ఈ వెనుకచూపు ఎందుకు?

19 Aug, 2021 00:00 IST|Sakshi

‘కాలం మారుతుంది... రేగిన గాయాలను మాన్పుతుంది’ అన్నారో కవి. కానీ, కాలగతిలో 75 ఏళ్ళు ప్రయాణించిన తరువాత, దేశం – కాలం – తరం మారిన తరువాత... మానుతున్న పాత గాయాన్ని మళ్ళీ రేపే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఏమనాలి? పాత చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవడానికే ఆ పని చేస్తున్నామని అంటే ఎలా నమ్మాలి? బ్రిటీషు పాలనలోని విశాల భారతదేశం 1947 ఆగస్టు 14న విభజనకు గురై, స్వతంత్ర పాకిస్తాన్, భారతదేశాలుగా విడిపోయిన క్షణాలు నేటికీ ఓ మానని గాయం. మతం, ప్రాంతం లాంటి అనేక అంశాలతో కొన్ని లక్షల మంది హింసకు గురై, నిర్వాసితులుగా విభజన రేఖకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళిన సందర్భం. మానవ చరిత్రలోనే మహా విషాదం. దాన్ని స్మరించుకోవడానికి, ఇక నుంచి ప్రతి ఆగస్టు 14వ తేదీని ‘దేశ విభజన బీభత్సాల సంస్మరణ దినం’గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్విట్టర్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 14న వరుస పోస్టులు, ఆ వెంటనే హడావిడిగా గెజిట్‌లో ప్రకటన, మరునాడు స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఆయన చేసిన ఆ ప్రస్తావన అనేక భయాలు, అనుమానాలకు తావిస్తోంది. 

భారత ఉపఖండ చరిత్రలో ఎన్నడూ ఎరుగని మానవ విషాదం– దేశ విభజన ఘట్టం. అందుకు అప్పటి రాజకీయ అవకాశవాదం, మత విద్వేషాల లాంటి అనేక కారణాలున్నాయి. నాటి బ్రిటీషు ప్రభుత్వానికీ ఆ నేరంలో భాగస్వామ్యం ఉంది. భౌగోళిక విభజన జరిగింది 1947 ఆగస్టు 14నే అయినప్పటికీ, అంతకు ముందు, ఆ తరువాత అనేక వారాలు మనుషుల్లో మానసిక విభజన కలిగించిన కష్టం, నష్టం అపారం. దాదాపు 20 లక్షల మంది దారుణంగా హతమయ్యారు. సుమారు లక్ష మంది అతివలు అపహరణకు గురై, అత్యాచారం పాలబడ్డారు. కోటిన్నర మందికి పైగా స్త్రీలు, పురుషులు, పిల్లలు వలస బాట పట్టారు. అనధికారిక లెక్కల్లో ఈ అంకెలు ఇంకా పెద్దవి. రిక్త హస్తాలతో దేశాన్ని విడిచిపోవాల్సిన బ్రిటీషువారు మతాల వారీ మానసిక విభజనతో భారత ఉపఖండాన్ని రక్తసిక్తం చేసి, గుండెల్లో చేసిన గాయం అది. సోదర భారతీయుల సంఘర్షణ... ముస్లిములపై – హిందువులు – సిక్కుల హింస... విభజన బాధిత పంజాబ్, బెంగాల్‌ ప్రాంతాల్లో దారుణ మారణకాండ... పురిటిగడ్డను వదిలేసి పొట్ట చేతపట్టుకొని కోట్లాది జనం వలస ప్రయాణం... ఇలా ఆనాటి ఘట్టాలు నేటికీ విషాద జ్ఞాపకాలు. పాలకులు పైకి ఏవేవో వివరణలు ఇస్తున్నా, ఆ పాత గాయాలను ఏటా స్మరించుకోవాలనే ఆకస్మిక నిర్ణయం వెనుక కారణాలేమిటన్నది ఆలోచించాలి. 

సామ్రాజ్యవాదం, ఏకపక్షంగా సరిహద్దుల నిర్ణయం, దేశపటాల రూపకల్పన, అధికారం కోసం మతవిద్వేషాలకు బీజం వేయడం లాంటివి ఎంత చెడు చేస్తాయన్నది దేశ విభజన నేర్పిన పాఠం. ఆ గుణపాఠాలను భావితరాలకు తెలియచెబితే సరే. కానీ, ఒక వర్గం ప్రజలను బుజ్జగించడం కోసమే అప్పటి పార్టీల నేతలు దేశాన్ని చీల్చారనే తప్పుడు భావన కలిగిస్తేనే ఇబ్బంది. అలా చేస్తే, మనుషుల మధ్య అంతరాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన 74 ఏళ్ళ తర్వాత మోదీ అనూహ్యంగా దేశ విభజన గాయాల పల్లవిని ఎత్తుకోవడం ఆశ్చర్యమే. ఆగస్టు 14 దాయాది దేశమైన పాకిస్తాన్‌ ఆవిర్భావ దినమని తెలిసీ, ఆ రోజును ఇలా స్మరించుకోవాలని మన పాలకులు ప్రకటించడంలోని లోగుట్టు పెరుమాళ్ళకెరుక! 

విశాల భారతావని చరిత్రలో విభజన గాయాలే ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయో తెలీదు. మతపరమైన ద్విజాతి సిద్ధాంతంతో మొదలైన పాకిస్తాన్‌ చివరకు 1971లో మరోదేశం బంగ్లాదేశ్‌కు జన్మనివ్వడం చూశాం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామరస్యం, సర్వమత సహజీవనం నమ్మిన భారతావని అన్ని రంగాల్లో సాధించిన పురోగతీ చూస్తున్నాం. మరి ఇప్పుడీ వెనుకచూపులు ఎందుకు? రాజకీయ అనివార్యత లేకుండా పాలకులు ఇలాంటి విధాన ప్రకటనలు చేయడం అరుదు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఇది కొత్త ఎత్తుగడ అని విమర్శకుల వాదన. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలో బీజేపీ మాటల గారడీ పని చేయని వేళ, యూపీలో వచ్చే ఎన్నికలు జాతి మనోగతానికి ఒక సూచిక. పొరపాటున అక్కడా చతికిలబడితే నాయకత్వానికి సవాలు ఎదురుకావచ్చు. ఆగుతున్న అసమ్మతి వరద తోసుకురావచ్చు. అందుకే, మతపరంగా దేశాన్ని చీల్చిన ఘటనను పదే పదే స్మరిస్తూ, ఒక వర్గం ఓట్లను సంఘటితం చేసుకోవడమే పాలకపక్షం అసలు ఉద్దేశమని విపక్షాల ఆరోపణ. 

పురాస్మరణ కావాలి. చరిత్ర నేర్పిన పాఠాల పునఃస్మరణా కావాలి. కానీ అవి ఏ ప్రయోజనాలకన్నది పురోగామివాదులు, బుద్ధిజీవుల ప్రశ్న. ఎద్దు పుండు కాకికి రుచి. అలా మానుతున్న గాయాలను ఓట్ల కోసం మళ్ళీ ఎవరు కెలికినా అది సరికాదు. దాటి వచ్చిన గతాన్ని తవ్వి తలపోసుకోవడం వల్ల విద్వేషాలు పెరుగుతాయే తప్ప, విశాల సౌహార్దం వీలుకాదు. వివిధ మతాల మధ్య, విభజనతో ఏర్పడ్డ దాయాది దేశంతోనూ స్నేహం, సామరస్యం పెరగడానికి ఈ సరికొత్త స్మారక దినాలు ప్రతిబంధకమయ్యే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే, ఆ పాపం ఎవరిది? ‘గత జల సేతుబంధనం’పై కన్నా మళ్ళీ ఆ గాయాలు రేగకుండా, ఆగామి భవితవ్యంపై పాలకులు శక్తియుక్తుల్ని పెడితే నవీన భారతావనికి మేలు చేసినవారవుతారు. కొత్త తరం కోరుకోనేది అదే!  

మరిన్ని వార్తలు