మయన్మార్‌లో నరమేథం

31 Mar, 2021 01:11 IST|Sakshi

మయన్మార్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని రెండునెలల క్రితం కుట్రపూరితంగా కూల్చి పాలన చేజి క్కించుకున్న సైనిక నియంతలు ఉన్నకొద్దీ ఉన్మాదులుగా మారుతున్నారు. అర్థరాత్రుళ్లు ఇళ్లపైబడి రాళ్లదాడి చేయటం, కాల్పులు సాగిస్తూ బీభత్సం సృష్టించటం, తలుపులు తెరవకపోతే వాహనాలతో ఢీకొట్టి పగలకొట్టడం నిత్యకృత్యమైంది. ఆ తర్వాత తమకు ‘కావలసిన’ వ్యక్తులు దొరికితే సంకెళ్లువేసి తీసుకుపోతున్నారు. రోజులు, వారాలు గడుస్తున్నా తమవారి ఆచూకీ తెలియక కుటుం బాలు రోదిస్తున్నాయి. చాలా సందర్భాల్లో శవాలను తిరిగి అప్పగిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు సాయుధ దళాల గౌరవార్థం శనివారం జరిగిన దినోత్సవంనాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ప్రజానీకంపై కాల్పులు జరిపి 114మందిని కాల్చిచంపారు. తాజాగా జనావాసాలపై విమానదాడులు కూడా మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పటినుంచీ సైన్యం చేతుల్లో 450మంది మరణించగా, దాదాపు 3,000మంది అరెస్టయ్యారు. వందలాదిమంది జాడ తెలియడం లేదని ఆగ్నేయాసియా పార్లమెంటేరియన్ల బృందం చెబుతోంది. 

వీధుల్లోకి ఎవరూ రాకూడదని, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులున్నాయని సైన్యం ప్రతిరోజూ ప్రకటిస్తున్నా నిరసనలు ఆగకపోవటం ఆ దేశ పౌరుల స్వేచ్ఛా పిపాసకు అద్దం పడుతోంది. ఇదే సైన్యానికి కంటగింపుగా వుంది. మయన్మార్‌ సైన్యానికి జనం నాడి తెలియనిదేమీ కాదు. అర్థ శతాబ్దికిపైగా ఆ దేశాన్ని గుప్పిట బంధించినప్పుడు వారికి నిరంతరం ఛీత్కారాలే ఎదురయ్యాయి. ఇలా ఎల్లకాలమూ మనుగడ సాగించటం సాధ్యంకాదని 2015లో ఎన్నికలకు సిద్ధపడింది. అయితే తమ పెత్తనం యధావిధిగా సాగించేందుకు వీలుగా పార్లమెంటులో 25 శాతం స్థానాలను ఏకపక్షంగా తనకు తాను రిజర్వ్‌ చేసుకుంది. తన వ్యూహానికి ఇది సరిపోకపోవచ్చన్న ఉద్దేశంతో మాజీ సైనికాధికారులతో యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవెలప్‌మెంట్‌ పార్టీ(యూఎన్‌డీపీ) పేరిట ఒక పార్టీని కూడా నెలకొల్పింది. గత నవంబర్‌ ఎన్నికల్లో ఈ వ్యూహం అక్కరకు రాకుండాపోయి ఆంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ)కే మెజారిటీ లభించటంతో దానికి కాళ్లూ చేతులూ ఆడలేదు. అందుకే మరోసారి సైనిక నియంతృత్వానికి తెగబడింది. 

మయన్మార్‌ బహుళ జాతుల నిలయం. ఈ జాతులన్నిటి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక ప్రజాస్వామిక వేదిక అవసరం. ఇది లేని కారణంగానే యాభైయ్యేళ్లపాటు దాదాపు అన్ని జాతులూ తమ ప్రయోజనాల పరిరక్షణకు ఘర్షణనే మార్గంగా ఎంచుకున్నాయి. ఇవి ఉన్నకొద్దీ ముదిరి, పాలన అదుపు తప్పటం సైన్యానికి తలనొప్పిగా పరిణమించింది. ఈ అనుభవాల తర్వాతే మయన్మార్‌ సైన్యం కనీసం ప్రత్యక్షంగా పాలించే విధానానికైనా దూరంగా వుండాలని 2015లో నిర్ణయించుకుంది. కానీ గత అయిదారేళ్లుగా అది ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విషాదమేమంటే ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ సైతం ఆ స్పృహలో లేకపోవటం. మయన్మార్‌లో ప్రజాస్వామ్యం మళ్లీ మొగ్గ తొడిగే సమయానికి సాయుధ పోరాటబాట పట్టిన 15 ముఖ్యమైన జాతుల్లో ఏడెనిమిది జాతులు ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

రోహింగ్యా ముస్లింలు అందులో లేరు. అనంతరం వచ్చిన ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వం వారిని కూడా శాంతిప్రక్రియలో భాగం చేసివుంటే, బుద్ధిస్ట్‌ మిలిటెంట్లను కట్టడి చేస్తే పరిస్థితి వేరుగా వుండేది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా, రోహింగ్యాలపై దమనకాండ అమలు చేసిన సైన్యం తీరును చూసీచూడనట్టు వూరుకుంది. సరిగదా...అంతర్జాతీయ వేదికపై సాక్షాత్తూ సూకీయే సైన్యాన్ని సమర్థించారు. వారికి ఓటు హక్కు కూడా లేకుండా చేయటం ఆమెకు  ఏమాత్రం అన్యాయం అనిపించలేదు. దాని పర్యవసానాలేమిటో ఇప్పుడామెకు అర్ధమైవుండాలి. ప్రజాస్వామ్యమంటే సైన్యం నుంచి తన పార్టీకి అధికారమార్పిడి జరగటం కాదు. ప్రజాస్వామ్య సంస్కృతి సమాజంలోని అన్ని స్థాయిల్లోనూ నెలకొనటం. గత అయిదేళ్లలో అలాంటి సంస్కృతి వేళ్లూనుకుంటే సైన్యం మళ్లీ అధికారం హస్తగతం చేసుకోవటం ఇంత సులభమయ్యేది కాదు. 

మయన్మార్‌ సైన్యం ఆగడాలపై ఆలస్యంగానైనా ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. 12 దేశాల సైనిక చీఫ్‌లు నిరాయుధ పౌరులపై కాల్పులు జరపటాన్ని, బాంబుదాడులు చేయటాన్ని ఖండించారు. అయితే ఒకపక్క సైన్యం ప్రజలను పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తుంటే సైనిక దినోత్సవంలో మన దౌత్యకార్యాలయ ప్రతినిధితోపాటు రష్యా,  చైనా, పాకిస్తాన్‌ తదితర ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుంది. మయన్మార్‌తో మనకు 1,600 కిలోమీటర్ల సరిహద్దు వుంది.

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ ఆ పొడవునే వున్నాయి. మయన్మార్‌లో సైన్యం దారుణాలు పెచ్చరిల్లాక ఒక్క మిజోరంకే దాదాపు 1,500మంది ఆ దేశ పౌరులు కుటుంబాలతోసహా ప్రాణభయంతో వచ్చారు. వీరిలో మయన్మార్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వున్నారు. ఉన్నకొద్దీ ఇది పెరుగుతుందే తప్ప తగ్గదు. కనుక మయన్మార్‌ అల్లకల్లోలంగా ఉన్నంతకాలమూ అది మన దేశంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. అందుకే సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తగిన చర్యలు తీసుకోమని మయన్మార్‌ సైన్యానికి చెప్పాల్సిన బాధ్యత మనపై వుంది. 

మరిన్ని వార్తలు