తోవ చూపేది జీవవైవిధ్యం

9 Jun, 2021 00:01 IST|Sakshi

మనిషి–ప్రకృతి మధ్య సంబంధాలను పునరుద్ధరించే కీలకమైన ప్రక్రియ జీవవైవిధ్య పరిరక్షణ. ఈ విషయంలో మనం వెనుకబడుతున్నాం. యుగాల తరబడి మనిషి ప్రకృతితో మమేకమైన సహజీవన సౌందర్యానికి మన పౌరాణిక, చారిత్రక నేపథ్యం సాక్ష్యంగా నిలిస్తే, ఇప్పుడు మనం వెనుకంజలో ఉన్నాం. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్డీజీ)ల సాధనలో జీవవైవిధ్య రక్షణా ఉంది! నీటి లోపల, నేల మీది జీవరాశులుగా ప్రాధాన్యతనిచ్చింది. ఎస్డీజీల సాధన దిశలో భారత్‌ స్థానానికి ఇటీవల వెల్లడించిన యూఎన్‌ తాజా నివేదిక అద్దం పట్టింది. పలు అంశాల్లో వెంటనే అప్రమత్తం కావాలి. జీవవైవిధ్య రక్షణలో శీఘ్ర ప్రగతికి 2018 లో దేశంలో ఒక మిషన్‌ ఏర్పడింది. ‘జీవవైవిధ్యం–మానవ సుభిక్ష జాతీయ మిషన్‌’ (ఎన్‌ఎమ్‌బీహెచ్‌డబ్లుబీ)ని ప్రత్యేక లక్ష్యంతో ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి వల్ల ముంచుకు వచ్చిన కోవిడ్‌–19 ఒకటి, రెండు అలలు.. తిరుగులేని ప్రకృతి ఆధిపత్యాన్ని చెప్పకనే చెప్పాయి. జీవులన్నిట బుద్ధిజీవినని జబ్బలు చరుచుకునే మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పజీవో కరోనా తేల్చింది. దీన్ని ఒక గుణపాఠంగా గ్రహిస్తే.. ప్రఖ్యాత ఫ్రెంచ్‌ తత్వవేత్త రూసో చెప్పినట్టు మనిషి మళ్లీ ప్రకృతిలోకి నడవాలి. ప్రకృతి ఔన్నత్యాన్ని గ్రహించి, గుర్తించి, గౌరవించాలి. పర్యావరణం కాపాడుకోవాలి. సౌర కుటుంబంలో ఏకైక జీవగ్రహంగా పరిగణిస్తున్న పృథ్విని పరిరక్షించాలి. మానవ జోక్యంతో పాడుచేసుకున్న భూమ్యావరణ వ్యవస్థల్ని పునరుద్ధరించాలి. మొన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నిన్న సముద్ర దినోత్సవం... ఇలా పండుగలు జరుపుకోవడంలో మనం దిట్టలమే! కానీ, కార్యాచరణలోనే మందగమనం. ఈ యేడు పర్యావరణ దినానికి యూఎన్‌ ఒక ఆశయాన్నిచ్చింది. ఆవరణ వ్యవస్థల్ని కాపాడ్డం, నాశనం చేసుకున్నవి పునర్వవస్థీకరించుకోవడం, తద్వారా భూగ్రహాన్ని పునరుద్ధరించడం. ఈ పని సజావుగా జరగాలంటే, భాగస్వామ్య దేశాలతో కలిసి అదే యూఎన్‌ రూపొందించిన ఎస్డీజీలను కాలపరిమితిలోగా సాధించాలి. 2015లో యుఎన్‌ సభ్యదేశాలు చేసుకున్న ఈ అంగీకారానికి గడువు కాలం 2030. మూడో వంతు కాలం ఇప్పటికే కరిగిపోయింది. నికరంగా దశాబ్దకాలం కూడా లేదు. ఏయే అంశాల్లో ఎంతెంత ప్రగతి సాధించాం? ఎవరెక్కడ ఉన్నారు? ఏటా ఒక నివేదిక తయారవుతోంది. తాజా నివేదిక దేశ పరిస్థితినే కాక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రగతినీ నివేదించింది.

ఎస్డీజీల సాధన దిశలో కిందటేడుతో పోలిస్తే భారత్‌ కొన్ని పాయింట్లు (60 నుంచి 66) పెంచుకున్నప్పటికీ, స్థానం రెండు ర్యాంకులు (115 నుంచి 117) దిగువకు పోయింది. దక్షిణాసియాలోని భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ మనకన్నా మెరుగైన స్థితిలో ఉండటం మన దుస్థితిని ఎత్తిచూపేదే!  స్వచ్ఛ పునర్వినియోగ ఇంధనాలు, నగర–పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో మనం ప్రగతి సాధించాం. ఆకలి రూపుమాపడం, ఆహార భద్రత, సమానత్వ సాధన, సమ్మిళిత మౌలికరంగ వసతులు–పారిశ్రామిక వృద్ధి వంటి అంశాల్లో వెనుకబడ్డాం. ఈ తడబాటు భారత్‌ స్థానాన్ని రెండు ర్యాంకులు దిగజార్చింది. ఇదే స్థితి రాష్ట్రాల ప్రగతి సూచీల్లోనూ ప్రతిబింబించింది. మానవ సర్వతోముఖ వికాసం ప్రాతిపదికగా 17 అంశాలతో సుస్థిరాభివృద్ది లక్ష్యాలు రూపొందాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కలిసి, విశ్వ భాగస్వామ్య పద్ధతిలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా ప్రపంచ ప్రజల శాంతి, సమున్నతి సాధించడం, ప్రస్తుత భవిష్యత్‌ అవసరాలు తీరేలా భూగ్రహాన్ని కాపాడుకోవడం ఈ ఉమ్మడి కృషి వెనుక సంకల్పం. చరిత్రాత్మకమైన పారిస్‌ భాగస్వామ్య ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించిన భారత్‌ చాలా ఎస్డీజీ అంశాల్లో ఇంకా ప్రగతి సాధించాలి. విధాన నిర్ణయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తే తప్ప అది సాధ్యపడదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాలు నిర్దిష్ట అంశాల్లో ప్రగతివైపు అడుగులు వేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు వడివడిగా ముందుకు సాగుతుంటే, మరికొన్ని ఇంకా బుడిబుడి అడుగులేస్తున్నాయి. కేరళ (75 పాయింట్లు), హిమాచల్‌ ప్రదేశ్, తమిళనాడు (74) అగ్రభాగాన ఉన్నాయి. బిహార్‌ (52), జార్ఖండ్‌ (56), అస్సోమ్‌ (57) రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. నిర్దేశించిన గడువు (2030) నాటికైనా ఆశించిన లక్ష్యాలు సాధిస్తాయా? అన్న సందేహం రేకెత్తిస్తుస్నాయి. కిందటేడుతో పోల్చి చూస్తే మిజోరాం, హర్యానా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు తమ పరిస్థితిని బాగా మెరుగుపరచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ (72) తొలి అయిదు రాష్ట్రాల్లో ఉంటే, తెలంగాణ (69) మధ్యరకం ప్రగతి రాష్ట్రాల్లో ఉంది.

ఏ అంశంలో అయినా రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలు సాధించే ఉమ్మడి ప్రగతే దేశ పరిస్థితిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. అందులో కొన్ని జీవవైవిధ్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తే మరికొన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. సామాజికార్థికాంశాలతో పాటు విధాన నిర్ణయాలు, పాలనా సామర్థ్యం, ప్రాధాన్యతలే ఆయా రాష్ట్రాల్లో ఎస్డీజీల ప్రగతిని–వ్యత్యాసాల్ని ప్రభావితం చేశాయని నివేదిక పేర్కొంది. పర్యావరణ ప్రగతి సూచీ (ఈపీఐ)లో మనం మరింత వెనుకబడి 180 దేశాలకు గాను 168 వ స్థానంలో ఉన్నాం. యాలె విశ్వవిద్యాలయం ఇచ్చిన 2020 ఈపీఐ నివేదిక ప్రకారం జీవవైవిధ్యాంశంలో మన స్థానం (148) పొరుగు దేశమైన పాకిస్తాన్‌ (127) కంటే 21 స్థానాలు అడుగునుంది. పరిస్థితి మెరుగుపరచి చరిత్రను తిరగరాయాలి.                                              

మరిన్ని వార్తలు