విద్యకు ‘కరోనా’ కోత!

6 Feb, 2021 01:27 IST|Sakshi

కరోనా మహమ్మారి కాటేసిన తరువాత ప్రపంచ దేశాలన్నిటా సకల రంగాలూ దెబ్బతిన్నాయి. విద్యారంగం అందులో ప్రధానమైనది. ఈ కరోనా సమయంలోనే కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. కనుక కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యకు అత్యంత ప్రాముఖ్యత వుంటుందని అందరూ ఆశించారు. కానీ జరిగింది అందుకు విరుద్ధం. కరోనా వచ్చి విద్యారంగానికి కొత్త అడుగులు నేర్పింది. అంతక్రితం కేవలం వృత్తి, ఉద్యోగాలు చేసుకునే వారినుద్దేశించి ప్రవేశపెట్టిన దూరవిద్య లాక్‌డౌన్‌ల పుణ్యమా అని ఇప్పుడు హైస్కూల్‌ మొదలు పీజీ వరకూ అందరికీ తప్పనిసరి అవస రంగా మారింది. ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా నేర్చుకునే అవసరం పెరిగింది.

ఉన్నత విద్య బోధించే క్యాంపస్‌లు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఈ స్థితిలో విద్యారంగానికి నిధుల అవసరం చాలా ఎక్కువుంటుంది. ఎందుకంటే కొత్త అవసరానికి తగ్గట్టు అత్యధిక విద్యాసంస్థలు ఇంకా తయారుకాలేదు. చాలా తక్కువ విద్యాసంస్థలు మాత్రమే ఆ దోవన పోతున్నాయి. ఆర్థికంగా వెనక బడిన కుటుంబాల విద్యార్థులకు సబ్సిడీతోగానీ, ఉచితంగాగానీ ల్యాప్‌టాప్‌లు అందించాలన్న డిమాండ్‌ కూడా వస్తోంది. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. విద్యార్థులందరికీ అవసర మైన ఉపకరణాలు అందుబాటులో లేకపోతే చదువుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. 

ఈ స్థితిలో విద్య కోసం కేటాయింపుల్ని భారీగా పెంచాల్సివుండగా ప్రస్తుత బడ్జెట్‌లో అవి గణనీయంగా తగ్గాయి. విద్యకు ఈసారి ఆరు శాతం కోతపడిందని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు రూ. 99,311 కోట్లు కేటాయించగా, ఈసారి అది కాస్తా రూ. 93,300 కోట్లకు పడిపోయింది. సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) పరిస్థితి కూడా అంతే. నిరుడు రూ. 38,750 కోట్లు కేటాయించిన ఆ పథకానికి ఈసారి కేవలం రూ. 31,050 కోట్లతో సరిపెట్టారు. ఈ పథకంకింద రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ కొండ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ నడిచే సాధారణ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తారు. దళిత, ఆదివాసీ పిల్లల్లో డ్రాపౌట్ల శాతం ఎక్కువగా వుంటున్నదని గుర్తించి, వారికి అవసరమైన సదుపాయాల కల్పన కోసం చేసిన కేటాయింపులు కాస్తా తగ్గితే దాని ప్రభావం ఎలావుంటుందో చెప్పన వసరం లేదు.

ఉన్నత విద్యకూ రూ. 1,000 కోట్ల మేర కోత పెట్టారు. ఉన్నత విద్యా నిధి సంస్థ (హెచ్‌ఈఎఫ్‌ఏ)కు నిరుడు రూ. 2,100 కోట్లు కేటాయించగా, అదిప్పుడు రూ. 1,000 కోట్లు మాత్రమే. మార్కెట్‌ రుణాలు సేకరించి, ఆ నిధులతో కేంద్రీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు పదేళ్లలో చెల్లించేవిధంగా రుణాలివ్వాలని 2016లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఆనాటి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కానీ ఇప్పుడది నామమాత్ర మొత్తానికి పరిమితమైంది. అయితే మధ్యాహ్న భోజనం, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వగైరాలకు నిధులు స్వల్పంగా పెరిగాయి. అలాగే కొత్తగా వంద సైనిక స్కూళ్లు నెలకొల్పబోతున్నట్టు చెప్పారు. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగానికే ప్రభుత్వాలు కోత పెడతాయని నిరుడు మే నెలలో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు జోస్యం చెప్పింది. ఆ మాట చెబుతూనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మాదిరి చర్యలు తీసుకోవద్దని హితవు పలికింది.  కరోనా వైరస్‌ తీసుకొచ్చిన కొత్త ఇబ్బందుల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం, వారి సామాజిక సంరక్షణ వగైరాలకు అదనంగా వ్యయం చేయాల్సివుంటుంది గనుక ఇది అవసరమని  తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు. నూతన  జాతీయ విద్యావిధానం సాంకేతిక వనరులను సమృద్ధిగా వినియోగించుకుని మన విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పింది. జాతీయ విద్యా సాంకేతిక వేదిక నెలకొల్పి దాని ఛత్రఛాయలో సాంకేతికత సాయంతో విద్యార్థులకు ప్రామాణికమైన, ప్రయోగ ఆధారిత విద్యను అలవాటు చేస్తామని వాగ్దానం చేసింది.

ఆన్‌లైన్, ఈ–లెర్నింగ్‌ వేదికల్లో పాఠశాలలు మొదలు కళాశాలల వరకూ విద్యార్థులందరికీ సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోబోతున్నట్టు చెప్పింది. జాతీయ పరిశోధనా సంస్థను నెలకొల్పి ఉన్నత విద్యారంగంలో మెరుగైన పరిశోధనలను ప్రోత్సహిస్తామని తెలిపింది. ఇన్ని చేయడానికి సిద్ధపడుతూ నిధులు గణనీయంగా తగ్గించటంలోని ఆంతర్యమేమిటో అర్థం కాదు. అంత పెద్ద పెద్ద ఆశయాల మాటెలావున్నా కరోనా అనంతర పరిస్థితుల్లో అటు ఉపాధ్యాయులకూ, ఇటు విద్యార్థులకూ అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచటం కోసం ప్రైవేటు రంగ సహాయ సహకారాలు తీసుకోవటం అవసరమవుతుంది. నిధుల కోత వల్ల అదైనా ఇప్పుడు సాధ్యమవు తుందా? అసలు కరోనా కారణంగా దీర్ఘకాలం విద్యకు దూరమైన పిల్లలను మళ్లీ బడులవైపు మళ్లించటానికి ప్రభుత్వం దగ్గరున్న కార్యక్రమాలేమిటో కూడా నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదు. ఐక్యరాజ్యసమితి 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించాలని నిర్దేశించిన సుస్థిర లక్ష్యాల్లో విద్య కూడా వుంది. ఒకపక్క విద్యాహక్కు చట్టం రూపొందించుకున్నాం. దాన్ని సమర్థ వంతంగా అమలు చేయడానికి ఇంకేం చేయాలని ఆలోచించాల్సిన తరుణంలో నిధుల కోతతో విద్యా రంగాన్ని మరింత నీరుగార్చటం విచారకరం. సమస్యలున్న మాట వాస్తవమే అయినా వాటి ప్రభావం విద్యారంగంపై పడకుండా చూడటమే వర్తమాన అవసరం.  

మరిన్ని వార్తలు