మతిమాలిన ప్రతిపాదన

24 Jun, 2021 02:15 IST|Sakshi

ఇద్దరికి మించి సంతానం వున్నవారికి ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేయాలన్న రెండేళ్లనాటి ప్రతిపాదనను అస్సాం ప్రభుత్వం మళ్లీ ఎజెండాలోకి తీసుకొచ్చింది. పెరిగే జనాభాను అదుపు చేయాలని ప్రభుత్వాలు సంకల్పించటం మన దేశంలో కొత్తగాదు. ఇద్దరికన్నా ఎక్కువమంది సంతానం వున్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేసే నిబంధన పది రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లోవుంది. అయితే సంక్షేమ పథకాలకు స్వస్తి చెబుతామనటం, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అనర్హులను చేస్తామనటం అస్సాం ప్రతిపాదనల్లోని ప్రత్యేకత. గతంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా వున్నప్పుడే ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఈ ప్రతిపాదన తెచ్చారు. ఉద్యోగం సంపాదించేనాటికి ఇద్దరు పిల్లలున్న ఎవరైనా తమ సర్వీసు కాలంలో ఆ నిబంధననే పాటించాల్సివుంటుందని, లేని పక్షంలో వారి ఉద్యోగానికి ఎసరు తప్పదని అప్పట్లోనే ఆయన చెప్పారు. ఈ విధానం తేయాకు తోటల్లో పనిచేసేవారికి, ఎస్సీ, ఎస్టీలకూ వర్తించదని తాజాగా ఆయన అంటున్నారు.  దేశం ఎదుర్కొంటున్న సమస్త క్లేశాలకూ అధిక జనాభాయే కారణమని అనుకునేవారు చాలామంది వున్నారు. 70వ దశకం వరకూ మన దేశంలో వున్న కుటుంబ నియం త్రణ విధానం అప్పటి యువ నాయకుడు సంజయ్‌ గాంధీ విపరీత పోకడల పర్యవసానంగా కుటుంబ సంక్షేమ విధానంగా పేరు మార్చుకోవాల్సివచ్చింది. భారత్‌ పన్ను చెల్లింపుదారుల సంఘం(టాక్సాబ్‌) అనే సంస్థ జనాభాను అరికట్టడానికి పకడ్బందీ చట్టం తీసుకురావాలని నాలు గేళ్లక్రితం డిమాండ్‌ చేసింది. అధిక జనాభా కారణంగా ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించలేక పోతున్నాయని, మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమవుతున్నదని, నిరుద్యోగం పెరిగిందని, అందరికీ మంచి ఆహారం అసాధ్యమవుతున్నదని ఆ సంస్థ భావిస్తోంది. ఆఖరికి జనాభా పెరిగి పోవటం వల్లే కాలుష్యం ఎక్కువవుతున్నదని కూడా అది సెలవిచ్చింది. ఇప్పుడు అస్సాం ప్రభుత్వం చెబుతున్న కారణాలు కూడా ఆ మాదిరే వున్నాయి. అందరికీ అన్ని సంక్షేమ పథకాలనూ వర్తింప జేయాలంటే జనాభా నియంత్రణే మార్గమని హిమంతా బిశ్వ శర్మ అంటున్నారు. కానీ ఇద్దరు సంతానం మించటానికి వీల్లేదని ఆంక్షలు విధిస్తున్న రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు ఎక్కువయ్యాయని స్వచ్ఛంద సంస్థల సర్వేల్లో వెల్లడైంది.

మన దేశంలో జనాభా పెరుగుదల రేటు అందరూ భావిస్తున్నట్టు అడ్డూ ఆపూ లేకుండా పైపైకి ఎగబాకటం లేదు. 70, 80 దశకాల్లో ఏటా 2.3 శాతం చొప్పున వున్న జనాభా పెరుగుదల రేటు ఇప్పుడు 1.2 శాతానికొచ్చింది. 70వ దశకంలో ఒక మహిళ సగటున అయిదుగురికి జన్మనిస్తే 2015–16నాటికి ఆ సంఖ్య 2.2కి పడిపోయింది. అస్సాంలో అయితే ఇది 1.9 శాతం మాత్రమే. ఇక కుటుంబ నియంత్రణ సాధనాల వినియోగంలో సైతం ఎంతో మార్పు కనబడుతోంది. 70వ దశ కంలో అటువంటి సాధనాల వినియోగం కేవలం 13 శాతం వుంటే ఇప్పుడది 56 శాతానికి చేరింది.  నగరాల్లో కిక్కిరిసిన జనాభాను చూస్తుంటే ఎవరికైనా జనాభా పెరిగిపోతున్నదన్న అభిప్రాయం కలగటం సహజమే. కానీ అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయటానికి బదులు, దాన్ని ఒకే చోట కేంద్రీకరించే ప్రభుత్వాల అస్తవ్యస్థ విధానాలు అందుకు దోహదపడుతున్నాయి. సాగు వ్యయం భారీగా పెరిగి, పంటలకు గిట్టుబాటు ధరలు పడిపోవటంతో అనేకులు వ్యవసాయం వదులుకోవటంవల్ల అక్కడ ఉపాధి కరువై వలసలు పెరిగి నగరాలు కిటకిటలాడుతున్నాయి. వీటికి తోడు ఆరోగ్యంగా జీవనం సాగించటంపై గతంతో పోలిస్తే అవగాహన ఏర్పడిన కారణంగా దేశంలో సగటు ఆయుర్దాయం పెరిగింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవటానికి బదులు ఇద్ద రికి మించి పిల్లలున్న కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఇవ్వబోమనటం అమానవీయం అవు తుంది. పురుషాధిక్యత రాజ్యమేలుతున్న మన దేశంలో పిల్లల్ని కనడం, కనకపోవడం అనేది మహిళల చేతుల్లో లేదు. కుమారుడు కావాలన్న కోరికతో భార్య అనారోగ్యాన్ని లెక్కచేయకుండా మూడో సంతానం కోసం లేదా నాలుగో సంతానం కోసం చూసే పురుషులకు కొదవలేదు. నిరుపేద వర్గాల్లో ఈ ధోరణి బాగా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలను ఆపడం ద్వారా ఎవ రిని శిక్షిస్తున్నట్టు? ఇలాంటి నిర్ణయాలు నియంతృత్వ పోకడలుండేచోట చెల్లుబాటవుతాయి తప్ప ప్రజాస్వామ్యం రాజ్యమేలే చోట కాదు. జనాభా పెరిగిపోతున్నదని ఆందోళనపడి చైనా ప్రభుత్వం 80వ దశకంలో ఒకే సంతానం వుండాలని పౌరులపై ఆంక్షలు విధించింది. ఒకరిని మించి కంటే కఠినంగా శిక్షించిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ ఈమధ్యే చైనా తెలివి తెచ్చుకుని, ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనొచ్చునంటూ చట్టాన్ని సవరించింది.

అక్షరాస్యత బాగా పెరిగేలా చూడటం, కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవటంలో మహిళలకు ప్రాముఖ్యతనివ్వటంపై పురుషులకు నచ్చజెప్పటం చాలా అవసరం. తల్లిదండ్రులు కాదల్చుకున్న జంటలకు  పునరుత్పత్తి, ఆరోగ్యకరమైన లైంగిక జీవనంవంటి అంశాల్లో అవగాహన కలిగించ టమూ ముఖ్యమే. మగవాళ్లలో అవిద్యనూ, అజ్ఞానాన్ని పోగొట్టగలిగితే పిల్లల్ని ఎప్పుడు, ఎంత మందిని కనాలన్న విషయాల్లో వారిలో కాస్తయినా మార్పు వస్తుంది. అందుకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టి, సంక్షేమ పథకాలకు స్వస్తి చెప్పి నిరుపేద వర్గాలను శిక్షించ బూనుకుంటే ఇప్ప టికే కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన అసమానతలు మరింతగా ముదురుతాయి. నిరుపేద వర్గాలు నిస్సహాయ స్థితిలో పడతాయి. ఈ ప్రతిపాదనకు అస్సాం తక్షణం స్వస్తి చెప్పడం ఉత్తమం. 

మరిన్ని వార్తలు