సాధికారతలో మరింత వెనక్కి...

3 Apr, 2021 03:26 IST|Sakshi

మన దేశంలో స్త్రీ, పురుష సమానత్వం గంభీరోపన్యాసాలకే పరిమితమవుతున్నది తప్ప ఆ దిశగా నిర్మాణాత్మకమైన ఆలోచన, ఆచరణ వుండటం లేదని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక కుండబద్దలు కొట్టింది. మరో నాలుగు నెలల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపు కోబోతున్నాం. మన రాజ్యాంగం స్త్రీ, పురుషుల సమానత్వాన్ని ప్రబోధిస్తోంది. సకల రంగాల్లో వారికి అర్ధవంతమైన భాగస్వామ్యం ఇచ్చినప్పుడే దేశ పురోగతి సాధ్యమవుతుందని నేతలు చెబు తుంటారు. తీరా మన ప్రోగ్రెస్‌ రిపోర్టులు తీసికట్టుగా వుంటాయి. ఏం చెబుతోంది తాజా నివేదిక? భారత్‌లో సమానత్వం ఎండమావేనని దండోరా వేస్తోంది. మహిళలకు ఏ దేశం ఏమేరకు అవకాశాలిస్తున్నదో, ఎక్కడెక్కడ సమానత్వం ఏ స్థాయిలోవుందో తెలుసుకునేందుకు 156 దేశాలను అధ్యయనం చేసిన డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక నిరుటితో పోలిస్తే మన దేశం 28 స్థానాలు కిందకుపోయి 140వ స్థానంలో వున్నదని ప్రకటించింది. ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ(జీజీజీఐ)లో దక్షిణా సియాలో మనకంటే తీసికట్టుగా వున్నవి పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌ మాత్రమే! పాకిస్తాన్‌ 153వ స్థానంలోనూ, అఫ్ఘానిస్తాన్‌ 156వ స్థానంలోనూ వున్నాయి. అవి రెండూ ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు వుండవు కనుక మనకు ఈ స్థానం పదిలమని, ఇంతకంటే దిగజారే అవకాశం లేదని భావించాలి. విషాదం ఏమంటే సరిగ్గా 50 ఏళ్లక్రితం మన చేయూతతో స్వతంత్ర దేశంగా అవ తరించిన బంగ్లాదేశ్‌ 65వ స్థానంలో వుంది. ఆఖరికి నేపాల్‌ సైతం 106వ స్థానంలోవుంది. శ్రీలంక 116, భూటాన్‌ 130 స్థానాల్లో నిలిచాయి. మహిళల స్థితిగతులు ఎక్కడెలా వున్నాయో నిర్ధారిం చటానికి ప్రధానంగా నాలుగు అంశాలను జీజీజీఐ పరిగణనలోకి తీసుకుంది. ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యం, వారికుంటున్న అవకాశాలు... విద్యలో పురోగతి... ఆరోగ్యం... రాజకీయ సాధి కారతలను ప్రాతిపదికగా తీసుకుని ఈ అంచనాలకొచ్చింది. ఐస్‌లాండ్‌ స్త్రీ, పురుష సమానత్వంలో వరసగా 12వసారి అగ్రస్థానంలోవుంది. 

కరోనా మహమ్మారి భూగోళాన్ని చుట్టుముట్టాక దాదాపు అన్ని దేశాల్లో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. అంతో ఇంతో సాధించిన పురోగతి కాస్తా వెనక్కి వెళ్లింది. అయితే ఈ తిరోగమనం అన్నిచోట్లా ఒకేలా లేదు. కొన్ని దేశాలు ఈ మహమ్మారి సృష్టించిన అవరోధాలను చాలావరకూ తట్టుకోగలిగాయి. ప్రపంచ దేశాల్లో ఇప్పుడున్న పురోగతి ఆధారంగా లెక్కేస్తే స్త్రీ, పురుష సమానత్వం 99.5 ఏళ్లకుగానీ సాధ్యపడదని గతంలో చెప్పిన డబ్ల్యూఈఎఫ్‌ వర్తమాన పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని దాదాపు 136 ఏళ్ల తర్వాతే సమానత్వం సాధ్యమని తాజాగా అంచనా వేస్తోంది. కరోనా పంజా అనంతరం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల పరిశ్రమలు మూతబడి అందరి ఉపాధి దెబ్బతింది. కానీ ఈ ధోరణి స్త్రీ, పురుషులకు సమానంగా లేదు. మగవారితో పోలిస్తే మహిళల ఉపాధి అవకాశాలే తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఆక్స్‌ఫాం నివేదిక లాక్‌డౌన్‌ కాలంలో ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలతోపాటు లింగ వ్యత్యాసం కూడా చాలా ఎక్కువుందని తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లోని పరిశ్రమల్లోనూ మారిన పరిస్థితుల్లో వ్యయాన్ని అదుపు చేయటానికి సిబ్బందిని తగ్గించాల్సివస్తే పురుషులకన్నా మహిళలనే అధికంగా తొలగిస్తున్నాయి. కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం తక్కువగా వున్న దేశాల్లో మన దేశం ఒకటి. గతంలో అది 24.8 శాతంగా వుండగా ఇప్పుడది 22.3 శాతానికి తగ్గింది. వృత్తి నైపుణ్యం, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం 29.2 శాతానికి పడిపోయింది. సీనియర్, మేనేజ్‌మెంట్‌ పదవుల్లో మహిళలు 14.6 శాతంమంది మాత్రమే. అత్యున్నత స్థాయి సారథ్య పదవుల్లో వారి వాటా కేవలం 8.9 శాతం. ఇక స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం సంగతి చెప్పనవసరమే లేదు. లాక్‌డౌన్‌ అనంతరం ఆ వ్యత్యాసం మరింతగా పెరిగింది. పురుషులు పొందే ఆదాయంతో పోలిస్తే మహిళల ఆదాయం అయిదోవంతు మాత్రమే వున్నదని నివేదిక తెలిపింది. ఈ అంశంలో పది అట్టడుగు దేశాల్లో భారత్‌ కూడా ఒకటి.

రాజకీయ రంగంలో మహిళా సాధికారత సాధిస్తే అది సమాజంలో అన్ని రంగాలనూ ప్రభా వితం చేస్తుంది. కానీ మన దేశంలో అది రాను రాను మరింత తగ్గుతున్నదే తప్ప పెరగటం లేదు. పార్లమెంటులో మహిళా భాగస్వామ్యం ఎప్పటిలాగే 14.4 శాతం దగ్గర స్థిరంగా వుండిపోగా, మహిళా మంత్రుల సంఖ్య 2019తో పోలిస్తే బాగా తగ్గిందని డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక తెలిపింది. 2019లో అది 23.1 శాతంకాగా, ఇప్పుడు 9.1 శాతం మాత్రమే. అంటే సమాజానికి ఆదర్శంగా వుండాల్సిన రాజకీయ రంగం మహిళలకు సాధికారత కల్పించటంలో బాగా వెనక్కిపోయిందన్న మాట! చట్టసభల్లో మహిళలకు మూడోవంతు స్థానాలు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు దీర్ఘ కాలంగా మూలనపడింది. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవుల దగ్గరనుంచి స్థానిక సంస్థల సారథ్యం వరకూ మహిళలకు సముచితమైన స్థానం కల్పించారు. విద్యారంగం వరకూ మన దేశం సాధిస్తున్న ప్రగతి మెచ్చదగ్గదిగానే వున్నదని డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక చెబుతోంది. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య రంగాల్లో బాలురు, బాలికల మధ్య అంతరం తగ్గుముఖం పడుతోందని నివేదిక వెల్లడించింది. మహిళా సాధికారత గురించి తరచుగా మాట్లాడే పాలకులు డబ్ల్యూఈఎఫ్‌ తాజా నివేదిక చూశాకైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అన్ని స్థాయిల్లోనూ లోటుపాట్లు సరిద్దాలి. 

>
మరిన్ని వార్తలు