కొండల్లో కాషాయ రాగం

3 Mar, 2023 02:36 IST|Sakshi

‘ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు... వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు!’ ఇది ఓ హిట్‌ సినిమాలో ఫైట్‌ చేసిన హీరోను ఉద్దేశించి ఓ ఛోటా విలన్‌ పాపులర్‌ డైలాగ్‌. సమయం, సందర్భం వేరైనా... గురువారం నాడు వెలువడ్డ మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయాలకు ఇదే డైలాగ్‌ సరిగ్గా సరిపోతుంది. త్రిపుర అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా గెలిచి, బీజేపీ ఆ రాష్ట్రాన్ని స్వీప్‌ చేసింది.

నాగాలాండ్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీపీపీ కూటమి అధిక స్థానాలు సాధించి, సర్కారు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మిగిలిన మేఘా లయలో ఎన్‌పీపీ అధిక స్థానాలు దక్కించుకున్నా, అక్కడా ప్రస్తుత సీఎం కన్రాడ్‌ సంగ్మా చూపు నిన్నటి దాకా తమ ప్రభుత్వంలో భాగమైన బీజేపీని మళ్ళీ కలుపుకోవడం మీదే ఉంది. వెరసి, ముచ్చటగా మూడు రాష్ట్రాలూ బీజేపీ జేబులోనే! అదీకాక అటు సీపీఎం, ఇటు కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) తదితరుల్ని కనుమరుగు చేసి, కాషాయం రెపరెపలాడడం విశేషం. 

కొన్నేళ్ళ క్రితం ఈశాన్యంలో సీట్ల బలమే కాదు... ఓటర్ల బలగం కూడా లేని కాషాయ పార్టీ ఇప్పుడు అక్కడి రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్‌ను తోసిపుచ్చి, తిరుగులేని శక్తిగా నిలవడం ఆషామాషీ కాదు. అందుకు ఆ పార్టీ దీర్ఘకాలిక వ్యూహం, ఎన్నికల లెక్కల్లో స్థానిక పొత్తులు వగైరా అనేకం ఉన్నాయి. గిరిజన జనాభా, క్రైస్తవులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ స్వరం మార్చింది.

మతపరమైన అంశాలు, గొడ్డుమాంసంపై నిషేధం లాంటి ప్రస్తావనలే తేకుండా తెలివిగా వ్యవహ రించింది. మైనారిటీల అభద్రతనూ, సెంటిమెంట్లనూ రెచ్చగొట్టే తెలివితక్కువ పనికి దిగలేదు. పైగా, కేంద్రంలోని అధికారపక్షంతో స్నేహంగా సాగాలని భావించే అభివృద్ధి ఆధారిత ప్రజాస్వా మ్యాన్ని ఈ సుదూర పర్వతప్రాంత రాష్ట్రాలు నమ్మడం సాధారణం. అందుకు తగ్గట్లే పొరుగునే బీజేపీ పాలిత అస్సామ్‌లోని అభివృద్ధి నమూనాను చూపి, ఓటర్లను బీజేపీ తన వైపు తిప్పుకొంది.

త్రిపురలో కాంగ్రెస్, టీఎంసీ, కొత్తగా వచ్చిన ‘టిప్రా మోటా పార్టీ’లతో త్రిముఖ పోటీని ఎదుర్కొన్న కమలనాథులు వరుసగా రెండోసారీ గద్దెనెక్కడం విశేషం. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విప్లవ్‌దేవ్‌ను సరైన సమయంలో సీఎంగా పక్కకు తప్పించి, మాణిక్‌ సాహాకు కిరీటం పెట్టడమూ బీజేపీకి వ్యూహాత్మకంగా ఫలించింది. గతంలో వరుసగా 7 సార్లు త్రిపురను పాలించి, శాసించిన సీపీఎంకు ఆ రాష్ట్రంలో ఇది వరుసగా రెండో పరాజయం.

పైగా ఓట్లు 42 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడం ఆ పార్టీకి ప్రమాదఘంటిక. ‘టిప్రా’ కింగ్‌మేకర్‌గా ఆవిర్భవించకున్నా, కలసి బరిలోకి దిగిన సీపీఎం – కాంగ్రెస్‌ అవకాశాలను దెబ్బ తీసింది. బెంగాలీ ఓటర్లపై టీఎంసీ పెట్టుకొన్న ఆశ అడియాసైంది. 2018తో పోలిస్తే బీజేపీ కూటమికి 11 శాతం ఓట్లు తగ్గినా, కమల నాథులే సొంతంగా సర్కారు ఏర్పాటు చేసే స్థితికి చేరుకోవడం ప్రతిపక్షాల అనైక్యతకు ప్రతిఫలం!

శుభవార్త ఏమంటే, అరవై ఏళ్ళ నాగాలాండ్‌ చరిత్రలో తొలిసారిగా మహిళలు ఎమ్మెల్యే లుగా ఎన్నిక కావడం! పితృస్వామ్య భావజాలం ప్రబలంగా ఉండే ఈ గడ్డపై గతంలో పట్టణ మునిసిపల్‌ ఎన్నికల్లో స్త్రీల రంగప్రవేశానికి ప్రయత్నం జరిగినా, హింస రేగి పోటీ నుంచి తప్పుకోవాల్సొచ్చింది. కానీ ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలు గెలవడం గమనార్హం.

ఇది మార్పు పవనాలకు ప్రతీక. ఇక, వివిధ రాష్ట్రాల పార్టీలు (జేడీ–యూ, లోక్‌జనశక్తి, శరద్‌ పవార్‌ ఎన్సీపీ, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) నాగాలాండ్‌ బరిలో దిగడం చిత్రం. ఆరు సీట్లలో ఎన్సీపీ గెలవడం, పశ్చిమాన మహారాష్ట్ర నుంచి వచ్చి తూర్పున నాగాలాండ్‌లో సత్తా చాటి, పెద్ద ప్రతిపక్షంగా అవతరించడం విచిత్రం.

ఈశాన్య రాష్ట్రాల్లో అంచనాలకు అల్లంత దూరంలో ఆగిన కాంగ్రెస్‌ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన 6 ఉప ఎన్నికల్లో మాత్రం 3 చోట్ల విజయాలు సాధించింది. తమిళనాట ఈరోడ్‌ (ఈస్ట్‌), మహారాష్ట్రలోని కస్బాపేట్, బెంగాల్‌లో టీఎంసీ నుంచి చేజిక్కించుకున్న సాగర్‌దిఘీ స్థానాలు హస్తానికి కొంత ఊరట.

ఈరోడ్‌ గెలుపు వెనుక అధికార డీఎంకెతో పొత్తు, కస్బాలో విజయానికి మహా వికాస్‌ ఆఘాడీ కూటమి మద్దతు, 2021 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బెంగాల్‌లో ఈసారి సీపీఎం అండ కాంగేయులకు కలిసొచ్చింది నిజమే. అయితే, 32 ఏళ్ళుగా కంచుకోటైన పుణేలోని కస్బాపేట్లో బీజేపీ ఓటమి ఆలోచన రేపుతోంది. అదే సమయంలో మిగతా 3 ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, అందులోనూ రామ్‌గఢ్‌ను కైవసం చేసుకోవడం విస్మరించలేం.

ఒకరకంగా ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు ఆత్మశోధన అవకాశం. ఏ మాటకా మాట – ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలను బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు ఏ మేరకు సీరియస్‌గా తీసుకున్నాయన్నది అనుమానమే. ప్రధాని, కేంద్ర హోమ్‌మంత్రి సహా పలువురు పదేపదే ఈశాన్యంలో పర్యటించారు. ప్రతిపక్షాలపై ప్రచారదాడి చేశారు.

స్థానిక స్థితిగతులకు అనుగుణంగా వ్యాఖ్యలు, వ్యూహాలు మార్చుకున్నారు. ప్రతిపక్షాల్లో గెలిచితీరాలనే ఆ పట్టుదల, ఎన్నికల చాణక్యం కొరవ డ్డాయి. మరి రెండు నెలల్లో కర్ణాటక, ఆ వెంటనే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ – ఇలా అనేక రాష్ట్రాల్లో ఎన్ని కలు రానున్న వేళ ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు ఓ మేలుకొలుపు.

ఐక్యత, ఐడియాలజీ ఏదీ లేకుండా ఒక్క మోదీ వ్యతిరేక మంత్రమే ఫలిస్తుందనుకుంటే పొరపాటు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు, అజెండాలు లేకుండా సవాలు చేస్తే శృంగభంగం తప్పదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మేలుకుంటే... కోలుకుంటాయి. లేదంటే, ఎన్నికలు ఏవైనా ఫలితాలు కాస్త అటూ ఇటుగా ఇలాగే ఉంటాయి. 

మరిన్ని వార్తలు