిఉండి సుప్తావస్థలో గడుపుతాయి. నిత్యచైతన్యశీలత కలిగిన పక్షులు ఇలా సుప్తావస్థలోకి జారుకోలేవు. అందుకే తమ స్వేచ్ఛా విహారానికి తగిన మెరుగైన పరిసరాలను అన్వేషిస్తూ వలసలు ప్రారంభిస్తాయి. వాతావరణం ఎంత ప్రతికూలంగా మారినా, ఎక్కడికక్కడే ఉండిపోయి సుప్తావస్థలోకి జారుకోవడం స్తబ్ధతకు పరాకాష్ఠ! ఇలాంటి స్తబ్ధత కొందరు మనుషుల్లోనూ ఉంటుంది. పరిస్థితుల్లోని మార్పులకు స్పందించకుండా, ఎలాంటి కదలికా లేకుండా శీతలనిద్రలోకి జారుకునే మనుషులు చరిత్ర ప్రవాహంలో ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోతారు. బలమైన ఆకాంక్షలతో వలసల బాట పట్టిన సమూహాలు, వ్యక్తులు చరిత్రగతిని మార్చేసిన ఉదంతాలు మనకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చిన సమూహాలు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని, శతాబ్దాల తరబడి పాలన సాగించాయి. స్థానికులపై నిర్దాక్షిణ్యంగా అణచివేత సాగించాయి. ఉన్నత విద్య కోసం బ్రిటన్‌కు, ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన గాంధీజీ, తన వలస ప్రస్థానాన్ని స్వాతంత్య్రోద్యమానికి పునాదిగా మలచుకున్నారు. శ్వేతజాతీయుల వలస ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తే, గాంధీజీ వంటి జాతీయ నాయకుల వలస ఈ దేశ స్వాతంత్య్రానికి ఊపిరిపోసింది. అన్ని ప్రయాణాల్లో మాదిరిగానే వలసల్లోనూ ప్రమాదాలు అనివార్యం. అంతమాత్రాన వలసలు ఆగిపోవు, చరిత్రా ఆగిపోదు! 

మరిన్ని వార్తలు