అస్సాం ఎటువైపు?

18 Mar, 2021 00:10 IST|Sakshi

ఎన్నికలు జరగబోతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం వుందని అత్యధికులు పరిగణించే రాష్ట్రం అస్సాం. 126 స్థానాలుండే రాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 27, ఏప్రిల్‌ 1, 6 తేదీల్లో మూడు దఫాలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు అన్ని సర్వేలూ అస్సాం మళ్లీ బీజేపీదేనని జోస్యం చెప్పాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో కొచ్చినప్పటినుంచీ ఆదివాసీలతోసహా అన్ని వర్గాల్లోనూ చొచ్చుకుపోతూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బీజేపీ తన పునాదిని పటిష్ట పరుచుకుంది. అయితే ఆ పార్టీకి నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలతోపాటు మరో రెండు ప్రధాన సమస్యలున్నాయి. ఇంతవరకూ బీజేపీ కూటమిలో భాగస్వామిగా వున్న బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(బీపీఎఫ్‌), ఇప్పుడు కాంగ్రెస్‌ కూటమికి వలసపోయింది. అలాగే జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లపై 2019లో సాగిన ఉద్యమాలు కూడా బీజేపీ గెలుపు అవకాశాలను ప్రభావితం చేయొచ్చన్నది విశ్లేషకుల అంచనా. రెండు సంవత్సరాలక్రితం ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల య్యాక రాష్ట్రంలో అలజడి రేగింది. దాదాపు 20 లక్షలమంది ఇక్కడి పౌరులు కారని నిర్ధారించటం అందుకు కారణం. వీరంతా ఈ దేశస్తులమేనని నిరూపించుకోవటానికి అవసరమైన పత్రాలు లేని నిరక్షరాస్యులు, నిరుపేద వర్గాలవారు.

చివరకు దీన్ని రద్దు చేసి, దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోయే ఎన్‌ఆర్‌సీలో అస్సాంను కూడా చేర్చమని ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరాల్సివచ్చింది. అటుపై సీఏఏ పార్లమెంటులో ఆమోదం పొందాక దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు అస్సాం కూడా భగ్గుమంది. అయితే వేరే రాష్ట్రాల్లో సీఏఏను వ్యతిరేకించటానికీ, అస్సాంలో వ్యతిరేకించటానికీ వ్యత్యాసం వుంది. వేరేచోట్ల ఈ చట్టాన్ని ప్రధానంగా ముస్లింలు వ్యతిరేకించారు. ఆ పేరుతో తమపై ఈ దేశ పౌరులు కారన్న ముద్రేస్తారన్నది వారి ఆందోళనకు మూలం. కానీ అస్సాంలో ముస్లింలతో సహా అందరూ సీఏఏను వ్యతిరేకించారు. ఇరుగు పొరుగు దేశాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మైనారిటీ మతస్తులకు ఆశ్రయమిచ్చేందుకు ఆ చట్టం అవకాశమివ్వటమే అందుకు కారణం. ఈ చట్టం మాటున బంగ్లాదేశ్‌లో వుండే హిందువులు తమ రాష్ట్రానికి వెల్లువలా వస్తారని స్థానికుల భయం. అస్సామేతరులెవరూ ఉండటానికి వీల్లేదని వారి వాదన. ఈ విషయంలో గత నాలుగు దశా బ్దాలుగా ఉద్యమాలు సాగుతూనేవున్నాయి. ఆ ఉద్యమాలే అసోం గణ పరిషత్‌(ఏజీపీ) ఆవిర్భావా నికి దారితీశాయి. బీపీఎఫ్‌ బీజేపీ కూటమికి దూరం కావటానికి కూడా ఆ పార్టీకి సీఏఏపై వున్న వ్యతిరేకతే కారణం. కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి అసోం గణ పరిషత్‌(ఏజీపీ)లోనూ సీఏఏపై విభేదాలున్నాయి. సీఏఏకు పార్టీ అధికారికంగా మద్దతిస్తున్నా పార్టీ సీనియర్‌ నేత మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్‌ మహంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 


ఈసారి ఎన్నికల్లో ఎన్‌ఆర్‌సీ, సీఏఏలను బీజేపీ కూటమి ప్రస్తావించకపోవటం గమనించదగ్గ అంశం. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో సీఏఏ అమలు గురించి మాట్లాడే సీనియర్‌ నేతలు అస్సాంకొచ్చేసరికి మౌనం పాటిస్తున్నారు. సీఏఏ వ్యతిరేకత తమ గెలుపును ప్రభావితం చేయ బోదని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోవున్న హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డ తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో సీఏఏ వ్యతిరేక ఆందోళన రాష్ట్రంలో చల్లబ డింది. ఆ తర్వాత అది మళ్లీ రాజుకున్న దాఖలా లేదు. బహుశా ఇది బీజేపీకి భరోసానిస్తుండవచ్చు. తమ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆ పార్టీ దృష్టి నిలిపింది. ముస్లింలతో సహా అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలందాయి గనుక తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ విశ్వాసంతో వుంది. కానీ బీజేపీ అధికారంలోకొస్తుందని చెబుతున్న సర్వేలే అధిక ధరలు ఆ పార్టీకి కొంత అవరో ధమేనని అంగీకరించాయి.

అలాగే సీఏఏ కూడా. వాస్తవానికి సీఏఏను పార్లమెంటు ఆమోదించి చాన్నాళ్లు కావొస్తున్నా ఇంతవరకూ దాన్ని కేంద్రం నోటిఫై చేయకపోవటానికి కారణం అస్సాం, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలేనని చెబుతారు. బీజేపీ వ్యూహాత్మక మౌనానికి కూడా అదే కారణం. కానీ ఆ పార్టీ చేత సీఏఏ గురించి పలికించాలని, అదే జరిగితే బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్‌ పక్ష కూటమి అనేకవిధాల ప్రయత్నిస్తోంది. రంగంలోకి కొత్త పార్టీలు రావటం కూడా బీజేపీకి తలనొప్పే. ఈసారి అస్సాం జాతీయ పరిషత్‌(ఏజేపీ), రాజియోర్‌ దళ్, అంచాలిక్‌ గణ మోర్చా రంగంలోవున్నాయి. సీఏఏ విషయంలో ఏజీపీలో అంతర్గత విభేదాలుండటం బీజేపీ కూట మికి కొంత ఇబ్బంది. ఇటు ముస్లింలలో పలుకుబడివున్న ఏఐయూడీఎఫ్‌తో చెలిమి కాంగ్రెస్‌కు ఎంతవరకూ లాభించగలదో చూడాలి. 


ఎన్నికల సమయంలో ప్రజా ప్రయోజన అంశాలు చర్చకు రావటం ఈమధ్యకాలంలో తగ్గింది. నాయకులు ఒకరిపై ఒకరు విసురుకునే సవాళ్లు, సంచలనాత్మక ప్రకటనలు, ఇరుగు పొరుగు దేశా లతో వుండే సంబంధాలు వగైరా ప్రాధాన్యతలోకొస్తున్నాయి. కానీ అస్సాం అందుకు భిన్నం. ఎవ రెంత కాదన్నా అక్కడ స్థానిక సమస్యలే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. తన ప్రయోజనాలకు ఏ రూపంలోనైనా విఘాతం కలుగుతుందంటే అస్సాం భగ్గుమంటుంది. అది ఒక రకంగా మేలు కలి గించే అంశమే అయినా, భిన్న జాతులు నివసించే అస్సాంలో అది ఒక్కోసారి శాంతిభద్రతల సమ స్యను సృష్టిస్తోంది. ఏదేమైనా అస్సాం ఈసారి ఎవరి పక్షంవహిస్తుందన్నది ఉత్కంఠ రేపే అంశం. 

మరిన్ని వార్తలు