బెంగాల్‌ బ్యాలెట్‌ పోరు

22 Jan, 2021 00:16 IST|Sakshi

చాన్నాళ్ల తర్వాత నందిగ్రామ్‌ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. తనను ముఖ్యమంత్రి పీఠంవైపు తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించిన నందిగ్రామ్‌ నుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించటమే ఇందుకు కారణం. గతంలో అప్పటి లెఫ్ట్‌ ఫ్రంట్‌ సర్కారుపై యుద్ధభేరి మోగించటానికి ఆ స్థానాన్ని ఎంచుకుంటే... ఇప్పుడు తనను నిత్యం సవాలు చేస్తున్న బీజేపీకి దీటుగా జవాబిచ్చేందుకు సిద్ధమై అక్కడికి వెళ్తున్నారు. మరో నాలుగైదు నెలల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్యా ఇప్పటికే పోరాటం మొదలైంది.

వరసగా మూడోసారి కూడా జయకేతనం ఎగరేయాలని మమత పట్టుదలగా వుంటే...ఈ ఎన్నికల్లో కుదిరితే ఆమెను అధికారం నుంచి దించాలని, కనీసం రాజకీయంగా గట్టి దెబ్బతీయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ దాదాపు నీరసించిపోయిన వర్తమా నంలో మమతకు తామే ప్రధాన ప్రత్యర్థి పక్షం అవుతామని బీజేపీ విశ్వసిస్తోంది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్నవి మూడంటే మూడే స్థానాలు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆ పార్టీ సమరోత్సాహానికి ఆ ఫలితాలే స్ఫూర్తి. మరింత కృషి చేస్తే అధికారం చేజిక్కించుకోవటం అసాధ్యం కాదన్న దూకుడుతో బీజేపీ వెళ్తోంది. అయితే ఇందుకు తృణమూల్‌ నుంచి జరిగే ఫిరాయింపులపైనే ఆధారపడటం ఈ వ్యూహంలోని బలహీనత.

దేశంలోనే కాదు... అంతర్జాతీయంగా కూడా 2007లో మార్మోగిన రెండు పేర్లు–నందిగ్రామ్, సింగూర్‌. నందిగ్రామ్‌లో రైతుల నుంచి భూసేకరణ జరిపి ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో  కెమికల్‌ హబ్‌ ఏర్పాటు చేయటానికి ఇండొనేసియాకు చెందిన సలీమ్‌ గ్రూపు సంస్థలకు అనుమతులిచ్చినప్పుడు ఉద్యమం రాజుకుంది. సింగూర్‌లో టాటా మోటార్స్‌ కార్ల ఫ్యాక్టరీ నిర్మాణం మొదలెట్టినప్పుడు అక్కడి రైతులు ఆందోళనలకు దిగారు. నందిగ్రామ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో 14మంది మరణించినట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువని, పదిమంది జాడ ఈనాటికీ తెలియలేదని స్థానికులు చెబుతారు. ఈ రెండుచోట్లా జరిగిన ఉద్యమాలు చూస్తుండగానే తీవ్రమై, దాదాపు మూడున్నర దశాబ్దాల లెఫ్ట్‌ ఫ్రంట్‌ పాలనకు చరమగీతం పాడాయి.

తనను అధికార పీఠం ఎక్కించిన నందిగ్రామ్, సింగూర్‌ల విషయంలో మమతా బెనర్జీ ప్రత్యేకించి చేసింది తక్కువేగానీ...ఆ పోరాటాల పర్యవసానంగా దేశంలో పాలకపక్షాలు అంత వరకూ అమలు చేసిన భూసేకరణ విధానం పూర్తిగా మారిపోయింది. దానికి ముందు వలస పాలకులు 1894లో తెచ్చిన నిరంకుశ భూసేకరణ చట్టాన్నే మన ప్రభుత్వాలు కూడా అనుసరించేవి. నామమాత్రపు పరిహారంతో, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ‘ప్రజా ప్రయోజనం’ మాటున బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకునేవి. 2013లో యూపీఏ పాలనలో ఆ పాత చట్టం స్థానంలో మెరుగైన చట్టం ఉనికిలోకొచ్చింది. 2014లో అధికారంలోకొచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం దాన్ని సవరించి, నీరుగారుస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమ య్యాయి. ఆ ఆర్డినెన్స్‌ మాటునే ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరు ప్రాంతంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు సైతం రైతులు ఎదురుతిరిగారు. ఇలా దేశం లోని అన్నిచోట్లా రైతుల గొంతు బలంగా వినిపించటానికి నందిగ్రామ్, సింగూర్‌ రైతులే స్ఫూర్తి.

అంతటి చరిత్ర వున్న నందిగ్రామ్‌ చాన్నాళ్లుగా వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవటానికి మమత అక్కడికెళ్తున్నారు గనుక కొత్త కొత్త పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. నందిగ్రామ్‌ ఉద్యమంలో పాల్గొన్నవారికి ఆమె అనేక వరాలు ప్రకటించారు. ఆచూకీ లేకుండా పోయినవారి కుటుంబాలకు రూ. 4 లక్షలు, ఉద్యమంలో భాగస్వాములైనవారికి నెలకు రూ. 1,000 పింఛన్‌ ఇవ్వబోతున్నట్టు మమత తెలిపారు. సింగూర్‌లో ఇప్పటికే ఇవి అమలవు తున్నాయి. నందిగ్రామ్‌ ఉద్యమకాలంలో ఆమెకు అక్కడ అండదండలందించి, పార్టీ ఎదుగుదలలో ఇన్నాళ్లూ కీలకపాత్ర పోషించి, మంత్రిగా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే సువేందు అధికారి ఆమెకు దూరమై బీజేపీలో చేరటమే మమత తాజా నిర్ణయానికి కారణం. పైగా నందిగ్రామ్‌ ఓటర్లలో 30 శాతంమంది ముస్లింలు. ఆ వర్గం తృణమూల్‌కు మొదటినుంచీ అండగావుంటోంది. 

మమత ప్రకటనతో సవాళ్లూ, ప్రతి సవాళ్లూ మొదలైపోయాయి. ఆమెను 50,000 ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని సువేందు అంటుండగా, అది అసాధ్యమని తృణమూల్‌ చెబుతోంది. నిన్న మొన్నటివరకూ నందిగ్రామ్‌లోనే కాదు... ఈస్ట్‌ మిడ్నాపూర్‌ ప్రాంత తృణమూల్‌లో కీలకపాత్ర పోషించిన సువేందును రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వినియోగించుకోవాలన్న బీజేపీ వ్యూహాన్ని దెబ్బతీయడానికే ఆమె అక్కడ పోటీ చేయడానికి నిశ్చయించుకున్నారా లేక ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన భవానీపూర్‌ నియోజకవర్గం పరిధిలో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ మెజారిటీ గణనీయంగా తగ్గటం వల్ల ఇలా నిర్ణయించారా అన్న విషయంలో ఎవరి విశ్లేషణలు వారివి. కానీ ఆమె రాకపోతే సువేందుకు తృణమూల్‌ నుంచి గట్టి పోటీ ఇచ్చే బలమైన నేత స్థాని కంగా ఎవరూ లేరన్నది వాస్తవం.

ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ఆమె పూర్తిగా సువేందుకే విడిచి పెట్టారు. మమత నందిగ్రామ్‌కొచ్చి ఆరేళ్లవుతోంది. నందిగ్రామ్‌లో ఆమె బరిలోకి దిగాక ఫిరా యింపులు మాత్రమే కాదు... ఉత్తరాదిలో సాగుతున్న రైతు ఉద్యమం కూడా రాష్ట్రంలో ప్రధానంగా చర్చకొస్తుంది. ప్రస్తుత రైతు ఉద్యమానికి మీ పోరాటమే స్ఫూర్తి అని నందిగ్రామ్‌ రైతులనుద్దేశించి మమత ఇప్పటికే అన్నారు. ఎన్నికల్లో ఇలా పాలన పద్ధతులు, విధానాలు, సమస్యలు తదితరాలపై చర్చ జరగటం ఎప్పుడైనా ఆరోగ్యకరమే. మొత్తానికి బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా వుండబోతున్నాయి. 

మరిన్ని వార్తలు