లెక్కలు... చిక్కులు...

25 Aug, 2021 02:25 IST|Sakshi

ముందు నుయ్యి, వెనుక గొయ్యి. అధికారంలో ఉన్న అధినేతల పరిస్థితి ఇప్పుడు అదే. దేశంలో కులాల వారీ జనాభా లెక్క చేపడతామని ఒప్పుకుంటే ఒక తంటా, ఒప్పుకోకపోతే మరో తంటా. బిహార్‌ సహా వివిధ రాష్ట్రాలు పట్టుబడుతున్న కుల జనగణనపై ఏం చెబితే, అది రాజకీయంగా ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సారథ్యంలో ఢిల్లీ వచ్చిన పది పార్టీల అఖిలపక్షం చేసిన కులగణన డిమాండ్‌ను ప్రధాని మోదీ సోమవారం సావధానంగా విన్నారే తప్ప, అవుననలేదు. కాదనీ చెప్పలేదు. ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీలు) సహా ఏ కులం వాళ్ళెంత ఉన్నారో తెలుసుకోవడానికి ఈ లెక్క ఉపకరిస్తుందనేది నితీశ్‌ బృందం మాట. నిజానికి, భారత రాజకీయాల గతిని మార్చే లెక్క అది. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల ప్రణాళిక, చివరకి నేతల తలరాతను సైతం మార్చే అంశమది. కాబట్టే పాలకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

పదేళ్ళకోసారి దేశజనాభా లెక్కలు జరిగినప్పుడల్లా కులాల వారీ లెక్కల కోసం వెనుకబడిన వర్గాల్లో బలం ఉన్న ప్రాంతీయ పార్టీలు అడుగుతూనే ఉన్నాయి. అగ్రవర్ణాల్లో గణనీయమైన బలం ఉన్న పార్టీలు, రాజకీయ నేతలు ఆ ఆలోచనను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. 2011 తర్వాతి జనగణన కరోనా వల్ల ఆలస్యమైంది. బ్రిటీషు పాలనాకాలంలో 1931లో దేశంలో కులాల వారీగానే జనగణన జరిగింది. ఆపైన 1941లో రెండో ప్రపంచ యుద్ధవేళ ఈ భారీ ఖర్చు వ్యవహారానికి బ్రేకు పడింది. స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 2011 దాకా జరిగిన జనగణనల్లో ఎస్సీ, ఎస్టీల జనసంఖ్యే తప్ప, మిగతా కులాల లెక్క తీయలేదు. దాంతో ఇప్పటికీ ఓబీసీల సంఖ్య ఎంతన్నది సరైన అంచనా లేదు.
2011లో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ సర్కారు సామాజిక – ఆర్థిక కుల జనగణన చేసినా, ఆ సమాచారాన్ని విడుదల చేయలేదు. తాజా డేటా లేకపోవడంతో– ఇప్పటికీ 1931 నాటి అంకెలు, జాతీయ శాంపిల్‌ సర్వే సమాచారం ఆధారంగా లెక్కలు కట్టి, పార్టీలు, ప్రభుత్వ సంస్థలు విధాన రూపకల్పన చేస్తూ వస్తున్నాయి. కులాల వారీ లెక్క తేలితే సంక్షేమ పథకాల్లో లోటుపాట్లు సవరించుకోవచ్చు. సామాజిక ప్రతిఫలాలు అందించనూ వచ్చు. కానీ, కాంగ్రెస్, బీజేపీ సహా అనేక జాతీయ పార్టీలు మళ్ళీ ఇలా కులాల వారీ జనగణన చేయడాన్ని గతంలో వ్యతిరేకించాయి. సమాజంలో కులాల ఉనికి, కుమ్ములాటలు శాశ్వతమయ్యే ముప్పుందని వాదించాయి. వర్తమాన సామాజిక పోరాటాలు, రాజకీయ అనివార్యతలతో ఇప్పుడా అభిప్రాయం మార్చుకోక తప్పదు. 


అవకాశాల్లో, అధికారంలో దామాషా పద్ధతిన తమదైన వాటా కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్న వర్గాల ఓట్లను దూరం చేసుకోవడం ఏ పార్టీకైనా ఎందుకు ఇష్టం ఉంటుంది! రాజకీయంగా వెనుకబడకుండా బిహార్‌ బీజేపీ నేతలూ అఖిలపక్షంతో కలసి రాక తప్పలేదు. ఇక, మమతా బెనర్జీ మొదలు మజ్లిస్‌ ఒవైసీ దాకా అందరూ కులాల లెక్కకు ఓటేస్తున్నారు. దేశంలో 50 శాతం ఉన్న ఓబీసీలకు 27 శాతం రిజర్వేషనే దక్కుతుంటే, జనాభాలో 20 శాతమే ఉన్నవారు 50 శాతం కోటా అనుభవిస్తున్నారని వారి వాదన. మరోపక్క కనీసం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్‌పై సుప్రీమ్‌ కోర్టు పెట్టిన 50 శాతం పరిమితిని ఇప్పటికే దాటేశాయి. సామాజిక, ఆర్థిక వాస్తవాల రీత్యా ఎక్కడికక్కడ ఈ పరిమితిపై వెసులుబాటు తీసుకోక తప్పదు. 

మన సమాజంలో శతాబ్దాలుగా వెంటాడుతున్న సామాజిక వాస్తవం కులవ్యవస్థ. రాజకీయాల్లోనూ దాన్ని విస్మరించలేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపిది– హిందుత్వ నినాదంతో సంఘటిత ఓటుబ్యాంకు సంపాదించుకొని, ఓబీసీలను పునాదిగా మార్చుకున్న సమకాలీన చరిత్ర. ఓబీసీల ఉపవర్గీకరణతో ఆ బలాన్ని పటిష్ఠం చేసుకోవాలని ఆ పార్టీ యోచన. అయితే, ఆ ఉప వర్గీకరణ కోసం ఏర్పాటైన జస్టిస్‌ రోహిణి కమిషన్‌ నివేదిక ద్వారా న్యాయం జరగాలన్నా... కులాల వారీ లెక్క తెలియాల్సిందే. తీరా ఆ లెక్కల తర్వాత 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని కేంద్రమే దాటాల్సి వస్తుంది. అప్పుడది బీజేపీ సామాజిక సమీకరణాల్ని దెబ్బతీయవచ్చు. అది ఆ పార్టీకి ఉన్న ఒక భయం. మరోపక్క ఆ పార్టీకి సైద్ధాంతిక భూమికగా నిలిచే ఆరెస్సెస్‌ సైతం కుల జనగణనకు సానుకూలమేమీ కాదు. అందుకే, 2018 ప్రాంతంలో కులాల లెక్కలకు ఓకే అన్న భావన వ్యక్తం చేసిన బీజేపీ ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో తూచ్‌ అనేసింది. 

పైగా, కులగణనను రాజకీయ లబ్ధికి వాడుకోవచ్చన్న వివిధ పార్టీల రాజకీయ వ్యూహం అటూ ఇటూ అయితే, మొదటికే మోసం వస్తుంది. 2022లో యూపీ, 2024లో సార్వత్రిక ఎన్నికలూ ఉన్నాయి కాబట్టి బీజేపీ తొందరపడక పోవచ్చు. ఎన్నికలలో తాము చెప్పుకోదలుచుకున్న జాతీయవాదం, రామమందిర నిర్మాణం, 370వ అధికరణం రద్దు లాంటి ఘనతలు పక్కకు పోయి, ఈ కులాల కుంపటి ఎన్నికల అజెండా అయిపోతుందేమోనన్న భయం ఉంది. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్ల నాటి వీపీ సింగ్‌ ప్రభుత్వంలా చిక్కుల్లో పడతామేమో అన్న అనుమానమూ ఉంది. ఇక, కులాతీత సమసమాజాన్ని కోరుకున్న భారత రాజ్యాంగ కర్తల అభీష్టానికి ఇలాంటి లెక్కలు హాని చేస్తాయని కొందరి వాదన. కానీ, స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు నిండినా సామాజిక న్యాయం దక్కని బతుకుల్లో వెలుగు కోసం ఈ లెక్కలు అనివార్యమే. వాటిని పూర్తి రాజకీయ లబ్ధికి వాడుకొంటేనే అది సామాజిక అశాంతికి దారి తీస్తుంది. రాజకీయ నేతల ఆ దౌర్బల్యాన్ని కనిపెట్టి, జాగ్రత్తపడాల్సింది మాత్రం కులాలతో పని లేకుండా ప్రజలే! ఆ చిన్న లెక్క మర్చిపోతేనే అసలు చిక్కు!! 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు