పిల్లిమొగ్గల రాజకీయం

10 Aug, 2022 00:21 IST|Sakshi

అనుమానిస్తున్నంతా అయింది. కొద్ది నెలలుగా బీజేపీ పెద్దలతో ఎడముఖం, పెడముఖంగా ఉన్న జనతాదళ్‌ – యునైటెడ్‌ (జేడీ–యూ) అధినేత నితీశ్‌ కుమార్‌ కాషాయపార్టీతో తెగతెంపులు చేసుకొని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి మంగళవారం బయటకు వచ్చేశారు. బీహార్‌ సీఎం పదవికి రాజీనామా ఇచ్చారు. బీజేపీ వినా రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), కాంగ్రెస్‌ సహా 7 పార్టీల ‘మహా గఠ్‌బంధన్‌ 2.0’తో కొత్త సర్కారు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2010 నవంబర్‌ నుంచి ఇప్పటికి 22 ఏళ్ళలో రకరకాల పొత్తులతో, ఏకంగా 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతూ, కొత్త రికార్డు సృష్టించారు.

రాజకీయ వ్యూహాలు, అధికార ఆకాంక్షల నడుమ విలువలకై వెతుకులాడితే వృథాప్రయాసని సామాన్య ఓటర్లకు  చెప్పకనే చెప్పారు. పార్టీల తేడా లేకుండా బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ... ఇలా అన్నీ నితీశ్‌ను ఏదో ఒక సందర్భంలో దుయ్యబట్టినవే. పదేపదే అదే బీహారీ బాబుతో చేయి కలిపి, చంకనెక్కించుకున్నవే. ఇన్నిసార్లు దోస్తీలు మార్చి, రాజకీయ ఊసరవెల్లిగా అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవడం నితీశ్‌ చేసిన విచిత్ర విన్యాసం.  

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులంటూ ఎవరూ ఉండరనే సూత్రాన్ని నితీశ్‌ ఆపోశన పట్టారు. అసలు సోషలిస్టు సిద్ధాంత నేపథ్యం నుంచి పైకొచ్చిన నితీశ్‌ ఏ సైద్ధాంతికతతో ఒకప్పుడు బీజేపీకి దగ్గరయ్యారన్నది ఆశ్చర్యమే. ఆ పైన 2013లోనే మోదీ మతతత్వాన్ని వ్యతిరేకించి, 17 ఏళ్ళ బంధాన్ని తెంపుకొని ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన  ఆయన తర్వాత మళ్ళీ ఏ విలువల కోసం అదే నాయకుడితో అంటకాగారో అర్థం కాదు. తీరా ఇప్పుడు బలహీనపడుతున్న తన సొంత పార్టీ పునాదులు, లోలోపలి జాతీయ రాజకీయ ఆకాంక్షలతో ఆయన బీజేపీతో దోస్తీకి రామ్‌ రామ్‌ చెప్పడమూ భవిష్యత్‌ అవసరాల కోసం చేసిన రాజకీయమే.

బీహార్‌ రాజకీయాల్లో ‘పల్టీ మాస్టర్‌’గా పేరు పడ్డ నితీశ్‌ వేసిన రాజకీయ పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు. 1994లో లూలూ ప్రసాద్‌తో విభేదించి, జనతాదళ్‌ నుంచి బయటకొచ్చి, సమతా పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎన్డీఏతో దోస్తీ కట్టారు. 2013లో మోదీ మతతత్త్వ రాజకీయాల్ని నిరసిస్తూ మహా గఠ్‌బంధన్‌తో కలిశారు. 2017లో ఆర్జేడీ అవినీతిమయమైందంటూ గఠ్‌బంధన్‌ను వదిలి మళ్ళీ ఎన్డీఏ పంచన చేరారు. ఇప్పుడేమో మళ్ళీ ‘మహా గఠ్‌బంధన్‌ 2.0’తో పాతవాళ్ళనే అక్కున చేర్చుకున్నారు. 

పాట్నాలో ఒకరికొకరు కూతవేటు దూరంలో నివసించే నితీశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఇప్పుడు మరింత సన్నిహితం కానున్నారు. పరస్పరం అనుమానించుకుంటూ, తీవ్రంగా దూషించుకొన్న జేడీ(యూ), ఆర్జేడీలు ‘గతం గతః’ అనుకుంటూ, గాఢాలింగనం చేసుకోవడం రాజకీయ వైచిత్రి. ఎనభై ఏళ్ళ క్రితం సరిగ్గా ‘క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైన రోజునే తీసుకున్న ఈ మహత్తర నిర్ణయం దేశానికి నూతన ఉషోదయమ’ని తేజస్వి ఉవాచ. దేశం మాటేమో కానీ, అధికారం కోసం ముఖం వాచి, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా, హోం మంత్రిగా బాధ్యత, సోదరుడికి మరో మంత్రి పదవి... ఇన్నీ ఆశిస్తున్న తేజస్వి అండ్‌ పార్టీకి ఈ పొత్తుపొడుపు కొత్త పొద్దుపొడుపే. పెద్దన్న లాంటి లాలూతో కలసి నడిచిన నితీశ్‌... ఇది లాలూ వారసులకిస్తున్న రాజకీయ కానుక. 

గతంలో నితీశ్‌ తమను వదిలి బీజేపీ చేయందుకున్నప్పుడు ఆర్జేడీ ఆయనను నిందించింది. ఇప్పుడు అచ్చంగా అవే విమర్శలు బీజేపీ నోట వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కలసి పోటీ చేసి, అధికారంలోకి వచ్చాక పొత్తుధర్మాన్ని విస్మరించి అర్ధంతరంగా వదిలేసిన నితీశ్‌ వల్ల బాధితులమనీ, రాజకీయ అమరులమనీ రాబోయే ఎన్నికల్లో చెప్పుకోవాలనీ బీజేపీ భావిస్తోంది. కలసి గెలిచినప్పటికీ కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి పదవితో సరిపెట్టి అవమానించడమే కాక, తమను బలహీనపరిచేందుకు కాషాయపార్టీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నందుకే బయటకు రావాల్సి వచ్చిందని జేడీ (యూ) వాదిస్తోంది.

పంజాబ్, మహారాష్ట్ర మొదలు ఇప్పుడు బీహార్‌ దాకా కూటమి మిత్రులను బీజేపీ ఎప్పుడూ బలహీనపరుస్తూనే వస్తోందని జేడీ–యూ పాత కథల పట్టిక చూపిస్తోంది. నిజానికి, నితిన్‌ గతంలో ఇవే తన ఆఖరి ఎన్నికలన్నారు. తీరా ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారు. ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆశలను నెరవేర్చుకోవడానికి ఇదే మంచి సమయమని అనుకుంటున్నారు. 

లెక్కప్రకారం జాతీయ ఎన్నికలు 2024లో, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరగాలి. ఇప్పటి దాకా తన కైవసం చేసుకోలేకపోయిన బీహార్‌ విషయంలో బీజేపీకి రాబోయేది పెద్ద పరీక్ష. ‘మండల్‌ వర్సెస్‌ కమండల్‌’ పోరాటానికి బహుశా రానున్న బీహార్‌ ఎన్నికలే రణక్షేత్రం కావచ్చు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 4 శాతం ఉన్న దళిత పాశ్వాన్లు, వారి నేతగా రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడైన చిరాగ్‌ కీలకం కానున్నారు. వారిని బీజేపీ చేరదీస్తుందని ఓ అంచనా. మరి ఏ ఎన్నికలకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడైన నితీశ్‌ ఎలాంటి వ్యూహం వేస్తారో చూడాలి.

ఇప్పటికైతే బీజేపీని ఎదురుదెబ్బ తీసి, నితీశ్‌ తమ వైపు రావడం ప్రతిపక్షాలకు ఒకింత ఉత్సాహజనకమే. కానీ, దానివల్ల కలిసొచ్చేది ఎంత? ఇప్పటికే ఉన్న సోనియా పరివారం, మమత, కేజ్రీవాల్‌ల సరసన పీఎం పదవికి నితిన్‌ రేసులో నిలుస్తారు. ఏక కేంద్రక బీజేపీకి దాని వల్ల మరింత లాభం. ఏమైనా, రెండేళ్ళలో రానున్న జాతీయ ఎన్నికల ఆట రంజుగా మారింది. కానీ, రాజకీయాలంటే వట్టి అంకగణితమే కాదు... పొత్తులోని పార్టీల మధ్య కెమిస్ట్రీ, ప్రజల్లో ఆ పార్టీల విశ్వసనీయత. క్రమంగా విశ్వసనీయత క్షీణిస్తూ, ఢిల్లీ వైపు చూస్తున్న నితీశ్‌జీకి ఆ సంగతి తెలీదంటారా?

మరిన్ని వార్తలు