‘ఔకస్‌’ ప్రమాద ఘంటికలు

18 Sep, 2021 00:30 IST|Sakshi

ఇప్పటికే అనేకానేక కూటములతో కిక్కిరిసివున్న ప్రపంచంలోకి మరో సైనిక కూటమి అడుగు పెట్టింది. గత కొన్నేళ్లుగా చైనా పోకడలతో స్థిమితం లేకుండా పోయిన అమెరికాయే ఈ కొత్త కూటమి పుట్టుకకు కూడా కారణం. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలున్న ఈ త్రైపాక్షిక కూటమిని ఆ దేశాల పేర్లు గుదిగుచ్చి ‘ఔకస్‌’గా వ్యవహరించబోతున్నారు. అఫ్గానిస్తాన్‌లో రెండు దశాబ్దాలపాటు తిష్టవేసి సాగించిన యుద్ధం ఆశించిన ఫలితం ఇవ్వకపోగా, తాలిబన్‌ల ధాటికి కకావికలై అవమానకర రీతిలో నిష్క్రమించాల్సివచ్చిన అమెరికాకు ఈ కొత్త కూటమి ఓదార్పునిచ్చే మాట వాస్తవమే. కానీ మూడు దేశాల అధినేతలూ కూటమి ఏర్పాటు గురించి ప్రకటించిన కాసేపటికే చైనా సంగతలావుంచి... మిత్ర పక్షాలైన ఫ్రాన్స్, యూరొపియన్‌ యూనియన్‌(ఈయూ)లనుంచి వినబడిన అపస్వరాలు రాగల రోజుల్లో ఆసక్తికర పరిణామాలు సంభవించబోతున్నాయన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. ఏడు దశాబ్దాలపాటు పూర్వపు సోవియెట్‌ యూనియన్, అమెరికాల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం బెడద 90వ దశకం నుంచి తొలగిందని అందరూ అనుకుంటుండగా ఈ ఏడాది మార్చిలో చతుర్భుజ కూటమి(క్వాడ్‌) దేశాల తొలి శిఖరాగ్రం జరిగింది. దానిపై కొంత ‘నాగరికంగా’ స్పందించిన చైనా... ఈసారి మాత్రం అన్ని మొహమాటాలనూ, దౌత్య మర్యాదలను వదిలి ఆస్ట్రేలియానుద్దేశించి బెదిరింపులకు దిగింది. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక అయిన ‘గ్లోబల్‌ టైమ్స్‌’ సంపాదకీయం ద్వారా గట్టి హెచ్చరికలే పంపింది. భౌగోళికంగా చూస్తే చైనా, ఆస్ట్రేలియాల మధ్య ఏ రకమైన పొర పొచ్చాలూ లేవని, కానీ ఆస్ట్రేలియా తనంత తానుగా చైనా–అమెరికాల వైరంలో తలదూర్చి కొరివితో తలగోక్కుంటున్నదని దాని సారాంశం. అమెరికా అండ చూసుకుని సైనిక దుస్సాహసానికి పాల్పడితే చైనా ‘నిర్దాక్షిణ్యం’గా బదులుతీర్చుకోవడం ఖాయమని బెదిరించింది. బహుశా దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రాణాలను వృథా చేసుకునే పాశ్చాత్య సైనిక పటాలంలో తొలి వంతు ఆస్ట్రేలియాదే కావొచ్చని కూడా విస్పష్టంగా సంకేతాలు పంపింది.


చైనా ఆగ్రహావేశాల మాట అటుంచి ఆస్ట్రేలియా ఈ కూటమికి సై అనడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి అమెరికా ప్రమేయం ఉన్న కూటముల్లో ఆస్ట్రేలియాకు సభ్యత్వం ఉండటం కొత్తేమీ కాదు. 1941లో అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్‌లతో పాటు ‘ఫైవ్‌ ఐస్‌’(అయిదు నేత్రాల) కూటమిలో అది కూడా భాగస్వామి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఏర్ప డిన‘అంజుస్‌’లోనూ అది కొనసాగుతోంది. క్వాడ్‌లో సరేసరి. అందులో అమెరికా, భారత్, జపాన్‌ లతోపాటు అది కూడా ఉంది. అయితే ఈ మూడు కూటముల తీరుతెన్నులూ వేరు. ఫైవ్‌ ఐస్‌ అప్పటి సోవియెట్‌ యూనియన్‌పై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. అంజుస్‌ రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌కు వ్యతిరేంగా అమెరికా, బ్రిటన్‌ల కోసం ఏర్పడింది. క్వాడ్‌ చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన కూటమి. కానీ కొత్తగా అడుగుపెట్టిన ‘ఔకస్‌’ ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చాలని నిర్ణయించింది. అదే చైనాకు ఆగ్రహం కలిగిస్తున్న అంశం. ఇది కేవలం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించిందేనని ఆ దేశం రగిలిపోతోంది. కారణాలు వేరైనా ఫ్రాన్స్‌కు సైతం అమెరికా, ఆస్ట్రేలియాల పోకడలు ఏమాత్రం నచ్చడం లేదు. తనతో డీజిల్‌–విద్యుత్‌లతో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఆస్ట్రేలియా 4,300 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని...ఆ ప్రాజెక్టుపై దాదాపు 1,800 కోట్ల డాలర్లు వ్యయం చేశాక ఏకపక్షంగా దాన్నుంచి తప్పుకోవటం ఫ్రాన్స్‌ ఆగ్రహావేశాలకు కారణం. అవసరమైన ఆహారం, మంచినీరు ఉన్నంతకాలం సముద్ర జలాల్లో గుట్టుచప్పుడు కాకుండా సంచరించడానికి వెసులుబాటుండే అణు శక్తి జలాంతర్గాముల ముందు... ఆక్సిజెన్‌ కోసం పదే పదే ఉపరితలానికి రాకతప్పని స్థితిలో ఉండే డీజిల్‌–విద్యుత్‌ జలాంతర్గాములు సురక్షితమైనవి కాదని ఆస్ట్రేలియా అభిప్రాయపడుతోంది. అటు వేల కోట్ల డాలర్ల కాంట్రాక్టును మిత్ర దేశమన్న మర్యాద కూడా లేకుండా అమెరికా సొంతం చేసుకుందన్న బాధ ఫ్రాన్స్‌ను పీడిస్తోంది. ఈయూ అభ్యంతరం వేరు. ఇన్ని దశాబ్దాలుగా నాటో కూటమి ద్వారా తమ వల్ల ప్రయోజనం పొందిన అమెరికా మాట మాత్రమైనా చెప్పకుండా భిన్నమైన బాట పట్టడం ఈయూ సహించలేకపోతోంది. ఈయూ నుంచి బయటికొచ్చాక బ్రిటన్‌ తీసుకున్న అతిపెద్ద వ్యూహా త్మక నిర్ణయం ఈ ‘ఔకస్‌’. అమెరికా సాంకేతికతతో తమ దేశంలోనే ఈ జలాంతర్గాముల నిర్మాణం జరుగుతుంది గనుక దానికిది లాభసాటి బేరం కూడా. 

అయితే ఒకటి మాత్రం నిజం. పోఖ్రాన్‌లో మనం అణుపరీక్ష జరిపినప్పుడు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించామని ఆరోపిస్తూ తమ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారత శాస్త్రవేత్తలను  గంటల్లో దేశం వదిలిపోవాలని గెంటేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఆ ‘చాదస్తం’ ఎందుకు వదిలిపెట్టాల్సివచ్చిందో సంజాయిషీ ఇవ్వాల్సివుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో తీసుకున్న నిర్ణ యాలు ఈయూ దేశాలను క్రమేపీ అమెరికాకు దూరం చేశాయి. అమెరికాను కాదని అవి రష్యాతో గ్యాస్‌ పైప్‌లైన్‌పై ఒప్పందానికొచ్చాయి. ఇప్పుడు బైడెన్‌ ఆవిష్కరించిన ‘ఔకస్‌’ వాటిని మరింత దూరం చేయడం ఖాయం. ఈ పరిణామంతో మున్ముందు పునరేకీకరణలు ఎలా ఉంటాయో, ఎవరు ఏ శిబిరంలో చేరతారో... వాటి పర్యవసానాలేమిటో చూడాల్సి వుంది. అయితే ‘ఔకస్‌’ పూర్తి స్థాయిలో అమలైతే రాజుకునే ఘర్షణలు ఆసియా ఖండ దేశాలన్నిటినీ చుట్టుముట్టడం ఖాయం. 

మరిన్ని వార్తలు