మంచుకొండల ఆత్మఘోష

8 Oct, 2021 00:52 IST|Sakshi

మంచుకొండల కాశ్మీరం మళ్ళీ రక్తమోడుతోంది. బరి తెగించిన ముష్కరుల దాడుల్లో అమాయకులు బలి కావడం పెరిగింది. కొద్దిరోజులుగా జమ్మూ – కశ్మీర్‌లో జరుగుతున్న వరుస సంఘటనల్లో అక్కడి అల్పసంఖ్యాక వర్గాలైన కశ్మీరీ పండిట్లు సహా అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భద్రతాదళాల ప్రాణత్యాగం చేయడం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. కానీ, గడచిన ఆరేళ్ళ గణాంకాల లెక్కలు తీస్తే తీవ్రవాదులు రూటు మార్చి, భద్రతాదళాల బదులు ఇప్పుడు పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. పేరున్న వ్యక్తులు, కశ్మీర్‌ లోయలోని స్థానికేతరులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కశ్మీరీ పండిట్‌ అయిన ప్రసిద్ధ కెమిస్ట్‌ సహా ముగ్గురు పౌరులను మంగళవారం కొద్ది గంటల వ్యవధిలో తీవ్రవాదులు కాల్చి చంపడం అందుకు ఉదాహరణ. వేర్పాటువాద హురియత్‌ కాన్ఫరెన్స్‌ సహా పార్టీలన్నీ దీన్ని ఖండించాయి. 

ఆ రక్తపుమరకలు ఆరక ముందే గురువారం శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి తుపాకీలు ధరించిన ఆగంతుకులు చొచ్చుకు వచ్చి, టీ తాగుతున్న ప్రిన్సిపాల్‌పై, మరో కశ్మీరీ పండిట్‌ టీచర్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి, ప్రాణాలు తీయడం మరో తీరని విషాదం. జనంతో మమేకమయ్యేందుకు కేంద్ర మంత్రులు పలువురు తొమ్మిది వారాల కార్యక్రమం చేస్తున్న సమయంలో గత పది రోజుల్లో ఇలా ఏడుగురు పౌరులు బలి కావడం గమనార్హం. బీజేపీ తెచ్చిన పునర్వ్యవస్థీకరణ చట్టంతో కొత్తగా ఏర్పడ్డ ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ నెలలోనే హోమ్‌ మంత్రి అమిత్‌ షా కూడా పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలో ఈ వరుస దాడులు, హత్యలు కలవరపరిచే విషయాలు. కాశ్మీరం కళకళలాడుతోందంటున్న పాలకుల మాటల్లోని డొల్లతనానికి నిదర్శనాలు. 

మతపరంగా అస్థిరతను సృష్టించి, అల్పసంఖ్యాకుల్లో భయాన్ని పెచ్చరిల్ల జేయడం కోసమే ఈ దాడులని సాక్షాత్తూ డీజీపీయే చెప్పారు. 2016 నుంచి గత ఆరేళ్ళలో కశ్మీర్‌లో ఇదే ధోరణి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉత్తిపుణ్యానికి 27 మంది పౌరుల ప్రాణాలు తీవ్రవాదపు కోరలకు చిక్కాయి. తాజాగా ఆరెస్సెస్‌కు పని చేస్తున్నారంటూ సుప్రసిద్ధ ఫార్మసిస్టునూ, పోలీసు ఇన్ఫార్మర్‌ అంటూ బీహారీ వీధి వర్తకుణ్ణీ – ఇలా రకరకాల నెపాలతో తీవ్రవాదులు దారుణకాండకు దిగుతున్నారు. పాకిస్తాన్‌లోని లష్కరే తాయిబాకు ఇక్కడి మరోరూపమైన ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’, మరోపక్క ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ జమ్మూ– కశ్మీర్‌’ లాంటి వేర్వేరు సంస్థలు ఈ దారుణాలకు పాల్పడింది తామేనని ప్రకటించుకోవడం నివ్వెరపరుస్తోంది. నిఘా వర్గాల వైఫల్యాన్ని పట్టి చూపిస్తోంది.

కశ్మీర్‌లోని ప్రముఖ వ్యాపారులే లక్ష్యంగా కొన్నాళ్ళుగా దాడులు జరుగుతున్నాయి. ఏ వర్గంతోనూ సంబంధం లేని అమాయకులను చంపడం ద్వారా దశాబ్దాలుగా అక్కడ శాంతియుతంగా జీవిస్తున్న అల్పసంఖ్యాకులను భయపెట్టడమే పరమార్థం. పండిట్లు కశ్మీర్‌కు సత్వరమే తిరిగొచ్చేందుకు వీలు కల్పిస్తూ, ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించడమే తీవ్రవాదుల దృష్టిలో ఆ ఫార్మసిస్టు చేసిన తప్పు. కశ్మీర్‌కు తిరిగిరావాలనుకొనే వారిని హెచ్చరించడమే వారి ఉద్దేశం. ‘స్థానికులు కానివారెవరూ ఇక్కడకు రాకూడదు, జీవనం గడపకూడద’న్న అవాంఛనీయ ధోరణికీ, అసహనానికీ ఈ ఘటనలు సూచిక. ఈ నీచప్రయత్నాలకు ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. రోజువారీ వ్యవహారంగా మారిన హింసకు ముగింపు పడేలా చూడాలి. ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వానికి తావివ్వకుండా పగ్గాలను తమ చేతిలోనే ఉంచుకోవాలనే ధోరణినీ సత్వరమే వదిలించుకోవాలి. ఏళ్ళూపూళ్ళ కశ్మీర్‌ సమస్యకు పైపూతలు పనికిరావు. లోతైన పరిష్కారమే శరణ్యం. 

జరుగుతున్న ప్రతి దాడీ, పోతున్న ప్రతి ప్రాణం గుర్తుచేస్తున్నది అదే! ఇలాంటి పరిస్థితుల్లోనూ ముష్కరుల చేతిలో ఫార్మసిస్టు మఖన్‌లాల్‌ బింద్రూ అసువులు బాసినప్పుడు, ఆ కుటుంబ సభ్యులు గుండె దిటవుతో మాట్లాడిన తీరు జాతికి స్ఫూర్తిదాయకం. ‘ఆ దుండగులు తుపాకులతో ఈ దేహాన్ని కాల్చవచ్చు. కానీ, మా ఆత్మనూ, మా ఈ స్ఫూర్తినీ చంపలేరు’ అన్న ఉద్వేగభరితమైన మాటలు చాలాకాలం చెవులలో రింగుమంటాయి. తీవ్రవాదం పంజా విసిరిన 1990లలో ఎందరో పురిటిగడ్డను వీడిపోయినా, హిమసీమలనే అంటిపెట్టుకొని బతుకుతున్న ఇలాంటి కొద్ది కశ్మీరీ పండిట్ల కుటుంబాల నైతిక స్థైర్యం అనుసరణీయం. అక్కడ ఇప్పుడు అందరికీ కావాల్సిన పరమౌషధం అదే. 

మరి, అంతటా భయం, అందరిపైనా అనుమానం నెలకొన్న కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి పాలకులు ఏం చేస్తున్నారు? జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికో, ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికో ‘నయా కశ్మీర్‌ నిర్మాణం’ నినాదాలను కేంద్ర పాలకులు ఎత్తుకుంటే సరిపోతుందా? కశ్మీర్‌పై పాకిస్తాన్‌ కుయుక్తులు, ఈ దాడులతో ప్రజలకు చేరవేయదలుచుకున్న భావం ఏమిటో తెలుస్తూనే ఉంది. కానీ, అదే సమయంలో కశ్మీర్‌లో నిద్రాణంగా ఆగ్రహం, బాధ, ఆవేదన గూడుకట్టుకున్నాయన్నది వాస్తవం. ఆ సంగతి గుర్తించాలి. భారత అనుకూల భావాలు తగ్గుతూ, వేర్పాటువాదానికి ఊతం అందుతున్న తీరును ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలను కలుపుకొని, తగిన చర్యలు చేపట్టాలి. జూన్‌లో ప్రధాని జరిపిన అఖిలపక్షం తదుపరి కర్తవ్యాన్ని చేపట్టాలి. అలా కాకుండా, పెట్టుబడులు, పర్యాటకులు, రోడ్ల నిర్మాణం, విద్యుదుత్పత్తి లాంటి మాటలు చెప్పి, గణాంకాల లెక్కలతో కశ్మీర్‌ శాంతిసౌభాగ్యాల సీమ అని నమ్మబలికితే అది ఆత్మవంచనే. కశ్మీరే కాదు... దేశం దాన్ని ఎంతోకాలం భరించలేదు.  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు