బలమైన బంధం!

23 Mar, 2022 23:58 IST|Sakshi

భారత, జపాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఏడు పదుల వసంతాల వేళ ఇది. ఈ సందర్భంలో జపనీస్‌ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషీదా భారత సందర్శన పలు కారణాల రీత్యా కీలకమైనది. గత ఏడాది అక్టోబర్‌లో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయన పర్యటించిన తొలి దేశం మనదే. ఢిల్లీతో ద్వైపాక్షిక సంబంధాలకు టోక్యో ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది ఓ తార్కాణం. రెండు దేశాల మధ్య ఏటా జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశాలు మూడేళ్ళుగా సాధ్యం కాలేదు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్ళు సమావేశాలు కుదరలేదు. అంతకు ముందు 2019లో భారత పౌరసత్వ చట్టంలో సవరణలపై నిరసనలతో అప్పటి ప్రధాని షింజో ఆబేతో సమావేశం రద్దయింది. చివరకు ఇన్నేళ్ళ తర్వాత జరగడంతో తాజా సమావేశానికి అంత ప్రత్యేకత. వర్తమాన భౌగోళిక రాజకీయ సంక్షోభ పరిస్థితులు సైతం ఏమవుతుందనే ఆసక్తిని పెంచాయి. భారత, జపాన్‌ల మైత్రీ బంధ పునరుద్ఘాటనలో ఇది కీలక ఘట్టం అంటున్నది అందుకే! 

ఏడు దశకాలుగా ద్వైపాక్షిక సంబంధాలున్నప్పటికీ, కారణాలు ఏమైనా వివిధ రంగాల్లో రెండు దేశాలూ ఇప్పటికీ అవ్వాల్సినంత సన్నిహితం కాలేకపోయాయి. 2006 నుంచి మరింత లోతైన సంబంధాలతో పరిస్థితి మారుతూ వచ్చింది. అప్పట్లో మన రెండు దేశాలూ ‘వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని’ ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటి నుంచి వాణిజ్యం, సైనిక విన్యాసాలు, నియమానుసారమైన సముద్ర జల వ్యవస్థ లాంటి వాటిలో రెండూ బాగా దగ్గరయ్యాయి. జపాన్‌ ప్రధాని తాజా పర్యటన రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల సాన్నిహిత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. 2014 నాటి పెట్టుబడుల ప్రోత్సాహక భాగస్వామ్యం కింద అనుకున్న 3.5 లక్షల కోట్ల జపనీస్‌ యెన్‌ల లక్ష్యాన్ని జపాన్‌ నిలబెట్టుకోవడం విశేషం. ఇక ఇప్పుడు 5 లక్షల కోట్ల జపనీస్‌ యెన్‌ల మేరకు పెట్టుబడులు పెట్టనుంది. అంటే, జపాన్‌ ప్రభుత్వం, జపనీస్‌ సంస్థలు నేటికీ తమ పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామమని చెప్పకనే చెబుతున్నాయన్న మాట. 

చైనా ప్రాబల్యం పెరుగుతున్న ప్రస్తుత సమయంలో మరింత క్రియాశీలంగా కలసి పనిచేయ డానికి  ఉన్న అవకాశాలను ఆసియాలోని రెండవ, మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు రెండూ గుర్తిస్తు న్నాయి. డిజిటల్‌ సెక్యూరిటీ, హరిత సాంకేతిక పరిజ్ఞానాల్లోనూ సహకరించు కోవాలని నిశ్చయించు కున్నాయి. జపాన్‌ ప్రధాని తాజా పర్యటనలో వెలువడ్డ సంయుక్త ప్రకటనలు అందుకు తగ్గట్టే ఉన్నాయి. వ్యూహాత్మకంగానూ ముందడుగు కనిపించింది. భారత భూభాగంపై పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాద దాడులను సంయుక్త ప్రకటన ఖండించింది. అలాగే, అఫ్గానిస్తాన్‌లో శాంతి, సుస్థిరతలకై కలసి పనిచేయడానికి కంకణబద్ధులమై ఉన్నట్టు రెండు దేశాలూ మరోసారి నొక్కిచెప్పాయి. 

ఇటీవల కొద్దివారాలుగా ఉక్రెయిన్‌ సంక్షోభంతో పాశ్చాత్య ప్రపంచం, జపాన్‌తో సహా దాని మిత్రపక్షాలు భారత వైఖరిని నిశితంగా గమనిస్తున్నాయి. కర్ర విరగకుండా, పాము చావకుండా ఈ సంక్షోభం విషయంలో భారత్‌ అనుసరిస్తున్న వైఖరి పట్ల పాశ్చాత్య దేశాల్లో సహజంగానే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ భిన్నమైన వైఖరితో ఉన్న మిత్రదేశంతో భారత సమా వేశం ఆసక్తికరమే. అయితే, ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలు ఏమైనప్పటికీ చైనా వైఖరికి భిన్నంగా భారత, జపాన్‌లు కలసికట్టుగా నిలవడం విశేషం. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని జపాన్‌ ప్రధాని ఖండించగా, భారత్‌ చర్చలు, శాంతి మంత్రం పఠించింది. వ్యక్తిగత వ్యూహాత్మక అవసరాలకు తగ్గట్టుగా రెండు దేశాలు స్వతంత్ర వైఖరులను అవలంబిస్తూనే, ఐక్యంగా నిలబడడం గమనార్హం. 

ఇరుదేశాల మధ్య ఈ విషయంలో అభిప్రాయ భేదాలున్నాయనే చర్చ జరుగుతున్న సందర్భంలో సంయుక్త ప్రకటన దానికి స్వస్తి పలికింది. ఉక్రెయిన్‌ లాంటి అంశాలపై పరస్పర భిన్న వైఖరులు ఉన్నప్పటికీ, చాలామంది ఆశించినదానికి భిన్నంగా మిత్ర దేశాలు ఇలా ఎప్పటిలానే దౌత్యం కొనసాగిస్తాయనే సంకేతాలు రావడం భారత్‌కు పెద్ద సాంత్వన. ఇన్నేళ్ళుగా అల్లుకున్న స్నేహలతకు దక్కిన సాఫల్యం. మయన్మార్‌లో గత ఏడాది సైనిక కుట్రతో వచ్చిపడ్డ సంక్షోభం విషయంలోనూ పాశ్చాత్య ప్రపంచానికి భిన్నంగా రెండు దేశాల స్పందన జాగరూక ధోరణిలో సాగింది. దౌత్య ప్రయత్నాలు, సంక్షోభానికి రాజకీయ పరిష్కారమే శరణ్యమని పేర్కొనడం విశేషం. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మునుపటి లానే పరస్పరం సహకరించుకోవ డానికే కట్టుబడినట్టు తెలిపాయి. ఇండో – పసిఫిక్‌లో చైనా దూకుడు వైఖరినీ చర్చించాయి. 

అయితే, ఈ తాజా సమావేశంలో ఒకటి రెండు అసంతృప్తులు లేకపోలేదు. ఆఫ్రికాలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన భారత – జపనీస్‌ సంయుక్త ప్రయత్నం ‘ఆసియా – ఆఫ్రికా గ్రోత్‌ కారిడార్‌’ (ఆగ్‌)పై చర్చించలేదు. అలాగే, 2011లో సంతకాలు చేసుకున్న ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (సీఈపీఏ)ను పరిస్థితులకు తగ్గట్టు మార్చుకోవడంలోనూ పెద్దగా పురోగతి కనిపించలేదు. నిజానికి, ఆ ఒప్పందంతో ఢిల్లీ, టోక్యోల వాణిజ్య బంధాన్ని పెంచుకోవడం అవసరం. ఏమైనా, కిషీదా భారత సందర్శనతో పాత స్నేహం బలపడిందనే చెప్పాలి. ఈ సౌహార్దం పురోగమించాలి. రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య మంత్రిత్వ స్థాయి సమావేశంలోనూ పరస్పర సహకారం  వెల్లివిరియాలి. ఇలా ఆసియా ఖండంలోని ఈ ప్రాంతంలో మరో సన్నిహిత మిత్రుడు భారత్‌కు సైదోడు కావడం దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా ఎప్పటికైనా అవసరమే మరి! 

మరిన్ని వార్తలు