వేయాల్సిన అడుగులు ఎన్నో...

1 Feb, 2023 03:21 IST|Sakshi

దాదాపు 5 నెలలు... 135 రోజులు... 12 రాష్ట్రాలు... 2 కేంద్ర పాలిత ప్రాంతాలు... 75 జిల్లాలు... 4 వేల కిలోమీటర్లు... దేశానికి దక్షిణపు కొస నుంచి ఉత్తరపు కొస దాకా పాదయాత్ర... కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ (బీజేవై)కు అనేక లెక్కలున్నాయి. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో దెబ్బతిన్నాక, 2022 వేసవిలో ఉదయ్‌పూర్‌ ‘చింతనా శిబిరం’లో ఆత్మవిమర్శలో పడ్డ కాంగ్రెస్‌ దూరమైన ప్రజలకు దగ్గర కావాలన్న ‘నవ సంకల్పం’తో చేసుకున్న పాదయాత్ర ప్రతిపాదన ఎట్టకేలకు విజయవంతమైంది. విద్వేషాన్ని పెంచుతున్న బీజేపీకి విరుగుడు తామే అన్న పార్టీ చిరకాలపు మాటను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తనకు తానే తరలిన ఆకాశంలా రాహుల్‌ నడక సాగించారు. కార్యకర్తల్లో ఉత్సాహంతో సారథిగా ఆయనను బలోపేతం చేసినా, సోనియా మార్కు పొత్తుల చతురత కనిపించని ఈ యాత్ర వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు లాభిస్తుందన్నది ప్రశ్న. పార్టీ పునరుజ్జీవనానికి ఇదొక్కటీ సరిపోతుందా అన్నది అంతకన్నా కీలక ప్రశ్న.

2014 ఎన్నికల్లో కనిష్ఠంగా 44 సీట్లే గెలిచిన గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీకి 2017 డిసెంబర్‌లో అధ్యక్షుడై, ఆపైన 2019లో 52 సీట్లే తేగలిగిన నేతగా రాహుల్‌కు ఇది పరీక్షాకాలం. వదులుకున్న పార్టీ కిరీటాన్ని మరోసారి నెత్తినపెట్టాలని తల్లి సోనియా, సమర్థకులు ప్రయత్నించినా, యువరాజు దేశసంచారానికే మొగ్గుచూపారు. అసమ్మతి, పార్టీ నుంచి పెద్దల నిష్క్రమణలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీనీ, కార్యకర్తల్నీ ఒక్కతాటిపైకి తేవడానికీ, మరీ ముఖ్యంగా తన వెంట నడపడానికీ ఆయన అందుకున్న వ్యూహాత్మక అస్త్రం బీజేవై. ప్రాంతీయ పార్టీలు, మోదీ ప్రభంజనం మధ్య కాంగ్రెస్‌ నానాటికీ తీసి కట్టుగా మారుతున్నప్పుడు ఆ పార్టీకి దశాబ్దాలుగా మూలస్తంభమైన కుటుంబానికి శ్రమదమాదులు తప్పవు. ‘ఇది భారత్‌ జోడో కాదు, కాంగ్రెస్‌ జోడో’ అని బీజేపీ ఆది నుంచి అల్లరి చేస్తున్నది అందుకే. 

అయితే, మతం ఆసరాగా విభజన రాజకీయాలు విజృంభిస్తున్న వేళ... దేశమంతా ‘కలసి పాడుదాం ఒకే పాట... కదలి సాగుదాం వెలుగుబాట’ అంటూ ప్రేమ, సమైక్యతల రాగంతో రాహుల్‌ ముందుకు రావడం విస్మరించలేనిది. ఈ యాత్ర అనేక లోపాలతో నిండిన చిరు ప్రయత్నమే అయినప్పటికీ... వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల్లో, నేతల్లో, మేధావుల్లో కాంగ్రెస్‌కు కొంత సానుకూలత తెచ్చింది. ప్రతి ఒక్కరితో సంభాషిస్తూ, పెరిగిన గడ్డంతో, సామాన్యుల్లో ఒకరిగా తిరుగుతున్న యువరాజుపై సదభిప్రాయమూ పెంచింది. విభజనకు అడ్డుకట్టగా భారతదేశపు మూలకందమైన భిన్నత్వంలో ఏకత్వపు ప్రేమను రాహుల్‌ భుజాన వేసుకోవడం దేశానికి చారిత్రక అవసరమనే భావన కలిగించింది. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌కీ ఇది అత్యవసరమే. అందుకే, సరైన సమయానికి భారత్‌ జోడో జరిగిందనుకోవాలి.

గత నాలుగేళ్ళలో మూడే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా గెలిచిన కాంగ్రెస్‌కు రానున్న ఎన్నికల్లో విజయం కీలకం. దాని మాటేమో కానీ, 75 ఏళ్ళ క్రితం భారత తొలి ప్రధాని నెహ్రూ శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌లో తొలిసారి జాతీయ జెండా ఎగరేసినచోటే, పాదయాత్ర ఆఖరి రోజున రాహుల్‌ కూడా పతాకావిష్కరణతో చెప్పినమాట చేసిచూపారు. ప్రతీకాత్మకమే అయినా ప్రజాబాహళ్యంలోకి కాంగ్రెస్‌ అనుకున్న సందేశాన్ని పంపడానికి ఇది పనికొచ్చింది. అధికార బీజేపీపై సమరానికి ప్రతి పక్షాలన్నీ ఏకమవుతాయని చెప్పాలనుకున్న బహిరంగ సభ వ్యూహం మాత్రం ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేదు. ఏకంగా 21 పార్టీల నేతల్ని కాంగ్రెస్‌ ఆహ్వానించినా, భారీ హిమపాతం సహా కారణాలేమైనా వచ్చింది ఒకరిద్దరే. ఇది నిరాశాజనకమే. పైగా, ఆమధ్య ఢిల్లీలో, మళ్ళీ ఇప్పుడు ఇలాగే జరిగి, ప్రతిపక్ష ఐక్యత మిథ్యేనని తేలిపోవడం మరో దెబ్బ. 

వ్యక్తిగతంగా మాత్రం రాహుల్‌కు ఈ పాదయాత్ర కలిసొచ్చింది. ‘నాన్‌ సీరియస్‌ పొలిటీషియన్‌’, ‘పప్పు’ లాంటి ఎకసెక్కపు మాటల ఇమేజ్‌ను ఈ యువనేత తుడిపేసుకోగలిగారు. నడకలో పదుగురితో మమేకమై, ప్రజా సమస్యలను లోతుగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే, పాదయాత్ర చేసినంత మాత్రాన ఓటర్లు వరాల వర్షం కురిపిస్తారనీ, సారథ్యం స్థిరపడుతుందనీ అనుకుంటే పొరపాటు. ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్ళి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేసినప్పుడే అవి సాధ్యం. సుదీర్ఘ యాత్రతో రాహుల్‌ మారిన మనిషయ్యారని ఒక విశ్లేషణ. ఆయన స్నేహశీలత జనానికి తెలియడమూ మంచిదే. హర్యానా సహా కొన్ని రాష్ట్రాల్లో ఆయన పాపులారిటీ పెరిగిందనీ సర్వేల సారం. కానీ, ఇప్పటికీ మోదీకి దీటుగా కాంగ్రెస్, రాహుల్‌ మారనే లేదన్నది నిష్ఠురసత్యం. దాన్ని సరిదిద్దుకొనేలా ఎలాంటి భవిష్యత్‌ కార్యాచరణ చేపడతారన్నది ఆసక్తికరం. 

ప్రతిపక్ష కూటమికి దీర్ఘకాలం సహజ సారథి అయిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఆ స్థానానికి కూడా పోటీని ఎదుర్కొంటోంది. మోదీకి ప్రత్యామ్నాయం తామేనని చిత్రించుకొనేందుకు పలువురు ప్రాంతీయ సారథులు తొందరపడుతున్నారు. తమలో తాము తోసుకుంటున్నారు. ఈ అనైక్యతతో చివరకు పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీరుస్తుంది. ప్రతిపక్షాలు అది గ్రహించాలి. 2024 సార్వత్రిక ఎన్నికల లోగా ఈ ఏడాదే 9 రాష్ట్రాల అసెంబ్లీ పోరు ఉంది. ఈ ప్రయాణంలో పెద్దన్నగా కాంగ్రెస్‌ ఆచరణాత్మక దృక్పథంతో పట్టువిడుపులు చూపాలి. ప్రేమ పంచిన ప్రేమ వచ్చును అని కవి వాక్కు. ‘మొహబ్బత్‌ కీ దుకాన్‌’ పెట్టుకొని దేశం తిరిగిన పార్టీకీ, నేతకూ ఏం చేయాలో చెప్పనక్కర్లేదు. దేశం ఈ మూల నుంచి ఆ మూలకు ఒక పాదయాత్ర ముగిసిపోయి ఉండవచ్చు. కానీ, కాంగ్రెస్, రాహుల్‌లు నడవాల్సిన దూరం చాలానే ఉంది. వేయాల్సిన అడుగులు మిగిలే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు