అనూహ్య దుర్ఘటన

9 Dec, 2021 00:27 IST|Sakshi

ఇది హృదయాన్ని కలచివేసే అనూహ్య దుర్ఘటన. దేశంలో త్రివిధ సైనిక దళాలకు పెద్ద తలకాయ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ సైనిక హెలికాప్టర్‌ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులో ప్రమాదానికి గురికావడం, రావత్‌ – ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం దిగ్భ్రాంతికరం. దట్టమైన చెట్లు, తేయాకు తోటలు నిండిన నీలగిరుల్లో, కూనూరుకు సమీపంలో 5 నిమిషాల్లో గమ్యానికి చేరతారనగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోనే అత్యంత కీలక సైనికాధికారి మరణానికి కారణమైన ఈ ప్రమాదం అనేక భావోద్వేగాలకూ, తొలి దశలో రక్షణపరమైన అనుమానాలకూ దారి తీస్తోంది. గత ప్రమాదాల కథ గిర్రున రీలులా తిరుగుతోంది. తొందరపడి ఒక నిర్ధారణకు రావడం సరైనది కాదు కానీ, అసలు ఇలాంటి వీఐపీల ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారా అని సామాన్యుల్లో సందేహం రేపుతోంది. 

2015లో నాగాలాండ్‌లో ఓ సింగిల్‌ ఇంజన్‌ హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయ్యీ అవగానే 20 అడుగుల ఎత్తున ప్రమాదానికి గురైనప్పుడు రావత్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ, ఈసారి అదృష్టం ఆయనకు ముఖం చాటేసింది. అయితే, భారత తొలి సీడీఎస్‌గా నియుక్తులైన అదృష్టం రావత్‌కే దక్కింది. హోదా రీత్యా భారత సర్వసైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి కాగా, ఆ తర్వాతి స్థానం ఈ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ది. దేశరక్షణ వ్యవహారాల్లో ప్రధానికీ, రక్షణ మంత్రికీ సీడీఎస్‌ కీలక సలహాదారు. అలాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి దుర్మరణం దేశానికి భారీ నష్టం. తదుపరి చర్యల కోసం ‘రక్షణ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ’ (సీసీఎస్‌) హుటాహుటిన సమావేశమవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రతిసారీ రావత్‌ హాజరయ్యే ఆ భేటీ ఈసారి ఆయన లేకనే జరగాల్సి రావడం విషాదం.  
 
నాలుగు స్టార్లు ధరించిన అరుదైన జనరల్‌గా ఎదిగిన 63 ఏళ్ళ రావత్‌ 1978 నుంచి ఇప్పటికి 43 ఏళ్ళుగా భారత సైన్యంలో విశేష సేవలందిస్తూ వచ్చారు. గతంలో ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించారు. కీలక ఘట్టాల్లో వీరోచిత సైనికుడిగా తన సత్తా చాటి, ఎన్నో గౌరవ పతకాలు అందుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో శాంతి పరిరక్షణ బాధ్యతలు, ఈశాన్యంలో తీవ్రవాద నిరోధక చర్యలు, సరిహద్దు ఆవల మయన్మార్‌ ఆపరేషన్లు, ఆ మధ్య సర్జికల్‌ దాడుల్లో రావత్‌ కీలక పాత్రధారి. రిటైరయ్యే లోగా నెరవేర్చాల్సిన బృహత్తర బాధ్యత చాలా ఉందని సీడీఎస్‌గా చెబుతూ వచ్చారు. 

1999లో కార్గిల్‌ యుద్ధం తర్వాత, త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం, సైన్యంలో అవసరమైన సంస్కరణల కోసం సీడీఎస్‌ అనే ప్రత్యేక హోదా ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. రెండు దశాబ్దాల తాత్సారం తర్వాత, రెండేళ్ళ క్రితం అది కార్యరూపం దాల్చింది. ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రావత్‌ దూరదృష్టితో, చురుకుగా ముందుకు సాగారు. అప్పటి దాకా ఆలోచనలకే పరిమితమైన సైనిక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. సౌత్‌ బ్లాక్‌లోని కార్యాలయంలో బల్ల నిండా ఫైళ్ళు, నిరంతర సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతూ వచ్చారు. అనుకున్నది సాధించే దాకా విశ్రమించని వ్యక్తిగా పేరున్న రావత్‌ విమర్శలు, వివాదాలు వచ్చిపడ్డా వెనక్కి తగ్గలేదు. అదేమంటే, ‘నేనేమీ అందరినీ మెప్పించి, ఎన్నికల్లో గెలవనక్కర్లేదుగా’ అని నవ్వేయడం ఆయన విలక్షణ శైలి. 

దేశ రక్షణకు కీలకమైన ఇంతటి వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఇలా కూలిపోవడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మునుపు సంజయ్‌ గాంధీ (1980 జూన్‌), కాంగ్రెస్‌ నేత మాధవరావ్‌ సింధియా (2001 సెప్టెంబర్‌) విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తెలుగువారైన లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి (2002 మార్చి), సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి (2009 సెప్టెంబర్‌), అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం దోర్జీ ఖండూ (2011 మే) తదితరులు వివిధ హెలికాప్టర్‌ ప్రమాదాల్లో అకాల మరణం పాలయ్యారు. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు, తేలని విచారణలు తెలిసిందే. ఇప్పటి ఈ తాజా ప్రమాదానికి కారణం – అననుకూల వాతావరణమా? వాహనంలో వచ్చిపడ్డ సాంకేతిక సమస్యా? పైలట్ల అనుభవ రాహిత్యమా? ఇలా ఎన్నో బేతాళ ప్రశ్నలు. విచారణలో నిజాలు నిగ్గు తేలతాయి. ఎయిర్‌ మార్షల్‌ స్థాయి ఉన్నతాధికారి సారథ్యంలో త్రివిధ దళాధికారులతో లోతైన విచారణ జరపనున్నట్టు సమాచారం. 

రష్యా నుంచి భారత సైన్యంలోకి వచ్చిన జవనాశ్వంగా ‘మీ–17వీ5’ హెలికాప్టర్లకు పేరు. ప్రముఖుల ప్రయాణాలకూ, కీలక రవాణాకూ చాలాకాలంగా నమ్మకమైన ఈ ఛాపర్లు ప్రమాదం పాలవడం ఆశ్చర్యమే. సీనియర్లు, అనుభవజ్ఞులైన పైలట్లే ఇలాంటి వీవీఐపీల హెలికాప్టర్లను నడుపుతారు. ప్రముఖుల ప్రయాణాలకు ముందు వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆయిల్‌ మార్చడం మొదలు అనేక చిన్న విడిభాగాలను మార్చడం దాకా అనేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. 

బుధవారం ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నారట. కానీ, ఊహించని రీతిలో తక్కువ ఎత్తులో ఛాపర్‌ ప్రయాణిస్తోందనీ, ఓ భారీ వృక్షానికి గుద్దుకుందనీ, ఇంధన ట్యాంకు పేలి, కాలిపోయిందనీ కథనం. అంతా పైకి కనిపిస్తున్నట్టనిపించినా, బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణ సహా లోతైన విచారణ తర్వాతే కనిపించని కారణాలు తెలియరావచ్చు. ఏమైనా జరగకూడని నష్టం జరిగేపోయింది. వర్తమానానికి అవసరమైన కీలక సైనిక సంస్కరణలు చేయడానికి రావత్‌ సిద్ధమవుతున్న వేళ, దేశానికి పశ్చిమ, ఉత్తరాల నుంచి పాక్, చైనాలతో ముప్పున్న వేళ ఆయనను పోగొట్టుకోవడం ఓ అశనిపాతం. ఈ భారత వీరపుత్రుడు అర్ధంతరంగా వదిలేసివెళ్ళిన సంస్కరణల సత్కార్యాన్ని పూర్తి చేయడమే ఆయనకు నిజమైన నివాళి.

మరిన్ని వార్తలు